18, జూన్ 2019, మంగళవారం

గోల్కొండ కోటకి నేను....

మంగళవారం, జూన్ 18, 2019 4 Comments
  ఈ సంక్రాంతికి హైదరాబాదులో ఉన్న గోదారి వాసిని బహుశా నేను ఒక్కదాన్నే అయి ఉంటానేమో😣. ఇంటికి వెళ్దామని ఎంత ప్రయత్నం చేసినా అస్సలు వీలు పడలేదు. నా దురదృష్టం ఏంటో గానీ, వరుస సెలవులు వచ్చాయి కదా! ఎలాగూ ఇంటికి వెళ్ళట్లేదు...కనీసం ఇక్కడే ఏదైనా చోటకి వెళ్తే బాగుంటుంది అని నేను, మా చెల్లి నిర్ణయించుకున్నాం. అప్పటికే హైదరాబాదులో చూడదగిన ప్రదేశాలను బిర్లా మందిర్, బిర్లా మ్యూజియం లతో ప్రారంభించేశాం. తర్వాత ఏంటీ అని ఆలోచిస్తుంటే గోల్కొండ కోట గుర్తుకు వచ్చింది. చాలా మందిని అడిగితే " ...ఏముంటుంది కోటలో.." అని చెప్పారు. కానీ అప్పటికి నేను ఒకసారి వెళ్ళాను. అది కూడా ఆఫీసు పని మీద. World Heritage Week లో భాగంగా పోయిన నవంబరు లో 19-25 మధ్య, గోల్కొండ కి 500 ఏళ్లు అయిన సందర్భంగా జరిగిన కార్యక్రమానికి వెళ్ళాం మా ఆఫీస్ వాళ్ళందరూ. అప్పుడు కోటని పూర్తిగా చూడటం అవ్వలేదు. కొన్ని ప్రదేశాలను మాత్రమే చూడగలిగాను. అప్పుడే నాకు చాలా చాలా నచ్చింది. పుస్తకాలు టీవీల్లో చూడటమే తప్ప నిజంగా గోల్కొండ ని చూస్తా అని ఎప్పుడూ అనుకోలేదు నేను☺️.

  మొదటి సారి వెళ్ళినప్పుడు తీసుకున్న చిత్రాలు








మా చెల్లి కూడా గోల్కొండ చూడాలి అనటంతో అక్కడకే వెళ్దామని నిర్ణయించుకున్నాం. ASI ఉద్యోగిని కావటం వల్ల ASI పరిధిలో ఉన్న అన్ని కట్టడాలను మేము ఉచితంగా సందర్శించవచ్చు. అలా మేము చూసిన మొదటి monument గోల్కొండ అయింది.

అలా జనవరి 13 తారీఖున ముహూర్తం పెట్టుకున్నాం. అప్పుడు మొదటిసారి వెళ్ళినప్పుడు కార్ లో వెళ్ళాం. నాకు హైదరాబాద్ కొత్త కాబట్టి దారీ అదీ ఏమీ అర్ధం కాలేదు. ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకుందాం అంటే డాడీ ససేమిరా అన్నారు..అందుకని ఒక పని చేసా. నాతో పాటు ASI తెలంగాణ కి ఎంపికైన మాకందరికీ ఒక WhatsApp గ్రూప్ ఉంది. గోల్కొండ లో చేసేవాళ్ళు అందులో ముగ్గురు ఉన్నారు. ఎవరొకళ్లు చెప్తారని గ్రూపులో అడిగాను, ఏం బస్సులు ఎక్కితే కోటకి వెళ్లొచ్చు అని. మెహదిపట్నం వెళ్తే అక్కడి నుండి గోల్కొండ కి బస్సులు ఉంటాయని ఒకరు సమాధానం ఇచ్చారు.

రోజు పొద్దున్నే 9 కల్లా తయారై పోయి హిమాయత్ నగర్ లో ఉప్పల్ - మెహదిపట్నం బస్ ఎక్కేసాం🚌. మెహదిపట్నం లో గోల్కొండ కి వెళ్లే SETWIN బస్ దొరికింది. ఒక పావుగంట ఇరవై నిముషాల్లో గోల్కొండ లో దిగిపోయాము.

ఆదివారం కావడంతో 10 గంటలకే చాలా మంది ఉన్నారు. టికెట్ కౌంటర్ దగ్గర పెద్ద లైను ఉంది. సెక్యూరిటీ వాళ్ళకి నా ఐడీ కార్డు🎴చూపిస్తే సీదా పంపించారు. మా చెల్లికి కూడా టికెట్ తీయాల్సిన అవసరం లేకపోయింది. అలా కొన్ని సెల్ఫీ లు తీసుకుంటూ ఫతే దర్వాజా దగ్గరికి వెళ్ళాం. అక్కడ టికెట్స్ చూసి లోపలికి అనుమతిస్తున్నారు. అక్కడ ఇంకోసారి ఐడీ కార్డు చూపించాను. లోపలికి వెళ్ళిపోయాము. ప్రత్యేకంగా కెమెరా ఏమీ తీసుకెళ్ళ లేదు కానీ నా LG G4📱తోనే చాలా ఫొటోలు తీసుకున్నాం. రోజైతే కోట మొత్తం జనంతో చాలా సందడిగా ఉంది.



గోల్కొండ పట స్వరూపం




వచ్చేవారు చప్పట్లు కొట్టి ఆనందించేది ఇక్కడే









తారామతి మసీదు






మొదటి సారి వెళ్ళినపుడే తెలిసింది నాకు కోట పైకంటా వెళ్లొచ్చు అని. కాకపోతే అది ఒక కిలో మీటరు దాకా ఉంటుంది. ఇపుడు మా చెల్లి పైకి ఎక్కుదాం అని గొడవ చేసింది. పైగా రోజు ఎండ కూడా కొంచెం ఎక్కువే ఉంది😣. ఎలాగూ ఇద్దరం చెరో బాగ్ లో ఒక్కో నీళ్ళ సీసా, రెండు రెండు బిస్కట్ పేకెట్లు🍪 పెట్టుకున్నాం. అలా కొంచెం కొంచెం విరామాలు తీసుకుంటూ నీళ్ళు తాగుతూ బిస్కెట్లు తింటూ మొత్తానికి పైకి ఎక్కేశాం.

అప్పటిదాకా సెల్ఫీలు, ఇంకా అది నన్ను ఫొటోలు తీస్తే నేను దాన్ని తీయటం అలా సాగింది. మా ఇద్దర్నీ ఎవరైనా ఫోటో తీస్తే బాగుండు అని పక్కనే ఉన్న ఒకాయన ని రెక్వెస్ట్ చేశాం. Background బానే వచ్చింది కానీ నేనే బాగా రాలేదు అందులో👻. పైకి ఎక్కేసరికి నాకు చాలా అలసట వచ్చింది. ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతానేమో అన్నంత అనిపించింది😰.














