5, ఆగస్టు 2019, సోమవారం

భీమవరం - మర మెట్లు

ఎప్పుడో రెండేళ్ల కిందటి మాట. ఒక ఆదివారం ఖాళీ గా ఉన్నామని భీమవరం వెళ్దామని నిర్ణయించుకున్నాం. డాడీ డిగ్రీ క్లాస్ మేట్ ఒకావిడ ఎప్పటి నుండో వాళ్ళింటికి రమ్మని అంటుందట. అలా వాళ్ళింటికి వెళ్లి రిలయన్స్ కి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం. మా పాలకొల్లుకి, భీమవరానికి దూరం 20 Kms యే కావడం వల్ల ఈ ఊళ్ళ మధ్య రాకపోకలు చాలా ఎక్కువ. ఏ పెద్ద వస్తువు కొనుక్కోవాలి అన్నా మా వాళ్ళందరూ భీమవరం వైపే చూస్తారు.

ఆ ఉదయం 9:30 కల్లా తయారై పోయి మేం నలుగురం బస్సు కోసం బస్టాప్ కి వచ్చేశాం. అదేంటో గానీ ఉత్తపుడు ప్రతీ పావుగంట కీ ఉండే బస్సు ఆ రోజు అరగంట నిలబడితే గానీ దొరకలేదు. బస్సులో భీమవరానికి అరగంట నుండి ముప్పావు గంట సమయం పడుతుంది.🚌 అలా భీమవరం లో బస్సు దిగి, నడుచుకుంటూ వాళ్ళింటికి వెళ్ళాం. ఆవిడ మమ్మల్ని చూసి చాలా ఆనంద పడింది. వాళ్ళిల్లు చాలా బాగుంది. పెద్ద పెద్ద సీతాఫలాలు నలుగురికీ నాలుగు పెట్టింది. ఎంత రుచిగా , ఉన్నాయంటే😋😋..నా వరకూ సీతాఫలాలు తినడం అంటే అదృష్టం అనే అనుకుంటాను..ఆవిడకి నేనూ మా చెల్లీ తెగ నచ్చేసినట్టున్నాం. "మీ పిల్లలు మంచి హైటున్నారు బుజ్జీ" అని ఎన్ని సార్లు అన్నదో...😊..ఎప్పుడూ మా చుట్టాల నుండి "మీ పిల్లలు ఎంత పొడుగో!!..వెతకడం కష్టమే!!" ..ఇలాంటి పిచ్చి డైలాగులు 😬😠వినీ వినీ విసిగిపోయిన మాకు ఆవిడ పాజిటివ్ గా అన్న మాటలు మా చెవుల్లో అమృతం పోసినట్టు అనిపించాయి. సంతోషంగా ఆవిడ దగ్గర సెలవు తీసుకుని హోటల్ కెళ్ళి భోజనం చేశాం.

Google image

అసలు ప్లాన్ ప్రకారం తర్వాత వెళ్ళాల్సింది బస్టాండ్ దగ్గరున్న రిలయన్స్ సూపర్ కి. కానీ ఎప్పుడూ గీతా మల్టీప్లెక్స్ చూడలేదని ముందు అక్కడికి వెళ్ళాం. ఆ బిల్డింగ్ పేరు కోస్టల్ సిటీ సెంటర్. ఎక్కడ చూసినా జనమే..ఆదివారం ఎఫెక్టు. అందులోనే రిలయన్స్ ట్రెండ్స్ ఇంకా డిజిటల్ కూడా ఉన్నాయి. ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి. పైనేమో మల్టీ ప్లెక్స్. మూడు థియేటర్లు ఉన్నాయి. ఇలాంటి ఒక షాపింగ్ మాల్ కి వెళ్ళడం నాకదే మొదటి సారి.

