6, జూన్ 2019, గురువారం

నా ఉద్యోగ ప్రయాణం - 1

మొట్ట మొదటగా నేను రాసిన పరీక్ష తపాలా శాఖ వారి MTS పరీక్ష (2015-D.Ed చదువుతున్న సమయంలో). అందులో 60% మార్కులే వచ్చాయి. కనీసం 80% ఉంటే ఉద్యోగం వస్తుంది. తర్వాత నేను SSC పరీక్షల వెంట పడ్డా..CHSL పరీక్ష ఇప్పటికి మూడు సంవత్సరాల నుండి రాస్తున్నా..2015 లో 103.5 , 2016 లో 105 మార్కులు వచ్చాయి..అప్పట్లో కటాఫ్ 110-120 ఉంది..ప్చ్..ఈ సారి అంటే 2017 ఫలితాల కోసం నిరీక్షిస్తున్నా...ఇప్పుడు కటాఫ్ దాటుతుంది..కానీ మెరిట్ లిస్ట్ లో చేరేంత పరిస్థితి లేదు. ఎందుకంటే కటాఫ్ దగ్గరగా ఉంటాయి నా మార్కులు.

ఇక మొట్టమొదట విజయం సాధించిన పరీక్ష..FCI వాచ్ మేన్ పరీక్ష...అది 8 వ తరగతి అర్హత తో 2017 లో జరిగింది.. 120 కి 90 దాటిన వారిని హైదరాబాదులో ఫిజికల్ టెస్ట్ కి రమ్మని పిలుపు వచ్చింది...కానీ నేను అపుడు DSC కోచింగ్ కని అవనిగడ్డలో ఉన్నా..అయినా నాకు అది ఇష్టం లేదు..ఊరికే రాశానంతే..ఇక అది వదిలేశా..

తర్వాత TET..మా D.Ed చదివిన వారు అందరూ ఖచ్చితంగా ఇది రాస్తారు..అచ్చం ఇలాగే కేంద్రీయ విద్యాలయాలు, సైనిక్ స్కూళ్ళు, నవోదయాలు లో టీచర్ గా చేరాలంటే దేశస్థాయిలో CTET పరీక్ష జరుగుతుంది..అది రాద్దామని పుస్తకాలు కూడా తెప్పించుకున్నా అమెజాన్ నుండి..నా దురదృష్టమేమిటంటే నా D.Ed పూర్తి అయినప్పటి నుండి ఒక్కసారి కూడా ఆ పరీక్ష ప్రకటన వెలువడలేదు...ఇదిగో ఇపుడు సుప్రీం కోర్టు తక్షణమే CTET ను నిర్వహించాలని అదేశించింది. ఏమవుతుందో చూడాలి మరి..
   2014 లో లాగ ఇకపై TET ఉండదు..కేవలం DSC ఒక పరీక్షే అని నా లాంటి వారందరూ దానికే తయారవుతుంటే, 2017 డిసెంబరులో (అపుడు నేను అవనిగడ్డలోనే ఉన్నా) ప్రభుత్వం ఈసారి TET తప్పనిసరిగా ఉంటుంది అని ప్రకటించింది..తర్వాత అవనిగడ్డ నుండి వచ్చేసి నేను ఇంటి దగ్గరే TET కి ప్రిపేర్ అయ్యాను..అందులో మంచి మార్కులే వచ్చాయి...నేను హ్యాపీ...ఇక DSC కి ప్రెపేర్ కావొచ్చనుకుంటే మళ్ళీ జూన్ లో TET అంట.

