ఉద్యోగం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఉద్యోగం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, జూన్ 2020, ఆదివారం

లాక్ డౌన్ లో చెన్నై కి ...🚆

ఆదివారం, జూన్ 21, 2020 0 Comments


జూన్ వచ్చేస్తుంది అంటే మళ్లీ భయం మొదలైంది. ఎందుకంటే 20 న వేసవి సెలవుల అనంతరం స్కూలు తెరిచే రోజు. మామూలు రోజులు అయితే భయమే లేదు..కానీ ఇప్పటి పరిస్థితి వేరు కదా..స్కూలు తెరవడం అంటే పిల్లలు ఎలాగూ రారు. మరి టీచర్స్ స్టేషన్ లో అందుబాటులో ఉండాలి గా. మా స్కూలు నుండి ఇలా పది మందిమి స్వ రాష్ట్రాలకి వెళ్ళాము. మళ్లీ ఇప్పుడు చెన్నై వెళ్ళాలంటే బోలెడు భయాలు. అది ఫుల్ రెడ్ జోన్. బస్సులు ఎలాగూ లేవు..trains ఉన్నాయో లేదో తెలీదు.. quarantine కి గానీ పంపారంటే అదో తలపోటు. హాస్టల్ తీయరు..వెళ్తే అక్కడ ఎక్కడ ఉండాలి..?  ఓ వైపు తమిళనాడు epass తప్పనిసరి చేసింది. ఇప్పుడు మళ్లీ అప్లై చేస్తే వస్తదో రాదో అని..ఇలా అన్నమాట..!! 


సమ్మర్ వెకేషన్ ఏమైనా Corona గురించి పొడిగిస్తారేమో అన్న చిన్న ఆశతో 19 కి trains వెతికా… ఒకే ఒక ట్రైన్ ఉంది.  న్యూ ఢిల్లీ - చెన్నై రాజధాని ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మనకి విజయవాడ మాత్రమే halt ఉంది. దానికి డాడీ కి నాకు tickets బుక్ చేశాను. ఆ టికెట్ pnr నంబర్ తో epass అప్లై చేసా. ఆ రాత్రే pass approve అయిపోయింది. ఒక టెన్షన్ తీరింది. ఇదంతా జూన్ 3 నాటి కథ. తర్వాత పని ఇల్లు వెతుక్కోవడం. సడన్ గా నా అమోఘమైన బుర్రకి ఒక సంగతి గుర్తుకు వచ్చింది. పోయిన జనవరి లో మా స్కూల్ టీచర్ ఒకావిడ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఆ ఇల్లు అప్పటి నుండి ఖాళీ గానే ఉంటుంది. ఆవిడ ను అడిగి ఆ ఓనర్ గారి ఫోన్ నంబర్ తీసుకున్నాము. ఫోన్ చేసి ఇలా మాకు ఆ ఇల్లు కావాలి అంటే సరే అన్నారు. హమ్మయ్య...అన్నీ సెట్ ….అనుకునే లోపు అంతలోనే చెన్నై లో 19 నుండి 30 దాకా లాక్ డౌన్ అన్నారు.🥴😵


మా అందరి బాధ ఏంటంటే జరిగేవి ఆన్లైన్ క్లాసులే..అయినప్పుడు ఇంటి దగ్గర ఉండి చేస్తే ఏంటి అని. ఎవరికీ ఇల్లు వదిలి వెళ్ళడం సుతారమూ ఇష్టం లేదు (నాక్కూడా😒) అందుకే 19 దాకా ఎదురు చూసా...kvs hq నుండి ఏమైనా దానికి సంబంధించిన letter/circular వస్తుందేమో అని…. ఊహూ...ఏం రాలేదు. ఇక ఇప్పుడు అయితే టికెట్ .. పాస్ ...ఇల్లు ఉన్నాయి..ఇంకా ఆలస్యం చేస్తే మళ్లీ ఉంటాయో లేదో అని ఇక వెళ్ళడానికే నిర్ణయించుకున్నాం. 


కరెంటు కుక్కరు..కరెంటు పొయ్యి...ఇంకా కొన్ని ముఖ్యమైన పప్పులు ఉప్పులు లాంటివి సర్దాం. 19 పొద్దునే మా పాలకొల్లు నుండి భీమవరం ఆటో లో వెళ్ళాం. అక్కడి నుండి విజయవాడ కి బస్ దొరికింది. Temperature check చేసి ఎక్కించారు. విజయవాడ వెళ్లేసరికి సుమారు 11 అయింది. మా ట్రైన్ 2:40 కి. విజయవాడ రైల్వే స్టేషన్లో టికెట్ ఉంటేనే లోపలికి పంపుతున్నారు. అది కూడా ట్రైన్ వచ్చే రెండు గంటల ముందు. మాకు కొంచెం ముందుగానే పంపారు. లోనికి వెళ్లే ముందు లగేజ్ మీద స్ప్రే కొట్టారు. మెటల్ డిటెక్టర్ లాంటి థర్మల్ స్కానర్ ఉంది. అందులోంచి నడిచి లోపలికి వెళ్ళాలి...అసలు ఎలాంటి విజయవాడ రైల్వే స్టేషన్ ఎలా అయిపోయిందో..ఎప్పుడూ జనంతో ...వచ్చే పోయే రైళ్ళతో కళకళ లాడుతూ ఉండేది కాస్తా నిర్మానుష్యంగా ఉంది. 