తర్వాత మెల్లిగా కిందకి వచ్చేశాం. దారిలో రామదాసు చెరసాల, అక్కన్న మాదన్న కార్యాలయాలు, నగినా బాగ్ చాలా నచ్చాయి. కానీ కోట మొత్తం చాలా తికమక గా అనిపించింది. ఏది ఎక్కడ ఉందో అస్సలు గుర్తు లేదు. అలా మొత్తానికి కోట మొత్తం చూడగలిగాము. ఇక మధ్యాహ్నం ఒంటి గంట దాటడం తో సూర్య ప్రతాపానికి భయపడి బయటికి వచ్చేశాం. మా చెల్లి ఇంకాసేపు ఉందాం అక్కా అన్నా కూడా వినకుండా లాక్కొచ్చేసా😜. బయట నిమ్మకాయ షర్బత్ తీసుకున్నాం ఎండ నుండి ఉపశమనం కోసం🍸. కానీ అది అసలేం బాగోలేదు. సోడా తప్ప నిమ్మకాయ జాడే లేదు...తాగలేక పడేయాల్సి వచ్చింది😏. అక్కడితో గోల్కొండ కోట రెండో పర్యటన ముగిసింది.

నగీనా బాగ్ ప్రాంతం

ముచ్చట గా మూడోసారి అంటే ఏప్రిల్ లో మా ఆఫీసు తరపున స్వచ్ఛ పక్వాడా కార్యక్రమం గోల్కొండ లో జరిగింది. అలా ఇంకోసారి చూసే అవకాశం దక్కింది. అప్పుడు కోటలోని కొన్ని ప్రదేశాలను శుభ్రం చేశాం. చెత్త ఏరి పిచ్చి మొక్కలని పీకేశాం. కానీ అపుడు ఒక గంట మాత్రమే ఉన్నాము. ఎందుకో గానీ గోల్కొండ చాలా చాలా నచ్చింది నాకు.

స్వచ్చ పక్వాడా అయిపోయాక వచ్చేసేటపుడు తీసా ఇది😍



కానీ సారి మాత్రం మా అమ్మానాన్నలను తీసుకురావాలి. వాళ్ళకి కూడా గోల్కొండ కోటని చూపించాలి. ఇదండీ గోల్కొండ తో నాకున్న అనుబంధం..😍 చాలా మందికి తెలిసే ఉంటుంది అన్న ఉద్దేశ్యంతో గోల్కొండ కోట చరిత్ర ఏమీ చెప్పట్లేదు ఇందులో నేను. ఎవరికైనా ఆసక్తి ఉన్నట్లైతే కింద ఇచ్చిన Wikipedia పుటల లింకులు ద్వారా తెల్సుకోండి. ఫోటోలను ఎడిట్ చేయడానికి వాడినవి : Snapseed & Picasa. టపా నచ్చిందో లేదో తప్పకుండా చెప్పండి మరి సరేనా..!!



గోల్కొండ కోట - తెలుగు
Golconda Fort - English


6, జూన్ 2019, గురువారం

నా ఉద్యోగ ప్రయాణం - 1

గురువారం, జూన్ 06, 2019 12 Comments
మొట్ట మొదటగా నేను రాసిన పరీక్ష తపాలా శాఖ వారి MTS పరీక్ష (2015-D.Ed చదువుతున్న సమయంలో). అందులో 60% మార్కులే వచ్చాయి. కనీసం 80% ఉంటే ఉద్యోగం వస్తుంది. తర్వాత నేను SSC పరీక్షల వెంట పడ్డా..CHSL పరీక్ష ఇప్పటికి మూడు సంవత్సరాల నుండి రాస్తున్నా..2015 లో 103.5 , 2016 లో 105 మార్కులు వచ్చాయి..అప్పట్లో కటాఫ్ 110-120 ఉంది..ప్చ్..ఈ సారి అంటే 2017 ఫలితాల కోసం నిరీక్షిస్తున్నా...ఇప్పుడు కటాఫ్ దాటుతుంది..కానీ మెరిట్ లిస్ట్ లో చేరేంత పరిస్థితి లేదు. ఎందుకంటే కటాఫ్ దగ్గరగా ఉంటాయి నా మార్కులు.

ఇక మొట్టమొదట విజయం సాధించిన పరీక్ష..FCI వాచ్ మేన్ పరీక్ష...అది 8 వ తరగతి అర్హత తో 2017 లో జరిగింది.. 120 కి 90 దాటిన వారిని హైదరాబాదులో ఫిజికల్ టెస్ట్ కి రమ్మని పిలుపు వచ్చింది...కానీ నేను అపుడు DSC కోచింగ్ కని అవనిగడ్డలో ఉన్నా..అయినా నాకు అది ఇష్టం లేదు..ఊరికే రాశానంతే..ఇక అది వదిలేశా..

తర్వాత TET..మా D.Ed చదివిన వారు అందరూ ఖచ్చితంగా ఇది రాస్తారు..అచ్చం ఇలాగే కేంద్రీయ విద్యాలయాలు, సైనిక్ స్కూళ్ళు, నవోదయాలు లో టీచర్ గా చేరాలంటే దేశస్థాయిలో CTET పరీక్ష జరుగుతుంది..అది రాద్దామని పుస్తకాలు కూడా తెప్పించుకున్నా అమెజాన్ నుండి..నా దురదృష్టమేమిటంటే నా D.Ed పూర్తి అయినప్పటి నుండి ఒక్కసారి కూడా ఆ పరీక్ష ప్రకటన వెలువడలేదు...ఇదిగో ఇపుడు సుప్రీం కోర్టు తక్షణమే CTET ను నిర్వహించాలని అదేశించింది. ఏమవుతుందో చూడాలి మరి..
   2014 లో లాగ ఇకపై TET ఉండదు..కేవలం DSC ఒక పరీక్షే అని నా లాంటి వారందరూ దానికే తయారవుతుంటే, 2017 డిసెంబరులో (అపుడు నేను అవనిగడ్డలోనే ఉన్నా) ప్రభుత్వం ఈసారి TET తప్పనిసరిగా ఉంటుంది అని ప్రకటించింది..తర్వాత అవనిగడ్డ నుండి వచ్చేసి నేను ఇంటి దగ్గరే TET కి ప్రిపేర్ అయ్యాను..అందులో మంచి మార్కులే వచ్చాయి...నేను హ్యాపీ...ఇక DSC కి ప్రెపేర్ కావొచ్చనుకుంటే మళ్ళీ జూన్ లో TET అంట.

ఇంకో అసలైన విషయం చెప్పాలి..
2017 కొత్త సంవత్సర కానుకగా స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ 10 వ తరగతి అర్హతతో గ్రూప్ సి పోస్టులైన మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి ప్రకటన విడుదల చేసింది..అప్పటికి అది ఆఫ్ లైన్ పరీక్షే..మే నెలలో జరిగింది..అపుడు నా డిగ్రీ మొదటి సంవత్సర పరీక్షల కారణంగా నేను సరిగా ఆ పరీక్షపై ఎక్కువగా దృష్టి పెట్టలేకపోయాను...నా అదృష్టమో ఏమోగానీ..ఆ ఆఫ్ లైన్ పరీక్ష రద్దయ్యింది..కారణం ఉత్తర భారతంలో పేపర్ లీక్..తర్వాత మళ్ళీ ఆన్ లైన్ ద్వారా పరీక్షను సెప్టెంబర్-అక్టోబర్ మధ్య నిర్వహించారు.. అప్పటికే నేను SSC CHSL పరీక్ష మూడు సంవత్సరాల నుండి రాస్తున్నాను. రెండు సార్లూ 100-105 మధ్యనే వచ్చాయి..ఈసారి ఎక్కువే వస్తాయి అనుకుంటున్నా..ఇలా ముందే చదివి ఉన్నందువల్ల ఇంకా రివిజన్ ఎక్కువ చేసుకోవడానికి అవకాశం దొరికింది.అప్పుడు నాకు బోలెడంత సమయం దొరికింది చదవడానికి.. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కి కోచింగ్ ముందే తీసుకున్నా..ఇంక GK, English, Reasoning మాత్రం సొంత ప్రిపరేషనే..నాకు సెంటర్ రాజమండ్రి రాజీవ్ కాలేజి వచ్చింది..బాగా రాసానన్న సంతృప్తి దొరికింది..అలా అది రాసి వెంటనే కోచింగ్ కి అవనిగడ్డ వెళ్ళిపోయా..అక్కడా డైలీ, వీక్లీ పరీక్షల్లో మంచి మార్కులు వస్తుండేవి.


