8, మార్చి 2020, ఆదివారం

అదివో..అల్లదివో.. శ్రీహరివాసము!!!

ఆదివారం, మార్చి 08, 2020 0 Comments







ప్పుడైనా ఎవరితో అయినా మాటల సందర్భంలో " నేను ఇప్పటిదాకా తిరుపతే వెళ్ళలేదు" అని అన్నానంటే ... విన్న వాళ్ళ ప్రతిస్పందన మామూలుగా ఉండదు. ఏదో ఘోరమైన పాపం చేసినట్టే చూస్తారు. మరేం చేయను..ఏమో..అలా అయిపోయింది. ఇలా కాదు…"నేను కూడా తిరుపతి వెళ్ళాను అని పదిమందితో సగర్వంగా చెప్పుకోవాల్సిందే" అని నిర్ణయించుకుని 😜 తిరుపతికి కుటుంబ సమేతంగా యాత్ర పథకం వేసుకున్నాం. తిరుపతిలో ఎప్పుడూ ఆ జన సందోహం అలానే ఉంటుంది కదా!! ఫిబ్రవరి, మార్చి నెలల్లో గుడ్డిలో మెల్ల లా కాస్తంత పలచగా ఉంటుంది జనాభా అని విని అప్పుడే అంటే ఫిబ్రవరి నెలాఖరు లో రెండు రోజులు ఎంపిక చేసాము. నేనేమో ఇక్కడి నుండి తిరుపతి వెళ్లేలాగ, అమ్మ డాడీ చెల్లి ఏమో అక్కడి నుండి తిరుపతి వచ్చే లాగా. చెల్లి నేను ఇద్దరమూ సెలవులు తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అప్పటి నుండి నా ఆనందం అంతా ఇంతా కాదు. మా వాళ్ళని కల్సి రెండు నెలలు అవుతోంది..వాళ్ళని కలవొచ్చు👨‍👩‍👧‍👧...ఇంకా ముఖ్యంగా తిరుపతి చూడబోతున్నా అనే ఆతృత ఇంకో వైపు🤩

అక్కడ వసతి సముదాయాల లో అద్దె గది రెండో రోజుకి మాత్రమే దొరికింది. మొదటి రోజుకి దొరకలేదు. మొదట అయితే కాలి నడకన కొండ ఎక్కుదాం అనుకున్నాం. కానీ తర్వాత ఎండ ఎక్కువగా ఉంటుంది...రిస్కు తీసుకోవడం ఎందుకు అని సర్వదర్శనం కి మారిపోయాము. 

అంతా అయిపోయింది. ఇక స్కూల్లో సెలవు తీసుకోవడం మిగిలింది. మూడు రోజులు casual లీవు అని లీవ్ లెటర్ రాసి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తే మూడు రోజులా.. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు. అప్పటికే డాడీ చెప్పారు ...తిరుపతి అని చెప్పకు..దగ్గరి వాళ్ళ పెళ్లి అనేదో చెప్పు అని..కానీ ఆ సమయానికి నోట్లోంచి అలా వచ్చేసింది.😒🙄 దానికి ఆయన .."పక్కనేగా..ఒక్కరోజు సరిపోతుంది "గా అన్నట్టు అన్నారు..నేనేం అనకుండా అలా నిలబడిపోయాను. HM మేడం చేత సంతకం తెచ్చుకో అన్నారు.. హ్మ్...🥴అదేదో ముందే తెల్సి ఉంటే బాగుండు నే అనుకుంటూ...తర్వాతి రోజు ఆవిడ దగ్గరికి వెళ్ళాను. ఆవిడ కూడా అదే ప్రశ్న వేశారు..ఎక్కడికి అని..నేను కూడా అదే సమాధానం చెప్పాను.." అబ్బాయిని చూడటానికా" అని నవ్వుతుంది సంతకం పెడుతూ🙈🙃 " కాదు మేడమ్" అంటూ పళ్ళు ఇకిలించా 🤦..మూడు రోజుల సెలవు కోసం ఇన్ని పాట్లు పడాల్సి వచ్చింది నాకు…
Google image

చెన్నై నుండి తిరుపతికి వెళ్లే సప్తగిరి ఎక్స్ప్రెస్ కి ఇక్కడ హాల్టు లేదు. అంబత్తూర్ వెళ్ళాలి లేక తిరువళ్లూరు...ఇది దూరం అవుతుంది నాకు. అందుకు మొదటిది ఎంచుకున్నా. ప్రయాణము అయ్యే రోజు రానే వచ్చింది. 5:30 కల్లా బయటపడి మా లోకల్ రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోయా. చీకటి ఇంకా పోలేదు. టికెట్టు కౌంటర్ 6:30 కి తెరుస్తారు అంట. ఇంక నాకేం చేయాలో తెలీక టికెట్టు లేకుండానే వేళచ్చేరి వెళ్లే ట్రైన్ ఎక్కేసి అంబత్తుర్ లో దిగిపొయాను.🤫 సరైన సమయానికి సప్తగిరి వచ్చేసింది. ఏమీ తినకపోవడం తో చాలా ఆకలి వేసింది. తిరుపతిలో దిగేసరికి 10 అయింది. మా వాళ్ళ ట్రైన్ చాలా ఆలస్యం అయిపోయింది. స్పెషల్ ట్రైన్ అట. నేను అక్కడే టిఫిన్ చేసి అలాగే కూర్చున్నా. 