ట్రైన్ దిగాక ఇంటికి తీసుకు వెళ్ళడానికి prepaid taxi లకి అనుమతి ఉందని తెలిసింది. అప్పుడు నన్ను చెన్నై నుండి తీసుకొచ్చిన డ్రైవర్ కి ఫోన్ చేస్తే స్టేషన్ కి వస్తా అన్నాడు. అతని పేరు మీద pass కూడా జెనరేట్ చేసాము. అలా ట్రైన్ వచ్చే దాకా వెయిటింగ్ హాల్ లో కూర్చున్నాం. ట్రైన్ కొంచెం ముందే వచ్చేసింది. నాకు డాడీ కి వేరు వేరు బోగీలు వచ్చాయి. కానీ ఇద్దరం ఒకే చోట కూర్చున్నాం. ట్రైన్ అంతా ఖాళీ నే. చాలా తక్కువ మంది ఉన్నారు. TC వస్తాడేమో అనుకుంటే రాలేదు. ట్రైన్ లో చాలా బోర్ కొట్టేసింది. 


చెన్నై సెంట్రల్ లో దిగేసరికి రాత్రి 8:30 అయింది. దిగిన వాళ్ళందర్నీ వరుస లో నిల్చో బెట్టి లగేజ్ మీద స్ప్రే చేశారు. అందరికీ home quarantine stamps ఎడమ చేతి మీద వేశారు (అది అప్పుడే వెలిసిపోయింది😑) ముందుగా టాక్సీ బుక్ చేసుకున్న వారిని వేరే వైపు నుండి temperature check చేసి పంపేశారు. 😊


నాకు ఆశ్చర్యం అనిపించినది ఏంటంటే ...epass గురించి అంత టెన్షన్ పడ్డాము. అసలు అది చూడనేలేదు...🤕 ఇంకా ... స్టాంప్స్ అయితే వేశారు ..వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు..ఎక్కడికి వెళ్తున్నారు అవేం వివరాలు తీసుకోలేదు.. ఏంటో మరి..🤷

ఇక ఇంటికి వచ్చేసి స్నానాలు కానిచ్చి.. ఓట్ మీల్ చేసుకుని తినేసి పడుకున్నాము. మా పది మందిలో ముగ్గురం మాత్రమే చెన్నై నుండి తిరిగి వచ్చాం..మిగిలిన వారి సంగతి ఏమో మరి..20 న mail ద్వారా జాయినింగ్ report ...station చేరుకున్నట్లు ఆధారాలు గా ట్రైన్ టికెట్, epass కాపీ తో సహా పంపేసాను...హ్మ్…ప్రస్తుతానికి అంతే ఇక..👻

2, జూన్ 2020, మంగళవారం

కరోనా కాలం లో నేను -2

మంగళవారం, జూన్ 02, 2020 2 Comments

Lockdown 1.0 :-


  • ఆ మర్నాడు అందరూ వాట్సప్ status లు పెట్టేదాక తెలియలేదు ఉగాది అని... హ్మ్..

  • స్కూలు వాళ్ళు మాకో పని అప్పగించారు. ఒక్కో టీచరు బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు తయారు చేయాలని. నాకేమో 4 వ తరగతి ఇంగ్లీషు, రేణు కేమో 4 వ తరగతి హిందీ వచ్చాయి. ఇద్దరం ఆ పనిని కొన్ని రోజుల్లోనే చేసేసాము.

  • మొదట్లో రోజూ చపాతీ తినడం భయం వేసేది. ఆహార అలవాట్లు మారటం వల్ల ఏమైనా అవుతుందేమో అని.. కానీ త్వరగానే అలవాటు పడిపోయాను.

  • మధ్య మధ్య లో పక్కింటి తెలుగు ఆంటీ.. రవ్వ కేసరి, గోంగూర పచ్చడి, దోశలు, ఆమ్లెట్, మామిడికాయ పులిహోర లాంటివి ఇస్తుండే వారు.. అప్పుడు అమ్మ గుర్తు వచ్చేది😞

  • అప్పట్లో ఉత్తినే కన్నీళ్లు వచ్చేసేవి. చాలా డెప్రెషన్ లో ఉండేదాన్ని. మా స్కూల్లో ఒక సీనియర్ టీచర్ ఒకరోజు మెసేజ్ చేశారు.." ఏం మోహనా!! ఎలా ఉన్నావ్ ఎక్కడ ఉన్నావ్?" అని. ఆ మాత్రానికే చాలా సంతోష పడ్డాను. 

  • నా ఫోన్ కి అసలు సిగ్నల్ యే ఉండేది కాదు. వాట్సప్ తప్ప ఇంకేం సరిగ్గా వచ్చేవి కాదు మరి. ఒక్క ఐదు ని|| వీడియోను ...అదీ 240p లో చూడటానికి 20 ని|| పట్టేది. అందుకే YouTube వాడటమే మానేశాను.

  • ఒక రోజు రేణు వాళ్ళమ్మ గారు కాటుక తయారు చేశారు. దూది లో వేపాకు, వాము పెట్టీ దానికి ఆవ నూనె పట్టించి దాన్ని మండించారు. ఆ పొగకి వచ్చే మసిని పోగేయటమే...బాగుంది భలేగా..!!


Lockdown 2.0 :-


  • TV లో lockdown పొడిగింపు మే 3 వరకు అనేసరికి ఇంచుమించు ఏడుపు ముఖమే అయింది. May 2 నుండి మాకు వేసవి సెలవులు. ఇంటికి వెళ్ళడానికి 2 న బయల్దేరే లా టికెట్ చేసుకున్నాను ఎప్పుడో! పైగా వేసవి కాలం కదాని 2AC తీసుకున్నా. ఇప్పుడది గోవిందా!!🙄 అసలు ఇంటికి వెళ్ళడం ను ఊహించ లేక పోయే దాన్ని. 

