Google image |
సాయంత్రం ఆఫీసు నుండి వచ్చే సరికి జానకి గుమ్మం దగ్గరే కుర్చీ వేసుకుని మొబైల్ లో చూస్తూ ముసి ముసి గా నవ్వుకుంటుంది. నా రాక చూసి చెంగున లేచి వంటింట్లోకి వెళ్లి మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చింది. టవల్ చేతికిచ్చి "త్వరగా స్నానం చేసి రండి..మీకోటి చెప్పాలి...త్వరగా.."అంటూ తొందర పెట్టింది. నాకిదంతా వింతగా తోచింది. ఎప్పుడూ లేనిది ఏమైంది జానకి కి.. ఎప్పుడు నేను అడిగితే కానీ ఇచ్చేది కాదు ఇప్పుడేమో తనకు తానుగా టవల్ తెచ్చి ఇచ్చింది. జానకి ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటుంది. ఈ సస్పెన్స్ కి తెర దించాలి అనంటే త్వరగా స్నానం చేసి రావాలి అనుకుంటూ బాత్రూం లోకి దూరి తలుపేసుకున్నాను.
"మిసెస్ మనోహర్ గారూ..! ఎక్కడున్నారు.." అని ముద్దుగా పిలుస్తూ వంటింట్లో కి వెళ్ళాను. జానకి చాలా ఏకాగ్రత తో పకోడీ లు వేసేస్తోంది. జానకికి వంటలు అంత బాగా ఏమీ రావు. మొన్ననే ఆషాఢ మాసం అని పుట్టింటికి వెళ్లి వచ్చింది. వాళ్ళమ్మ ఏవో కొన్ని చేయడం నేర్పించింది. అవన్నీ ఒక్కక్కటి గా నా మీద ప్రయోగం చేస్తుంది. "నన్నేమైనా సాయం చేయమంటావా డియర్" అంటే "ఏం అక్కర్లేదు కానీ...ఇవి తీసుకుని వరండా లోకి పదండి" అని పకోడిల ప్లేటు చేతిలో పెట్టింది. తను కూడా ఇంకో ప్లేటు తీసుకుని నా వెనుకే వచ్చింది. అప్పుడే చిన్నగా వర్షం మొదలైంది. "ఎంతైనా నీది మంచి సమయస్ఫూర్తి జానకీ!! వాన వస్తుంది అని నీకు ముందే తెల్సా...పకోడీ ల పథకం వేసావు" అని అంటూ రెండు తీసుకుని నోట్లో వేసుకున్నా...దానికి జానకి "సర్సర్లే గానీ..ఇంతకీ పకోడీలు ఎలా వచ్చాయో చెప్పండి" అని అడిగింది. "నీ ముఖం లానే ఉన్నాయి మిసెస్ మనోహర్ గారూ" అని నేనంటే "హ్మ్..మీరెప్పుడు ఇంతే" అని మూతి ముడుచుకుంది.
పకోడీ ల రుచి ఆస్వాదించడం లో పడిన నాకు...ఇందాక జానకి ఏదో చెప్పాలి అన్న విషయం గుర్తు వచ్చింది. "ఆ..అది సరే గానీ జానకి..నాకేదో చెప్పాలి అన్నావు..ఏంటది?" అప్పుడు జానకి తినడం ఆపి కళ్ళు ఇంత చేసుకుని.."భలే గుర్తు చేశారు.. మర్చేపోయాను సుమా!" అంటూ మొదలెట్టింది..
ఇంతకీ ఆవిడ గారు చెప్పిందేమిటి అంటే..ఆషాఢ మాసం నెల్లాళ్ళు ఇంట్లో ఉండి బోర్ కొట్టి యూట్యూబ్ లో తెలుగు వ్లోగ్స్ చూడటం అలవాటు అయిందట. ఇప్పుడేమో అది కాస్త పిచ్చిగా మారి జానకి కూడా ఒక వ్లోగ్ ఛానెల్ మొదలు పెట్టడానికి ఒక మంచి కెమెరా కావాలి అని కోరింది. నాకిదంతా విని చాలా ఆశ్చర్యమనిపించింది. మా జానకి బుర్రలో ఇన్ని ఆలోచనలు ఉన్నాయా అని. కావాలని మరీ పల్లెటూరి కి చెందిన జానకిని ఏరి కోరి పెళ్లి చేసుకున్నాను. పేరు పాతగా ఉన్నా ఆమె ఆలోచనలు చాలా కొత్తవి అని..ఇంకా బియే కూడా చేసింది అని ఇంట్లో వాళ్ళు పల్లెటూరు పిల్ల అన్నా కూడా వినకుండా తనే కావాలనుకున్నాను. దానికి తగ్గట్టుగానే జానకి ఎప్పుడూ నన్ను బాధపెట్టేలా ప్రవర్తించలేదు. ఒక రకంగా జానకి నా భార్య కావడం నిజంగా నా అదృష్టమే..
