13, మే 2019, సోమవారం

నా మొదటి కథ....

సోమవారం, మే 13, 2019 9 Comments
కొన్నేళ్ళ క్రిందట ఈ కథ ని రాసాను. నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా, కొంచెం కల్పిత కథ ని కలిపి అల్లాను..ఎలా ఉందో మీ వ్యాఖ్యల ద్వారా నాకు తప్పకుండా తెలియజేయండి...

కుంటి కుక్క

Google Image

     నేనొక ఊరకుక్కని! కౄరమైనదాన్ని అనుకుంటున్నారేమో! వీధుల్లో తిరిగేదాన్ని కాబట్టి వీధి కుక్క అనుకోండి! అయినా చాలా మంది ఊరకుక్క అనే అంటారు కదండీ..ఏంటీ! కుంటుతున్నానని చూస్తున్నారా? అది చాలా పెద్ద కథండీ. ఇప్పుడు చెప్పేంత ఓపిక లేదు కానీ తర్వాత ఎపుడైనా చెప్తాలెండి..ఏంటీ! ఇప్పుడే చెప్పాలా..సర్లెండి చెప్తాను!

****

      అప్పుడే పుట్టాను. ఎవరో చిన్నబ్బాయి నన్ను చేతుల్లోకి తీసుకున్నాడు. "భలే ఉంది కదా! బుజ్జిగా" అంటూ ముద్దు చేసాడు. "ఒరేయ్ టింకూ దాన్ని పట్టుకోకురా! వదిలెయ్, వాళ్ళమ్మ దగ్గర పాలు తాగుతుంది" అని టింకూ అమ్మ అనుకుంటా! గట్టిగా అరిచింది. టింకూ వెంటనే నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. "టామీ" అనే పేరుతో నన్ను పిలిచేవారు.


     నెల పోయిన తర్వాత టింకూ, వాళ్ళ స్నేహితులతో వచ్చాడు. వాళ్ళలో ఒకడైన బన్ను నన్ను చూస్తూ "టింకూ! ఈ కుక్కపిల్ల నాకు చాలా నచ్చిందిరా. నేను మా ఇంటికి తీసుకెళ్ళి పెంచుకుంటాన్రా" అని అన్నాడు. దానికి టింకూ "దానికేం! తీసుకెళ్ళు, మరి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా?"  "నేను ఎలాగో ఒప్పిస్తాన్లే గానీ, మళ్ళీ వస్తాను" అంటూ బన్ను పరుగు తీసాడు. నేను భయపడిపోయాను. "బాబోయ్ వాళ్ళింటికి తీసుకెళ్ళిపోతారా. ఇక్కడ చాలా బాగుందే! మరి నాతో మా అమ్మ, నా తోబుట్టువులూ వస్తారో, రారో?" అనుకుంటూ అమ్మ బొజ్జ దగ్గరకెళ్ళిపోయా, పాలు తాగడానికి. అమ్మ శరీరం కింద ఒళ్ళు తెలియకుండా పడుకున్నా..


     లేచేసరికీ అమ్మ నా దగ్గర లేదు. బన్ను, టింకూ కనబడ్డారు. బన్ను నన్ను చూసి నవ్వుతున్నాడు. వాళ్ళింట్లో ఒప్పేసుకున్నారేమో! అయితే నేను వెళ్ళిపోవాలా? బన్ను నన్ను తీసుకుని బుట్టలో వేసాడు. "అరె! అమ్మని ఒక్కమాటైనా అడక్కుండా, తను లేని సమయంలో తీసుకుపోతారేమిటీ, అయ్యో!" అనుకుంటూ ఏడ్చా. నా ఏడుపు వాళ్ళకి వినిపించదు కదా!

