25, ఫిబ్రవరి 2020, మంగళవారం

ఎన్నాళ్ళకో మళ్లీ ఇలా.....

మంగళవారం, ఫిబ్రవరి 25, 2020 0 Comments
ఇలా బొమ్మలు చూసి వెయ్యటం అంటే చిన్నప్పటి నుండి ఒక పిచ్చి...కానీ చదువు..ఉద్యోగం లో పడి బొమ్మలు వేయటం మొత్తానికి వదిలేసాను అనే చెప్పొచ్చు. ఈ మధ్య కొంచెం తీరిక చిక్కటం తో ఎలా అయినా మళ్లీ నా కళకి పునర్జన్మ నివ్వాలి అని సూపర్ మార్కెట్ నుండి క్లాస్ మేట్ drawing పుస్తకము..రంగులు తెచ్చేసుకున్నా🤩..పోయిన ఆదివారం ఇలా ప్రయత్నించా అన్నమాట...మా అమ్మేమో అందరి బొమ్మలు వేస్తున్నావ్...నా బొమ్మ కూడా వెయ్యి అని మూతి ముడుచుకుంది😜..

పెన్సిల్ తో షేడింగ్ చేయటం నాకంత రాదు..నేర్చుకోవాలి🙄 పెదాల దగ్గర కొంచెం తేడా ఉంది కానీ...మొత్తానికి బాగానే వచ్చింది అనిపించింది...మీరేం అంటారు...🤗13, జనవరి 2020, సోమవారం

2019 లో ఏమైందంటే....

సోమవారం, జనవరి 13, 2020 11 Comments


మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు...🤝👍2019 ...నా జీవితంలో ప్రత్యేకమైన సంవత్సరం🤗🤩. మర్చిపోలేని సంఘటన ఏమిటంటే కేంద్రీయ విద్యాలయ లో టీచరుగా👩‍🏫 ఉద్యోగం రావడం...అదీ ఒక ఉద్యోగం లో చేరిన కొద్ది నెలలకే..ఇంతకంటే గొప్ప విషయం నాకేం ఉంటుంది. నెలల వారీగా జరిగిన కథేంటో చెప్తా మరి...సరేనా…!!!😉

జనవరి: మొదటి రోజును నల్ల డ్రెస్సు తో మొదలు పెట్టాను. మా అమ్మకి తెలీదు కానీ...తెలిస్తే "కొత్త సంవత్సరం మొదటి రోజున ఆ రంగు ఎవరైనా వేస్తారెంటే..నీకు నేను చెప్పలేను..మతానికి ఎదురు మంచానికి అడ్డం" అని పురాణం విప్పుతుంది😁🤓...మనం అవన్నీ నమ్మం కాబట్టి లైట్ తీసుకుంటాం. KVS PRT పరీక్ష 'key' చూసుకుంటే...ఆశలు పెట్టుకునే లా మార్కులు వచ్చాయి. ఈ లోపు నా పని చూసుకుంటూ ఇంటర్వ్యూ కి తయారయ్యే దాన్ని. చిన్నా తో గోల్కొండ వెళ్ళటం మర్చిపోలేని అనుభూతి 😊 మేమిద్దరమే ఉంటే ఇంకెవరూ అక్కర్లేదు👭 ఇక..నెలాఖరున ఇంటర్వ్యూ selected list వచ్చింది. అందులో నా పేరు చూసుకుని ఎగిరి గంతేశా. ఇక ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ముమ్మరం చేశాను. ఒక్క నెల మాత్రమే టైముంది మరి. మధ్యలో ఈ NOC గోల ఒకటి..అప్పటికే ఉద్యోగంలో ఉండటంతో...ఆ తర్వాత మళ్లీ PRT పోస్టులను నోటిఫికేషన్ లో ఇచ్చినట్టు కాక 5300 నుండి 3000 కి తగ్గించేయటం తో ఒక్కసారిగా నిరాశలో కి వెళ్ళిపోయాను. పోటీ ఇప్పుడు ఇంకా పెరిగింది గా మరి. గుడ్డిలో మెల్ల ఏంటంటే ఇంటర్వ్యూ కోసం ఏ ఢిల్లీ కో వెళ్ళాలేమో అని డబ్బులు పోగేసుకున్నా...కానీ ఎంచక్కా హైదరాబాదే వచ్చింది పెద్ద కష్టం లేకుండా..😋

ఫిబ్రవరి: ఈ నెల మొత్తం ఇంటర్వ్యూ..ఇంటర్వ్యూ..ఇంటర్వ్యూ...ఒక మూడు రోజులు సెలవులు పెట్టీ ఇంట్లో ప్రిపేరయ్యా. అక్కడ సరిగ్గా సాగటం లేదని. ఇక ఇంటర్వ్యూ రోజు..బాగుంది అని చెప్పలేను..బాగోలేదు అని కూడా చెప్పలేను🤷 ఎంతైనా మొదటి ఇంటర్వ్యూ కదా..60 కి ఒక 40 మార్కులు వస్తే చాలు అనుకున్నా..చివరికి అలాగే వచ్చాయి లే..😉 అది వేరే విషయం.

