ఛాయాచిత్రాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఛాయాచిత్రాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, మార్చి 2021, బుధవారం

నా కొత్త కళ

బుధవారం, మార్చి 17, 2021 9 Comments

 ఈమధ్య ఇలాంటి చిత్రాలు ఇన్స్టా లో చూసాను. చాల నచ్చాయి నాకు. నాకు కూడా గీయాలనిపించింది. మొట్ట మొదటి సారిగా ఇది ప్రయత్నించాను. బాగా వచ్చింది. నేను కూడా బాగా గీయగలను అని నమ్మకం వచ్చింది. కొన్ని చిత్రాలను ఇన్స్టా నుండి ఇంకా పింటెరెస్ట్ నుండి తీసుకొని అప్పుడప్పుడు ఇలా వేస్తున్నాను. ప్రస్తుతానికి నా దగ్గర ఉండే నల్ల జెల్ పెన్నులనే వాడుతున్నాను. మంచి ఫైన్ లైనర్స్ కొనుక్కొవాలి ఎలాగైనా..










ఈమధ్య కాలం లో వేసినవి ఇవే.. ఎలా ఉన్నాయి??

25, ఫిబ్రవరి 2020, మంగళవారం

ఎన్నాళ్ళకో మళ్లీ ఇలా.....

మంగళవారం, ఫిబ్రవరి 25, 2020 0 Comments
ఇలా బొమ్మలు చూసి వెయ్యటం అంటే చిన్నప్పటి నుండి ఒక పిచ్చి...కానీ చదువు..ఉద్యోగం లో పడి బొమ్మలు వేయటం మొత్తానికి వదిలేసాను అనే చెప్పొచ్చు. ఈ మధ్య కొంచెం తీరిక చిక్కటం తో ఎలా అయినా మళ్లీ నా కళకి పునర్జన్మ నివ్వాలి అని సూపర్ మార్కెట్ నుండి క్లాస్ మేట్ drawing పుస్తకము..రంగులు తెచ్చేసుకున్నా🤩..పోయిన ఆదివారం ఇలా ప్రయత్నించా అన్నమాట...మా అమ్మేమో అందరి బొమ్మలు వేస్తున్నావ్...నా బొమ్మ కూడా వెయ్యి అని మూతి ముడుచుకుంది😜..

పెన్సిల్ తో షేడింగ్ చేయటం నాకంత రాదు..నేర్చుకోవాలి🙄 పెదాల దగ్గర కొంచెం తేడా ఉంది కానీ...మొత్తానికి బాగానే వచ్చింది అనిపించింది...మీరేం అంటారు...🤗



15, డిసెంబర్ 2019, ఆదివారం

మహాబలిపురం...మహాబలిపురం....మహాబలిపురమ్మ్...

ఆదివారం, డిసెంబర్ 15, 2019 0 Comments

బాలరాజు కథ సినిమా డాడీ చిన్నప్పుడు వచ్చిందట. ఆ సినిమాలో "మహాబలిపురం " పాటను డాడీ అప్పట్లో తెగ పాడేవారు అని మా నానమ్మ మురుస్తూ చెప్పేది. ఇంకా పోటీ పరీక్షల్లో ఎప్పుడు మహాబలిపురం కి సంబంధించిన ప్రశ్న వచ్చినా ఆ పాటే గుర్తు వచ్చేది "కట్టించాడు ఈ ఊరు పల్లవ రాజు " అంటూ. దాని ద్వారా సులభంగా సమాధానం పట్టేయొచ్చు గా😜 అసలే SSC పరీక్షల్లో ఎక్కువగా అడిగే అవకాశం ఉన్న అంశం అది. అలాగే ఇంకోసారి ASI ఉద్యోగిని గా ఉన్నపుడు Google arts & culture project లో ASI కి సంబంధించిన పేజ్ చూసాను. అందులో మహాబలిపురం 360 డిగ్రీ దృశ్యాలు చూసి ఆసక్తి ఇంకా పెరిగింది. ఎప్పటికైనా చూసి తీరాల్సిన నా ప్రదేశాల జాబితాలో మహాబలిపురం రెండు మూడు స్థానాలు ఎగబాకింది. 