     బన్ను వాళ్ళింట్లో వాళ్ళందరూ నా చుట్టూ చేరారు. కొంచెం భయం వేసింది. కానీ చూస్తే మంచి వాళ్ళ లాగానే ఉన్నారు. బన్నూ, తన చెల్లి హనీ నాకు మంచి స్నేహితులైపోయారు. మేము ముగ్గురం ఆదివారం వస్తే చాలు, బంతితో తయారైపోతాం. ఇద్దరూ కలిసి నాకు వారానికొక్కసారి బేబీ షాంపూతో స్నానం కూడా చేయిస్తారు. హనీ ఒక్కోసారి నా పక్కనే కూర్చుని నా తల మీద చెయ్యి వేసి సవరిస్తూ, నా బుగ్గల్ని నొక్కుతూ ముద్దు చేస్తుంది. అలా చేస్తుంటే, నేను హనీ ఒడిలో తల పెట్టుకుని గారాలు పోతూ ఉంటాను. ఇదిలా ఉంటే, నేనంటే బన్నూ వాళ్ళ నాన్నకి అంత పడదు. కానీ మిగతా ముగ్గురి మాట కాదనలేక నన్ను ఇంట్లో ఉంచడానికి ఒప్పుకున్నాడు. అయినా నాకు ఆయనంటే అభిమానం. ఆయన సోఫాలో కూర్చుని పేపరు చదువుతుంటే కాళ్ళను చుట్టుకుని పడుకుంటా. కానీ ఆయన నన్ను చీదరించుకుంటాడు. అప్పుడు నా ముఖం చిన్నబోతుంది.


      ఒకరోజు సెలవుల్లో బన్ను, హనీ నా మెడకు బెల్టు కట్టి రోడ్డు పైకి తీసుకెళ్ళారు. అలా నేను వెళ్ళడం అదే మొదటిసారి. బెల్టు వదులుగా ఉండటంతో కొంతసేపటికి ఊడిపోయింది. అంతలో మా అమ్మ లాంటి కుక్క రోడ్డుకవతల కనిపించింది. నేను వెంటనే అటు వైపు వెళ్ళబోయా. ఒక్కసారిగా అటువైపు నుండి కారు వచ్చి నా కాలు మీద నుండి వెళ్ళిపోయింది. నాకు చెప్పలేనంత భయం, బాధ కలిగాయి. ఆ బాధ భరించలేక గట్టిగా ఏడుస్తూ అరిచా. ఇంతలో బన్ను, హనీ పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చారు. వాళ్ళకి కూడా భయం వేసినట్టుంది. బిక్క ముఖాలు పెట్టారు. బన్ను ఏడుస్తూ "సారీ టామీ, మా వల్లే నీకు ఇంత దెబ్బ తగిలింది. ఇంకెప్పుడూ నిన్ను ఇలా వదలము" అని ఏడ్చాడు. ఇందులో నాకు వాళ్ళ తప్పేమీ కనిపించలేదు. నేను ఆ కుక్కని మా అమ్మేమో అనుకుని చూడ్డానికి వెళ్తుంటే ఆ కారు వాడు గుద్దేసాడు. అయినా నేను అటూ ఇటూ చూసే వెళ్ళాను. నేను రోడ్డు దాటుతుంటే స్పష్టంగా కనబడుతుంది కదా. నాలా కాకుండా రంగులు కనిపిస్తాయి కదా! అదే మనిషి ఎవరైనా నా స్థితిలో ఉంటే అలా మీద నుండి పోతారా! కుక్కే కదా అని అశ్రద్ధ! అని సైగల ద్వారా చెప్పబోయా. కానీ, వాళ్ళకి నా భాష అర్ధం కాదు కదా!