మార్చి: హ్మ్...పెద్ద విషయం ఏంటంటే ctet కి ఎలా తయారవ్వాలి అని ఒక వీడియో తెలుగులో చేసి YouTube లో పెట్టాను. 2500+ వీక్షణలు వచ్చాయి ఇప్పటిదాకా😇..మా ఆఫీసు లో నిర్వహించే సాంస్కృతిక అవగాహనా కార్యక్రమంలో భాగంగా వరంగల్ కోటను సందర్శించే భాగ్యం దక్కింది. ఆ kvs ఫలితాలు గురించి ఈ రోజు కాదు రేపు..రేపు కాదు ఎల్లుండి అని డ్రామా సాగింది. నాకేమో టెన్షన్ ఒక వైపు..ఎప్పుడు వస్తాయా అని. ఎంతకీ విడుదల చేయకపోవడం తో పట్టించుకోవటం మానేశా. (ఆశ నిరాశ పాఠం లోలా)

ఏప్రిల్: 2018 సెప్టెంబరు తర్వాత ఒక కొత్త బ్లాగ్ పోస్ట్ పెట్టాను చంద్రముఖి మీద. రెండు కామెంట్లు వచ్చేసరికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది💃

మే: చాలా భయపెట్టిన సంఘటన..నా ఫోన్ మొత్తం లాక్ పడిపోయింది📴 ఏం టచ్ అయిందో తెలీదు కానీ..ఎంత ప్రయత్నించినా వల్ల కాలేదు. కొన్నాళ్ళు టాబ్ నే ఫోనుగా వాడుకోవలసి వచ్చింది. ఇంకా చిన్నాకి NIT AP లో లాబ్ టెక్నీషియన్ గా పోస్ట్ రావడం మా కుటుంబం లో ఆనందాన్ని నింపింది. మధ్య మధ్య నా result ఎప్పుడు వస్తుంది దేవుడా అని ఆలోచనలు..ఎలక్షన్ కోడ్ అదీ ఇదీ అని కారణాలు చెప్పారు..సర్లే ఇక వాళ్ళు result ఇచ్చినట్టే అనుకున్నా. క్యాలెండర్ లో పేజీలు అయితే మారుతున్నాయి కానీ నా జీవితం ఏం మారట్లేదు అనే నిరాశలో బతికేదాన్ని అప్పట్లో..😒

జూన్: ఉష్…! సైలెన్స్...పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు మరి😛

జూలై: ఎదురుచూపు కి తెరపడింది. మా KVS పరీక్ష ఫలితాలు ఇచ్చేశారు. నాకు PRT జాబ్ వచ్చేసిందోచ్. 🤩🤗 ఇప్పుడు ఇంకో సమస్య ..రాజీనామా ఎప్పుడు చేయాలి అని ..ఎందుకంటే పోస్టింగులు ఇంకా ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారో తెలీదు. ఇంకా.. resignation ఢిల్లీ లో ఆమోదం పొంది రావాలి అంటే కొంచెం టైం పడుతుంది..ఇలా అన్నమాట🤦

ఆగస్టు: కొత్త ఫోన్ LG W30 కొనటం నేను చేసిన ఒక తెలివైన పని. 🤪 9 వేలకే మంచి ఫోను వచ్చేసింది. 20 వ తారీఖున పోస్టింగ్ ఎక్కడ వచ్చిందీ తెలిసిపోయింది. Ernakulam, Bangalore, Hyderabad అన్నీ పోగా నా పేరు చెన్నై రీజన్ లో కనబడింది🧐. చాలా కంగారు పడ్డాను. నేనేంటి..చెన్నై ఏంటీ అని. కానీ తప్పదుగా. అత్త కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అన్నట్టు నాకు తమిళనాడు వచ్చినందుకు కాదు కానీ మా ఫ్రెండ్స్ ఇద్దరికీ ఆంధ్ర నే రావడం చాలా బాధ అనిపించింది😯 ప్చ్..ఇక ఇంకా 20 రోజులే టైము ఇవ్వడంతో ఆ జాబుకి రాజీనామా చేసేసా. హైదరాబాదు ని విడిచి వచ్చేసేటపుడు చివరిగా చార్మినార్ చూసాను..చాలా నచ్చింది😻

