18, జూన్ 2019, మంగళవారం

గోల్కొండ కోటకి నేను....

మంగళవారం, జూన్ 18, 2019 4 Comments
  ఈ సంక్రాంతికి హైదరాబాదులో ఉన్న గోదారి వాసిని బహుశా నేను ఒక్కదాన్నే అయి ఉంటానేమో😣. ఇంటికి వెళ్దామని ఎంత ప్రయత్నం చేసినా అస్సలు వీలు పడలేదు. నా దురదృష్టం ఏంటో గానీ, వరుస సెలవులు వచ్చాయి కదా! ఎలాగూ ఇంటికి వెళ్ళట్లేదు...కనీసం ఇక్కడే ఏదైనా చోటకి వెళ్తే బాగుంటుంది అని నేను, మా చెల్లి నిర్ణయించుకున్నాం. అప్పటికే హైదరాబాదులో చూడదగిన ప్రదేశాలను బిర్లా మందిర్, బిర్లా మ్యూజియం లతో ప్రారంభించేశాం. తర్వాత ఏంటీ అని ఆలోచిస్తుంటే గోల్కొండ కోట గుర్తుకు వచ్చింది. చాలా మందిని అడిగితే " ...ఏముంటుంది కోటలో.." అని చెప్పారు. కానీ అప్పటికి నేను ఒకసారి వెళ్ళాను. అది కూడా ఆఫీసు పని మీద. World Heritage Week లో భాగంగా పోయిన నవంబరు లో 19-25 మధ్య, గోల్కొండ కి 500 ఏళ్లు అయిన సందర్భంగా జరిగిన కార్యక్రమానికి వెళ్ళాం మా ఆఫీస్ వాళ్ళందరూ. అప్పుడు కోటని పూర్తిగా చూడటం అవ్వలేదు. కొన్ని ప్రదేశాలను మాత్రమే చూడగలిగాను. అప్పుడే నాకు చాలా చాలా నచ్చింది. పుస్తకాలు టీవీల్లో చూడటమే తప్ప నిజంగా గోల్కొండ ని చూస్తా అని ఎప్పుడూ అనుకోలేదు నేను☺️.

  మొదటి సారి వెళ్ళినప్పుడు తీసుకున్న చిత్రాలు
మా చెల్లి కూడా గోల్కొండ చూడాలి అనటంతో అక్కడకే వెళ్దామని నిర్ణయించుకున్నాం. ASI ఉద్యోగిని కావటం వల్ల ASI పరిధిలో ఉన్న అన్ని కట్టడాలను మేము ఉచితంగా సందర్శించవచ్చు. అలా మేము చూసిన మొదటి monument గోల్కొండ అయింది.

అలా జనవరి 13 తారీఖున ముహూర్తం పెట్టుకున్నాం. అప్పుడు మొదటిసారి వెళ్ళినప్పుడు కార్ లో వెళ్ళాం. నాకు హైదరాబాద్ కొత్త కాబట్టి దారీ అదీ ఏమీ అర్ధం కాలేదు. ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకుందాం అంటే డాడీ ససేమిరా అన్నారు..అందుకని ఒక పని చేసా. నాతో పాటు ASI తెలంగాణ కి ఎంపికైన మాకందరికీ ఒక WhatsApp గ్రూప్ ఉంది. గోల్కొండ లో చేసేవాళ్ళు అందులో ముగ్గురు ఉన్నారు. ఎవరొకళ్లు చెప్తారని గ్రూపులో అడిగాను, ఏం బస్సులు ఎక్కితే కోటకి వెళ్లొచ్చు అని. మెహదిపట్నం వెళ్తే అక్కడి నుండి గోల్కొండ కి బస్సులు ఉంటాయని ఒకరు సమాధానం ఇచ్చారు.

రోజు పొద్దున్నే 9 కల్లా తయారై పోయి హిమాయత్ నగర్ లో ఉప్పల్ - మెహదిపట్నం బస్ ఎక్కేసాం🚌. మెహదిపట్నం లో గోల్కొండ కి వెళ్లే SETWIN బస్ దొరికింది. ఒక పావుగంట ఇరవై నిముషాల్లో గోల్కొండ లో దిగిపోయాము.

ఆదివారం కావడంతో 10 గంటలకే చాలా మంది ఉన్నారు. టికెట్ కౌంటర్ దగ్గర పెద్ద లైను ఉంది. సెక్యూరిటీ వాళ్ళకి నా ఐడీ కార్డు🎴చూపిస్తే సీదా పంపించారు. మా చెల్లికి కూడా టికెట్ తీయాల్సిన అవసరం లేకపోయింది. అలా కొన్ని సెల్ఫీ లు తీసుకుంటూ ఫతే దర్వాజా దగ్గరికి వెళ్ళాం. అక్కడ టికెట్స్ చూసి లోపలికి అనుమతిస్తున్నారు. అక్కడ ఇంకోసారి ఐడీ కార్డు చూపించాను. లోపలికి వెళ్ళిపోయాము. ప్రత్యేకంగా కెమెరా ఏమీ తీసుకెళ్ళ లేదు కానీ నా LG G4📱తోనే చాలా ఫొటోలు తీసుకున్నాం. రోజైతే కోట మొత్తం జనంతో చాలా సందడిగా ఉంది.గోల్కొండ పట స్వరూపం
వచ్చేవారు చప్పట్లు కొట్టి ఆనందించేది ఇక్కడే