ఆ మల్టీటాస్కింగ్ స్టాఫ్ పరీక్ష ఫలితాలు 2018 సంక్రాంతి రోజైన జనవరి 15న వెలువడ్డాయి..అదీ మార్కులు కాదు..టయర్ 2 కి ఎంపికైన వారి లిస్ట్ పెట్టారు.అందులో నా పేరు ఉంది..వెంటనే అంటే జనవరి 28 నే టయర్ 2 పరీక్ష..అది కూడా విశాఖపట్నం కేంద్రం...ఇది వ్రాత పరీక్ష 50 మార్కులకి ఒక వ్యాసం గానీ లేఖ గానీ రాయాలి...సాధారణంగా SSC వ్రాత పరీక్షలు ఇంగ్లీషు లేక హిందీ భాషల్లో మాత్రమే రాయలి(CHSL&CGL)..ఇందులో వెసులుబాటు ఏంటంటే రాజ్యాంగం గుర్తించిన ఏ భాషలోనైనా వ్రాయవచ్చు...నేను ఇంగ్లీషులో రాసి రిస్కు తీసుకోవడం ఎందుకని తెలుగు లోనే లేఖ రాసొచ్చా. CHSL మరియు CGL లో కూడా ఇలాంటి ఏర్పాటు ఉంటే చాలా బాగుంటుంది..హిందీ మాతృభాష కలవారికే ఇందులో మంచి అవకాశాలు లభిస్తున్నాయి..ఇదీ ఒక రకంగా మనకు జరుగుతున్న అన్యాయం. ఇది అర్హత పరీక్ష మాత్రమే. ఈ మార్కులు మెరిట్ లిస్ట్ లో కలపరు..ఇందులో అర్హత మార్కులు 17 సాధిస్తే చాలని పరీక్ష అయ్యాక నిర్ణయించారు..టయర్ 2 ఫలితాలు రాకుండానే ఫిబ్రవరి చివరి వారంలో మళ్ళీ కటాఫ్ మార్కులు పెంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి రమ్మని వెబ్ సైట్ లో పెట్టారు...ఆ లిస్ట్ లో కూడా నా పేరు ఉంది..ఇంతకీ తమాషా ఏంటంటే టయర్ 1 లో నాకెన్ని మార్కులు వచ్చాయో ఇంకా తెలీదు..DV కి SSC సదరన్ రీజన్ (AP, TS, TN) చెన్నై కి వెళ్ళాలి...తర్వాత మొదలయ్యాయి అసలు కష్టాలు..
(సశేషం)

13, మే 2019, సోమవారం

నా మొదటి కథ....

సోమవారం, మే 13, 2019 9 Comments
కొన్నేళ్ళ క్రిందట ఈ కథ ని రాసాను. నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా, కొంచెం కల్పిత కథ ని కలిపి అల్లాను..ఎలా ఉందో మీ వ్యాఖ్యల ద్వారా నాకు తప్పకుండా తెలియజేయండి...

కుంటి కుక్క

Google Image

     నేనొక ఊరకుక్కని! కౄరమైనదాన్ని అనుకుంటున్నారేమో! వీధుల్లో తిరిగేదాన్ని కాబట్టి వీధి కుక్క అనుకోండి! అయినా చాలా మంది ఊరకుక్క అనే అంటారు కదండీ..ఏంటీ! కుంటుతున్నానని చూస్తున్నారా? అది చాలా పెద్ద కథండీ. ఇప్పుడు చెప్పేంత ఓపిక లేదు కానీ తర్వాత ఎపుడైనా చెప్తాలెండి..ఏంటీ! ఇప్పుడే చెప్పాలా..సర్లెండి చెప్తాను!

****

      అప్పుడే పుట్టాను. ఎవరో చిన్నబ్బాయి నన్ను చేతుల్లోకి తీసుకున్నాడు. "భలే ఉంది కదా! బుజ్జిగా" అంటూ ముద్దు చేసాడు. "ఒరేయ్ టింకూ దాన్ని పట్టుకోకురా! వదిలెయ్, వాళ్ళమ్మ దగ్గర పాలు తాగుతుంది" అని టింకూ అమ్మ అనుకుంటా! గట్టిగా అరిచింది. టింకూ వెంటనే నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. "టామీ" అనే పేరుతో నన్ను పిలిచేవారు.


     నెల పోయిన తర్వాత టింకూ, వాళ్ళ స్నేహితులతో వచ్చాడు. వాళ్ళలో ఒకడైన బన్ను నన్ను చూస్తూ "టింకూ! ఈ కుక్కపిల్ల నాకు చాలా నచ్చిందిరా. నేను మా ఇంటికి తీసుకెళ్ళి పెంచుకుంటాన్రా" అని అన్నాడు. దానికి టింకూ "దానికేం! తీసుకెళ్ళు, మరి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా?"  "నేను ఎలాగో ఒప్పిస్తాన్లే గానీ, మళ్ళీ వస్తాను" అంటూ బన్ను పరుగు తీసాడు. నేను భయపడిపోయాను. "బాబోయ్ వాళ్ళింటికి తీసుకెళ్ళిపోతారా. ఇక్కడ చాలా బాగుందే! మరి నాతో మా అమ్మ, నా తోబుట్టువులూ వస్తారో, రారో?" అనుకుంటూ అమ్మ బొజ్జ దగ్గరకెళ్ళిపోయా, పాలు తాగడానికి. అమ్మ శరీరం కింద ఒళ్ళు తెలియకుండా పడుకున్నా..


     లేచేసరికీ అమ్మ నా దగ్గర లేదు. బన్ను, టింకూ కనబడ్డారు. బన్ను నన్ను చూసి నవ్వుతున్నాడు. వాళ్ళింట్లో ఒప్పేసుకున్నారేమో! అయితే నేను వెళ్ళిపోవాలా? బన్ను నన్ను తీసుకుని బుట్టలో వేసాడు. "అరె! అమ్మని ఒక్కమాటైనా అడక్కుండా, తను లేని సమయంలో తీసుకుపోతారేమిటీ, అయ్యో!" అనుకుంటూ ఏడ్చా. నా ఏడుపు వాళ్ళకి వినిపించదు కదా!

