బాలరాజు కథ సినిమా డాడీ చిన్నప్పుడు వచ్చిందట. ఆ సినిమాలో "మహాబలిపురం " పాటను డాడీ అప్పట్లో తెగ పాడేవారు అని మా నానమ్మ మురుస్తూ చెప్పేది. ఇంకా పోటీ పరీక్షల్లో ఎప్పుడు మహాబలిపురం కి సంబంధించిన ప్రశ్న వచ్చినా ఆ పాటే గుర్తు వచ్చేది "కట్టించాడు ఈ ఊరు పల్లవ రాజు " అంటూ. దాని ద్వారా సులభంగా సమాధానం పట్టేయొచ్చు గా😜 అసలే SSC పరీక్షల్లో ఎక్కువగా అడిగే అవకాశం ఉన్న అంశం అది. అలాగే ఇంకోసారి ASI ఉద్యోగిని గా ఉన్నపుడు Google arts & culture project లో ASI కి సంబంధించిన పేజ్ చూసాను. అందులో మహాబలిపురం 360 డిగ్రీ దృశ్యాలు చూసి ఆసక్తి ఇంకా పెరిగింది. ఎప్పటికైనా చూసి తీరాల్సిన నా ప్రదేశాల జాబితాలో మహాబలిపురం రెండు మూడు స్థానాలు ఎగబాకింది.
Google image |
కొన్ని రోజుల క్రితం మా హాస్టల్ రూం లో ఒకమ్మాయి తన స్నేహితురాలి తో మహాబలిపురం వెళ్తున్నట్టు చెప్పింది. నేనూ రావొచ్చా అని అడిగేద్దాం అని అనిపించింది. కానీ ఆగిపోయా..మళ్లీ ఏమనుకుంటుందో అని. భక్తుడు కోరిందీ దేవుడు వరమిచ్చిందీ ఒకటే అన్నట్టు (సామెత సరిగా గుర్తు రాలేదు) ఒక శనివారం స్కూలు అయిపోయాక ఇళ్లకు వెళ్ళిపోతున్న సమయం లో రేణు చెప్పింది. (తను నాతో పాటే మా స్కూల్లో చేరింది) "రేపు కొంతమంది tgt లు, నేను మహాబలిపురం వెళ్తున్నాం...వస్తావా" అని🤩...ఓ ...తప్పకుండా అని బుర్ర ఊపాను ఆనందంతో. ప్రయాణం ఎలా... ఏ సమయానికి అవన్నీ ఇంటికెళ్ళాక చెప్తా అంది. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్న మాదిరిగా ...హుషారుగా సైకిల్ తొక్కుకుంటూ రూం కి వచ్చేసా. మళ్లీ పొద్దునే తలస్నానం ప్రోగ్రాం పెట్టుకుంటే ఆలస్యం అవుతుంది ఏమో అని వెళ్ళగానే చేసేసా..😜
కాసేపటికి రేణు సందేశం పంపింది. రేపు ఉదయం 11 కి కార్ బయల్దేరుతుంది. 10:30 కల్లా మా ఇంటికి వచ్చేయ్ అని. అలా ఆదివారం పదకొండుంపావు దాటేక ఇక్కడి నుండి బయల్దేరాం. సరిగ్గా రెండు గంటల ప్రయాణం. మా బ్యాచ్ లో నేను తప్ప అందరూ ఉత్తర భారతీయులే. 😕
మహాబలిపురం ముందు 5km దూరం లో టైగర్ కేవ్ అని ఒక ప్రదేశం ఉంది చూస్తారా.. ఆపనా అని డ్రైవర్ అంటే...మేం ఒప్పుకున్నాము. అప్పటికే టైము ఒంటిగంట అయింది. సూర్యుడు నడినెత్తిన సుర్రుమంటున్నాడు. 🌞😵నేను ముందు జాగ్రత్తగా ముఖానికి సన్ స్క్రీన్ పులుముకున్నా..ఇంకా నల్ల కళ్లద్దాలు కూడా బ్యాగ్ లో వేసుకున్నా..😎 నేనింకా టైగర్ కేవ్ అంటే ఏమైనా పులులు ఉంటాయేమో అనుకున్నా...ఉష్..😉కాదు...ఇదే ఆ పులి గుహ...కానీ భలేగా చెక్కారు పులి బొమ్మలు.