Google image





కొన్ని రోజుల క్రితం మా హాస్టల్ రూం లో ఒకమ్మాయి తన స్నేహితురాలి తో మహాబలిపురం వెళ్తున్నట్టు చెప్పింది. నేనూ రావొచ్చా అని అడిగేద్దాం అని అనిపించింది. కానీ ఆగిపోయా..మళ్లీ ఏమనుకుంటుందో అని. భక్తుడు కోరిందీ దేవుడు వరమిచ్చిందీ ఒకటే అన్నట్టు (సామెత సరిగా గుర్తు రాలేదు) ఒక శనివారం స్కూలు అయిపోయాక ఇళ్లకు వెళ్ళిపోతున్న సమయం లో రేణు చెప్పింది. (తను నాతో పాటే మా స్కూల్లో చేరింది) "రేపు కొంతమంది tgt లు, నేను మహాబలిపురం వెళ్తున్నాం...వస్తావా" అని🤩...ఓ ...తప్పకుండా అని బుర్ర ఊపాను ఆనందంతో. ప్రయాణం ఎలా... ఏ సమయానికి అవన్నీ ఇంటికెళ్ళాక చెప్తా అంది. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్న మాదిరిగా ...హుషారుగా సైకిల్ తొక్కుకుంటూ రూం కి వచ్చేసా. మళ్లీ పొద్దునే తలస్నానం ప్రోగ్రాం పెట్టుకుంటే ఆలస్యం అవుతుంది ఏమో అని వెళ్ళగానే చేసేసా..😜


కాసేపటికి రేణు సందేశం పంపింది. రేపు ఉదయం 11 కి కార్ బయల్దేరుతుంది. 10:30 కల్లా మా ఇంటికి వచ్చేయ్ అని. అలా ఆదివారం పదకొండుంపావు దాటేక ఇక్కడి నుండి బయల్దేరాం. సరిగ్గా రెండు గంటల ప్రయాణం. మా బ్యాచ్ లో నేను తప్ప అందరూ ఉత్తర భారతీయులే. 😕


మహాబలిపురం ముందు 5km దూరం లో టైగర్ కేవ్ అని ఒక ప్రదేశం ఉంది చూస్తారా.. ఆపనా అని డ్రైవర్ అంటే...మేం ఒప్పుకున్నాము. అప్పటికే టైము ఒంటిగంట అయింది. సూర్యుడు నడినెత్తిన సుర్రుమంటున్నాడు. 🌞😵నేను ముందు జాగ్రత్తగా ముఖానికి సన్ స్క్రీన్ పులుముకున్నా..ఇంకా నల్ల కళ్లద్దాలు కూడా బ్యాగ్ లో వేసుకున్నా..😎 నేనింకా టైగర్ కేవ్ అంటే ఏమైనా పులులు ఉంటాయేమో అనుకున్నా...ఉష్..😉కాదు...ఇదే ఆ పులి గుహ...కానీ భలేగా చెక్కారు పులి బొమ్మలు.




టైగర్ కేవ్ దగ్గర బీచ్😍

చెట్టు మీద కోతి🐒

అక్కడ కాసేపయ్యాక మహాబలిపురం షోర్ టెంపుల్ కి చేరుకున్నాం. అక్కడే ఒక చోట కూర్చుని తెచ్చుకున్న ఆలూ పరాఠా లు, పూరీలు తినేసాం. ఆదివారం కావటం వల్లన చాలా మంది జనం ఉన్నారు. సముద్ర ప్రాంతం కావడంతో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. సన్ స్క్రీన్ రాసినా ఏం ఉపయోగం లేదు. పైగా ముఖం అంతా జిడ్డుగా తయారైంది😣 రెండు బొట్టు బిళ్ళలు పెట్టాను. రెండూ పడిపోయాయి😒 మహాబలిపురం అనగానే అందరూ కళ్ల ముందు మెదిలే సీ షోర్ టెంపుల్ ఎంత బాగుందో..చుట్టూ బుజ్జి నంది బొమ్మలతో. 



షోర్ టెంపుల్ ముందు ఉన్న వినాయక విగ్రహం

ఇది కూడా టెంపుల్ ముందే ఉంది..😇


రూట్ మ్యాప్







ముందు ఉన్న గోపురం లో ఉన్న విగ్రహాలు ఇవే!