సెప్టెంబరు: ఇంకేముంటుంది….నా రాజీనామా పని మా మేడం వల్ల త్వరగా అవ్వడం, చెన్నై లో పడటం, కొత్త జాబ్, కొత్త మనుషులు, కొత్త ప్రదేశం..సర్దుబాటు సమస్యలు..వాటి మధ్య నేను.. అంతే ఇక💁👩‍🏫

అక్టోబరు: చెన్నైలో చేరాక మొదటి సారి దసరా కి ఇంటికొచ్చాను. ఇంట్లో వాళ్ళతో ఆ పది రోజులు సరదాగా గడిచిపోయాయి. సిటీ బస్సులతో..క్యాబ్ లతో అష్టకష్టాలు పడలేక శుభ్రంగా ఒక సైకిలు కొనేసుకున్నాను🚲 ఇప్పుడిక ప్రశాంతంగా ఉంది. 

నవంబరు: స్కూలు తరపున వర్క్ షాప్ లో పాల్గొనడానికి మైసూర్ వెళ్ళడం మర్చిపోలేను. ఆ ఊపిరి సలపని 3 రోజులు అస్సలు..మై గాడ్😵 మా స్టాఫ్ కొంతమంది తో మహాబలిపురం వెళ్ళడం మంచి అనుభవం. నేను చూసిన మొదటి ప్రపంచ వారసత్వ కట్టడం అదే అయింది. 

డిసెంబరు: ఆటం బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో పది రోజులు వింటర్ బ్రేక్. ఈ సారి మకాం వైజాగ్ లో వేశాం. చాలా బాగా అనిపించింది. 🤩🤩👌

మొత్తానికి ఇలా గడిచింది అన్నమాట...2019🤗😊15, డిసెంబర్ 2019, ఆదివారం

మహాబలిపురం...మహాబలిపురం....మహాబలిపురమ్మ్...

ఆదివారం, డిసెంబర్ 15, 2019 0 Comments

బాలరాజు కథ సినిమా డాడీ చిన్నప్పుడు వచ్చిందట. ఆ సినిమాలో "మహాబలిపురం " పాటను డాడీ అప్పట్లో తెగ పాడేవారు అని మా నానమ్మ మురుస్తూ చెప్పేది. ఇంకా పోటీ పరీక్షల్లో ఎప్పుడు మహాబలిపురం కి సంబంధించిన ప్రశ్న వచ్చినా ఆ పాటే గుర్తు వచ్చేది "కట్టించాడు ఈ ఊరు పల్లవ రాజు " అంటూ. దాని ద్వారా సులభంగా సమాధానం పట్టేయొచ్చు గా😜 అసలే SSC పరీక్షల్లో ఎక్కువగా అడిగే అవకాశం ఉన్న అంశం అది. అలాగే ఇంకోసారి ASI ఉద్యోగిని గా ఉన్నపుడు Google arts & culture project లో ASI కి సంబంధించిన పేజ్ చూసాను. అందులో మహాబలిపురం 360 డిగ్రీ దృశ్యాలు చూసి ఆసక్తి ఇంకా పెరిగింది. ఎప్పటికైనా చూసి తీరాల్సిన నా ప్రదేశాల జాబితాలో మహాబలిపురం రెండు మూడు స్థానాలు ఎగబాకింది. 


Google image

కొన్ని రోజుల క్రితం మా హాస్టల్ రూం లో ఒకమ్మాయి తన స్నేహితురాలి తో మహాబలిపురం వెళ్తున్నట్టు చెప్పింది. నేనూ రావొచ్చా అని అడిగేద్దాం అని అనిపించింది. కానీ ఆగిపోయా..మళ్లీ ఏమనుకుంటుందో అని. భక్తుడు కోరిందీ దేవుడు వరమిచ్చిందీ ఒకటే అన్నట్టు (సామెత సరిగా గుర్తు రాలేదు) ఒక శనివారం స్కూలు అయిపోయాక ఇళ్లకు వెళ్ళిపోతున్న సమయం లో రేణు చెప్పింది. (తను నాతో పాటే మా స్కూల్లో చేరింది) "రేపు కొంతమంది tgt లు, నేను మహాబలిపురం వెళ్తున్నాం...వస్తావా" అని🤩...ఓ ...తప్పకుండా అని బుర్ర ఊపాను ఆనందంతో. ప్రయాణం ఎలా... ఏ సమయానికి అవన్నీ ఇంటికెళ్ళాక చెప్తా అంది. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్న మాదిరిగా ...హుషారుగా సైకిల్ తొక్కుకుంటూ రూం కి వచ్చేసా. మళ్లీ పొద్దునే తలస్నానం ప్రోగ్రాం పెట్టుకుంటే ఆలస్యం అవుతుంది ఏమో అని వెళ్ళగానే చేసేసా..😜


