29, ఏప్రిల్ 2021, గురువారం
10, ఏప్రిల్ 2021, శనివారం
పోలింగ్ ఆఫీసర్ అయ్యానోచ్!!!
డిసెంబర్లో వింటర్ బ్రేక్ అయిపోయాక స్కూలు తిరిగి తెరిచే రోజు వచ్చేటపుడు ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో తెచ్చుకోమన్నారు. వెళ్ళాక తెల్సింది ఏమిటంటే, ఈ సంవత్సరం జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల విధులు కోసం మా స్కూలు నుండి కూడా టీచర్లను పంపించడం కోసం, దరఖాస్తులు నింపమన్నారు. దానికన్న మాట ఆ ఫోటో. మొత్తానికి అందరూ పూర్తి చేసి పంపేసాం.
చిన్నప్పటి నుండి నాకు ఇలాంటి ఎలక్షన్ డ్యూటీ అన్నా, జనాభా లెక్కల పని అన్నా మహా ఆసక్తిగా ఉండేవి. ఎందుకంటే మా హైస్కూల్లో టీచర్లు వెళ్ళేవారు గా. వాళ్ళని చూసి నాకూ అలాంటి అవకాశం వస్తే బాగుణ్ణు అనుకునేదాన్ని...అందుకే అన్నమాట ఈ ఉత్సాహం.
కానీ ఆ ఉత్సాహం అంతా ఒక రోజు నీరు కారిపోయింది. ఎలాగంటే ఇదివరకు ఎన్నికల విధులకు వెళ్ళినవాళ్ళు చెప్పారు ఇలా అని. ట్రైనింగ్ క్లాసులు ఆదివారాలే పెడతారు, పైగా ఈసారి కోవిడ్ టీకా తీసుకోవడం తప్పనిసరి అని. ఆదివారం ఒక్కరోజే మనకు కాస్త సమయం చిక్కేది. కానీ అప్పుడు కూడా డ్యూటీ కి వెళ్ళాలంటే కష్టం అనిపించింది.
ఒక మంచిరోజున ఎన్నికల విధులకు సంబంధించిన appointment order వచ్చింది. నాతో సహా చాలా మందికి పోలింగ్ ఆఫీసర్-3 ఇచ్చారు. మరుసటి ఆదివారం దగ్గర్లో ఒక ఇంజనీరింగ్ కాలేజీ లో శిక్షణ కి హాజరు అవ్వమని దాని సారాంశం. అందరం ఎంచక్కా కలిసి వెళ్ళి మళ్ళీ కలిసి వచ్చేసాం. అక్కడ వాళ్ళు ఏం చెప్పింది లేదు, మేమేం చేసింది లేదు. హాజరు పట్టి లో ఒక సంతకం తప్ప. ఆ తర్వాతి ఆదివారం కూడా ఉంటుందని అనుకున్నాం. కానీ ఎవరికి ముందు రోజు sms రాలేదు. హమ్మయ్య.. ఆ ఆదివారం ఎలాంటి కార్యక్రమం లేదు. తర్వాత ఇంకో 3-4 రోజులకు ఇంకో ఆర్డర్ వచ్చింది అందరికీ.
అందులో ఏ ఏ తేదీల్లో హాజరు కావాలి, ఏ నియోజకవర్గంలో పని చేయాలి, ఇంకా టీమ్ కోడ్ ఇలాంటివన్నీ ఉన్నాయి. మనం వెళ్లాల్సిన పోలింగ్ బూత్ మాత్రం ఎన్నికల ముందు రోజు మాత్రమే తెలుస్తుందట. నాకు వచ్చిన నియోజకవర్గం "పొన్నేరి". అక్కడ వేళమ్మల్ హైస్కూల్లో -3 సార్లు వెళ్ళాలి. నాతో పాటు మా రేణు కి కూడా అక్కడే వచ్చింది. ఏంటో మా ఇద్దరికీ ఎప్పుడూ అన్ని ఇలా కలిసి వస్తాయి😀 మా అందరికీ ఇంచుమించు దగ్గర దగ్గరే వచ్చాయి కొంతమందికి మాత్రం దూరంగా తిరుత్తణి, గుమ్మిడి పూండి లాంటివి ఇచ్చారు.