అప్పటికే చాలా మంది చెప్పగా విన్నాను. మాకు దగ్గర్లో ఉన్న ఎస్కలేటర్ ఆ మల్టీ ప్లెక్స్ లోనే అని. దాని దర్శన భాగ్యం ఇప్పుడు కలిగింది నాకు. చూసి ఊరుకోకుండా దాన్ని ఎక్కాలనిపించింది. కానీ ఒక పక్క భయం నన్ను వెనక్కి లాగుతుంది. చివరికి ఎక్కుదాం అని నేను చెల్లి అనుకుని పాములా కదులుతున్న దాని మొదటి మెట్టు మీద కాలు పెట్టాను...😦😧అమ్మ బాబోయ్...ఎవరో కిందకి తోసినట్టు అనిపించి వెంటనే పడిపోబోయాను. కింద ఉన్న అమ్మ పట్టుకుంది కాబట్టి సరిపోయింది. నాకైతే ఎంత సిగ్గేసిందో😷😖..ఒక్క క్షణం అందరూ నన్నే చూసారా ఏంటి అని అనిపించింది. పక్కల ఉండే రెయిలింగు పెట్టుకుందాం అంటే అది కూడా మెట్లతో పాటే పైకి పోతోంది😝.. మా చెల్లి, డాడీ మాత్రం ఇంతలో పైకెళ్ళిపోయారు. అదేమో నన్ను చూసి కోతిలా పళ్లు ఇకిలిస్తోంది. మా అమ్మకి కూడా భయం వేయడంతో కిందనే ఉండిపోయింది. ఇంక చేసేదేమీ లేక అమ్మా, నేను పక్కనే ఉన్న మామూలు మెట్లు ఎక్కేసి పైకెళ్ళాం. నాలాంటి వాళ్ళు కూడా ఉంటారని ముందుగానే కనిపెట్టారేమో కట్టినవాళ్లు 😆..అక్కడితో ఆ కథ ముగిసినా ఎస్కలేటర్ అంటే భయం మాత్రం పోలేదు.

ఆ మాల్ అంతా ఒకసారి విండో షాపింగ్ చేసేసి తర్వాత రిలయన్స్ సూపర్ కి వెళ్ళాం. ఎప్పుడో ఒకసారి తప్పితే భీమవరం వెళ్ళినప్పుడు రిలయన్స్ ని దర్శించకుండా అస్సలు తిరిగి రాను. అది కూడా ఏమి కొన్నా కొనకపోయినా noodles family pack🍜 మాత్రం కొనుక్కుంటా. అంతిష్టం నాకు noodles అన్నా రిలయన్స్ అన్నా..Top Ramen, రిలయన్స్, సన్ ఫీస్ట్ యిప్పీ..ఇలా ఎన్ని వచ్చినా నా ఓటు మాత్రం మ్యాగీ కే😍..#ilovemaggi..అక్కడితో భీమవరం సంగతులు అయిపోయాయి. ఇప్పుడు మరమెట్ల దగ్గరికి వచ్చేద్దాం.



ఎస్కలేటరు ను తెలుగులో మర మెట్లు అనొచ్చు అని తెలుగు వెలుగు పత్రిక ద్వారా తెలుసుకున్నాను. అందుకే నా ఈ టపాలో ఇలా వాడేస్తున్నా. ఉద్యోగంలో చేరడానికి మొట్ట మొదటి సారి సికింద్రాబాదు రైల్వే స్టేషన్లో దిగినప్పుడు తప్పని సరిగా మర మెట్లని ఎక్కాల్సి వచ్చింది. అది ఎక్కాలంటేనే కంగారు వస్తుంది నాకు. డాడీ ఏమో "ఏం కాదు..అందరూ ఎక్కట్లేదూ" అంటూ ఆ మెట్ల దగ్గరికి తీసుకెళ్లారు.

Google image


నాకు భయం వేసి ఎక్కే ముందే డాడీ చేతిని పట్టుకున్నాను. 😿పైకెక్కే దాకా వదల్లేదు. పైకి ఎక్కాక మన్మధుడు సినిమాలో బ్రహ్మానందం తూలినట్టు నేను కూడా ముందుకు పడబోయాను...కానీ వెంటనే నన్ను నేను సంభాళించుకున్నాను. హమ్మయ్య….! మొత్తానికి నేను కూడా ఎస్కలేటర్ ఎక్కేసాను👏. నన్ను నేనే మెచ్చుకున్నాను.

😜
ఇక ఆ తర్వాత మర మెట్లు అంటే భయం పోయింది. సికింద్రాబాద్ స్టేషన్ లో బోల్డు సార్లు..ఇంకా హిమాయత్ నగర్ Westside లో ..ఎక్కేసరికి ధైర్యం వచ్చేసింది😁.. అంతే కదండీ..ముందు మొదలు పెట్టేవరకే భయం..తర్వాత అన్నీ పరార్.. ఇదేనండీ నా ఎస్కలేటర్ కథ..👍

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...