కాసేపటికి రేణు సందేశం పంపింది. రేపు ఉదయం 11 కి కార్ బయల్దేరుతుంది. 10:30 కల్లా మా ఇంటికి వచ్చేయ్ అని. అలా ఆదివారం పదకొండుంపావు దాటేక ఇక్కడి నుండి బయల్దేరాం. సరిగ్గా రెండు గంటల ప్రయాణం. మా బ్యాచ్ లో నేను తప్ప అందరూ ఉత్తర భారతీయులే. 😕


మహాబలిపురం ముందు 5km దూరం లో టైగర్ కేవ్ అని ఒక ప్రదేశం ఉంది చూస్తారా.. ఆపనా అని డ్రైవర్ అంటే...మేం ఒప్పుకున్నాము. అప్పటికే టైము ఒంటిగంట అయింది. సూర్యుడు నడినెత్తిన సుర్రుమంటున్నాడు. 🌞😵నేను ముందు జాగ్రత్తగా ముఖానికి సన్ స్క్రీన్ పులుముకున్నా..ఇంకా నల్ల కళ్లద్దాలు కూడా బ్యాగ్ లో వేసుకున్నా..😎 నేనింకా టైగర్ కేవ్ అంటే ఏమైనా పులులు ఉంటాయేమో అనుకున్నా...ఉష్..😉కాదు...ఇదే ఆ పులి గుహ...కానీ భలేగా చెక్కారు పులి బొమ్మలు.
టైగర్ కేవ్ దగ్గర బీచ్😍

చెట్టు మీద కోతి🐒

అక్కడ కాసేపయ్యాక మహాబలిపురం షోర్ టెంపుల్ కి చేరుకున్నాం. అక్కడే ఒక చోట కూర్చుని తెచ్చుకున్న ఆలూ పరాఠా లు, పూరీలు తినేసాం. ఆదివారం కావటం వల్లన చాలా మంది జనం ఉన్నారు. సముద్ర ప్రాంతం కావడంతో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. సన్ స్క్రీన్ రాసినా ఏం ఉపయోగం లేదు. పైగా ముఖం అంతా జిడ్డుగా తయారైంది😣 రెండు బొట్టు బిళ్ళలు పెట్టాను. రెండూ పడిపోయాయి😒 మహాబలిపురం అనగానే అందరూ కళ్ల ముందు మెదిలే సీ షోర్ టెంపుల్ ఎంత బాగుందో..చుట్టూ బుజ్జి నంది బొమ్మలతో. షోర్ టెంపుల్ ముందు ఉన్న వినాయక విగ్రహం

ఇది కూడా టెంపుల్ ముందే ఉంది..😇


రూట్ మ్యాప్ముందు ఉన్న గోపురం లో ఉన్న విగ్రహాలు ఇవే!

తర్వాత అర్జునుడు పాశుపతం పొందిన ప్రదేశం గా చెప్పబడే Arjuna's penance చూసాము. రెండు పెద్ద పెద్ద శిలల మీద ఎన్ని బొమ్మలు చెక్కారో!!..ఇందులో ముల్లోకాలను చూపించారట. అక్కడి నుండి "కృష్ణ మండపం" చూశాం. కృష్ణుడు గోవర్ధన గిరి ని ఎత్తుతున్న సన్నివేశం ఎంత బాగుందో..😍 ఇక్కడ కింద గచ్చు మీద ఏవో బొమ్మలు ఉన్నాయి. వాటి అర్థం ఏమిటో మరి..ఇదేదో వైకుంఠ పాళీ ఆటలాగ ఉంది.
Arjuna's penance
ఇదే....ఏదో ఆట లాగా ఉంది అన్నాను గా

కృష్ణ మండపంకృష్ణ మండపం తర్వాత నడుచుకుంటూ లైట్ హౌస్ ప్రాంతానికి చేరుకున్నాం. దారిలో ఈ⬇️ బొమ్మలు దర్శనం ఇచ్చాయి. ఆ లైట్ హౌస్ ప్రాంగణం లో ఉన్న maritime ప్రదర్శన శాల కూడా చూసాము. అక్కడున్న టైటానిక్ షిప్ నమూనా హైలెట్. లైట్ హౌస్ దగ్గర చాలా జనం ఉన్నారు. టైం పట్టేలా ఉందని ఇక పైకి ఎక్కలేదు. కింద నుండే చూసి ఆనంద పడ్డాం. ఇదే టైటానిక్ నమూనా