మాకు పోన్నేరి కాస్త దూరమే. 25-30 km దాకా ఉంటుందేమో cabs ఏమో out station ride అని చూపిస్తున్నాయి. ఇక బస్సుల్నే నమ్ముకున్నాం. ఇక్కడి నుండి రెడ్ హిల్స్ దాకా ఒక బస్సు, అక్కడి నుండి పొన్నేరి లో ఆ స్కూలుకు ఇంకో బస్సు. బస్సులకేం... బోలెడు ఉన్నాయి. కానీ జనాలు కూడా అలాగే ఉండేవారు. నిల్చొడానికి కూడా ఖాళీ ఉండేది కాదు. ఈ కొవిడ్ భయం ఒకటి ఉండనే ఉంది. కానీ ఏం చేస్తాం. తప్పని పని..అలా రెండు రోజులు వెళ్ళాం.
మా టీమ్ లో ఎవరెవరు ఉంటారో మొదటి రోజునే తెలిసిపోయింది నాకు. మా దాంట్లో ఒక ప్రేసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ ఆఫీసర్లు 1,2,3 ఉన్నారు. అక్కడంతా తమిళమే ఉండేది. పైగా ప్రభుత్వాలు ఎలాంటి భాషను వాడుతాయో తెల్సు గా. అదేమో నాకర్థమే కాలేదు. మా ప్రిసైడింగ్ ఆఫీసర్ స్టేట్ స్కూల్లో HM అంట. మొదట్లో ఆవిడతో ఇంగ్లీషులో మాట్లాడా. అలా మాటల్లో నాది ఇలా ఆంధ్ర అంటే ఎక్కడో చెప్పు అన్నది. పాలకొల్లు అన్నా, మాది భీమవరం అంది. అంతే..దెబ్బకి నా భయం ఎగిరిపోయింది. ఆశ్చర్యపడాల్సినది ఏమంటే మా టీమ్ లో మిగతా ఇద్దరికీ కూడా తెలుగు తెల్సు. PO-1 ఏమో ఆర్ట్ టీచర్, PO-2 ఏమో అంగన్వాడీ కార్యకర్త. నాకైతే చాలా ఆనందమనిపించింది. పైగా మా presiding officer గారికి ఇది 13 వ ఎలక్షన్ డ్యూటీ అంట. ఇంకేం భయం ఉంటుంది.
ఇక ఎన్నికల ముందు రోజు ఊరికి వెళ్తున్నట్టు అన్నీ బ్యాగులో పెట్టుకుని బయలు దేరాం. మరి ఆ రెండు రోజులూ అక్కడే బస చేయాలిగా. మా పోలింగ్ బూత్ ఆర్డర్ చేతిలో పెట్టారు వెళ్ళాక. అది కూడా దూరమే మాకు. పైగా చాలా లోపలికి అంట. అందరూ అక్కడనుండి ఆటో తీసుకుని వాడికి 500 సమర్పించి పోలింగ్ బూత్ చేరుకున్నాం. స్కూలు అయితే బాగుంది నీట్ గా. అక్కడ మొత్తంగా 5 బూత్ లు ఉన్నాయట. సాయంత్రం దాకా అలా కాలక్షేపం చేశాం. సాయంత్రం సామగ్రి అంతా వచ్చింది. అవన్నీ అమర్చడం లో టైమే తెలియలేదు. పోస్టర్లు అంటించాలి, ఓటర్ స్లిప్పులు తయారు చేయాలి, చెక్ లిస్ట్ లో చూసుకోవాలి అన్నీ వచ్చాయో లేదో. ముఖ్యంగా EVM, VVPAT సరిగా పని చేస్తున్నాయో లేదో చూడాలి. ఇక ఆ రాత్రి వాళ్ళిచ్చిన దోశలు తిని ఆ గదిలోనే పడుకున్నాం. బెంచీలు రెండు ఒకదానికొకటి పక్కన పెట్టి, అదే ఆరోజుకి మంచం.