     బన్ను వాళ్ళింట్లో వాళ్ళందరూ నా చుట్టూ చేరారు. కొంచెం భయం వేసింది. కానీ చూస్తే మంచి వాళ్ళ లాగానే ఉన్నారు. బన్నూ, తన చెల్లి హనీ నాకు మంచి స్నేహితులైపోయారు. మేము ముగ్గురం ఆదివారం వస్తే చాలు, బంతితో తయారైపోతాం. ఇద్దరూ కలిసి నాకు వారానికొక్కసారి బేబీ షాంపూతో స్నానం కూడా చేయిస్తారు. హనీ ఒక్కోసారి నా పక్కనే కూర్చుని నా తల మీద చెయ్యి వేసి సవరిస్తూ, నా బుగ్గల్ని నొక్కుతూ ముద్దు చేస్తుంది. అలా చేస్తుంటే, నేను హనీ ఒడిలో తల పెట్టుకుని గారాలు పోతూ ఉంటాను. ఇదిలా ఉంటే, నేనంటే బన్నూ వాళ్ళ నాన్నకి అంత పడదు. కానీ మిగతా ముగ్గురి మాట కాదనలేక నన్ను ఇంట్లో ఉంచడానికి ఒప్పుకున్నాడు. అయినా నాకు ఆయనంటే అభిమానం. ఆయన సోఫాలో కూర్చుని పేపరు చదువుతుంటే కాళ్ళను చుట్టుకుని పడుకుంటా. కానీ ఆయన నన్ను చీదరించుకుంటాడు. అప్పుడు నా ముఖం చిన్నబోతుంది.


      ఒకరోజు సెలవుల్లో బన్ను, హనీ నా మెడకు బెల్టు కట్టి రోడ్డు పైకి తీసుకెళ్ళారు. అలా నేను వెళ్ళడం అదే మొదటిసారి. బెల్టు వదులుగా ఉండటంతో కొంతసేపటికి ఊడిపోయింది. అంతలో మా అమ్మ లాంటి కుక్క రోడ్డుకవతల కనిపించింది. నేను వెంటనే అటు వైపు వెళ్ళబోయా. ఒక్కసారిగా అటువైపు నుండి కారు వచ్చి నా కాలు మీద నుండి వెళ్ళిపోయింది. నాకు చెప్పలేనంత భయం, బాధ కలిగాయి. ఆ బాధ భరించలేక గట్టిగా ఏడుస్తూ అరిచా. ఇంతలో బన్ను, హనీ పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చారు. వాళ్ళకి కూడా భయం వేసినట్టుంది. బిక్క ముఖాలు పెట్టారు. బన్ను ఏడుస్తూ "సారీ టామీ, మా వల్లే నీకు ఇంత దెబ్బ తగిలింది. ఇంకెప్పుడూ నిన్ను ఇలా వదలము" అని ఏడ్చాడు. ఇందులో నాకు వాళ్ళ తప్పేమీ కనిపించలేదు. నేను ఆ కుక్కని మా అమ్మేమో అనుకుని చూడ్డానికి వెళ్తుంటే ఆ కారు వాడు గుద్దేసాడు. అయినా నేను అటూ ఇటూ చూసే వెళ్ళాను. నేను రోడ్డు దాటుతుంటే స్పష్టంగా కనబడుతుంది కదా. నాలా కాకుండా రంగులు కనిపిస్తాయి కదా! అదే మనిషి ఎవరైనా నా స్థితిలో ఉంటే అలా మీద నుండి పోతారా! కుక్కే కదా అని అశ్రద్ధ! అని సైగల ద్వారా చెప్పబోయా. కానీ, వాళ్ళకి నా భాష అర్ధం కాదు కదా!


      నన్ను జాగ్రత్తగా చేతుల్లో పట్టుకుని ఇంటికి తీసుకెళ్ళారు. ఏవో మందులు వేశారు. నేను ఆ మంటకి "కుయ్యో..మొర్రో.." అంటూ అరిచాను. అలా కొన్ని రోజులు నా పక్క మీదే ఉన్నాను. దెబ్బలు చాలా వరకూ మానాయి. ఒక రోజు లేచి నడవబోయాను. పడిపోయాను. మళ్ళీ మళ్ళీ పడిపోయాను. అయ్యో! నా కాలు విరిగిపోయిందే. ఇదంతా ఆ కారు వాడి పనే! వాడు గానీ నాకు దొరకాలీ..ఒళ్ళంతా కరచి పడేస్తా! అనుకుంటూ మూడు కాళ్ళపై నడవడం నేర్చుకున్నా. అప్పట్నుంచి బన్నూ వాళ్ళ నాన్న నాపై ఇంకా ఎక్కువ చిరాకు పడేవాడు. అదీకాక, వాళ్ళమ్మ కూడా అలాగే తయారైంది. మాటిమాటికీ "కుంటికుక్క...కుంటికుక్క.." అని అంటున్నారు. అప్పుడు మా అమ్మ దగ్గరికెళ్ళిపోవాలనిపిస్తుంది. హనీ, బన్ను మాత్రం నన్ను ఇంకా ప్రేమతో చూసుకునేవారు.


      ఒకరోజు బన్ను వాళ్ళ నాన్న స్నేహితుడు, ఒకాయన మా ఇంటికి వచ్చారు. నేను ఆయన రాగానే తోకూపుకుంటూ వెళ్ళాను, ఆహ్వానించాడానికి. ఆయన కూర్చోగానే "ఏవిట్రా! మీ కుక్క గట్టిగా అరవలేదు. పైగా కుంటుతుంది. ఎవరైనా తెలియని వాళ్ళొస్తే కుక్కలు అరుస్తాయి కదా! ఏ దొంగో వస్తే? అరవకపోగా, తోకూపుకుంటూ వెళ్ళి స్వాగతిస్తుంది" అని అన్నాడు. బన్నూ వాళ్ళ నాన్న వికారంగా నవ్వాడు. మళ్ళీ ఆ స్నేహితుడే "ఒరేయ్ ఎందుకూ పనికి రాని దీన్ని ఒదిలించేసుకో, నీకు అంతగా మంచి కుక్క కావాలంటే ఒక దృఢమైన డాబర్ మేన్ కుక్కని నీకిప్పిస్తాను" అని అన్నాడు. వాళ్ళు మెల్లిగా అనుకుంటున్నా ఆ మాటలు నా చెవిన పడకపోలేదు.

       ఆ వచ్చినతను బన్నూ నాన్నతో వచ్చాడు కాబట్టి నేను ఏమీ అరవలేదు, అలా కాకుండా అయితే తప్పకుండా అరుస్తాను కదా! అసలే బన్నూ వాళ్ళ నాన్నకి నేనంటే చిరాకు కదా! నిజంగానే నన్ను వదిలించుకుంటాడేమో!

       ఓ రెండు రోజులు పోయిన తర్వాత ఎప్పుడూ లేనిది బన్నూ వాళ్ళ నాన్న నన్ను చేతుల్లోకి తీసుకున్నాడు. నేను చాలా ఆనందపడ్డాను. కానీ ఎందుకో? బన్నూ, హనీ గట్టిగా ఏడుస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనిపించింది, కానీ నన్ను ఈయన గట్టిగా పట్టుకున్నాడు. నాకేం అర్ధం కావడంలేదు. ఆయన నన్ను బుట్టలో పెట్టుకుని బైక్ పై కూర్చున్నాడు. చీకటిగా ఉందేమో! అంతా అస్పష్టంగా ఉంది. నన్ను చంపేస్తాడా ఏంటీ! ఒక్కసారిగా భయం వేసింది.. బాబోయ్..దూకేయాలనుకున్నా. కానీ ఆయన ఒక చెయ్యి నన్ను అదిమి పట్టి ఉంది. అయినా నా పిచ్చి కానీ అతని బలం ముందు, నా బలం ఎంత?