  • మా స్కూలు పిల్లలకు ఆన్లైన్ క్లాసులు మొదలు పెట్టాం. అసలైతే ఏప్రిల్ 1 నుండి 2020-21 మొదలు అవ్వాలి. సగం నెల వృధా అయిపోయింది. వాట్సప్ ద్వారా సెక్షన్ల వారీ గ్రూపులు క్రియేట్ చేసి, చిన్న చిన్న వీడియో లు , వర్క్ షీట్లు లాంటివి పంపే వాళ్ళం. ఇదంతా వన్ వే నే...అటు నుండి స్పందన తెల్సుకునే వీలు లేదు. 

  • ఒక రోజు సరదాగా ఇంటికి దగ్గర్లో నే ఉన్న ఇంకో మేడం ఇంటికి వెళ్ళాం నేను, రేణు. ఆ ఇంటి గలావిడ మా వంక అదోలా చూస్తూ "ఇప్పుడు రాకూడదు" అన్నది. ఇంత దారుణంగా తయారు అయ్యాయా పరిస్థితులు అని అనిపించింది అప్పుడు.

  • మధ్యలో ఒకరోజు హాస్టల్ వార్డెన్ తనకు తానుగా ఫోన్ చేసి మే 1 నుండి తెరుస్తాను.. వచ్చేసెయ్ అంది. లాక్ డౌన్ పొడిగించినా పర్లేదు నువ్వొచ్చెయ్ అంది. చాలా ఆనందమేసింది. కానీ తర్వాత ఫోన్ చేసి మళ్లీ అడిగితే ...ఆ వీధి లోకి ఎవర్నీ రానివ్వకుండా వీధి మొదట్లో అడ్డంగా పెట్టిన బ్యారికేడ్ల ఫోటోలు పంపింది.🤕


Lockdown 3.0 :-


  • లాక్ డౌన్ లో చిక్కుకు పోయిన వాళ్ళకి ఇంటికి వెళ్ళే అవకాశం ఉందని ప్రభుత్వం చెప్పడం తో దానికి సంబధించిన email address లకు emails పంపాను. Stranded citizen కింద ఇంకా మన స్పందన సైట్ లోనూ , తమిళనాడు కు సంబంధించిన సైట్ లోనూ రిజిస్టర్ కూడా చేశాను. ఏమైనా రైళ్లు, బస్సులు లాంటివి వేస్తారేమో అని పిచ్చి ఆశ...🥺

  • ఎంత కాలం ఇలా ఒకరింట్లో ఉంటాం...అని ధైర్యం చేసి మా హాస్టల్ దగ్గర్లోని ఇంకో కేవీ లో పని చేసే తెలుగు అమ్మాయి గౌతమి ఇంటికి వెళ్ళిపోయాను. ఆరోజు సైకిల్ లో గాలి లేకపోయినా కష్టపడి మెల్లగా వచ్చేసాను. గాలి కొట్టిద్దాం అంటే ఏం షాపులు లేవాయే. మధ్యలో ఎక్కడైనా ఆపుతారేమో అని చాలా భయపడ్డాను..కానీ ఏం కాలేదు.

  • ఆ నాలుగు జతల బట్టలతో నే గడపటం చాలా చిరాగ్గా అనిపించేది. ఇలా ఎంత కాలమో అర్ధమయ్యేది కాదు. చివరికి ఇంటికి వెళ్ళలేక పోయినా పర్వాలేదు.. హాస్టల్ తీస్తే చాలు అనుకునేదాన్ని. 

  • కార్ అద్దెకి తీసుకుని TN epass కి అప్లై చేసుకోవచ్చు అని తెలిసింది. నేనేమో ముందు జంకాను. ఒక్కదాన్నే కార్లో ఎలా వెళ్ళడం అని. గౌతమి వాళ్ళు విజయనగరం వెళ్ళాలి. పోనీ వాళ్ళు వెళ్ళినా నేను ఒక్కదాన్నే ఇక్కడే ఉండొచ్చు లే అనుకున్నాను.

  • మా తెలుగు కేవీ టీచర్స్ వాట్సప్ గ్రూప్ ద్వారా ఇద్దరు కన్యాకుమారి నుండి తెలంగాణా వెళ్తున్నారు అని తెలిశాక నమ్మకం కుదిరింది. వెళ్ళాలనే కోరిక పెరిగింది. దగ్గర్లోని ఒక ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడి బండి నంబర్ తీసుకుని epass కి అప్లై చేశాం. వాళ్ళేమో విజయనగరం కి, నేనేమో పాలకొల్లు కి. ఆ మర్నాడు లేచేసరికి పాస్ వచ్చినట్టు sms వచ్చింది. ఇక నా ఆనందానికి అవధులు లేవు.🤩

  • బయల్దేరే ముందు రోజు హాస్టల్ కి వెళ్లి నా బట్టలు అవీ సర్దేసుకుని తెచ్చేసుకున్నా. 49 రోజులు సెలవులు కదా .(అప్పటికే వారం రోజులు వృధా) కారే కదా అని ఎక్కువగా నే luggage తయారు చేశా.

  • లాక్ డౌన్ లో చెన్నై లో ఉన్నంత కాలం నా స్నేహితులైన జలుబు, జ్వరం రాలేదు. చాలా భయ పడేదాన్ని .. ఎక్కడేం తేడా చేసి ఏం పట్టుకుంటుందో అని..కరోనా అంటే అంత భయం ను సృష్టించారు మరి..!


ఎన్నాళ్ళో వేచిన ఉదయం : మే 8


డ్రైవర్లను పొద్దునే 4 కే రమ్మన్నాము. ఫోన్ కి వచ్చిన pass print తీసి కార్ ముందు అద్దం మీద అంటించాము. నేను మాస్క్..ఇంకా దాని పైన ముఖం అంతా స్కార్ఫ్ తో కప్పేసాను. రెండు నీళ్ల సీసాలు, రెండు డ్రింక్ సీసాలు, బిస్కెట్స్ ప్యాకెట్లు ఇవన్నీ ముందే సర్ది పెట్టుకున్నా….కానీ ఏం తినలేదు ఇంటికి వెళ్ళేదాకా...ఆరార గా ఆ డ్రింక్..నీళ్ళు మాత్రమే తాగాను. అసలు ఇలా ఇంటికి వెళ్ళ గల్గుతాను అని కల్లో కూడా ఊహించలేదు. 