తారామతి మసీదు


మొదటి సారి వెళ్ళినపుడే తెలిసింది నాకు కోట పైకంటా వెళ్లొచ్చు అని. కాకపోతే అది ఒక కిలో మీటరు దాకా ఉంటుంది. ఇపుడు మా చెల్లి పైకి ఎక్కుదాం అని గొడవ చేసింది. పైగా రోజు ఎండ కూడా కొంచెం ఎక్కువే ఉంది😣. ఎలాగూ ఇద్దరం చెరో బాగ్ లో ఒక్కో నీళ్ళ సీసా, రెండు రెండు బిస్కట్ పేకెట్లు🍪 పెట్టుకున్నాం. అలా కొంచెం కొంచెం విరామాలు తీసుకుంటూ నీళ్ళు తాగుతూ బిస్కెట్లు తింటూ మొత్తానికి పైకి ఎక్కేశాం.

అప్పటిదాకా సెల్ఫీలు, ఇంకా అది నన్ను ఫొటోలు తీస్తే నేను దాన్ని తీయటం అలా సాగింది. మా ఇద్దర్నీ ఎవరైనా ఫోటో తీస్తే బాగుండు అని పక్కనే ఉన్న ఒకాయన ని రెక్వెస్ట్ చేశాం. Background బానే వచ్చింది కానీ నేనే బాగా రాలేదు అందులో👻. పైకి ఎక్కేసరికి నాకు చాలా అలసట వచ్చింది. ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతానేమో అన్నంత అనిపించింది😰.


తర్వాత మెల్లిగా కిందకి వచ్చేశాం. దారిలో రామదాసు చెరసాల, అక్కన్న మాదన్న కార్యాలయాలు, నగినా బాగ్ చాలా నచ్చాయి. కానీ కోట మొత్తం చాలా తికమక గా అనిపించింది. ఏది ఎక్కడ ఉందో అస్సలు గుర్తు లేదు. అలా మొత్తానికి కోట మొత్తం చూడగలిగాము. ఇక మధ్యాహ్నం ఒంటి గంట దాటడం తో సూర్య ప్రతాపానికి భయపడి బయటికి వచ్చేశాం. మా చెల్లి ఇంకాసేపు ఉందాం అక్కా అన్నా కూడా వినకుండా లాక్కొచ్చేసా😜. బయట నిమ్మకాయ షర్బత్ తీసుకున్నాం ఎండ నుండి ఉపశమనం కోసం🍸. కానీ అది అసలేం బాగోలేదు. సోడా తప్ప నిమ్మకాయ జాడే లేదు...తాగలేక పడేయాల్సి వచ్చింది😏. అక్కడితో గోల్కొండ కోట రెండో పర్యటన ముగిసింది.

నగీనా బాగ్ ప్రాంతం

ముచ్చట గా మూడోసారి అంటే ఏప్రిల్ లో మా ఆఫీసు తరపున స్వచ్ఛ పక్వాడా కార్యక్రమం గోల్కొండ లో జరిగింది. అలా ఇంకోసారి చూసే అవకాశం దక్కింది. అప్పుడు కోటలోని కొన్ని ప్రదేశాలను శుభ్రం చేశాం. చెత్త ఏరి పిచ్చి మొక్కలని పీకేశాం. కానీ అపుడు ఒక గంట మాత్రమే ఉన్నాము. ఎందుకో గానీ గోల్కొండ చాలా చాలా నచ్చింది నాకు.

స్వచ్చ పక్వాడా అయిపోయాక వచ్చేసేటపుడు తీసా ఇది😍కానీ సారి మాత్రం మా అమ్మానాన్నలను తీసుకురావాలి. వాళ్ళకి కూడా గోల్కొండ కోటని చూపించాలి. ఇదండీ గోల్కొండ తో నాకున్న అనుబంధం..😍 చాలా మందికి తెలిసే ఉంటుంది అన్న ఉద్దేశ్యంతో గోల్కొండ కోట చరిత్ర ఏమీ చెప్పట్లేదు ఇందులో నేను. ఎవరికైనా ఆసక్తి ఉన్నట్లైతే కింద ఇచ్చిన Wikipedia పుటల లింకులు ద్వారా తెల్సుకోండి. ఫోటోలను ఎడిట్ చేయడానికి వాడినవి : Snapseed & Picasa. టపా నచ్చిందో లేదో తప్పకుండా చెప్పండి మరి సరేనా..!!గోల్కొండ కోట - తెలుగు
Golconda Fort - English