ఎన్నికల రోజు రానే వచ్చింది. రాత్రి నిద్ర సరిగా పడితే కదా. తెల్లవారి 3 కి లేచి 5 కల్ల తయారైపోయాము. పొద్దున టిఫిన్ ఎప్పటికి వస్తుందో తెలీదు అని మా మేడం బ్రెడ్ పాకెట్ తెచ్చింది. అవే తలొక రెండు జాం రాసుకుని తిన్నాము. పొద్దున 6 కి పోలింగ్ ఏజెంట్లు వచ్చారు హడావిడి గా. వాళ్ళ సమక్షంలోనే 50 ఓట్లకి mock poll పెట్టాలి. అప్పుడు నాకు పూర్తిగా అర్థం అయిపోయింది. కంట్రోల్ యూనిట్ ని ఎలా ఆపరేట్ చేయటం అనేది. నమ్మకం వచ్చింది కొంచెం.
ఇక 7 గం.కి పోలింగ్ మొదలైంది. మా బూత్ లో మొత్తం ఓటర్లు 647. నా పని ఏమంటే PO-2 దగ్గర్నుండి వచ్చిన వాళ్ళకి ఇంక్ పెట్టడం, వల్ల దగ్గర్నుండి ఓటర్ slip తీసుకుని 50 కలిపి ఒక కట్టగా కట్టడం, వోట్ వేసే ముందు కంట్రోల్ యూనిట్ లోని ballot బటన్ నొక్కడం. బాగుంది మొత్తానికి. ఎంజాయ్ చేశాను పనిని. ఒకే ఒక్క ఇబ్బంది ఏమిటంటే ఆ ఇరుకు బెంచి మీద రోజంతా కూర్చుని ఉండటం వల్ల నడుం నొప్పి, ఇంకా రెండు రోజులు సరిగా నిద్ర లేకపోవడం.
ఆరోజు 7 కి పోలింగ్ పూర్తి చేసేసాం. పోలింగ్ శాతం 73% వచ్చింది మాకు. అప్పట్నుంచి చాలా పని ఉంది presiding officer గారికి. VVPAT, EVM, కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ అన్నిటినీ బాక్సుల్లో భద్రపరచి సీల్స్ వేయాలి. వాళ్ళు ఇచ్చిన ఫారాల్ని పూర్తి చేయాలి. మేం చేయగల్గినంత సహాయం చేశాం. ఆ జోనల్ ఆఫీసర్లు వచ్చి మా సామగ్రి అంతా తీసుకునే సరికి రాత్రి 9 దాటింది.
ఒక వయసు మళ్ళిన ఓటర్, తన గుర్తింపు కార్డు చూపించమని అడిగినపుడు ఈ ఊరిలో నా పేరుతో నేను ఒక్కడినే ఉన్నాను..అదీ..ఇదీ..అని వితండవాదం చేశాడు. చివరికి అందరూ నచ్చ చెప్పడంతో ఓటర్ id బయటికి తీసాడు. ఇంకోటి ఏమంటే ఈ పోలింగ్ ఏజెంట్లు ఉన్నారు కదా. వాళ్ళు వోట్ వేసేటపుడు ఇంక్ తక్కువగా అంటించమన్నారు. నేను మామూలుగానే పెట్టేసాను. వెంటనే చేరిపేసుకుంటున్నారు. అదేం చిత్రమో మరి…?? నాకైతే అర్థం కాలేదు🙄
హ్మ్..ఆ రాత్రికి అక్కడే ఉందాం అని నిర్ణయించుకున్నాం. అప్పుడు స్కూల్లో మేం తప్ప ఇంకెవరు లేరు. ఇక మర్నాడు పొద్దునే 4 కే లేచి ఆటో లో దగ్గర్లో ఉన్న "అత్తిపట్టు" రైల్వే స్టేషన్ కి చేరుకున్నాం. అక్కడ్నుంచి సబర్బన్ ట్రైన్లో ఇంటికి వచ్చేసాను.
మొత్తానికి ఇలా నా చిన్నప్పటి కోరిక తీరింది అన్నమాట😇😇🤩