      కొన్ని వీధులు తిప్పి, ఒక వీధి చివర నన్ను బుట్టతో సహా వదిలేసి, మరి వెనక్కి చూడకుండా బైక్ పై వేగంగా వెళ్ళిపోయాడు. నాకు దుఃఖం వచ్చేసింది. నాకేం తెలియలేదు. ఉన్నన్నాళ్ళు విశ్వాసంగానే ఉన్నాను కదా! ఒక్కసారీ ఏ దొంగా రాలేదు. ఒకవేళ వచ్చి ఉంటే నా ప్రతాపం చూపేదాన్ని! ఆయనకి నేనంటే మొదట్నుంచీ అయిష్టతే! ఆ స్నేహితుని మాటలు అగ్నికి ఆజ్యం పోసినట్లయినాయి, నావల్ల వాళ్ళకెప్పుడూ హాని కలగలేదు. కానీ వాళ్ళు నాకు ఇచ్చిందేంటీ? బన్ను, హనీలు అడ్డు చెప్పలేదెందుకో! అమ్మ, నాన్నలకు భయపడి ఉంటారు.

*****

       విన్నారు కదా..ఇదీ నా కథ! అలా అప్పట్నుంచీ ఇలా మూడు కాళ్ళతో కాలక్షేపం చేస్తున్నా. గాలికి తిరుగుతూ, దొరికింది తింటూ గడుపుతున్నాను. ఎక్కడైనా హనీ, బన్ను, మా అమ్మ కనిపిస్తారేమోనని ఆశగా చూస్తుంటా! "అబ్బా..!" రాయి పొట్టకి తగిలింది. మళ్ళీ తలకి..రాళ్ళు ఎక్కడ్నుంచి వస్తున్నాయో చూద్దును కదా! ఎవరో ఆకతాయిలు నాపై రాళ్ళు విసురుతూ నవ్వుతున్నారు. నేనిక ఊరుకోలేకపోయాను, మనుషుల్ని ఉపేక్షించేది లేదు.. ఒక్క ఉదుటున వాళ్ళపైకి దూకాను. వాళ్ళు రాళ్ళు అక్కడే పారేసి భయంతో పరుగెత్తారు. వాళ్ళని వదిలే ప్రశక్తే లేదు ఈవాళ అనుకుంటూ వాళ్ళని వెంబడించాను. ఒక్కడు చిక్కాడు నాకు. రెండు చోట్ల కండ ఊడేలాగా కరిచాను. వాడు బాధతో రాగాలు తీస్తుంటే నాకు చాలా ఆనందం వేసింది. హాయిగా పళ్ళు ఇకిలించాను. నేను చేసిందేమైనా తప్పా! చెప్పండి. నా మానాన నేను మీతో మాట్లాడుతుంటే నన్ను రెచ్చగొడతారా!


      ఏదో వేడుక జరిగినట్లుంది పెద్ద ఇంటోళ్ళది. సగం పదార్ధాలు నేలపాలే! విందు చేసుకున్నా. "బ్రేవ్.." మనుకుంటూ మెల్లగా నడుస్తున్నా. రైలు పట్టాలపైనుండి నడుస్తున్నాను. అయ్యో! నా కాలు పట్టాలో ఇరుక్కుపోయిందే! ఎలా.? అనుకుంటుంటే "కూ.." రైలు శబ్దం వినిపించింది. ఎంతో గింజుకున్నా...

*****

     ఆ రైలు నా పైనుండి వెళ్ళిపోయింది. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నా. అయినా మా అమ్మ చచ్చిపోయిందో, లేదో! నేను వెళ్ళే దగ్గర కూడా మనుషులు ఉంటారా ఏంటీ? నాకు మనుషులంటే కోపం వచ్చేస్తుంది.

      కొంపతీసి మీరూ మనుషులేనా?

1, ఏప్రిల్ 2019, సోమవారం

చంద్రముఖీ... నేను...

సోమవారం, ఏప్రిల్ 01, 2019 6 Comments


  ఒక శుభదినాన YouTube లో పాటలు చూస్తుంటే..video suggestions లో నాకు "వారాయ్" పాట కనిపించింది. నాకేంటో మరి ఆ పాని (తెలుగు అయినా తమిళం అయినా) ఎన్ని సార్లు చూసినా విన్నా తనివి తీరదు...ఆ పిచ్చి తోనే పదో తరగతి ఫేర్వెల్ పార్టీ లో ఇంకో అమ్మాయితో కలిపి పాటను పాడి వినిపించాను. (ఎలా ఉందో విన్న వారికే తెలియాలి. ఇపుడు మాత్రం పాడమనకండి 😅)..

  చంద్రముఖి పేరు వినగానే నాకు చాలా చాలా గుర్తు వస్తుంటాయి. ఇప్పటికి ఆ సినిమాని ఎన్ని సార్లు చూసానో నాకే తెలీదు. ఇక పతాక సన్నివేశం అయితే చెప్పక్కర్లేదు. అసలు ఆ సినిమా అంటే పిచ్చి కంటే ముందు పుట్టింది భయం..నిజమండీ బాబూ!!







  ఎప్పుడో 14 సం|| క్రిందటి మాట. సినిమా విడుదల అయినప్పటి సంగతి. ఇప్పటి కంటే అప్పట్లో సినిమాలకి థియేటర్లకు వెళ్ళేది ఎక్కువగా ఉండేది. అలాగే ఒకరోజు మా పోరు పడలేక డాడీ అందర్నీ ఆ సినిమాకి తీసుకెళ్లారు. అప్పుడు నాకు ఏడెనిమిది ఏళ్లు ఉండొచ్చేమో. అప్పట్లో మా డాడీ కి  Hero Honda CD 100 ఉండేది. దానిమీద అమ్మ, డాడీ, నేను, చెల్లి సినిమాకి వెళ్ళాం. ఆ సినిమా చూస్తున్నపుడు సినిమా హాల్లో నా ప్రతిస్పందన ఏమీ గుర్తు లేదు..కానీ ...తర్వాత జరిగినవి మాత్రం అలా నా మస్తిష్కంలో ముద్ర పడిపోయాయి. అసలు విషయం చెప్పడం మరిచిపోయాను. ఆ సినిమాకి వెళ్ళింది రెండో ఆటకి..హా..అవునండీ..వచ్చేటపుడు బండి మీద ఇలా కూర్చున్నాం...పెట్రోలు టాంక్ మీద చెల్లి, తర్వాత డాడీ, తర్వాత నేను,..వెనుక అమ్మ..అయితే ఆ సినిమా చూశాక కలిగిన భయమో ఏమో గానీ..ఇంటికి వచ్చేటపుడు బండి మీద కూర్చుని వెనక్కి వెనక్కి చూసా. అప్పట్లో అదొక భయం..ఎక్కడ చంద్రముఖి మా బండి వెనకాలే వచ్చేస్తుందో ఏమో..లకలకలకమని అరుచుకుంటూ అని😝..