మొత్తానికి జానకికి ఒక కెమెరా, ట్రైపొడ్ అడిగిందే తడవుగా కొనిపెట్టాను. కెమెరా ను వాడటం, వీడియో లను కంప్యూటర్ లో ఎడిట్ చేయడం వంటివి వివరించాను. "ముదితల్ నేర్వగరాని విద్య గలదె ముద్దార నేర్పించగన్" అన్నచందాన నా జానకి నేను చెప్పినవన్నీ బుద్ధిగా విని నేర్చుకుంది. నాకు భలే ముచ్చటేసింది. ఇక వీడియోలు తీయడమే తరువాయి.
****
"మొదటగా ఏం వీడియో చేస్తే బాగుంటుందో చెప్పండీ" అంటూ కాఫీ గ్లాసు పట్టుకుని, ఆదివారం పేపరు తీరిగ్గా చదువుకుంటున్న నా దగ్గరికి వచ్చింది. దానికి నేను "ఏమోనోయ్! వ్లాగుల మీద నాకు బొత్తిగా పరిజ్ఞానం లేదు..నువ్వే ఆలోచించు" అన్నాను. నా సమాధానం నాకే నచ్చలేదు. అందుకే ఆ ఆదివారం నాకు వీలైనంత సేపు వ్లాగులు చూసాను. ఎలాంటి వీడియోలు చేస్తే ఎక్కువ మంది చూస్తున్నారు, వ్లోగ్స్ లో రకాలు ఎలా ఉంటాయి అనే వాటిపై ఒక చిన్న పాటి పరిశోధన నా జానకి కోసం చేశాను.
ఒక అభిప్రాయానికి వచ్చాక "హోమ్ టూర్" వీడియో చెయ్యమని జానకికి చెప్పాను. ఎందుకంటే మా ఇల్లు చాలా బాగుంటుంది అని చాలా మంది అన్నారు. జానకిని కూడా ఇల్లు అద్దంలా ఉంచుతావు అని అంటుంటారు. అందుకే ఈ ఆలోచన నచ్చి చేస్తే బాగుంటుందని జానకిని ప్రోత్సహించాను.
మొట్టమొదటగా అనుకున్న ప్రకారం గా హోమ్ టూర్ వీడియో చేసింది జానకి. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నుండి డైనింగ్ టేబుల్ వరకు, బయట ఉంచే చెప్పుల స్టాండు నుండి బట్టలు ఆరేసే దండెం వరకూ అన్నీ చూపించింది. కానీ ఎందుకో ఆ వీడియో అంత క్లిక్ కాలేదు. జానకికి ఏడుపు ఒక్కటే తక్కువ. తనను ఓదార్చే సరికి పెద్దలు దిగి వచ్చారు.
*****
జానకి వీడియోలకు కొంచెం విరామం ఇచ్చి మళ్లీ వ్లోగ్స్ చూడటం మొదలు పెట్టింది. ఈ సారి తనకో బ్రహ్మాండమైన ఆలోచన బుర్రకి తట్టింది. ఓ రోజు రాత్రి వంటిల్లు సర్దుకుని వచ్చాక ఆ ఐడియా నాకు చెప్పింది. నేను ఒక్కటే చెప్పాను. "నువ్వేం చేసినా పర్లేదు జానకీ..ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో..అందరూ మంచి వాళ్ళే ఉండరు..అందర్నీ ఎదుర్కొనే నేర్పు, ధైర్యం నీకుండాలి" అని. దానికి జానకి ఎంతో ఆనందపడి " మీ లాంటి భర్త అందరికీ లభించాలని దేవుణ్ణి కోరుకుంటానండి" అని అంది. నేను "అయ్యో జానకి! ఇప్పుడు అందర్నీ పెళ్లి చేసుకోవాలంటే చాలా కష్టం" అంటూ నవ్వేసాను. "ఛీ..పొండి" అంటూ నా కౌగిలి లో బందీ అయింది.