దారిలో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయో! ప్రతీసారి దిగి అక్కడికి వెళ్ళడం...పేరు..ఫోన్ నంబర్.. బండి నంబర్..ఎక్కడి నుండి ఎక్కడికి ఇవి రాసుకోవడం...ఇంకా నెల్లూరు లో సరిహద్దు మొదట్లో నే థర్మల్ స్క్రీనింగ్ చేశారు. దారంతా లొకేషన్ ఆన్ లోనే పెట్టాను. డాడీ నన్ను ట్రాక్ చేస్తుండేవారు. అలా పొద్దున 5 కి బయల్దేరితే సాయంత్రం 5 అయింది వచ్చేసరికి.. అలా..సుమారు నాలుగు నెలల తర్వాత ఇంటి ముఖం చూసే అదృష్టం దక్కింది...🏠👨‍👩‍👧‍👧


21, మే 2020, గురువారం

కరోనా కాలంలో నేను -1

గురువారం, మే 21, 2020 0 Comments


18 మార్చి 2020 నుండి  మొదలుపెడదాం.....

ఆరోజు పదవ తరగతి సి బి ఎస్ ఈ సోషల్ పరీక్ష. నాకు ఇన్విజిలేషన్ రావడం రెండోసారి. కరోనా వ్యాధి నేపధ్యంలో సి బి ఎస్ ఈ పరీక్షలకి సంబంధించి కొన్ని మార్పులు చేసింది . అందరూ మాస్కులు వేసుకోవాలి శానిటైజర్ నీళ్ల సీసా లాంటివి తెచ్చుకోవచ్చు.. గదిలో ఇద్దరి మధ్య ఒక మీటరు దూరం ఉండాలి ఇలా అన్నమాట.. అప్పటివరకు ఒక గదిలో 25 మంది విద్యార్థులు, ఇద్దరు ఇన్విజిలేటర్లు (అసిస్టెంట్ సూపరింటెండెంట్) తో పరీక్షలు జరిగాయి. కానీ ఇప్పుడు ఒక గదిలో 12మంది విద్యార్థులు ఒక ఇన్విజిలేటర్ మాత్రమే ఉంటారు. దానికోసం ప్రైమరీ తరగతి గదులను కూడా వాడాల్సి వచ్చింది. కంట్రోల్ రూమ్ కి కొంచెం ముందుగానే వెళ్ళాం. తర్వాత మాకు కేటాయించిన రూములోకి వెళ్ళిపోయాం. నా రూమ్ లో అందరూ అమ్మాయిలే ఉన్నారు. వాళ్ళందర్నీ  చూస్తే నా పదవ తరగతి రోజులు గుర్తుకు వచ్చాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే అప్పుడు ఏ ఒక్కరూ మాస్క్ వేసుకోవడం కానీ ముఖాన్ని కప్పుకోవడం కానీ చేయలేదు. నేను కూడా. నిజం చెప్పాలంటే అప్పట్లో మాస్కులు శానిటైజర్ లు ఎక్కడా దొరికేవి కాదు.. స్టాకు ఖాళీ అయిపోయేది.🥺

ఆ తర్వాతి రోజు పొద్దున్నే ఫ్లాష్ న్యూస్ ఏంటంటే మార్చి 31 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను సి బి ఎస్ ఈ వాయిదా వేసిందని. అలాగే 31 వరకు అన్ని స్కూళ్లను మూసేయాలని కె వి ఎస్ హెచ్ క్యూ నుండి  ఆర్డర్ వచ్చింది. మార్చి 20న మాకు ఒక సర్క్యులర్ వచ్చింది. ప్రైమరీ స్టాఫ్ కి మొదట మూడు రోజులు సెలవులు ఆ తర్వాత సెకండరీ స్టాఫ్ కి సెలవులు. వాళ్లకి సెలవులు అయినప్పుడు మేం వెళ్ళాలి అన్నమాట. ఆ ఆదివారమే ప్రధాని జనతా కర్ఫ్యూ ప్రకటించారు (మార్చి 22).



సోమవారం సాయంత్రం హాస్టల్ వార్డెన్ వచ్చి చెప్పింది .."మంగళవారం అర్ధరాత్రి నుండి 31 దాకా తమిళనాడులో కర్ఫ్యూ అంట. హాస్టల్ మూస్తున్నాం" అని. నాకేం చెయ్యాలో తోచలేదు. ఇలాంటి పరిస్థితి వస్తుంది అని అనుకున్నా కానీ మరీ మొత్తానికి మూస్తుంది అని అనుకోలేదు.🤯😵😫 మా రూమ్ లో లో అప్పటికి ఇద్దరమే ఉన్నాం. ఆ అమ్మాయి ఆ రాత్రికే ఏదో కార్ పట్టుకొని వాళ్ల ఊరు trichy వెళ్ళిపోయింది. నేను ఒక్కదాన్నే మిగిలాను. ఇక చేసేది ఏమి లేక రేణు ని అడిగా... కొన్ని రోజులు మీ ఇంట్లో ఉంటాను అని.. తన ఒప్పుకుంది. 