  ఇంకా అపుడు వేసవికాలం కదా..రాత్రుళ్ళు నేల మీదే పడుకునే వాళ్ళం. తలుపులు కొంచెం తెరిచి ఉంచేవాళ్ళం చల్ల గాలి కోసం. అసలే వేసవి..పైగా రాత్రి సమయాల్లో నే కరెంటు కోతలు..ఇక చూడండి..మా చెల్లి నన్ను ఎలా ఆడుకునేదంటే, ఆ సమయం లో కావాలని మరీ "లకలకలక" అని గట్టిగా అనేది. అప్పుడు నా ముఖం చూడాలి😧 ఎందుకో చాలా భయం వేసేది..ఒక విధంగా మెరిసే చంద్రముఖి కళ్ళు, ఆ విశిష్టమైన తమిళ భాష మాట్లాడే ఆమె గొంతు, క్లైమాక్స్ లో అరుపులు ...ఇవన్నీ గుర్తు వచ్చేవి. అప్పట్లో "లకలకలక..." అని ఆపకుండా అనడం కూడా ఒక గొప్పే!!  ఇలా మా చెల్లి నన్ను భయపెట్టడం చాలా కాలం సాగింది..తర్వాత్తర్వాత భయం గియం ఏమీ లేవనుకోండి...
  కానీ చంద్రముఖి సినిమా అయిపోయాక ఏమైపోయంది? అన్న ప్రశ్న మాత్రం నాతో పాటు పెరిగి పెద్దదైంది. "నాగవల్లి" సినిమాకి వెళ్ళడానికి కారణం ఆ ఉత్సుకత నే. ఈ సినిమా చంద్రముఖి అంతగా ఆకట్టుకోలేకపోయింది.


   ఇదండీ!!.."చంద్రముఖి" తో నాకున్న అనుబంధం. ఇప్పుడు ఇవన్నీ గుర్తు వస్తుంటే నా ముఖం మీద ఒక చిరునవ్వు వస్తుంది😁

6, సెప్టెంబర్ 2018, గురువారం

'స్మార్ట్' కిడ్స్

గురువారం, సెప్టెంబర్ 06, 2018 2 Comments



ఈ కాలం పిల్లలని ఫోన్లకి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదని నా అభిప్రాయం. చిన్న పిల్లలు ఫోన్ ను కూడా ఆటవస్తువులాగే భావిస్తారు. ఒక వయసొచ్చాక ఇచ్చినా ఫర్వాలేదు..కానీ మరీ పసివయసులోనే అలవాటు చేస్తే ఇబ్బందే మరి. ఒక్కసారి చేతికిస్తే చాలు, మళ్ళీ అది మన చేతికి ఎప్పుడు వస్తుందో ఆ దేవుడికే తెలియాలి. ఫోనులో ఎక్కడ ఏమేమున్నాయో మనక్కూడా తెలియనంతగా వారి తెలివిని ప్రదర్శిస్తారు. నా అనుభవంలో జరిగిన సంఘటనలు చెబుతాను!!

ఒక ముఖ్యమైన పోటీ పరీక్షకి విశాఖపట్నం వెళ్ళాల్సి వచ్చింది. మామూలుగా ఇలా పరీక్షల కోసం రాజమండ్రి, విజయవాడ వరకే వెళ్ళాను. ఇవైతే ఒక్కరోజులో వెళ్ళి వచ్చేయొచ్చు. కానీ విశాఖపట్నం అలా కుదరదు మాకు! పోనీ వెళ్ళకుండా మానలేని పరీక్ష, అందుకని ముందురోజు ఉదయమే "సింహాద్రి" (అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు "హింసాద్రి". అందరి అభిమానం తట్టుకోలేక రైల్వే వాళ్ళు ఈ లింక్ ఎక్స్ ప్రెస్ ని నడపట్లేదు ఇప్పుడు) కి బయల్దేరాం. విశాఖలో దిగేసరికీ రాత్రి అయింది. ఆ రాత్రి, మా దగ్గరి బంధువుల ఇంటి దగ్గర ఉన్నాము. 


నేను ట్రయిన్ లో కాలక్షేపానికి పనికి వస్తుందని నా Tablet ని తీసుకెళ్ళా (8-9 గంటల ప్రయాణం మరి). ఆ బంధువులింట్లో చిన్న పిల్లాడు ఉన్నాడని తెల్సి ముందు జాగ్రత్తగా నా ట్యాబ్ ని ట్రయిన్ దిగక ముందే నా బ్యాగ్ లో కనిపించకుండా సర్దేశాను. వాడెప్పుడూ ఫోన్లతోనే ఉంటాడట. మా డాడీ తన ఫోన్ బయటికి తియ్యగానే అది తీసేసుకున్నాడు. లాక్ వేసి ఉన్నా తీయడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ తిరిగి ఇవ్వడం లేదు. వాళ్ళ అమ్మ ఇచ్చేయమని బతిమాలితే తప్ప కనికరించలేదు.దానికి చార్జింగ్ పెట్టనిస్తే ఒట్టు.. మా డాడీ ఇలా చార్జింగ్ పెట్టడం వాడు అలా తీసేయడం...ఇదే వరుస!. వాడికి అప్పటికే ఒక పాత ఫోను, ట్యాబ్ ఉన్నాయి. ఏది కొత్తదొస్తే అదే కావాలట. నా దగ్గర ట్యాబ్ ఉందని బయటపెట్టని నా ముందుజాగ్రత్తని మెచ్చుకున్నా!


తర్వాతి రోజు ఆదివారం..పరీక్ష రోజు. మా బ్యాగులూ అవీ అక్కడే ఉంచేసి, పరీక్షకి కావల్సినవి తీసుకుని బయల్దేరాం. పరీక్ష ఐతే బాగానే రాశాను. ఇంతా చేసి వైజాగ్ వస్తే...అది అరగంట పరీక్షే!! ఆ రోజు ఇక అక్కడే ఉండి మర్నాడు తెల్లారగానే ట్రయిన్ కి వెళ్దామని మా ప్లాన్. పరీక్ష అవ్వగానే ఇంటికి వెళ్ళాం. 


అక్కడి దృశ్యం చూసి నా కళ్ళు బైర్లు కమ్మాయి. వాడు చిద్విలాసంగా సోఫాలో కూర్చుని నా ట్యాబ్ లో ఆటలు ఆడుతున్నాడు. 😣మనకసలే మొహమాటం ఎక్కువాయే. ఇవ్వమని అడగలేకుండా ఉంది నా పరిస్థితి. "ఈ పిల్లకి మరీ ఇంత ఇదేంటో..ఒకసారి తీసుకున్నంత మాత్రాన నీ ట్యాబ్ ఏమీ అరిగిపోదులే" అన్నట్టు చూస్తారేమోనని భయం నాకు. అందుకే ఏం మాట్లాడకుండా నా బాధని దిగమింగుకుని సైలెంట్ గా ఉన్నా. ఇంతలో వాళ్ళమ్మ చెప్పింది...మేం వెళ్ళగానే మా బ్యాగ్ తెరిచేసి అన్నీ కెలికేసాడంట. ఇస్త్రీ చేసి పెట్టుకున్న బట్టలు అన్నీ చెల్లాచెదురు చేసేసాడు. ట్యాబ్ దొరికింది..ఇక అన్నీ అలాగే వదిలేశాడు. నేను ట్యాబ్ ని దాని స్పెషల్ బ్యాగ్ లో పెట్టి లగేజ్ బ్యాగ్లో ఉంచాను..అన్నీ తీసేశాడు.