      నన్ను జాగ్రత్తగా చేతుల్లో పట్టుకుని ఇంటికి తీసుకెళ్ళారు. ఏవో మందులు వేశారు. నేను ఆ మంటకి "కుయ్యో..మొర్రో.." అంటూ అరిచాను. అలా కొన్ని రోజులు నా పక్క మీదే ఉన్నాను. దెబ్బలు చాలా వరకూ మానాయి. ఒక రోజు లేచి నడవబోయాను. పడిపోయాను. మళ్ళీ మళ్ళీ పడిపోయాను. అయ్యో! నా కాలు విరిగిపోయిందే. ఇదంతా ఆ కారు వాడి పనే! వాడు గానీ నాకు దొరకాలీ..ఒళ్ళంతా కరచి పడేస్తా! అనుకుంటూ మూడు కాళ్ళపై నడవడం నేర్చుకున్నా. అప్పట్నుంచి బన్నూ వాళ్ళ నాన్న నాపై ఇంకా ఎక్కువ చిరాకు పడేవాడు. అదీకాక, వాళ్ళమ్మ కూడా అలాగే తయారైంది. మాటిమాటికీ "కుంటికుక్క...కుంటికుక్క.." అని అంటున్నారు. అప్పుడు మా అమ్మ దగ్గరికెళ్ళిపోవాలనిపిస్తుంది. హనీ, బన్ను మాత్రం నన్ను ఇంకా ప్రేమతో చూసుకునేవారు.


      ఒకరోజు బన్ను వాళ్ళ నాన్న స్నేహితుడు, ఒకాయన మా ఇంటికి వచ్చారు. నేను ఆయన రాగానే తోకూపుకుంటూ వెళ్ళాను, ఆహ్వానించాడానికి. ఆయన కూర్చోగానే "ఏవిట్రా! మీ కుక్క గట్టిగా అరవలేదు. పైగా కుంటుతుంది. ఎవరైనా తెలియని వాళ్ళొస్తే కుక్కలు అరుస్తాయి కదా! ఏ దొంగో వస్తే? అరవకపోగా, తోకూపుకుంటూ వెళ్ళి స్వాగతిస్తుంది" అని అన్నాడు. బన్నూ వాళ్ళ నాన్న వికారంగా నవ్వాడు. మళ్ళీ ఆ స్నేహితుడే "ఒరేయ్ ఎందుకూ పనికి రాని దీన్ని ఒదిలించేసుకో, నీకు అంతగా మంచి కుక్క కావాలంటే ఒక దృఢమైన డాబర్ మేన్ కుక్కని నీకిప్పిస్తాను" అని అన్నాడు. వాళ్ళు మెల్లిగా అనుకుంటున్నా ఆ మాటలు నా చెవిన పడకపోలేదు.

       ఆ వచ్చినతను బన్నూ నాన్నతో వచ్చాడు కాబట్టి నేను ఏమీ అరవలేదు, అలా కాకుండా అయితే తప్పకుండా అరుస్తాను కదా! అసలే బన్నూ వాళ్ళ నాన్నకి నేనంటే చిరాకు కదా! నిజంగానే నన్ను వదిలించుకుంటాడేమో!

       ఓ రెండు రోజులు పోయిన తర్వాత ఎప్పుడూ లేనిది బన్నూ వాళ్ళ నాన్న నన్ను చేతుల్లోకి తీసుకున్నాడు. నేను చాలా ఆనందపడ్డాను. కానీ ఎందుకో? బన్నూ, హనీ గట్టిగా ఏడుస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనిపించింది, కానీ నన్ను ఈయన గట్టిగా పట్టుకున్నాడు. నాకేం అర్ధం కావడంలేదు. ఆయన నన్ను బుట్టలో పెట్టుకుని బైక్ పై కూర్చున్నాడు. చీకటిగా ఉందేమో! అంతా అస్పష్టంగా ఉంది. నన్ను చంపేస్తాడా ఏంటీ! ఒక్కసారిగా భయం వేసింది.. బాబోయ్..దూకేయాలనుకున్నా. కానీ ఆయన ఒక చెయ్యి నన్ను అదిమి పట్టి ఉంది. అయినా నా పిచ్చి కానీ అతని బలం ముందు, నా బలం ఎంత?