మంగళవారం హాస్టల్లో నేనొక్కదాన్నే ఉన్నాను. అందరూ ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. ఆ రోజున చాలా ఒంటరితనం అనిపించి ఏడ్చేశా🤧. సాయంత్రం 3:30 కి నాలుగు జతల బట్టలు ఇంకా కొన్ని నిత్య అవసరం అనిపించినవి బ్యాక్ పాక్లో సర్దుకొని నా సైకిల్ మీద రేణు వాళ్ల ఇంటికి బయలుదేరాను. అప్పటిదాకా హాస్టల్ గది నాలుగు గోడల కి పరిమితమైన నాకు మనుషుల్ని చూడగానే కొంచెం బాగా అనిపించింది. ఆ రోజే ఇరవై ఒక్క రోజుల లాక్ డౌన్ ప్రకటన చేశారు. ఆ రాత్రి సరిగా నిద్ర పట్టలేదు. కొత్త ప్రదేశం ఇంకా 21 రోజులు... 31 దాకానే అనుకున్న.. అన్ని రోజులు ఇప్పుడు ఇక్కడ ఎలా ఉండటం అని… వీళ్ళకి ఇబ్బంది అవుతానేమో అని.. ఇవే ఆలోచనలు బుర్రనిండా..🙄😣

తర్వాత జరిగింది తర్వాతి టపా లో....🥴


8, ఏప్రిల్ 2020, బుధవారం

నా ఉద్యోగ ప్రయాణం - 6 (My preparation in a nutshell)

బుధవారం, ఏప్రిల్ 08, 2020 4 Comments



చాలా నెలల తర్వాత మళ్లీ ఈ 6 వ భాగంతో మీ ముందుకి వచ్చాను...10 వ తరగతి దాకా మున్సిపల్ స్కూలు..పక్కా తెలుగు మాధ్యమం. తర్వాత RGUKT నూజివీడు లో సీటు..అక్కడ రెండేళ్లు PUC అయ్యాక..Engineering is not my cup of tea అని అర్థం అయింది. DIETCET రూపంలో నాకు దారి దొరికింది. అందులో వచ్చిన మంచి రేంక్ సాకు చూపించి బయటికి వచ్చేసా. నిజం చెప్పాలంటే ఈ కోర్సంటే ఏదో ఆసక్తి ఉందని కాదు కానీ... అలా అయిపోయింది అప్పట్లో. రెండేళ్లు D.Ed తెలియకుండానే పూర్తి చేశాం. D.Ed చదువుతున్న సమయంలో నే రెండు మూడు పరీక్షలు రాశాను. Postman..FCI Watchman ఇంకా SSC CHSL ఇలా అన్నమాట. అవేమీ రాలేదు అనుకోండి. D.Ed అయ్యాక పూర్తి స్థాయిలో ప్రిపేర్ కావడం మొదలు పెట్టాను. Maths and reasoning కి మా ఊళ్ళో నే కోచింగ్ కి వెళ్ళే దాన్ని. మిగిలినవి సొంత ప్రిపరేషన్ యే…!!!

చాలా మంది నన్ను అడుగుతుంటారు. పరీక్షలకి ఎలా ప్రిపేర్ అయ్యావు..ఎలా చదివావు అని..కానీ నేనేం ఎలాంటి స్ట్రాటజీ లు ఫోలో కాలేదు...గంటలు లెక్క పెట్టుకుని చదవలేదు. D.Ed అయ్యాక MTS జాబ్ వచ్చే దాకా ఇంట్లోనే ఉండేదాన్ని. అలా చదువుకోవడానికి బోలెడు సమయం చిక్కింది నాకు. కానీ తక్కువ సమయం లో ఎక్కువ చదివింది మాత్రం MTS జాబ్ లో చేరాక 2018 అక్టోబర్ నుండి 2018 డిసెంబర్ దాకా...అదీ KVS PRT పరీక్ష కోసం. ఏ చిన్న ఖాళీ దొరికినా ఆఫీసు లో అయినా సరే..చదివే దాన్ని. దాని కోసం నా ఫోన్ ని అనుకూలంగా మార్చేసా.


💜 మేథ్స్ కోసం నేను తీసుకున్న కోచింగ్ చాలా బాగా ఉపయోగపడింది. మేథ్స్ పట్ల నా దృక్పధాన్ని మార్చింది. నేనూ లెక్కలు చేయగలను అన్న నమ్మకం కలిగింది. Sir చెప్పిన shortcuts బాగా గుర్తు పెట్టుకున్న. ఇంకా Apttrix e classes YouTube ఛానెల్లో RaMo sir చెప్పే పాఠాలు చూస్తూ నోట్స్ తయారు చేసుకున్నా. కష్టమైన లెక్కల్ని సైతం చాలా సులభంగా చెప్పడం బాగుండేది. 

🧡 ఇక GS విషయానికొస్తే అది నాకు ఇష్టమైన టాపిక్. రోజూ ఆరు నూరైనా దిన పత్రిక చదవాల్సిందే. పుస్తకాల్లో...Lucent GK చాలా మంచిదని చెప్పొచ్చు. ఇంకా మనోరమ ఇయర్ బుక్..ఇలా...ఈ సబ్జెక్ట్ తో తలపోటు ఏంటంటే చదివినవి చదివినట్టు మర్చిపోతుంటాము. అందుకే ఎప్పటికప్పుడు పునశ్చరణ అత్యవసరం. కరెంట్ అఫైర్స్ కోసం Gradeup app లో monthly capsules pdf రూపంలో వచ్చేవి. అవి download చేసుకుని వీలు ఉన్నప్పుడల్లా చదివేదాన్ని. ఇంకా Oliveboard, Testbook వీటి fb పేజీలని ఫాలో అయితే వాటిల్లో వాళ్ళు share చేసే పిక్చర్స్ చాలా బాగుంటాయి. Ready Reckoner లాగా పనికొస్తాయి. అలాంటివి నా ఫోన్లో వందల ఫోటోలు ఉండేవి..ఇంకా...Gradeup app చాలా అంటే చాలా ఎక్కువగా వాడేదాన్ని. డైలీ quizzes చేసేదాన్ని. Mocktest ప్యాకేజ్ కూడా కొన్నాను ctet & kvs కి. 