ఇంతకీ సంగతి ఏమిటంటే జానకి డిగ్రీ అయ్యాక సెలవుల్లో మేకప్ క్లాసులకు వెళ్లి కొంత వరకు నేర్చుకుంది. వాళ్ళ స్నేహితుల పెళ్ళిళ్ళలో కొంత మందికి బ్రైడల్ మేకప్ చేసిన అనుభవం కూడా ఉందట. అందుకే చాలా సులువుగా మేకప్ ఎలా చేయాలి అన్న విషయం పై వీడియో చేస్తాను అని అంటుంది.
జానకి నీ, నన్ను ఆశ్చర్యం లో ముంచుతూ ఆ వీడియో కి ఒక నెల రోజుల వ్యవధి లోనే ఒక లక్ష వీక్షణలు వచ్చాయి... సబ్ స్క్రైబర్ల సంఖ్యలో కూడా చెప్పుకోదగ్గ మార్పు వచ్చింది. దాంతో మా ఇద్దరి ఆనందానికి అవధులు లేవు. అలా జరగడం జానకికి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది.
ఇక అప్పటినుండి నా కష్టాలు మొదలు. నగరంలో ఎక్కడ షాపింగ్ ఎగ్జిబిషన్ లు పెట్టినా జానకి అక్కడికి వెళ్లాల్సిందే. అయినవీ కానివీ అన్నీ కొనల్సిందే..షాపింగ్ హాల్ పేరుతో వీడియోలు చేయాల్సిందే. Haul పేరుతో ఎన్ని బట్టలు, నగలు పోగేసిందో తనకైనా తెలుసో లేదో! మేకప్పు వీడియోలు, వంటల వీడియోలు...ఇలా వారానికి కనీసం రెండు మూడు వీడియోలు పోస్టు చేసేది. ఇలా మా జానకి వ్లాగు ల ప్రస్థానం మూడు లైకులు, ఆరు సబ్ స్క్రైబర్లు అన్న విధంగా అప్రతిహతంగా సాగిపోతుంది.
*****
తెల్లారు జామునే ఒక మంచి కల. నాకు నచ్చిన చీరలో నా జానకి నా దగ్గరికి వస్తున్నట్టు. దగ్గరకు తీసుకుంటుండగా మెలకువ వచ్చింది. ఆ కలను నిజం చేస్తూ ఆ రోజు వంకాయ రంగు చీరలో మెరిసిపోతుంది. "ఈ రోజు ఎంత బాగున్నావో తెలుసా" అంటూ ఒక చేయి అందుకోబోతూ ఉంటే, ఇంకో చేతిలో వీడియో రికార్డింగు లో ఉన్న ఫోన్ కనబడింది. చటుక్కున తన చేతిని వదిలేసాను. "ఏంటి జానకి! ఇదేం బాలేదు..ప్రతీదీ రికార్డు చేయాలనుకుంటావు" అన్నాను కొంచెం కోపం చూపిస్తూ. దానికి జానకి "మరి మీరేం ఫీల్ అయిపోకండి. ఇది DIML వీడియో. మీరు నన్ను పట్టుకున్న సీన్ ఎడిటింగ్ లో తీసేస్తాలే" అంటూ నవ్వేసింది. ఆ పదం కొత్తగా వింటుండటం తో "దానర్థం ఏమిటో తెల్సుకోవచ్చా?" అని అడిగాను. జానకి ఫోన్ కెమెరా వంక మాట్లాడుతూ..ఇలా అంటుంది. "మా ఆయన ఇప్పుడే లేచారు..నన్ను DIML అంటే ఏమిటని అడుగుతున్నారు (నవ్వులు)"..అప్పుడు నా వైపు చూస్తూ చెప్తుంది "Day in my Life" అని..నేను తలపట్టుకు కూర్చున్నా మంచం మీద మరేం చేయాలో తెలీక...
superb....
రిప్లయితొలగించండిThank you!!...
తొలగించండిభలే జానకి :))
రిప్లయితొలగించండిమా జానకా మజాకా..!!
తొలగించండిధన్యవాదాలు లలిత గారు!
సూపర్ అండి....👌👌👌
రిప్లయితొలగించండిధన్యవాదాలండీ
తొలగించండిBagundi
రిప్లయితొలగించండి