మా అమ్మ నన్ను చూసిన వెంటనే మొదట అన్నమాటలు...చిక్కిపోయావు...నల్లగా అయిపోయావు….అని😣 నలుగురూ వెంటనే పక్కనే ఉన్న "విష్ణునివాసం" కి వెళ్ళిపోయాం. గదుల కోసం ఇంత పెద్ద లైను ఉంది. అక్కడే ఉన్న ఒకాయన డాడీ తో అన్నారట. ..కొండ మీద పద్మనాభ నిలయం లో ఫ్రీగా లాకర్లు ఉంటాయి. అక్కడే ఉండొచ్చు కూడా అని. సరే...ఇక్కడ ఇలా సమయం వృధా ఎందుకు చేయటం..రేపటికి ఎలాగూ రూం ఉంది కదా అని నలుగురం అదే రోజు రాత్రి 7 గం. సమయానికి సర్వదర్శనం టికెట్లు తీసుకున్నాం. తర్వాత బయటికి వచ్చి తిరుమల వెళ్లే బస్సు ఎక్కేసాం. దాని ముందు లగేజీ చెకింగ్ కూడా ఉంది టోల్ దగ్గర. ఘాట్ రోడ్ ప్రయాణం భలేగా ఉంది. తిరుమల బస్టాప్ నుండి కొన్ని అడుగుల దూరం లో పద్మనాభ నిలయం ఉంది. అక్కడికి వెళ్లేసరికి మధ్యాహ్నం 1 అయింది. మా లగేజీ అంతా లాకరులో పెట్టుకుని..అన్నప్రసాదం తిని తలనీలాలు ఇవ్వడానికి కళ్యాణ కట్టకి వెళ్ళాము. చిన్నా..నేను మూడు కత్తెర్లు ఇచ్చాము. మూడు కత్తెర్లు అంటే మూడు సార్లు కత్తిరిస్తుంది అనుకున్నా .. పిచ్చిదాన్ని...ఒకేసారి కత్తిరించి..పైన మూడు వెంట్రుకలని కత్తిరించింది.🤔😳..బానే ఉంది తెలివి...అసలు నేను కత్తెర్లు కూడా ఇవ్వను అంటే...మా అమ్మ ఊరుకోదు గా😓…

తర్వాత పద్మనాభం కి వెళ్లిపోయి స్నానాలు కానిచ్చి తయారు అయిపోయాం. సాయంత్రం 4 కల్లా బయటికి వచ్చేసి క్యూ దగ్గరికి వెళ్ళాము. 7 గం. వాళ్ళని అప్పుడే లోనికి పంపము అని అన్నారని..అక్కడి నుండి ఒక అర కిలోమీటరు దూరం లో ఉన్న ఎస్వీ మ్యూజియం కి నడుచుకుంటూ వెళ్ళాము. కొండ మీద తిరగటానికి ఉచిత బస్సులు అందుబాటులో ఉన్నాయి.
మ్యూజియం చాలా బాగుంది. శ్రీవారి విగ్రహాలు, చిత్రపటాలు, తిరుపతి చరిత్ర, రోజ్వుడ్ విగ్రహాలు, బ్రహ్మోత్సవ వాహన నమూనాలు, ముఖ్యంగా ఇద్దరు రాణులతో ఉన్న శ్రీ కృష్ణ దేవరాయలు విగ్రహాలు నాకు బాగా నచ్చాయి. 