ట్యాబ్ కి పాటర్న్ లాకులు, పాస్వర్డ్ లు పెట్టే అలవాటు నాకు లేదు. సాధారణ స్లైడ్ లాక్ ఒక్కటే ఉంటుంది. బ్యాగ్లో పెట్టేముందు షట్ డౌన్ చేసే పెట్టాను. అయినా ఆన్ చేసేశాడు. పట్టుమని పదేళ్ళు కూడా లేవు వాడికి..ఎంత తెలివో!! వాడి అమ్మావాళ్ళేమో "ఏం చెయ్యడులే", "అన్నీ తెలుసు మావాడికి" అని అంటున్నారు. అయినా నా భయాలు నావి. అది వాడి చేతిలోంచి జారిందంటే అంతే చాలు లేదా కోపం వచ్చి దాన్ని విసిరికొట్టాడంటే!!అమ్మో...ఆ ఊహే ఎంతో భయంకరం..నా ట్యాబ్ ని ఒక కంట కనిపెడుతూ బట్టలు మడత పెట్టాను. చివరికి ఏదోలా మభ్యపెట్టి ట్యాబ్ ని నా చేతిలో పెట్టారు. నేను ఇచ్చిందే తడవుగా పాస్వర్డ్ పెట్టేశా!.ఏమేం తెరిచాడో చూద్దామని Recent Apps చూస్తే ఒక గేం ఆడాడు, కొన్ని ఎవేవో ఫోటోలు తీశాడు.. ఇంక తర్వాత మేము వచ్చేయడంతో అది అక్కడితో ముగిసింది.

ఇలా చెప్తుంటే నాకు ఇంకా ముందు జరిగిన సంఘటన ఒకటి గుర్తుకొచ్చింది.

ఒకరోజు మా ఇంటికి తెల్సినవాళ్ళు వచ్చారు. వాళ్ళతో పాటు మూడేళ్ళ పాప కూడా వచ్చింది. నేను అప్పటికి ట్యాబ్ లో ఏదో చదువుకుంటున్నాను. మావాళ్ళు, ఆ వచ్చినవాళ్ళు కబుర్లు చెప్పుకుంటుంటే, ఆ పిల్ల నా దగ్గరికి వచ్చింది. చిన్నపిల్ల కదా అని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నా. పక్కనే పెట్టిన ట్యాబ్ తీసుకుంది. Gallery తెరిచింది. ఒక్కొక్కటి తిప్పుతూ ఫోటోలు చూస్తుంది. Gallery లో ఒక mode లో కిందకు తోస్తే డిలీట్ అయిపోతాయి కదా..అలా తను మూడు ఫోటోలు డిలీట్ చేసేసింది. అవేమంత ముఖ్యమైన ఫోటోలు కాదు కాబట్టి సరిపోయింది. లేదంటేనా!!(ఒక వేళ అయినా చేసేదేమీ లేదు)..


అందుకనే చిన్నపిల్లలకి ఫోన్లూ అవీ అలవాటు చేయకపోవటమే మంచిది. (మా పిల్లలు టెక్నాలజీకి దూరంగా ఉండాలా? అని ఎదురు ప్రశ్న వేస్తే నేనేం చేయలేను మరి) మనం చూస్తూనే ఉన్నాం..స్మార్ట్ ఫోన్ల కాలంలో పసివాళ్ళు ఎలా మారిపోయారో!! ఒక పిల్లేమో ఫోన్లో పాటలు పెట్టందే ముద్ద తినదు..ఇంకొకడేమో వాళ్ళ డాడీ ఫోన్ ఇవ్వనంటే ఇల్లెగిరిపోయేలా ఆరున్నొక్కరాగం ఆలపించడానికి గొంతు సవరిస్తాడు. ఒకవేళ ఫోన్లు అలవాటు చేసినా, ఇంకొకరి ఫోన్లని కూడా లాక్కోవడం మంచిది కాదని చెప్తే సరి!!! (వాళ్ళు వింటే మంచిది, లేకపోతే నాలాంటి వాళ్ళు బలైపోతారు)....

31, జులై 2018, మంగళవారం

గ్రహణం

మంగళవారం, జులై 31, 2018 7 Comments
ఆ శతాబ్దపు సుదీర్ఘ చంద్ర గ్రహణం 27 జూలై న ఏర్పడ్తుందని రేడియో మరియు పత్రికల ద్వారా తెల్సుకుని, ఈ ఖగోళ అద్భుతాన్ని  ఎలాగైనా చూసి తీరాలని మంగమ్మ శపధం లాంటిది చేసాం...అదీగాక అరుణ గ్రహాన్ని కూడా పనిలో పనిగా చూడొచ్చంటగా...చంద్రుడికి దగ్గరగా వస్తాదట..కానీ అది అర్ధరాత్రిలో జరుగుతుందని తెల్సి నిరాశపడ్డా!! అయినా నా పిచ్చి గాని చంద్రుడు పగలు వస్తాడా ఏంటి!!!ప్చ్..కనీసం రాత్రి పది లోపు కూడా కాదు..

రాత్రి పడుకునే ముందు పైకెక్కి చూస్తే చంద్రుడు ఎక్కడా లేడు..నా మట్టిబుర్ర అప్పుడు వెలిగింది..పౌర్ణమి నుంచి చంద్రుడు ఆలస్యంగా తీరిగ్గా వస్తాడు కదా... ఆకాశం అంతా మబ్బుపట్టి ఉంది. ఒక్క చుక్క కూడా లేదు...ఇలా ఐతే గ్రహణాన్ని చూడ్డం కష్టమే మరి...ఏమో ఆ టైం కి ఎలా ఉంటుందో మరి.. నేను చూసే సమయానికి మేఘాలని కొంచెం పక్కకి తప్పుకోమని శరణు వేడుకొని కిందకి వచ్చేశా..!!

అర్ధరాత్రి మెలకువ రావడం కష్టమని సెల్లులో ఒంటిగంటకి అలారం పెట్టుకుని పడుకున్నా..కాసేపయ్యాక సడెన్ గా మెలకువ వచ్చింది..ఒహ్హో..అలారం అక్కర్లేకుండానే మెలకువ వచ్చిందే. నువ్ గ్రేట్ మోహనా అని నాకు నేనే భుజం తట్టుకున్నా...త్వరగా డాబా పైకి వెళ్ళి చంద్రుడి దోబూచులాట చూడాలనుకుంటూ.. అనందపడుతూ టైం చూశా... అంతే కత్తివేటుకి చుక్క నెత్తురు లేదన్న మాదిరి టైడ్ యాడ్ లో లాగా షాక్ అయ్యావా! అని చెవిలో ఎవరో అరిచినట్లయింది ఒక్కసారిగా..నేనేమో ఏ 12 అయ్యిందో అనుకున్నా...కానీ అంతలోనే నా ఆనందం అంతా ఆవిరి అయిపోయింది ఈ ఆషాఢం ఉక్కపోతకి..ఇంతకీ టైమెంతో తెల్సా??...తెల్లవారుజాము 4...హ్మ్..ఏం చేస్తాం..ఇంక మా చెల్లినేం లేపుతాను..పోనీ ఒకేఒక్క లాస్ట్ చాన్స్ అనుకుని, టైం చచ్చినా ఆశ చావక..(సామెత మార్చాన్లెండి!!)ఒకసారి చూసి వస్తే ఏమవుతుందని మెల్లగా తలుపులు తీసుకుని మా ఇంటికి రోజూ వచ్చే పిల్లిలా మెట్లెక్కా.. శబ్దం చేస్తే ఏ దొంగ వెధవో వచ్చాడనుకుంటారుగా మరి..