💛 English కి వచ్చే సరికి ఎక్కువ exercises చేయటమే. ఒక్క పుస్తకం అంటూ ఏం లేదు. నాకు నచ్చిన పుస్తకం మాత్రం Word power made easy by Norman Lewis.. ఇంకా A mirror of common errors by Dr. Ashok kumar Singh కూడా బాగుంటుంది. 

💚 తెలుగు...APTET మరియు CTET కోసం చదివాను. వ్యాకరణం అయితే అవనిగడ్డ కోచింగ్ సమయంలో అక్కడ ఒక sir చెప్పిన నోట్స్ మాత్రమే follow అయ్యాను. ఈ కింద లింకుల నుండి కావాలంటే download చేసుకోవచ్చు. 
హిందీ ఏమో KVS పరీక్ష కోసమే చదివాను. నెట్ లో శోధించగా ఒక అందమైన >నోట్స్ pdf దొరికింది. చదువుకోవడానికి చాలా బాగా అనిపించింది. 

💙చివరిగా ఉపాధ్యాయ పరీక్షలకి ప్రత్యేకమైనవి…."Child development and pedagogy" & "teaching methods" వీటి కోసం కొన్ని YouTube చాన్నెళ్లను చూసేదాన్ని. "Let's learn by Himanshi Singh" అందులో ముఖ్యమైనది. ఇంకా mentors36… back to school కూడా ఉన్నాయి. చదవటం కంటే ఈ వీడియో లు ఎక్కువ చూసేదాన్ని. కొంచెం సమయం లో ఎక్కువ నేర్చుకోవచ్చు కదా అని. 

చివరిగా ఒక్కటే చెప్తాను...30% మనం పరీక్ష కోసం చదివేది అయితే మిగిలిన 70% పాత ప్రశ్నా పత్రాలు, నమూనా పరీక్షలు రాయటం మీదే మన విజయం ఆధార పడుతుంది. 👍👍👍


13, జనవరి 2020, సోమవారం

2019 లో ఏమైందంటే....

సోమవారం, జనవరి 13, 2020 13 Comments


మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు...🤝👍2019 ...నా జీవితంలో ప్రత్యేకమైన సంవత్సరం🤗🤩. మర్చిపోలేని సంఘటన ఏమిటంటే కేంద్రీయ విద్యాలయ లో టీచరుగా👩‍🏫 ఉద్యోగం రావడం...అదీ ఒక ఉద్యోగం లో చేరిన కొద్ది నెలలకే..ఇంతకంటే గొప్ప విషయం నాకేం ఉంటుంది. నెలల వారీగా జరిగిన కథేంటో చెప్తా మరి...సరేనా…!!!😉

జనవరి: మొదటి రోజును నల్ల డ్రెస్సు తో మొదలు పెట్టాను. మా అమ్మకి తెలీదు కానీ...తెలిస్తే "కొత్త సంవత్సరం మొదటి రోజున ఆ రంగు ఎవరైనా వేస్తారెంటే..నీకు నేను చెప్పలేను..మతానికి ఎదురు మంచానికి అడ్డం" అని పురాణం విప్పుతుంది😁🤓...మనం అవన్నీ నమ్మం కాబట్టి లైట్ తీసుకుంటాం. KVS PRT పరీక్ష 'key' చూసుకుంటే...ఆశలు పెట్టుకునే లా మార్కులు వచ్చాయి. ఈ లోపు నా పని చూసుకుంటూ ఇంటర్వ్యూ కి తయారయ్యే దాన్ని. చిన్నా తో గోల్కొండ వెళ్ళటం మర్చిపోలేని అనుభూతి 😊 మేమిద్దరమే ఉంటే ఇంకెవరూ అక్కర్లేదు👭 ఇక..నెలాఖరున ఇంటర్వ్యూ selected list వచ్చింది. అందులో నా పేరు చూసుకుని ఎగిరి గంతేశా. ఇక ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ముమ్మరం చేశాను. ఒక్క నెల మాత్రమే టైముంది మరి. మధ్యలో ఈ NOC గోల ఒకటి..అప్పటికే ఉద్యోగంలో ఉండటంతో...ఆ తర్వాత మళ్లీ PRT పోస్టులను నోటిఫికేషన్ లో ఇచ్చినట్టు కాక 5300 నుండి 3000 కి తగ్గించేయటం తో ఒక్కసారిగా నిరాశలో కి వెళ్ళిపోయాను. పోటీ ఇప్పుడు ఇంకా పెరిగింది గా మరి. గుడ్డిలో మెల్ల ఏంటంటే ఇంటర్వ్యూ కోసం ఏ ఢిల్లీ కో వెళ్ళాలేమో అని డబ్బులు పోగేసుకున్నా...కానీ ఎంచక్కా హైదరాబాదే వచ్చింది పెద్ద కష్టం లేకుండా..😋

ఫిబ్రవరి: ఈ నెల మొత్తం ఇంటర్వ్యూ..ఇంటర్వ్యూ..ఇంటర్వ్యూ...ఒక మూడు రోజులు సెలవులు పెట్టీ ఇంట్లో ప్రిపేరయ్యా. అక్కడ సరిగ్గా సాగటం లేదని. ఇక ఇంటర్వ్యూ రోజు..బాగుంది అని చెప్పలేను..బాగోలేదు అని కూడా చెప్పలేను🤷 ఎంతైనా మొదటి ఇంటర్వ్యూ కదా..60 కి ఒక 40 మార్కులు వస్తే చాలు అనుకున్నా..చివరికి అలాగే వచ్చాయి లే..😉 అది వేరే విషయం.