తర్వాత అర్జునుడు పాశుపతం పొందిన ప్రదేశం గా చెప్పబడే Arjuna's penance చూసాము. రెండు పెద్ద పెద్ద శిలల మీద ఎన్ని బొమ్మలు చెక్కారో!!..ఇందులో ముల్లోకాలను చూపించారట. అక్కడి నుండి "కృష్ణ మండపం" చూశాం. కృష్ణుడు గోవర్ధన గిరి ని ఎత్తుతున్న సన్నివేశం ఎంత బాగుందో..😍 ఇక్కడ కింద గచ్చు మీద ఏవో బొమ్మలు ఉన్నాయి. వాటి అర్థం ఏమిటో మరి..ఇదేదో వైకుంఠ పాళీ ఆటలాగ ఉంది.
Arjuna's penance




ఇదే....ఏదో ఆట లాగా ఉంది అన్నాను గా

కృష్ణ మండపం



కృష్ణ మండపం తర్వాత నడుచుకుంటూ లైట్ హౌస్ ప్రాంతానికి చేరుకున్నాం. దారిలో ఈ⬇️ బొమ్మలు దర్శనం ఇచ్చాయి. ఆ లైట్ హౌస్ ప్రాంగణం లో ఉన్న maritime ప్రదర్శన శాల కూడా చూసాము. అక్కడున్న టైటానిక్ షిప్ నమూనా హైలెట్. లైట్ హౌస్ దగ్గర చాలా జనం ఉన్నారు. టైం పట్టేలా ఉందని ఇక పైకి ఎక్కలేదు. కింద నుండే చూసి ఆనంద పడ్డాం. 



ఇదే టైటానిక్ నమూనా

నౌక నడుపుతున్న ఫీలింగ్ వస్తుంది కదా!😁





తర్వాత చూసిన ప్రదేశం మహిష మర్దిని రాక్ కట్ మండపం. దాని పైకి ఎక్కినపుడు లైట్ హౌస్ వీక్షణ చాలా బాగుంది. 🤓 అక్కడి నుండి కొంచెం దూరం నడిచాక కృష్ణుని వెన్న ముద్ద దగ్గరికి వచ్చేశాం. అప్పటికి 5 దాటేసింది. అంత పెద్ద రాయి వాలుగా అసలు.. ఎలా నిల్చుందో 😲😯🤯 చాలా ఆశ్చర్యమేసింది. చాలా మంది ఆ రాయిని కిందకి తోస్తున్నట్లు ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు🤭 దార్లో దాహం వేసి కొబ్బరి బొండాల వాడి దగ్గర ఆగాం. కాయ ముప్పై రూపాయలట. లేతగా బాగున్నాయి.😋 లోపలి గుజ్జు కూడా తెరిచి ఇస్తా అన్నాడు. మా వాళ్ళకి అదేంటో తెలీదట. "మలై" అంటూ తినేశారు. 😆 నచ్చిందట బాగా వాళ్ళకి. 

మహిష మర్ధిని మండపం


మహిష మర్ధిని మండపం పై నుండి...😻


ఇదే కన్నయ్య వెన్న ముద్ద

ఇంకో అందమైన గుడి...


అసలైన విషయం ఏంటంటే ముఖ్యమైన పాండవుల పంచ రథాలు చూడలేక పోయాము..ప్చ్😔 వీళ్ళ బీచ్ ల పిచ్చి ఏమో గానీ….ఎక్కువ సమయం అక్కడే గడిపినట్టు అనిపించింది నాకైతే….మొదట ఏమో టైగర్ కేవ్ దగ్గర తర్వాత షోర్ టెంపుల్ దగ్గర...ఇక సాయంత్రం 6 దాటాక అక్కడి నుండి సెలవు తీసుకున్నాం. మళ్లీ తెల్లారితే సోమవారం..స్కూలు ఉండనే ఉంది. 






అలా "మహాబలిపురం" నేను కూడా చూసేసా అన్నమాట🤗🤗

18, జూన్ 2019, మంగళవారం

గోల్కొండ కోటకి నేను....

