29, జులై 2019, సోమవారం

నా ఉద్యోగ ప్రయాణం - 3 (ఉద్యోగం వచ్చేసిందోచ్)


ముందు భాగం ఇక్కడ

ఇంతకీ SSC మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పరీక్ష తుది ఫలితాలు మార్చి 31 న వస్తాయని సైట్లో ప్రకటించారు..ఆ రోజు కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసా..ఆ రోజు ఎన్ని సార్లు సైట్ తెలిచి రిఫ్రెష్ చేసానో నాకే తెలీదు. అలా ఏప్రిల్ 1, 2 తేదీలూ అంతే..ఇంక చిరాకొచ్చేసింది. రిజల్ట్ పెట్టలేదు కానీ..ఏప్రిల్ 27 న ఫలితాలు విడుదల చేస్తారని ఒక నోటీసు పడేసారు. అలా ఇంకో నెల రోజులు చూసాను..ఈ లోపల కొన్ని రోజులు DSC కి పుస్తకాలు తీసేదాన్ని..ఆ...ఇప్పుడు చదివినా Notification వస్తాదో రాదో అనుకుని మూసేసేదాన్ని. ఇంతలో దాన్ని మళ్ళీ ఏప్రిల్ 30 కి వాయిదా వేశారు.

ఆ రోజుల్ని ఎలా గడిపానో నాకే తెలీదు..వస్తుందో రాదో అని చాలా టెన్షన్ పడేదాన్ని. నాకు OBC రిజర్వేషన్ ఉంది. కానీ జాతీయ స్థాయిలో OBC కి UR కి పెద్ద తేడా ఏముండదు కదా కటాఫ్ విషయంలో...పోనీ విమెన్ రిజర్వేషన్ ఉందేమోననుకుని ఆనందపడ్డా..ఎందుకంటే సెలెక్టయిన వారిలో అమ్మాయిలు తక్కువగా ఉన్నారు. కంఫిర్మేషన్ కోసం ఓసారి నెట్ లో వెతికా..తెలిసినదేంటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ లేదు..దాన్ని తెచ్చే ప్రయత్నాలు ఇంకా జరుగుతున్నాయని.. ఇలా రిజర్వేషన్ లేదు కాబట్టే కనీసం అమ్మాయిల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతోనే పరీక్షలకి ఫీ కన్సెషన్ ఉంటుంది. అదే SSC పరీక్షలు ఏమైనా సరే అమ్మాయిలు ఫీజు కట్టక్కర్లేదు…కానీ మన ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళా కోటా ఉంది. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కూడా ఉంది..

ఇంతలో ఏప్రిల్ 28 న పోస్ట్ మాన్ ఉద్యోగానికి పరీక్ష హాల్ టికెట్ వచ్చింది.ఈ SSC రిజల్ట్ పాజిటివ్ గా వస్తే మానేద్దామనుకున్నా...వెళ్ళాలా వద్దా..అని చివరికి తెల్లారకుండానే బస్ ద్వారా విజయవాడకి వెళ్ళిపోయాం..అబ్బో ఏం ఎండ బాబూ...చాలా సేపటి వరకూ బయటే ఉంచేసారు మమ్మల్ని..అది ఆఫ్ లైన్ పరీక్షే..నోవా కాలేజీ వచ్చింది నాకు..చాలా మంది ఉన్నారు వెళ్ళేసరికే.. .కనీసం కూర్చోడానికి బల్లలు లాంటివేం లేవు అక్కడ. పరీక్ష ఐతే బాగానే రాసాను. మా D.Ed ఫ్రెండ్స్ చాలా మంది అప్ప్లై చేసారు దీనికి. అక్కడే మా కాలేజీ అమ్మాయి కనిపించింది. ఇంక వాళ్ళూ, మేమూ కలిసి మధ్యాహ్నం 2 కి ఉండే విజయవాడ - నర్సాపురం పాసింజర్ బండి ఎక్కేశాం..భోజనాలు చేసేంత సమయం దొరకలేదు మాకు. నరకం ఏంటంటే ఆ రైళ్ళో కనీసం నిల్చోడానికి కూడా ఖాళీ లేదు..అలాగే మా ఫ్రెండూ నేనూ కబుర్లు చెప్పుకుంటూ కాలం వెళ్ళదీశాం. సాధారణంగా గుడివాడ వచ్చేసరికీ చాలావరకూ ఖాళీ అయిపోతుంది..కానీ ఆ రోజు భీమవరం దాక కూడా జనాలు ఉన్నారు...ఆ రోజు చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయట..పైగా వేసవి సెలవులు కదా..అలాగే ఆ రైళ్ళో పరీక్ష కి వచ్చినోళ్ళు ఎక్కువ మందే ఉన్నారు. ఈ పరీక్ష ఏమవుతుందో మరి?? ఏదేమైతే ఇంటికి వచ్చేసరికీ 7.30 అయింది..ఏమీ తినలేదేమో చాలా ఆకలవుతూంది..భోజనం చేసేసి నెట్ ఆన్ చేసా..