నౌక నడుపుతున్న ఫీలింగ్ వస్తుంది కదా!😁

తర్వాత చూసిన ప్రదేశం మహిష మర్దిని రాక్ కట్ మండపం. దాని పైకి ఎక్కినపుడు లైట్ హౌస్ వీక్షణ చాలా బాగుంది. 🤓 అక్కడి నుండి కొంచెం దూరం నడిచాక కృష్ణుని వెన్న ముద్ద దగ్గరికి వచ్చేశాం. అప్పటికి 5 దాటేసింది. అంత పెద్ద రాయి వాలుగా అసలు.. ఎలా నిల్చుందో 😲😯🤯 చాలా ఆశ్చర్యమేసింది. చాలా మంది ఆ రాయిని కిందకి తోస్తున్నట్లు ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు🤭 దార్లో దాహం వేసి కొబ్బరి బొండాల వాడి దగ్గర ఆగాం. కాయ ముప్పై రూపాయలట. లేతగా బాగున్నాయి.😋 లోపలి గుజ్జు కూడా తెరిచి ఇస్తా అన్నాడు. మా వాళ్ళకి అదేంటో తెలీదట. "మలై" అంటూ తినేశారు. 😆 నచ్చిందట బాగా వాళ్ళకి. 

మహిష మర్ధిని మండపం


మహిష మర్ధిని మండపం పై నుండి...😻


ఇదే కన్నయ్య వెన్న ముద్ద

ఇంకో అందమైన గుడి...


అసలైన విషయం ఏంటంటే ముఖ్యమైన పాండవుల పంచ రథాలు చూడలేక పోయాము..ప్చ్😔 వీళ్ళ బీచ్ ల పిచ్చి ఏమో గానీ….ఎక్కువ సమయం అక్కడే గడిపినట్టు అనిపించింది నాకైతే….మొదట ఏమో టైగర్ కేవ్ దగ్గర తర్వాత షోర్ టెంపుల్ దగ్గర...ఇక సాయంత్రం 6 దాటాక అక్కడి నుండి సెలవు తీసుకున్నాం. మళ్లీ తెల్లారితే సోమవారం..స్కూలు ఉండనే ఉంది. 


అలా "మహాబలిపురం" నేను కూడా చూసేసా అన్నమాట🤗🤗

10, నవంబర్ 2019, ఆదివారం

మైసూరు వెళ్లానోచ్!!

ఆదివారం, నవంబర్ 10, 2019 4 Comments
రిగ్గా దీపావళి ముందు రోజు….ఆఫీసు నుండి పిలుపు వచ్చింది. ఎందుకా అని భయపడ్డాను. ఒక లెటర్ చేతిలో పెట్టి టికెట్స్ బుక్ చేసుకోమన్నారు. అదేంటి అంటే నవంబర్ 5-7 మధ్య ZIET మైసూరు లో జరగబోయే workshop కి చెన్నై రీజియన్ నుండి ఎంపికైన prt ల లిస్ట్. అందులో నా పేరు ఉంది.🧐 ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నేను స్కూల్లో చేరి పూర్తిగా రెండు నెలలు కూడా కాలేదు. అందుకే కొంచెం కంగారు గా ఫీలయ్యా. ఒక madam వాళ్లకు తెలిసిన ఇంకో సీనియర్ teacher నంబర్ ఇచ్చారు. "వాళ్ళు తెలుగు వాళ్ళే..ఆమె కూడా ఈ workshop కి వస్తున్నారు అరక్కోణం నుండి..నీకు కొత్త కదా! ఆమెతో కల్సి వెళ్లు" అని చెప్పారు. హమ్మయ్య అనుకున్నా..వెంటనే ఆమెకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. బిజీ ఏమో అని ఊరుకున్నా. ఆ రోజు స్కూలు హాఫ్ డే. తర్వాత మూడు రోజులు దీపావళి సెలవులు. హాస్టల్ కి వచ్చాక డాడీ కి ఫోన్ చేసి ఇలా అని విషయం చెప్పాను. నేను రానా అన్నారు..🙆"అయ్యో డాడీ!!" అని తల పట్టుకున్నా. అవును మరి ఒక్కదాన్నే ఎప్పుడూ దూర ప్రయాణాలు చేయలేదు. వెంటనే IRCTC app తెరిచాను. అప్పటికి seats available ఏం లేవు. నాకు ప్రయాణానికి వీలయ్యే ట్రైన్ కావేరి ఎక్స్ప్రెస్. వెళ్ళేటప్పుడు 3AC వెయిటింగ్ లిస్టు వచ్చింది. వచ్చేటప్పుడు కూడా 3AC వెయిటింగ్ లిస్టు వచ్చింది. WL నంబర్ సింగిల్ డిజిట్ లో ఉండటం వలన కన్ఫర్మ్ అవుతుంది లే అనే నమ్మకం తో ఉన్నాను. ఆ రాత్రి అరక్కొణం madam ఫోన్ చేశారు. ఇలా కావేరి కి బుక్ చేసుకున్నా madam అని చెప్తే నేను కూడా దానికే చేసుకుంటాను అని అన్నారు.
Google image