మంగళవారం, జూన్ 18, 2019 4 Comments
  ఈ సంక్రాంతికి హైదరాబాదులో ఉన్న గోదారి వాసిని బహుశా నేను ఒక్కదాన్నే అయి ఉంటానేమో😣. ఇంటికి వెళ్దామని ఎంత ప్రయత్నం చేసినా అస్సలు వీలు పడలేదు. నా దురదృష్టం ఏంటో గానీ, వరుస సెలవులు వచ్చాయి కదా! ఎలాగూ ఇంటికి వెళ్ళట్లేదు...కనీసం ఇక్కడే ఏదైనా చోటకి వెళ్తే బాగుంటుంది అని నేను, మా చెల్లి నిర్ణయించుకున్నాం. అప్పటికే హైదరాబాదులో చూడదగిన ప్రదేశాలను బిర్లా మందిర్, బిర్లా మ్యూజియం లతో ప్రారంభించేశాం. తర్వాత ఏంటీ అని ఆలోచిస్తుంటే గోల్కొండ కోట గుర్తుకు వచ్చింది. చాలా మందిని అడిగితే " ...ఏముంటుంది కోటలో.." అని చెప్పారు. కానీ అప్పటికి నేను ఒకసారి వెళ్ళాను. అది కూడా ఆఫీసు పని మీద. World Heritage Week లో భాగంగా పోయిన నవంబరు లో 19-25 మధ్య, గోల్కొండ కి 500 ఏళ్లు అయిన సందర్భంగా జరిగిన కార్యక్రమానికి వెళ్ళాం మా ఆఫీస్ వాళ్ళందరూ. అప్పుడు కోటని పూర్తిగా చూడటం అవ్వలేదు. కొన్ని ప్రదేశాలను మాత్రమే చూడగలిగాను. అప్పుడే నాకు చాలా చాలా నచ్చింది. పుస్తకాలు టీవీల్లో చూడటమే తప్ప నిజంగా గోల్కొండ ని చూస్తా అని ఎప్పుడూ అనుకోలేదు నేను☺️.

  మొదటి సారి వెళ్ళినప్పుడు తీసుకున్న చిత్రాలు








మా చెల్లి కూడా గోల్కొండ చూడాలి అనటంతో అక్కడకే వెళ్దామని నిర్ణయించుకున్నాం. ASI ఉద్యోగిని కావటం వల్ల ASI పరిధిలో ఉన్న అన్ని కట్టడాలను మేము ఉచితంగా సందర్శించవచ్చు. అలా మేము చూసిన మొదటి monument గోల్కొండ అయింది.

అలా జనవరి 13 తారీఖున ముహూర్తం పెట్టుకున్నాం. అప్పుడు మొదటిసారి వెళ్ళినప్పుడు కార్ లో వెళ్ళాం. నాకు హైదరాబాద్ కొత్త కాబట్టి దారీ అదీ ఏమీ అర్ధం కాలేదు. ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకుందాం అంటే డాడీ ససేమిరా అన్నారు..అందుకని ఒక పని చేసా. నాతో పాటు ASI తెలంగాణ కి ఎంపికైన మాకందరికీ ఒక WhatsApp గ్రూప్ ఉంది. గోల్కొండ లో చేసేవాళ్ళు అందులో ముగ్గురు ఉన్నారు. ఎవరొకళ్లు చెప్తారని గ్రూపులో అడిగాను, ఏం బస్సులు ఎక్కితే కోటకి వెళ్లొచ్చు అని. మెహదిపట్నం వెళ్తే అక్కడి నుండి గోల్కొండ కి బస్సులు ఉంటాయని ఒకరు సమాధానం ఇచ్చారు.

రోజు పొద్దున్నే 9 కల్లా తయారై పోయి హిమాయత్ నగర్ లో ఉప్పల్ - మెహదిపట్నం బస్ ఎక్కేసాం🚌. మెహదిపట్నం లో గోల్కొండ కి వెళ్లే SETWIN బస్ దొరికింది. ఒక పావుగంట ఇరవై నిముషాల్లో గోల్కొండ లో దిగిపోయాము.

ఆదివారం కావడంతో 10 గంటలకే చాలా మంది ఉన్నారు. టికెట్ కౌంటర్ దగ్గర పెద్ద లైను ఉంది. సెక్యూరిటీ వాళ్ళకి నా ఐడీ కార్డు🎴చూపిస్తే సీదా పంపించారు. మా చెల్లికి కూడా టికెట్ తీయాల్సిన అవసరం లేకపోయింది. అలా కొన్ని సెల్ఫీ లు తీసుకుంటూ ఫతే దర్వాజా దగ్గరికి వెళ్ళాం. అక్కడ టికెట్స్ చూసి లోపలికి అనుమతిస్తున్నారు. అక్కడ ఇంకోసారి ఐడీ కార్డు చూపించాను. లోపలికి వెళ్ళిపోయాము. ప్రత్యేకంగా కెమెరా ఏమీ తీసుకెళ్ళ లేదు కానీ నా LG G4📱తోనే చాలా ఫొటోలు తీసుకున్నాం. రోజైతే కోట మొత్తం జనంతో చాలా సందడిగా ఉంది.