 కానీ ఆ రోజునే సాయంత్రం ఊరికే సైట్ తెరిస్తే సరిగ్గా అప్పుడే లిస్ట్ అప్లోడ్ చేసారు.. 30 అని చెప్పి రెండు రోజుల ముందే ఇచ్చారు. నా పేరు ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఉందోచ్!!..నేను తెలంగాణ రాష్ట్రానికి ఎంపికయ్యా..ఎందుకంటే అదే నా మొదటి ప్రిఫరెన్స్. అప్లికేషన్ లో..అప్పుడు 3 4 కాకుండా 4 3 పెట్టా..(3-ఏపీ, 4-టీఎస్.. IIIT నుండి వచ్చేసి, D.Ed అయ్యాక ఇంట్లో ఖాళీగా కనిపించేదాన్ని అందరి దృష్టిలో...తెల్సిన వారు పిచ్చి పిచ్చి ఉచిత సలహాలు ఇచ్చేవారు..అందుకే వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకునేదాన్ని అప్పట్లో...ఈ చిరాకే కావొచ్చు ముందు తెలంగాణ పెట్టడానికి కారణం...అప్పుడు ఖచ్చితంగా వస్తుందని నాకు మాత్రం ఏం తెలుసు!!..). నాది OBC ఐనా జనరల్ లో సెలెక్టయ్యా..నా ఆల్ ఇండియా ర్యాంక్ 4288.. అతి తక్కువ కటాఫ్ 126..హైయస్ట్ కటాఫ్ అంటే 130 కంటే ఎక్కువున్న రాష్ట్రాలు బీహార్, యూపీ, హర్యనా లాంటివి ఉన్నాయి. ఉత్తర భారత రాష్ట్రాల కటాఫ్ ల కంటే దక్షిణ భారత రాష్ట్రాలవి తక్కువే...రాష్ట్రాల వారీగా కటాఫ్ ఉంది కాబట్టి ఎక్కువ తెలుగు వాళ్ళకీ అవకాశం వచ్చింది..అది కాకుండా ఇండియా అంతా ఒకే కటాఫ్ పెట్టి ఉంటే సుమారు 60%-70% ఉద్యోగాలు హిందీ వారికే వచ్చి ఉండేవి... ఎందుకంటే వారికి పోటీ ఎక్కువ..మార్కులూ ఎక్కువే.. CHSL, CGL లలో ఇలానే ఉంటుంది..

 నేనూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని కాబోతున్నా...వెంటనే ఎవరు క్రియేట్ చేసారో మరి...SSC MTS కి ఎంపికైన వారు ఫేస్ బుక్, పాగల్ గయ్ ల లో గ్రూపులు తెరిచేసారు..అందులో నేనూ చేరిపోయా..నా జీవితంలో మొదటిసారి  మా కుటుంబమంతా ఎంతో ఆనందపడ్డాం..మా కుటుంబంలో మొట్టమొదట ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికయ్యాను. ఇది చిన్న పోస్టని ఏం బాధ పడట్లేదు..ఎందుకంటే నిరుద్యోగం హెచ్చుస్థాయిలో ఉన్న ఈ రోజుల్లో 20 లక్షల మందితో పోటీ పడి, ఒక ఉద్యోగాన్ని సంపాదించడం అంటే చాలా కష్టమే!!.. పై స్థాయికి వెళ్ళడానికి ఇది ఒక నిచ్చెనలా ఉపయోగపడుతుంది..కింది స్థాయి ఉద్యోగమైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి దక్కే సౌకర్యాలన్నీ దీనికీ ఉన్నాయి. వారానికి 5 రోజులు మాత్రమే పని. మూడేళ్ళ సర్వీసు తర్వాత ప్రమోషన్లు ఇంకా డిపార్టుమెంటల్ పరీక్షలు కూడా రాసుకోవచ్చు.