టైగర్ కేవ్ దగ్గర బీచ్😍 |
చెట్టు మీద కోతి🐒 |
అక్కడ కాసేపయ్యాక మహాబలిపురం షోర్ టెంపుల్ కి చేరుకున్నాం. అక్కడే ఒక చోట కూర్చుని తెచ్చుకున్న ఆలూ పరాఠా లు, పూరీలు తినేసాం. ఆదివారం కావటం వల్లన చాలా మంది జనం ఉన్నారు. సముద్ర ప్రాంతం కావడంతో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. సన్ స్క్రీన్ రాసినా ఏం ఉపయోగం లేదు. పైగా ముఖం అంతా జిడ్డుగా తయారైంది😣 రెండు బొట్టు బిళ్ళలు పెట్టాను. రెండూ పడిపోయాయి😒 మహాబలిపురం అనగానే అందరూ కళ్ల ముందు మెదిలే సీ షోర్ టెంపుల్ ఎంత బాగుందో..చుట్టూ బుజ్జి నంది బొమ్మలతో.
షోర్ టెంపుల్ ముందు ఉన్న వినాయక విగ్రహం |
ఇది కూడా టెంపుల్ ముందే ఉంది..😇 |
రూట్ మ్యాప్ |
ముందు ఉన్న గోపురం లో ఉన్న విగ్రహాలు ఇవే! |
తర్వాత అర్జునుడు పాశుపతం పొందిన ప్రదేశం గా చెప్పబడే Arjuna's penance చూసాము. రెండు పెద్ద పెద్ద శిలల మీద ఎన్ని బొమ్మలు చెక్కారో!!..ఇందులో ముల్లోకాలను చూపించారట. అక్కడి నుండి "కృష్ణ మండపం" చూశాం. కృష్ణుడు గోవర్ధన గిరి ని ఎత్తుతున్న సన్నివేశం ఎంత బాగుందో..😍 ఇక్కడ కింద గచ్చు మీద ఏవో బొమ్మలు ఉన్నాయి. వాటి అర్థం ఏమిటో మరి..ఇదేదో వైకుంఠ పాళీ ఆటలాగ ఉంది.
Arjuna's penance |
ఇదే....ఏదో ఆట లాగా ఉంది అన్నాను గా |
కృష్ణ మండపం |
కృష్ణ మండపం తర్వాత నడుచుకుంటూ లైట్ హౌస్ ప్రాంతానికి చేరుకున్నాం. దారిలో ఈ⬇️ బొమ్మలు దర్శనం ఇచ్చాయి. ఆ లైట్ హౌస్ ప్రాంగణం లో ఉన్న maritime ప్రదర్శన శాల కూడా చూసాము. అక్కడున్న టైటానిక్ షిప్ నమూనా హైలెట్. లైట్ హౌస్ దగ్గర చాలా జనం ఉన్నారు. టైం పట్టేలా ఉందని ఇక పైకి ఎక్కలేదు. కింద నుండే చూసి ఆనంద పడ్డాం.
ఇదే టైటానిక్ నమూనా |
నౌక నడుపుతున్న ఫీలింగ్ వస్తుంది కదా!😁 |
తర్వాత చూసిన ప్రదేశం మహిష మర్దిని రాక్ కట్ మండపం. దాని పైకి ఎక్కినపుడు లైట్ హౌస్ వీక్షణ చాలా బాగుంది. 🤓 అక్కడి నుండి కొంచెం దూరం నడిచాక కృష్ణుని వెన్న ముద్ద దగ్గరికి వచ్చేశాం. అప్పటికి 5 దాటేసింది. అంత పెద్ద రాయి వాలుగా అసలు.. ఎలా నిల్చుందో 😲😯🤯 చాలా ఆశ్చర్యమేసింది. చాలా మంది ఆ రాయిని కిందకి తోస్తున్నట్లు ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు🤭 దార్లో దాహం వేసి కొబ్బరి బొండాల వాడి దగ్గర ఆగాం. కాయ ముప్పై రూపాయలట. లేతగా బాగున్నాయి.😋 లోపలి గుజ్జు కూడా తెరిచి ఇస్తా అన్నాడు. మా వాళ్ళకి అదేంటో తెలీదట. "మలై" అంటూ తినేశారు. 😆 నచ్చిందట బాగా వాళ్ళకి.
మహిష మర్ధిని మండపం |
మహిష మర్ధిని మండపం పై నుండి...😻 |
ఇదే కన్నయ్య వెన్న ముద్ద |
ఇంకో అందమైన గుడి... |
అసలైన విషయం ఏంటంటే ముఖ్యమైన పాండవుల పంచ రథాలు చూడలేక పోయాము..ప్చ్😔 వీళ్ళ బీచ్ ల పిచ్చి ఏమో గానీ….ఎక్కువ సమయం అక్కడే గడిపినట్టు అనిపించింది నాకైతే….మొదట ఏమో టైగర్ కేవ్ దగ్గర తర్వాత షోర్ టెంపుల్ దగ్గర...ఇక సాయంత్రం 6 దాటాక అక్కడి నుండి సెలవు తీసుకున్నాం. మళ్లీ తెల్లారితే సోమవారం..స్కూలు ఉండనే ఉంది.
అలా "మహాబలిపురం" నేను కూడా చూసేసా అన్నమాట🤗🤗
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...