గోల్కొండ పట స్వరూపం




వచ్చేవారు చప్పట్లు కొట్టి ఆనందించేది ఇక్కడే









తారామతి మసీదు






మొదటి సారి వెళ్ళినపుడే తెలిసింది నాకు కోట పైకంటా వెళ్లొచ్చు అని. కాకపోతే అది ఒక కిలో మీటరు దాకా ఉంటుంది. ఇపుడు మా చెల్లి పైకి ఎక్కుదాం అని గొడవ చేసింది. పైగా రోజు ఎండ కూడా కొంచెం ఎక్కువే ఉంది😣. ఎలాగూ ఇద్దరం చెరో బాగ్ లో ఒక్కో నీళ్ళ సీసా, రెండు రెండు బిస్కట్ పేకెట్లు🍪 పెట్టుకున్నాం. అలా కొంచెం కొంచెం విరామాలు తీసుకుంటూ నీళ్ళు తాగుతూ బిస్కెట్లు తింటూ మొత్తానికి పైకి ఎక్కేశాం.

అప్పటిదాకా సెల్ఫీలు, ఇంకా అది నన్ను ఫొటోలు తీస్తే నేను దాన్ని తీయటం అలా సాగింది. మా ఇద్దర్నీ ఎవరైనా ఫోటో తీస్తే బాగుండు అని పక్కనే ఉన్న ఒకాయన ని రెక్వెస్ట్ చేశాం. Background బానే వచ్చింది కానీ నేనే బాగా రాలేదు అందులో👻. పైకి ఎక్కేసరికి నాకు చాలా అలసట వచ్చింది. ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతానేమో అన్నంత అనిపించింది😰.














తర్వాత మెల్లిగా కిందకి వచ్చేశాం. దారిలో రామదాసు చెరసాల, అక్కన్న మాదన్న కార్యాలయాలు, నగినా బాగ్ చాలా నచ్చాయి. కానీ కోట మొత్తం చాలా తికమక గా అనిపించింది. ఏది ఎక్కడ ఉందో అస్సలు గుర్తు లేదు. అలా మొత్తానికి కోట మొత్తం చూడగలిగాము. ఇక మధ్యాహ్నం ఒంటి గంట దాటడం తో సూర్య ప్రతాపానికి భయపడి బయటికి వచ్చేశాం. మా చెల్లి ఇంకాసేపు ఉందాం అక్కా అన్నా కూడా వినకుండా లాక్కొచ్చేసా😜. బయట నిమ్మకాయ షర్బత్ తీసుకున్నాం ఎండ నుండి ఉపశమనం కోసం🍸. కానీ అది అసలేం బాగోలేదు. సోడా తప్ప నిమ్మకాయ జాడే లేదు...తాగలేక పడేయాల్సి వచ్చింది😏. అక్కడితో గోల్కొండ కోట రెండో పర్యటన ముగిసింది.

నగీనా బాగ్ ప్రాంతం

ముచ్చట గా మూడోసారి అంటే ఏప్రిల్ లో మా ఆఫీసు తరపున స్వచ్ఛ పక్వాడా కార్యక్రమం గోల్కొండ లో జరిగింది. అలా ఇంకోసారి చూసే అవకాశం దక్కింది. అప్పుడు కోటలోని కొన్ని ప్రదేశాలను శుభ్రం చేశాం. చెత్త ఏరి పిచ్చి మొక్కలని పీకేశాం. కానీ అపుడు ఒక గంట మాత్రమే ఉన్నాము. ఎందుకో గానీ గోల్కొండ చాలా చాలా నచ్చింది నాకు.

స్వచ్చ పక్వాడా అయిపోయాక వచ్చేసేటపుడు తీసా ఇది😍



కానీ సారి మాత్రం మా అమ్మానాన్నలను తీసుకురావాలి. వాళ్ళకి కూడా గోల్కొండ కోటని చూపించాలి. ఇదండీ గోల్కొండ తో నాకున్న అనుబంధం..😍 చాలా మందికి తెలిసే ఉంటుంది అన్న ఉద్దేశ్యంతో గోల్కొండ కోట చరిత్ర ఏమీ చెప్పట్లేదు ఇందులో నేను. ఎవరికైనా ఆసక్తి ఉన్నట్లైతే కింద ఇచ్చిన Wikipedia పుటల లింకులు ద్వారా తెల్సుకోండి. ఫోటోలను ఎడిట్ చేయడానికి వాడినవి : Snapseed & Picasa. టపా నచ్చిందో లేదో తప్పకుండా చెప్పండి మరి సరేనా..!!



గోల్కొండ కోట - తెలుగు
Golconda Fort - English