మార్చి: హ్మ్...పెద్ద విషయం ఏంటంటే ctet కి ఎలా తయారవ్వాలి అని ఒక వీడియో తెలుగులో చేసి YouTube లో పెట్టాను. 2500+ వీక్షణలు వచ్చాయి ఇప్పటిదాకా😇..మా ఆఫీసు లో నిర్వహించే సాంస్కృతిక అవగాహనా కార్యక్రమంలో భాగంగా వరంగల్ కోటను సందర్శించే భాగ్యం దక్కింది. ఆ kvs ఫలితాలు గురించి ఈ రోజు కాదు రేపు..రేపు కాదు ఎల్లుండి అని డ్రామా సాగింది. నాకేమో టెన్షన్ ఒక వైపు..ఎప్పుడు వస్తాయా అని. ఎంతకీ విడుదల చేయకపోవడం తో పట్టించుకోవటం మానేశా. (ఆశ నిరాశ పాఠం లోలా)

ఏప్రిల్: 2018 సెప్టెంబరు తర్వాత ఒక కొత్త బ్లాగ్ పోస్ట్ పెట్టాను చంద్రముఖి మీద. రెండు కామెంట్లు వచ్చేసరికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది💃

మే: చాలా భయపెట్టిన సంఘటన..నా ఫోన్ మొత్తం లాక్ పడిపోయింది📴 ఏం టచ్ అయిందో తెలీదు కానీ..ఎంత ప్రయత్నించినా వల్ల కాలేదు. కొన్నాళ్ళు టాబ్ నే ఫోనుగా వాడుకోవలసి వచ్చింది. ఇంకా చిన్నాకి NIT AP లో లాబ్ టెక్నీషియన్ గా పోస్ట్ రావడం మా కుటుంబం లో ఆనందాన్ని నింపింది. మధ్య మధ్య నా result ఎప్పుడు వస్తుంది దేవుడా అని ఆలోచనలు..ఎలక్షన్ కోడ్ అదీ ఇదీ అని కారణాలు చెప్పారు..సర్లే ఇక వాళ్ళు result ఇచ్చినట్టే అనుకున్నా. క్యాలెండర్ లో పేజీలు అయితే మారుతున్నాయి కానీ నా జీవితం ఏం మారట్లేదు అనే నిరాశలో బతికేదాన్ని అప్పట్లో..😒

జూన్: ఉష్…! సైలెన్స్...పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు మరి😛

జూలై: ఎదురుచూపు కి తెరపడింది. మా KVS పరీక్ష ఫలితాలు ఇచ్చేశారు. నాకు PRT జాబ్ వచ్చేసిందోచ్. 🤩🤗 ఇప్పుడు ఇంకో సమస్య ..రాజీనామా ఎప్పుడు చేయాలి అని ..ఎందుకంటే పోస్టింగులు ఇంకా ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారో తెలీదు. ఇంకా.. resignation ఢిల్లీ లో ఆమోదం పొంది రావాలి అంటే కొంచెం టైం పడుతుంది..ఇలా అన్నమాట🤦

ఆగస్టు: కొత్త ఫోన్ LG W30 కొనటం నేను చేసిన ఒక తెలివైన పని. 🤪 9 వేలకే మంచి ఫోను వచ్చేసింది. 20 వ తారీఖున పోస్టింగ్ ఎక్కడ వచ్చిందీ తెలిసిపోయింది. Ernakulam, Bangalore, Hyderabad అన్నీ పోగా నా పేరు చెన్నై రీజన్ లో కనబడింది🧐. చాలా కంగారు పడ్డాను. నేనేంటి..చెన్నై ఏంటీ అని. కానీ తప్పదుగా. అత్త కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అన్నట్టు నాకు తమిళనాడు వచ్చినందుకు కాదు కానీ మా ఫ్రెండ్స్ ఇద్దరికీ ఆంధ్ర నే రావడం చాలా బాధ అనిపించింది😯 ప్చ్..ఇక ఇంకా 20 రోజులే టైము ఇవ్వడంతో ఆ జాబుకి రాజీనామా చేసేసా. హైదరాబాదు ని విడిచి వచ్చేసేటపుడు చివరిగా చార్మినార్ చూసాను..చాలా నచ్చింది😻

సెప్టెంబరు: ఇంకేముంటుంది….నా రాజీనామా పని మా మేడం వల్ల త్వరగా అవ్వడం, చెన్నై లో పడటం, కొత్త జాబ్, కొత్త మనుషులు, కొత్త ప్రదేశం..సర్దుబాటు సమస్యలు..వాటి మధ్య నేను.. అంతే ఇక💁👩‍🏫

అక్టోబరు: చెన్నైలో చేరాక మొదటి సారి దసరా కి ఇంటికొచ్చాను. ఇంట్లో వాళ్ళతో ఆ పది రోజులు సరదాగా గడిచిపోయాయి. సిటీ బస్సులతో..క్యాబ్ లతో అష్టకష్టాలు పడలేక శుభ్రంగా ఒక సైకిలు కొనేసుకున్నాను🚲 ఇప్పుడిక ప్రశాంతంగా ఉంది. 

నవంబరు: స్కూలు తరపున వర్క్ షాప్ లో పాల్గొనడానికి మైసూర్ వెళ్ళడం మర్చిపోలేను. ఆ ఊపిరి సలపని 3 రోజులు అస్సలు..మై గాడ్😵 మా స్టాఫ్ కొంతమంది తో మహాబలిపురం వెళ్ళడం మంచి అనుభవం. నేను చూసిన మొదటి ప్రపంచ వారసత్వ కట్టడం అదే అయింది. 

డిసెంబరు: ఆటం బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో పది రోజులు వింటర్ బ్రేక్. ఈ సారి మకాం వైజాగ్ లో వేశాం. చాలా బాగా అనిపించింది. 🤩🤩👌

మొత్తానికి ఇలా గడిచింది అన్నమాట...2019🤗😊



10, నవంబర్ 2019, ఆదివారం

మైసూరు వెళ్లానోచ్!!