తర్వాత రోజు దీపావళి. ఆ రోజు ఇల్లు బాగా గుర్తు వచ్చింది ఎందుకో...mail తెరిచి చూస్తే అర్ధరాత్రి మైసూరు నుండి ఒక మెయిల్ వచ్చింది workshop సంబంధించి. అది పూర్తి చేసి ప్రిన్సిపాల్  సంతకం తీసుకుని ఆ తర్వాతి రోజు లోపు పంపాలి అని ఉంది. నాకైతే టెన్షన్ వచ్చింది. 🙄😰 స్కూలుకు వరుసగా మూడు రోజులు సెలవులాయే. సంతకం ఎలాగో ఏంటో అర్థం కాలేదు. వెంటనే మా hm mam కి ఆ mail విషయం చెప్తే..కంగారు పడకు..స్కూలుకు వచ్చాక చూద్దాం లే అన్నారు..  ఆమె అలా భరోసా ఇచ్చాక మనసు కాస్త కుదుట పడింది.😊 

4 సాయంత్రం ప్రయాణం..నేను టికెట్ తీసుకోవడం సెంట్రల్ స్టేషన్ నుండి తీసుకున్నా..కానీ వెనక్కి వెళ్లి ఎక్కడం ఎందుకూ అనిపించింది. ఎందుకంటే సెంట్రల్ తర్వాతి హాల్ట్ తిరువళ్ళూరు లో. అది మాకు ఇక్కడికి దగ్గర. ఈ విషయం నాకు మొదట్లో తెలియలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ వెయిటింగ్ లిస్ట్ నంబర్ లో పెద్దగా తేడా ఏం రావట్లేదు. పోనీ బస్ కి వెళ్తే ఎలాగ అని అనిపించి రెడ్ బస్ లో చూసాను. నాకేం అర్థం కాలేదు..ఆ పికప్ పాయింట్స్..dropping points..😵ఇక తత్కాల్ నే నమ్ముకున్నా. అదీ కుదరకపోతే అప్పుడు చూద్దాం ఏం చేయాలో అని ప్లాన్ వేసాను. 3న తత్కాల్ చేయాలి. అనుకూలంగా ఆదివారం వచ్చింది. పొద్దునే 9:45 నుండి app తెరిచి పెట్టి refresh చేస్తూ కూర్చున్నా. 3AC ఏమో 10, 2AC ఏమో 17 టికెట్స్ ఉన్నాయి. 2Ac ఎక్కువగా ఉన్నాయి కదా అని అది ముందు చేసా. కొంచెం ఖర్చు ఎక్కువైనా తిరువళ్ళూరు నుండే టికెట్ దొరికింది😋. ఒక టెన్షన్ వదిలింది. ముందు చేసిన టికెట్ WL 4తోనే ఆగిపోయింది. ఇక అది కాన్సెల్ చేసేసా. తిరుగు ప్రయాణం కి ఎందుకైనా మంచిది అని స్లీపర్ టికెట్ కూడా చేసి పెట్టాను. అది కానీ కన్ఫర్మ్ కాకపోతే కనీసం SL లో rac అయినా వస్తుంది కదా అని. ఆ ఆదివారం ప్రయాణం కి కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నా. NCERT బుక్స్ తెచ్చుకోమని అన్నారు కానీ….అన్నీ ఎలా మోసుకుని వెళ్లగలం అందుకే అన్నీ soft copies ఇంకా నా దగ్గర ఉన్న రెండు పుస్తకాలు తీసుకెళ్ళా. 

ఇక తర్వాతి రోజు సోమవారం స్కూలు నుండి వచ్చేసరికి 5 అయింది. వెంటవెంటనే బ్యాగ్స్ సర్దేసి రాత్రి హాస్టల్ లో పెట్టిన చపాతీ లు తినేసి..7:30 కల్ల దగ్గర్లోని సబర్బన్ స్టేషన్ కి వెళ్ళాను. అక్కడి నుండి తిరువళ్ళూరు ఒక అరగంట...ఇంకో madam ఏమో అరక్కోణం లో ఎక్కుతారు. 9 నుండి 10 దాకా ఒక్కదాన్నే అలా స్టేషన్ లో కూర్చున్నా. ఏసీ కోచ్ ప్రయాణం నాకు ఇదే మొదటిసారి. లోయర్ బెర్త్ వచ్చింది నాకు. దుప్పట్లు, చిన్న తలగడ, రగ్గు ఉన్నాయి. బాగా అనిపించింది. ఎక్కినట్టు ఇంటికి ఫోన్ చేసి వెంటనే పడుకున్నాను. బాగా నిద్ర పట్టింది. 