      కొన్ని వీధులు తిప్పి, ఒక వీధి చివర నన్ను బుట్టతో సహా వదిలేసి, మరి వెనక్కి చూడకుండా బైక్ పై వేగంగా వెళ్ళిపోయాడు. నాకు దుఃఖం వచ్చేసింది. నాకేం తెలియలేదు. ఉన్నన్నాళ్ళు విశ్వాసంగానే ఉన్నాను కదా! ఒక్కసారీ ఏ దొంగా రాలేదు. ఒకవేళ వచ్చి ఉంటే నా ప్రతాపం చూపేదాన్ని! ఆయనకి నేనంటే మొదట్నుంచీ అయిష్టతే! ఆ స్నేహితుని మాటలు అగ్నికి ఆజ్యం పోసినట్లయినాయి, నావల్ల వాళ్ళకెప్పుడూ హాని కలగలేదు. కానీ వాళ్ళు నాకు ఇచ్చిందేంటీ? బన్ను, హనీలు అడ్డు చెప్పలేదెందుకో! అమ్మ, నాన్నలకు భయపడి ఉంటారు.

*****

       విన్నారు కదా..ఇదీ నా కథ! అలా అప్పట్నుంచీ ఇలా మూడు కాళ్ళతో కాలక్షేపం చేస్తున్నా. గాలికి తిరుగుతూ, దొరికింది తింటూ గడుపుతున్నాను. ఎక్కడైనా హనీ, బన్ను, మా అమ్మ కనిపిస్తారేమోనని ఆశగా చూస్తుంటా! "అబ్బా..!" రాయి పొట్టకి తగిలింది. మళ్ళీ తలకి..రాళ్ళు ఎక్కడ్నుంచి వస్తున్నాయో చూద్దును కదా! ఎవరో ఆకతాయిలు నాపై రాళ్ళు విసురుతూ నవ్వుతున్నారు. నేనిక ఊరుకోలేకపోయాను, మనుషుల్ని ఉపేక్షించేది లేదు.. ఒక్క ఉదుటున వాళ్ళపైకి దూకాను. వాళ్ళు రాళ్ళు అక్కడే పారేసి భయంతో పరుగెత్తారు. వాళ్ళని వదిలే ప్రశక్తే లేదు ఈవాళ అనుకుంటూ వాళ్ళని వెంబడించాను. ఒక్కడు చిక్కాడు నాకు. రెండు చోట్ల కండ ఊడేలాగా కరిచాను. వాడు బాధతో రాగాలు తీస్తుంటే నాకు చాలా ఆనందం వేసింది. హాయిగా పళ్ళు ఇకిలించాను. నేను చేసిందేమైనా తప్పా! చెప్పండి. నా మానాన నేను మీతో మాట్లాడుతుంటే నన్ను రెచ్చగొడతారా!


      ఏదో వేడుక జరిగినట్లుంది పెద్ద ఇంటోళ్ళది. సగం పదార్ధాలు నేలపాలే! విందు చేసుకున్నా. "బ్రేవ్.." మనుకుంటూ మెల్లగా నడుస్తున్నా. రైలు పట్టాలపైనుండి నడుస్తున్నాను. అయ్యో! నా కాలు పట్టాలో ఇరుక్కుపోయిందే! ఎలా.? అనుకుంటుంటే "కూ.." రైలు శబ్దం వినిపించింది. ఎంతో గింజుకున్నా...

*****

     ఆ రైలు నా పైనుండి వెళ్ళిపోయింది. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నా. అయినా మా అమ్మ చచ్చిపోయిందో, లేదో! నేను వెళ్ళే దగ్గర కూడా మనుషులు ఉంటారా ఏంటీ? నాకు మనుషులంటే కోపం వచ్చేస్తుంది.

      కొంపతీసి మీరూ మనుషులేనా?