ఈ రోజు ఉదయం NHK World TV అనే జపాన్ చానెల్లో ఒక కార్యక్రమం చూశా.జపాన్ లో భూకంపాల బెడద ఎక్కువ కదా!అందుకని నగోయా అనే విశ్వవిద్యాలయం వాళ్ళు,భూకంపాలకు కూడా తట్టుకుని నిలబడేలా ఉండే భవనాల నిర్మాణాలపై పరిశోధన చేస్తున్నారు.ఆ భవనాలు భూకంపాలకు ఊగుతాయే తప్ప పడిపోవు.అది అలా ఉంచితే ఇంతకీ విషయం ఏంటంటే...
ఆ నగోయా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు టీవీలో మాట్లాడేటప్పుడు కూడా జపనీస్ లోనే మాట్లాడుతున్నారు.ఆ చానెల్ వారు దానికి ఆంగ్లంలో అనువాదం చేస్తున్నారు.చూడండి,అంత పెద్ద విశ్వవిద్యాలయం లో ప్రొఫెసర్లు అయ్యుండి కూడా వారు తమ మాతృభాషను వదలడం లేదు.మనమేమో ఒకటో తరగతి పిల్లలకి అ,ఆ,ఇ,ఈ..లను వదిలేసి A,B,C,D...లను నేర్పుతున్నాం.మన చుట్టూ ఉండే చిన్నపిల్లల్ని అ,ఆ,ఇ,ఈ లు వచ్చా అనడిగితే,ఎక్కువగా రాదు అనే సమాధానం వస్తుంది.
మన దేశంతో పోలిస్తే జపాన్ చాలా చిన్న దేశం.కానీ భాషాభిమానంలో మన కన్నా పెద్ద దేశం.ఆంగ్లం నేర్చుకుంటేనే అభివృద్ధి సాధ్యమనుకునే మన లాంటి వాళ్ళు,జపనీయుల్ని చూసి చాలా నేర్చుకోవాలి.