ఇంకో అసలైన విషయం చెప్పాలి..
2017 కొత్త సంవత్సర కానుకగా స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ 10 వ తరగతి అర్హతతో గ్రూప్ సి పోస్టులైన మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి ప్రకటన విడుదల చేసింది..అప్పటికి అది ఆఫ్ లైన్ పరీక్షే..మే నెలలో జరిగింది..అపుడు నా డిగ్రీ మొదటి సంవత్సర పరీక్షల కారణంగా నేను సరిగా ఆ పరీక్షపై ఎక్కువగా దృష్టి పెట్టలేకపోయాను...నా అదృష్టమో ఏమోగానీ..ఆ ఆఫ్ లైన్ పరీక్ష రద్దయ్యింది..కారణం ఉత్తర భారతంలో పేపర్ లీక్..తర్వాత మళ్ళీ ఆన్ లైన్ ద్వారా పరీక్షను సెప్టెంబర్-అక్టోబర్ మధ్య నిర్వహించారు.. అప్పటికే నేను SSC CHSL పరీక్ష మూడు సంవత్సరాల నుండి రాస్తున్నాను. రెండు సార్లూ 100-105 మధ్యనే వచ్చాయి..ఈసారి ఎక్కువే వస్తాయి అనుకుంటున్నా..ఇలా ముందే చదివి ఉన్నందువల్ల ఇంకా రివిజన్ ఎక్కువ చేసుకోవడానికి అవకాశం దొరికింది.అప్పుడు నాకు బోలెడంత సమయం దొరికింది చదవడానికి.. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కి కోచింగ్ ముందే తీసుకున్నా..ఇంక GK, English, Reasoning మాత్రం సొంత ప్రిపరేషనే..నాకు సెంటర్ రాజమండ్రి రాజీవ్ కాలేజి వచ్చింది..బాగా రాసానన్న సంతృప్తి దొరికింది..అలా అది రాసి వెంటనే కోచింగ్ కి అవనిగడ్డ వెళ్ళిపోయా..అక్కడా డైలీ, వీక్లీ పరీక్షల్లో మంచి మార్కులు వస్తుండేవి.


ఆ మల్టీటాస్కింగ్ స్టాఫ్ పరీక్ష ఫలితాలు 2018 సంక్రాంతి రోజైన జనవరి 15న వెలువడ్డాయి..అదీ మార్కులు కాదు..టయర్ 2 కి ఎంపికైన వారి లిస్ట్ పెట్టారు.అందులో నా పేరు ఉంది..వెంటనే అంటే జనవరి 28 నే టయర్ 2 పరీక్ష..అది కూడా విశాఖపట్నం కేంద్రం...ఇది వ్రాత పరీక్ష 50 మార్కులకి ఒక వ్యాసం గానీ లేఖ గానీ రాయాలి...సాధారణంగా SSC వ్రాత పరీక్షలు ఇంగ్లీషు లేక హిందీ భాషల్లో మాత్రమే రాయలి(CHSL&CGL)..ఇందులో వెసులుబాటు ఏంటంటే రాజ్యాంగం గుర్తించిన ఏ భాషలోనైనా వ్రాయవచ్చు...నేను ఇంగ్లీషులో రాసి రిస్కు తీసుకోవడం ఎందుకని తెలుగు లోనే లేఖ రాసొచ్చా. CHSL మరియు CGL లో కూడా ఇలాంటి ఏర్పాటు ఉంటే చాలా బాగుంటుంది..హిందీ మాతృభాష కలవారికే ఇందులో మంచి అవకాశాలు లభిస్తున్నాయి..ఇదీ ఒక రకంగా మనకు జరుగుతున్న అన్యాయం. ఇది అర్హత పరీక్ష మాత్రమే. ఈ మార్కులు మెరిట్ లిస్ట్ లో కలపరు..ఇందులో అర్హత మార్కులు 17 సాధిస్తే చాలని పరీక్ష అయ్యాక నిర్ణయించారు..టయర్ 2 ఫలితాలు రాకుండానే ఫిబ్రవరి చివరి వారంలో మళ్ళీ కటాఫ్ మార్కులు పెంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి రమ్మని వెబ్ సైట్ లో పెట్టారు...ఆ లిస్ట్ లో కూడా నా పేరు ఉంది..ఇంతకీ తమాషా ఏంటంటే టయర్ 1 లో నాకెన్ని మార్కులు వచ్చాయో ఇంకా తెలీదు..DV కి SSC సదరన్ రీజన్ (AP, TS, TN) చెన్నై కి వెళ్ళాలి...తర్వాత మొదలయ్యాయి అసలు కష్టాలు..
(సశేషం)

12 కామెంట్‌లు:

  1. తరవాతి భాగం కూడా చదివి వ్యాఖ్యానిస్తా. ఇంత వరకూ లేఖనం బాగుంది.

    రిప్లయితొలగించండి
  2. మీ ఉద్యోగ ప్రయాణ విశేషాలు బావున్నాయి, మోహనా! తరవాతి మజిలీ కబుర్లు చెప్పండి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తప్పకుండా చెప్తాను లలిత గారూ!..నా ప్రయాణం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు...

      తొలగించండి
  3. Good narration....u speak about importance of own language in 2nd paper...i.e a good point, I like it...bcz North Indians are getting benefitted bcz of Hindi....we need to give our voice about dis...

    రిప్లయితొలగించండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...