చెన్నై లో ఉన్నా అన్న పేరేగాని అక్కడికి ఇక్కడికి తిరిగింది లేదు. ఒక పక్క వైరస్ భూతం ఒకటి భయపడుతూనే ఉంది. పోయిన వారం ఓణం అప్పుడు, రెండు రోజులు సెలవులు రావడంతో చెల్లి నా దగ్గరికి వచ్చింది. అసలు అయితే వండలూర్ జూ కి వెళ్దామని అనుకున్నాం మొదట. కానీ కోవిడ్ నిబంధనల దృష్ట్యా అది కాస్తా మూతబడి ఉంది. ఇక తర్వాతి జాబితా లోని ప్రదేశాలు మహాబలిపురం మరియు కాంచీపురం.
మహాబలిపురం ఇంతకు పూర్వమే నేను వెళ్లి ఉండటంతో, ఇద్దరూ చూడలేనిది కాంచీపురాన్ని ఎంపిక చేశాం. అక్కడ ఇంకా బోలెడు గుళ్ళు కూడా చూడొచ్చు అని సంబరపడ్డాము. అంతకు ముందే వెళ్లిన నా స్నేహితురాలిని అడిగి ఎలా వెళ్లాలి అని ఆ వివరాలన్నీ తెలుసుకున్నాను.
శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కదా! గుడి ఖాళీ ఉండదేమో అని శనివారం పెట్టుకున్నాం ప్రయాణం. దానికోసం ఓలా లో పొద్దున 5 కి రైడ్ ని షెడ్యూల్ చేశాం.
శనివారం పొద్దున్నే మూడు గంటలకే లేచి, ముస్తాబయ్యి క్యాబ్ వాడి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాము. సరిగ్గా అనుకున్న సమయానికి వచ్చేసాడు. డ్రాపింగ్ పాయింట్ అడిగితే ఇలా కంచి కామాక్షి ఆలయం అని చెప్తే "అది అవుట్ స్టేషన్ రైడ్ మేడం! 250 రూపాయలు డీజిల్ చార్జీలు ఎక్స్ ట్రా ఇవ్వాలి" అని చెప్పాడు. మరి బుక్ చేసినప్పుడు బాగానే అయింది గా, అవుట్ స్టేషన్ అని ఏమి చూపించలేదు. సరే అనుకుని కారు ఎక్కాము. మేము ఏమి తినలేదు తాగలేదు. ముందు దర్శనం చేసుకున్నాక అక్కడే ఏదో ఒక హోటల్లో టిఫిన్ చేద్దామని ఆగాము.
అలా ఆరున్నరకి కాంచీపురం చేరుకున్నాం. గుడి ఉత్తర ద్వారం దగ్గర కారు ఆపి డ్రైవరు "వీకెండ్స్ గుడి క్లోస్ ఉంటుంది" అన్నాడు. అప్పుడు నాకు వాడు చెప్పింది ఎక్క లేదు. అక్కడే వాకింగ్ చేస్తున్న వాళ్ళని కనుక్కున్నాడు. మూడు రోజులు గుడి మూసి వుంటుంది అని అన్నారు వాళ్ళు.
ఒక్కసారిగా ఇద్దరం నీరుకారి పోయాం. ఎంతో ఆశ పడి, ఆనందపడి ఇంత దూరం వస్తే ఇదేంటి ఇలా అయిందని. 1330+ 250= 1580 రూపాయలు అయింది అని చెప్పి ఇక్కడే ఉంటారా వెనక్కి వచ్చేస్తారా అని అడిగాడు. మేము డబ్బులు ఇచ్చేసి షాపింగ్ చేసుకోవాలని వాణ్ణి వెళ్ళిపొమ్మన్నాము. ఆ డ్రైవర్ కి తమిళనాడులో వారాంతాల్లో ఆలయాలు మూసి ఉంటాయని ముందే తెలుసు. ఆ మాటేదో ఎక్కక ముందే చెప్తే అసలు రాకపోదుము కదా! కానీ ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదు.
అక్కడి దుకాణాలు 8 కి కానీ తెరవరట. ఏం చేస్తాం అప్పటిదాకా. అయినా గుడినే సందర్శించనప్పుడు ఇంకేం కొనుక్కుంటాము లే అని కనీసం ఏమైనా తినడానికి కూడా ఒక్క హోటలూ తెరిచి లేదు. ఇంకేం చేసేదిలేక, అలా గుడి చుట్టూ ఒకసారి తిరిగేసి బస్ స్టాండ్ వైపు నడిచాము.
ఇదొక్కటి మాత్రం తీసుకున్నాం. |
అనుకోకుండా ఒక డైరెక్ట్ బస్సు దొరికింది. ఇలాంటి బస్సులు ఉంటాయి నాకు మునుపు తెలీదు. హమ్మయ్య అనుకొని అది ఎక్కేసాం. తెచ్చుకున్న బిస్కెట్లు మాత్రం బస్సులో తిన్నాము.
మొత్తానికి అలా కాంచీపురం వెళ్లినట్టు వెళ్లి వెనక్కి వచ్చేసాం. పుల్లయ్య వేమవరం వెళ్లాడు అంటారే.. అలా అయ్యింది మాకు.
హహహ!!😂...మొత్తానికి వృధా ప్రయాస పడ్డారాన్నమాట
రిప్లయితొలగించండిఅలా జరిగిందా? మీ తరానికి ఓలాలు, ఊబర్లు అలవాటై పోయాయి. అయినా వాడు 1330 కాకుండా ఇంకా 250 ఏమిటి? ఆ 250 తన జేబులో వేసుకున్నాడేమో?
రిప్లయితొలగించండిపోన్లెండి, జరిగిందేదో జరిగింది. ీరు తమిళనాడులో ప్రదేశాలు చూడడానికి ప్రభుత్వం వారి Tamil Nadu Tourism Development Corporation (TTDC) వారి package tours వీలుగా ఉంటాయి. వాళ్ళవే హోటళ్ళు కూడా ఉన్నాయి. చెన్నై సిటీ లోకల్ టూర్ కూడా ఉంటుంది. ఈ క్రింద ఇచ్చిన లింక్ లో వివరాలు ఉంటాయి. చెన్నై సిటీలో పిక్-అప్ పాయింట్లు కూడా ఉంటాయి. నేను కంచి అలాగే చూశాను (వీకెండ్ లో గుడి మూసెయ్యడం ఏమిటో వినడానికే విచిత్రంగా ఉంది). పార్క్ టౌన్ స్టేషన్ దగ్గర వారి ఆఫీస్, పిక్-అప్ ఉండేవి. నేను చెప్పేది 20 యేళ్ళ క్రితం సంగతి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో వారికి ఫోన్ చేసి కనుక్కోండి. ఏమైనప్పటికీ TTDC వాళ్ళ టూర్లు బాగుండేవి. మధురై, రామేశ్వరం కు కూడా ఉండేవి.
TTDC వాటినే prefer చెయ్యడానికి ఆలోచించండి. మీ లాగా ఆడపిల్లలు అలా బయట ఊళ్ళకు cab లో వెళ్ళడం క్షేమకరం కాదు.
https://www.ttdconline.com/tourname.do?title=Package
నెనరులు అండి. కొవిడ్ నిబంధనల వలన lockdown ఇంకా ఇక్కడ నడుస్తూ ఉన్నది. దానిలో భాగంగా ప్రార్థన ప్రదేశాలు మూడు రోజులు మూసేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అందుకే ఇలా..
తొలగించండి