క్యూ కాంప్లెక్స్ లోకి వెళ్ళాక పులిహోర ప్రసాదం పెట్టారు. చాలా బాగుంది😋 ఇంకా లోపలికి వెళ్ళాక మొబైల్స్ లాకర్లు లో పెట్టుకోడానికి ఉంది. అక్కడే టికెట్ల వెరిఫై చేసి కంపార్ట్మెంట్ నెంబర్లను ఇచ్చారు...ఎక్కడ కూర్చోవాలి అనేది. అలా క్యూ కాంప్లెక్స్ లో ఒక కంపార్ట్మెంట్ లో గంట పాటు ఎస్విబిసి చూస్తూ గడిపేసాం. తర్వాత్తర్వాత లైన్ అలా ముందుకు కదులుతూ...వెండి వాకిలి దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా క్యూ చాలా ఇరుకుగా అయిపోయింది...నాకు భయమేసి అమ్మ మెళ్లో చేతులు వేసి అలాగే వెనుక వాళ్ళు తోస్తుంటే ముందుకు అలా వెళ్ళిపోయాను😰. రెండు మూడు సెకన్ల పాటు దేవుణ్ణి చూసా. చీకటి లో ఉంది. దర్శనమ్ సరిగ్గా పావు తక్కువ తొమ్మిదికి అయింది. తర్వాత లడ్డూ కౌంటర్ దగ్గరికి వెళ్లి లడ్డూలు తీసుకున్నాం. ఒక్కక్కరికి ఒక్కో ఉచిత లడ్డూ ఇచ్చారు. ఇంకా కావాలంటే ఒక్కొక్కరు 10 లడ్డూలు దాకా తీసుకోవచ్చు. ఒక్కో లడ్డూ ఖరీదు 50రు. 

తర్వాత శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన కేంద్రానికి వెళ్ళి భోజనం చేశాం. చక్కెర పొంగలి చాలా బాగుంది...తర్వాత నడుచుకుంటూ మా లాకర్ల రూంకి వెళ్ళిపోయాం. పెద్ద హాలు లో చాపలు వేసుకుని పడక. నాకైతే ఏం నిద్ర పట్టలేదు..ఒక వైపు చలి...మరోవైపు వచ్చే వాళ్ళు వెళ్లే వాళ్ల గోల..ఇంకెలా పడుతుంది...ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూసా…

4:30 తర్వాత నా వల్ల కాలేదు. లేచి...చిన్నా ను కూడా లేపేసి ఇద్దరం కూర్చుని కబుర్లు చెప్పుకున్నాం. 5 దాటాక ముఖాలు కడుక్కుని లగేజ్ తీసుకుని బయలు దేరాం. వేకువ జామునే ఘాట్ రోడ్ మీద అప్పుడే నిద్ర లేస్తున్న సూర్యుని కిరణాలు మీద పడుతుంటే.. హెయిర్ పిన్ మలుపుల్లో ప్రయాణ అనుభూతి బాగుంది🌄. మాకు శ్రీనివాసం లో రూం దొరకటం తో అక్కడికి వెళ్ళాం. గదిని ఆ రోజు ఉదయం 8 కి వీళ్లు ఇక్కడ కేటాయిస్తారు అంట. మేం ఏసీ గది తీసుకున్నాం. గది మాత్రం సకల సౌకర్యాలతో చాలా అంటే చాలా బాగుంది. ఇక అక్కడ స్నానాలు అవి చేసి తిరుచానూరు బయల్దేరాం. అది తిరుపతి నుండి 5km. అక్కడ ఆ రోజు శుక్రవారం కావడం తో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. దర్శనమ్ ఇపుడపుడే అయ్యే అవకాశాలు కనబడక పోవటంతో ఆ ఆలోచన విరమించుకుని ..తిరుగు ప్రయాణం అయ్యాము. మా అమ్మ ఏమో " ఇంత దూరం వచ్చి చూడకుండా వెళ్లిపోతామా…?" అంటూ ఒకటే గొడవ. 

శ్రీనివాసం వసతి సముదాయం

గోవింద రాజస్వామి ఆలయ గోపురం

తర్వాత అక్కడ నుండి గోవింద రాజ స్వామి గుడికి వెళ్ళాము. అది రైల్వే స్టేషన్ కి చాలా దగ్గర. అక్కడ జనం కొంచెం తక్కువగా ఉన్నారు. దర్శనమ్ బాగానే అయింది. తర్వాత మా గదికి వెళ్లిపోయి పడుకున్నాం. మళ్లీ తెల్లారితే ప్రయాణం…

ఈ వ్యూ చాలా బాగుంది🤩


ఒకసారి ఎవరో అనగా విన్నాను..తిరుపతికి అర్థం "తియ్ రూపాయ్ తియ్ " అని. నిజమే నేమో అనిపించింది...అక్కడ సదుపాయాలన్నీ ఉచితమే అయినా...కొన్ని కొన్ని చోట్ల డబ్బు ఇవ్వక తప్పలేదు.. అన్నిటి కంటే నాకు నచ్చింది మాత్రం లడ్డూ నే...ఏమైనా అనుకోండి ..ఇదిగో ఇప్పుడు కూడా లడ్డు తింటూ నే ఈ టపా వ్రాసాను🙃🤪….ఉంటా మరి..టాటా..👋

P.s. ఇంతకంటే ఫోటోలు ఎక్కువ తీయడానికి అసలు కాలేదు...మొబైల్స్ లాకర్లో ఉంచేయటం వలన...