హైదరాబాదు లో ట్రైన్ లో ఉంటే అస్సలు నెట్ కనెక్ట్ అయ్యేదే కాదు నాకు..కానీ ఇక్కడ బాగానే అవుతుంది. పొద్దునే లేచి ఫోన్ చూసేసరికి బర్త్ డే విషెస్ ఉన్నాయి..కొంతమంది ఫోన్ చేసి మరీ విష్ చేశారు🤩..మైసూర్ చేరేసరికి 7 అయింది. ఆవిడ చెప్పిన బోగీ దగ్గరికి వెళ్ళాను. బాగానే గుర్తు పట్టాను. పచ్చ చీర అని మాత్రమే చెప్పారు😁. బయటకి వచ్చి ఓలా పాయింట్ లో ZIET కి క్యాబ్ బుక్ చేసుకున్నాం. చేరుకోవటానికి ఒక పది నిముషాలు పట్టింది. మేం ఇద్దరం కలిపి ఒక రూం తీసుకున్నాం అక్కడి గెస్ట్ హౌస్ లో. 
ఈ Zonal Institute of research and training అనేది దేశంలో ఉన్న 5 ZIET s లో ఒకటి. దీని పరిధిలోకి కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, పుదుచ్చేరి, మరియు మహే వస్తాయి. త్వరత్వరగా రెడీ అయిపోయి టిఫిన్ చేసి, registration కార్యక్రమాలు ముగించకొని lecture hall కి వెళ్ళాము. అసలు workshop దేనికీ అంటే "workshop on enrichment programmes in maths and evs for gifted students for classes 3-5" . మొదటి రోజు పొద్దున నుండి సాయంకాలం వరకు lectures ఇచ్చారు. మధ్యలో కొంత సేపు గ్రూప్ ఫోటో సెషన్. మా 34 మందినీ evs, maths ఇలా రెండు గ్రూపులు చేశారు. మళ్లీ అందులో 5-6 మందిని తరగతుల వారీగా విడగొట్టారు. అలా నాకు 5th evs వచ్చింది. ...అలా ఒక్కొక్కరికి కొన్ని chapters కేటాయించి ఒక్కో చాప్టర్ కి సంబంధించి theme mapping, preparing enrichment projects for gifted అలాగే HOTS ప్రశ్నలు తయారు చేయడం లాంటివి assignments గా ఇచ్చారు. అవన్నీ soft copies కావాలని అన్నారు. 

పొద్దున breakfast, lunch వాళ్ళే పెట్టారు కానీ..రాత్రి భోజనం మనమే చూసుకోవాలి. అలా మొదటి రోజు దగ్గర్లోని రెస్టారెంట్ "దోశ కార్నర్" కి వెళ్లి ఉల్లి దోశ తిన్నాను. తర్వాతి రోజు సగం సమయం assignments చేయటానికి కేటాయించారు. ఆ రోజు ZIET వాళ్ళే ఒక బస్సు మాట్లాడి పెట్టారు శ్రీ రంగపట్నం, చాముండి హిల్స్ కి. డబ్బులు అందరూ పంచుకునేట్లు గా...క్లాసులు అవ్వగానే సాయంత్రం 6 కి బస్సు బయల్దేరింది. మొదటగా శ్రీ రంగనాథ స్వామి గుడికి వెళ్ళాము. అక్కడేమో స్వామి వారికి అలంకరణ చేస్తున్నారు. అందుకే పరదాలతో కప్పేసారు...అప్పటికే అక్కడ చాలా మంది ఎదురు చూస్తున్నారు. 5నిముషాలు..10 నిముషాలు..అంటూ గంట పాటు అక్కడే ఉన్నాం. చివరికి దర్శనం బాగా చేసుకున్నాం. శేష పాన్పు పైన పవళిస్తున్న నల్ల రాతి విగ్రహం చూడ్డానికి రెండు కళ్ళు చాలవు. 😻ఆలయ ప్రాంగణం కూడా చాలా చల్లగా అనిపించింది. ఇప్పుడు చలికాలం అయినా చెన్నై లో అలాంటి ఫీలింగ్ యే రావట్లేదు. కానీ అక్కడ ఎప్పుడూ అలాగే చల్లగా ఉంటుంది అంట మైసూరు లో. చాముండేశ్వరి గుడి 9 కి మూసేస్తారు అని వెంటనే మళ్లీ 8 కి బస్సు ఎక్కేసాం. ఘాట్ రోడ్ ప్రయాణం భలేగా ఉంది. ఉత్తరాది వారు పాటలు పాడుతూ వాతావరణాన్ని ఉల్లాస పర్చారు. మధ్యలో కొండ పైనుండి మైసూరు నగర వీక్షణ ఎంత బాగుందో!!😍🤩😍😍 మాటల్లో చెప్పలేం. అక్కడ కూడా వెంటవెంటనే దర్శనం అయిపోయింది. అలా నేను దర్శించిన మొట్ట మొదటి శక్తి పీఠం మైసూరు అయింది. 