దీని తర్వాతి ఘట్టం డిపార్ట్మెంట్ అలోకేషన్..అది ర్యాండంగా జరుగుతుంది.. ర్యాంక్ పాత్ర ఏమీ ఉండదు. ఈ లోపల యూట్యూబ్ లో SSC MTS తర్వాతి తతంగం గురించి ఎన్ని వీడియోలు పెట్టేశారో..చాలా వరకూ చూసా..అలోకేషన్ లిస్ట్ ఎపుడు పెడతారని, తెలంగాణ లో ఏఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయో కనుక్కుందామని, సదరన్ రీజన్ చెన్నై కి ఒక RTI అన్ లైన్ ద్వారా ఒక రిక్వెస్టు పెట్టా..రెండు రోజుల్లో సమాధానం వచ్చింది. మే 18 టెంటేటివ్ డేట్ అని, దానితో పాటు తెలంగాణ లో Department wise vacancies PDF (SSC MTS తెలంగాణకి సంబంధించి)  ఒకటి పంపారు. ఆ లిస్ట్ లో హైదరాబాద్ ఏజీ ఆఫీస్ లో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. అందులో వస్తే బాగుణ్ణు అనుకున్నా... మే 17 నే ఆంధ్రప్రదేశ్ లిస్ట్ పెట్టారు కానీ తెలంగాణ లిస్ట్ మాత్రం 22 న పెట్టారు. అందులో నాకు Archaeological Survey of India వచ్చింది..ఇపుడూ టెన్షన్ ఏంటంటే పోస్టింగ్ ఎక్కడొస్తుందీ అని..తెలంగాణ లో ఎక్కడైనా ఇవ్వొచ్చట.. నెట్లో వెతికితే తెలంగాణ లో ASI పరిధిలో ఉన్నవి కొన్ని తెలిశాయి... వరంగల్, గోల్కొండ, కొండాపూర్ మ్యూజియం..ఇలా ఉన్నాయి మరి.... ASI HQ నుండి లెటర్ ఎప్పుడొస్తదో ఏంటో!!? ఎందుకంటే అలోకేషన్ వరకే SSC పని..మిగతాది అంతా ఏ డిపార్ట్మెంట్ ఐతే అదే చూసుకుంటుంది. నా విజయం వెనుక మా కుటుంబం పాత్ర ఎంతో ఉంది. ఏ పరీక్ష ఐనా నన్ను రాయమని ప్రోత్సహిస్తారు మా అమ్మా నాన్నా..మా డాడీ ఐతే ఎంత దూరమైనా విసుక్కోకుండా దగ్గరుండి తీసుకెళ్తారు. ఇలాంటి తల్లిదండ్రులు మాకు దొరకడం మా అదృష్టం. ఇంకా GradeUp App మరియు Qmaths Site నా ప్రిపరేషన్ లో ఎంతో ఉపయోగపడ్డాయి..






నేనేమో ASI నుండి లెటర్ కోసం ఎదురు చూస్తుంటే కొన్ని రోజుల ముందు రాసిన పోస్ట్ మాన్ జాబ్ కి ఎంపిక అయినట్టు తెల్సింది..అది కూడా హైయెస్ట్ మార్కులు 100 కి 95 అయితే నాకు వచ్చినవి 94..చాలా ఆనందపడ్డాను..మా డివిజనే అయిన భీమవరానికే ఎంపికయ్యాను. ఇది తెల్సిన రెండు రోజులకే అపాయింట్మెంటు లెటర్ వచ్చేసింది. అక్టోబరు 4 న వచ్చి చేరాలని ఉంది. నాకేమో ఒక పక్క ఆందోళన, నేను ఎదురు చూసేది మాత్రం రావట్లేదు అని. సరే ఒక వారం చూద్దాము, ఇక రాకపొతే పోస్ట్ మాన్ కే వెళ్దాం అని నిర్ణయించుకున్నా. మొత్తానికి ఒక మూడు నాలుగు రోజుల తర్వాత ఎన్నాళ్ళో వేచిన ఉదయం రానే వచ్చింది. నాకు కేటయించిన కార్యాలయం "విజ్ఞాన శాఖ, భారతీయ పురాతత్వ సర్వేక్షణ, హైదరాబాదు". మొదటి నుండీ పొస్ట్ మాన్ ఉద్యోగము అంటే అంత ఇంట్రెస్టు లేదు నాకు...అమ్మాయిలకి అది సరిపోదు అని చాలా మంది చెప్పారు. ఇక అందుకే అటు వైపు వెళ్ళలేదు. ఈ లోపు జాయిన్ కావడానికి అవసరమైన మెడికల్, కారెక్టర్ సెర్టిఫికేట్ల లాంటివి చేసేసుకున్నాం. ఒక మంచి రోజు చూసుకుని డాడీ, నేనూ భాగ్యనగరానికి ప్రయాణం అయ్యాము.

తర్వాత ఏమేం సంఘటనలు జరిగాయి అనేది తర్వాతి టపాలలో చూద్దాము.
(సశేషం)

6 కామెంట్‌లు:

  1. ప్రభుత్వోద్యోగం సాధించినందుకు అభినందనలు మోహనా!💐👏👏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు రాణి గారూ!!..చాలా రోజులైంది అండి..నేను మీకు ఇంకా గుర్తు ఉన్నానా!!☺️

      తొలగించండి
    2. ప్రాంతీయాభిమానం కదా మరి!😀

      తొలగించండి


  2. హమ్మయ్య ! ఉజ్జోగం వచ్చేసింది !/ ఏమవుతుందో‌ అనుకుంటూ ఒకటి రెండు భాగాలు‌ చదివేటప్పు డనుకున్నా‌!

    All the best in your career path
    Try for Civils.

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు అండి నా ఈ ప్రయాణం మీకు నచ్చినందుకు!...

      తొలగించండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...