సీన్ కట్ చేస్తే చంద్రుడు మామూలుగానే ఉన్నాడు కానీ మబ్బుల ముసుగులో దాక్కున్నాడు..నన్ను ఎవరెవరు చూస్తున్నారా!!?? అని మేఘాల చాటు నుండి తొంగి తొంగి చూస్తున్నాడు. “నువ్వు నా గ్రహణంలో నన్ను చూడకుండా నిద్రపోయావ్ గా!! నీ ముఖం చూడను గాక చూడను ఫో!!”అంటూ మొత్తంగా మబ్బుల్లోకి దూరిపోయాడు..ఎంత జుట్టు పీక్కుని గింజుకున్నా కదిలిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేం గా!!నేనే మన్నా ‘24’ సినిమాలో సూర్య నా ఏంటీ!!!ఇంక చేసేదేంలేక కిందకివచ్చేసి తలుపులు జాగ్రత్తగా వేసేసి ఫ్యాన్ వేగం కాస్త పెంచి మళ్ళీ మంచమెక్కా...

ఇక ఆరింటికి మా చెల్లికి జరిగిన తతంగం చెబుదామని లేపాను...(అదింకా లేవ నేలేదు!!)..ఆవులిస్తూనే అప్పుడే ఒంటిగంట అయిపోయిందా అంది..నేను కొంచెం గట్టిగా ఒంటిగంట కాదే తెల్లారిందే అని అరిచినంత పని చేసా..అప్పుడు అసలు విషయం చెప్పింది..రాత్రి 12 కి దానికి మెలకువ వచ్చిందంట..ఎలాగూ ఇంకో గంటలో అలారం మోగుతుందిగా అప్పుడు లేవొచ్చులే అనుకుని పడుకుందట..అప్పుడు నిన్నూ లేపాల్సిందే అని బాధపడింది..మొత్తానికి ఈ సుదీర్ఘ చంద్రగ్రహణాన్ని చూసే అవకాశాన్ని కోల్పోయాం..మళ్ళీ 2028 లో ఇలాంటిది వస్తుందంటగా అప్పుడైనా చూస్తానో లేదో!!??

కానీ ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి..ఈ సంవత్సరంలో ఏర్పడిన మొదటి చంద్ర గ్రహణం జనవరి 31 న వచ్చింది కదా..దాని పట్టువిడుపులని ఆసాంతం రాత్రి పది దాటే వరకు ఉండి మరీ చూశాం..అప్పుడు గ్రహణం ఒకటే కాదు..సూపర్ మూన్+ రెడ్(బ్లడ్) మూన్+ బ్లూ మూన్..ఇవన్నీ ఒకేసారి ఏర్పడ్డాయంట..చూడ్డమే కాదు మా శక్తి కొలదీ ఆ దృశ్యాలను కేమెరా లో బంధించటానికి..సారీ సారీ ఇరికించటానికి ఎన్ని అగచాట్లు పడ్డామో...మరి అంత పేద్ద చందమామ మా బుల్లి కేమెరాలో పట్టాలి కదా!!అందులో ఒకటే ఈ ఫోటో..బాగోకపోయినా ఏం అనుకోకండే!!

2, ఆగస్టు 2015, ఆదివారం

పొట్టిక్కలూ..అప్పనపల్లి..!!

ఆదివారం, ఆగస్టు 02, 2015 6 Comments

ఈ రోజు మా కుటుంబ సమేతంగా అయినవిల్లి మరియు అప్పనపల్లి వెళ్ళాము..దారిలో చించినాడ గోదావరి రేవు దగ్గర ఆగి..గోదావరి అందాలను మా కేమేరాలో బంధించి తర్వాత..డొక్కా సీతమ్మ ఆక్విడక్టు ను కూడా చూసి...దారిలో అంబాజీపేట హోటల్లో "పొట్టిక్కలు"ను రుచి చూశాం...అవి చాలా బాగున్నాయి...తర్వాత అయినవిల్లి శ్రీ వరసిద్ధివినాయక స్వామిని దర్శనం చేసుకున్నాం..అక్కడే భోజనం చేసి అక్కడ్నించి అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామిని దర్శనం చేసుకున్నాం..





చించినాడ వంతెన కింద ప్రభాత గోదావరి


డొక్కా సీతమ్మ ఆక్విడక్టు


వేడి వేడి పొట్టిక్కలు తయారు..!!


దారిలో...ఒక సారి గైల్ ఇండియా గ్యాస్ లీక్ ప్రమాదం జరిగింది కదా..ఆ ఊరి పేరు "నగరం"...అక్కడ ఇవి రహదారి పక్కన అమ్ముతుంటే కొన్నా...అంతకుముందు కూడా కొన్నిసార్లు తిన్నాం..చాలా బావుంటాయి...వీటి పేరు ఎవరికైనా తెలిస్తే చెప్పండి..!!


వీటి పేరే తెలియనిది..??


21, జూన్ 2015, ఆదివారం

క్విల్లింగ్...Jewellery

ఆదివారం, జూన్ 21, 2015 0 Comments

ఫేస్ బుక్ లో క్విల్లింగ్ చెవి జుంకాలు ఎన్ని ఉన్నాయో!!!మాకూ అలాగ చెయ్యాలనిపించింది..చిన్నచిన్న పువ్వులు,ఆకులు లాంటివి చెయ్యడం వచ్చు కానీ..ఇలా చెవి జుంకాలు చెయ్యడం తెలియదు..అయితే ఈ అంతర్జాలం ద్వారా నేర్చుకోలేనివి ఏమున్నాయి..ఫలానాది చెయ్యడం నాకు రాదు అనడానికి లేదు....అలా అంతర్జాలం ద్వారా చూసి నేర్చుకున్నాం..ఇంతకీ చెయ్యడం వచ్చేసింది..సరే...మరి అవి తయారు చెయ్యడానికి కావల్సిన సామాగ్రి కావాలి కదా!!

ఆన్ లైన్ అంగళ్ళలో ఉన్నాయి కానీ...షిప్పింగ్ చార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయి..ఏం చెయ్యాలో అర్ధం కాలేదు...ఫేస్ బుక్ లో అలాంటివి అమ్మే కొన్ని పేజీలు దొరికాయి...వాటిలో కూడా ఆ కొరియర్ చార్జీలు ఎక్కువగా ఉన్నాయి..చివరికి మా పాలకొల్లులోనే మామిడిపల్లి ఫ్యాన్సీ దుకాణం లో దొరికాయి...హమ్మయ్య...దొరికేసాయ్...అని కొనుక్కుని తెచ్చేసుకున్నాం..కానీ అక్కడ సిల్వర్ కలర్ వి లేవట...ప్చ్..క్విల్లింగ్ పేపర్స్ అమెజాన్ ద్వారా తెప్పించుకున్నాం..
ఆ తర్వాత ఇలా....