ఫోటో లన్నీ చీకట్లో తీయాల్సి వచ్చింది..అందుకే కొంచెం ఎడిట్ చేసా🤫మధ్యలో ఒక రెస్టరెంట్ దగ్గర బస్ ఆపారు... భోజనం కోసం. నేనేమో ఫ్రైడ్ వెజ్ రైస్ చెప్పాను. నాలాగ ఇంకో ముగ్గురు ఉన్నారు. 10 దాటింది అప్పటికే. కడుపులో ఎలుకలు పరుగు పందెం పెట్టుకున్నట్టు ఉంది. అలా ఇంచుమించు అరగంట వెయిట్ చేయించారు. కానీ ఆర్డర్ తేవట్లేదు. ఐటమ్స్ లేవు అని చావు కబురు చల్లగా చెప్పాడు.😬😖మేము ముగ్గురం బయటకు వచ్చేసి క్యాబ్ బుక్ చేసుకుని దగ్గర్లోని "లెమన్ ట్రీ" కి వెళ్లి తిన్నాం. 11కి తింటే ఏం సయిస్తుంది. తినాలి కాబట్టి మమ అనిపించాను. అక్కడి నుండి నడుచుకుంటూ ziet కి 11:30 కల్ల వచ్చేశాం...ఇదొక అడ్వెంచర్😝😜

చివరి రోజు అయిన గురువారం కొంచెం బోరింగ్ గా జరిగింది. కంప్యూటర్ లాబ్ లో కూర్చుని అసైన్మెంట్స్ పూర్తి చేసి ...class wise..subject wise..అన్నీ ఒక ఫైల్ గా చేశాం..దానికే చాలా టైం పట్టేసింది. Ziet డైరెక్టర్ అయిన శ్రీమతి లక్ష్మి చారి mam , "students safety in schools" (sss) మీద తీసుకున్న సెషన్ బాగుంది. కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. ఆ రోజు సాయంత్రం presentations అయ్యాక అందరికీ ప్రశంసా పత్రాలు, "మైసూర్ పాక్" పాకెట్ ఇచ్చారు😋. ఇక వెంటనే మేము మా లగేజ్ సర్దేసుకునీ వెళ్లడానికి తయారయ్యాం. మా ఇద్దరికీ ఇంకొకరు తోడయ్యారు. ఆమె కూడా కావేరి కే వస్తున్నారు. అలా ముగ్గురం కల్సి స్టేషన్ కి వచ్చేశాం. అక్కడ సెల్ఫీ పాయింట్ దగ్గర కొన్ని ఫోటోలు తీసుకున్నాం.🤳 స్టేషన్ దగ్గర్లో ఉన్న "adyar anand bhavan" లో టిఫిన్ చేసి రైలెక్కాము. నాకు 3AC RAC వచ్చింది. బెర్త్ ఏమైనా దొరుకుతుందా అని టీసి నీ అడిగితే బెంగుళూరు దాటాక నే అన్నాడు. ఒంటి గంట కి ఒక బెర్తు ఇచ్చాడు😴💤 అలా హాస్టల్ కీ వచ్చేసి గబగబా తయారయ్యి స్కూలుకు వెళ్ళిపోయాను. మూడు రోజులు నిద్ర సరిగా లేక బాగా నీరసం అనిపించింది. కానీ తప్పదు గా…

ఇంకొన్ని ...


అలా మొత్తానికి మైసూరు ప్రయాణం చాలా బాగా జరిగింది. బోలెడు జ్ఞాపకాలు ను మిగిల్చింది. Busy schedule అయినా కూడా అంత టెన్షన్ అనిపించలేదు. అక్కడ కల్సిన వాళ్ళందరూ చాలా బాగా మాట్లాడారు. నాకు కేవీ ఇంటర్వ్యూ లో నా ముందు నెంబర్ అయిన నమ్రత అనే అమ్మాయి ఇక్కడ పరిచయం అయింది. నేనే గుర్తు పట్టి పలకరించాను. ఇంకా చాలా మంది తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు.. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి...🤗🤗 కానీ ఇప్పటికే ఆంజనేయుడి తోక లాగా అయింది కదా..అని ఇక్కడితో ఆపేస్తున్న...ఉంటా మరి!!!👋