ఆదివారం, నవంబర్ 10, 2019 4 Comments
రిగ్గా దీపావళి ముందు రోజు….ఆఫీసు నుండి పిలుపు వచ్చింది. ఎందుకా అని భయపడ్డాను. ఒక లెటర్ చేతిలో పెట్టి టికెట్స్ బుక్ చేసుకోమన్నారు. అదేంటి అంటే నవంబర్ 5-7 మధ్య ZIET మైసూరు లో జరగబోయే workshop కి చెన్నై రీజియన్ నుండి ఎంపికైన prt ల లిస్ట్. అందులో నా పేరు ఉంది.🧐 ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నేను స్కూల్లో చేరి పూర్తిగా రెండు నెలలు కూడా కాలేదు. అందుకే కొంచెం కంగారు గా ఫీలయ్యా. ఒక madam వాళ్లకు తెలిసిన ఇంకో సీనియర్ teacher నంబర్ ఇచ్చారు. "వాళ్ళు తెలుగు వాళ్ళే..ఆమె కూడా ఈ workshop కి వస్తున్నారు అరక్కోణం నుండి..నీకు కొత్త కదా! ఆమెతో కల్సి వెళ్లు" అని చెప్పారు. హమ్మయ్య అనుకున్నా..వెంటనే ఆమెకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. బిజీ ఏమో అని ఊరుకున్నా. ఆ రోజు స్కూలు హాఫ్ డే. తర్వాత మూడు రోజులు దీపావళి సెలవులు. హాస్టల్ కి వచ్చాక డాడీ కి ఫోన్ చేసి ఇలా అని విషయం చెప్పాను. నేను రానా అన్నారు..🙆"అయ్యో డాడీ!!" అని తల పట్టుకున్నా. అవును మరి ఒక్కదాన్నే ఎప్పుడూ దూర ప్రయాణాలు చేయలేదు. వెంటనే IRCTC app తెరిచాను. అప్పటికి seats available ఏం లేవు. నాకు ప్రయాణానికి వీలయ్యే ట్రైన్ కావేరి ఎక్స్ప్రెస్. వెళ్ళేటప్పుడు 3AC వెయిటింగ్ లిస్టు వచ్చింది. వచ్చేటప్పుడు కూడా 3AC వెయిటింగ్ లిస్టు వచ్చింది. WL నంబర్ సింగిల్ డిజిట్ లో ఉండటం వలన కన్ఫర్మ్ అవుతుంది లే అనే నమ్మకం తో ఉన్నాను. ఆ రాత్రి అరక్కొణం madam ఫోన్ చేశారు. ఇలా కావేరి కి బుక్ చేసుకున్నా madam అని చెప్తే నేను కూడా దానికే చేసుకుంటాను అని అన్నారు.




Google image

తర్వాత రోజు దీపావళి. ఆ రోజు ఇల్లు బాగా గుర్తు వచ్చింది ఎందుకో...mail తెరిచి చూస్తే అర్ధరాత్రి మైసూరు నుండి ఒక మెయిల్ వచ్చింది workshop సంబంధించి. అది పూర్తి చేసి ప్రిన్సిపాల్  సంతకం తీసుకుని ఆ తర్వాతి రోజు లోపు పంపాలి అని ఉంది. నాకైతే టెన్షన్ వచ్చింది. 🙄😰 స్కూలుకు వరుసగా మూడు రోజులు సెలవులాయే. సంతకం ఎలాగో ఏంటో అర్థం కాలేదు. వెంటనే మా hm mam కి ఆ mail విషయం చెప్తే..కంగారు పడకు..స్కూలుకు వచ్చాక చూద్దాం లే అన్నారు..  ఆమె అలా భరోసా ఇచ్చాక మనసు కాస్త కుదుట పడింది.😊 

4 సాయంత్రం ప్రయాణం..నేను టికెట్ తీసుకోవడం సెంట్రల్ స్టేషన్ నుండి తీసుకున్నా..కానీ వెనక్కి వెళ్లి ఎక్కడం ఎందుకూ అనిపించింది. ఎందుకంటే సెంట్రల్ తర్వాతి హాల్ట్ తిరువళ్ళూరు లో. అది మాకు ఇక్కడికి దగ్గర. ఈ విషయం నాకు మొదట్లో తెలియలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ వెయిటింగ్ లిస్ట్ నంబర్ లో పెద్దగా తేడా ఏం రావట్లేదు. పోనీ బస్ కి వెళ్తే ఎలాగ అని అనిపించి రెడ్ బస్ లో చూసాను. నాకేం అర్థం కాలేదు..ఆ పికప్ పాయింట్స్..dropping points..😵ఇక తత్కాల్ నే నమ్ముకున్నా. అదీ కుదరకపోతే అప్పుడు చూద్దాం ఏం చేయాలో అని ప్లాన్ వేసాను. 3న తత్కాల్ చేయాలి. అనుకూలంగా ఆదివారం వచ్చింది. పొద్దునే 9:45 నుండి app తెరిచి పెట్టి refresh చేస్తూ కూర్చున్నా. 3AC ఏమో 10, 2AC ఏమో 17 టికెట్స్ ఉన్నాయి. 2Ac ఎక్కువగా ఉన్నాయి కదా అని అది ముందు చేసా. కొంచెం ఖర్చు ఎక్కువైనా తిరువళ్ళూరు నుండే టికెట్ దొరికింది😋. ఒక టెన్షన్ వదిలింది. ముందు చేసిన టికెట్ WL 4తోనే ఆగిపోయింది. ఇక అది కాన్సెల్ చేసేసా. తిరుగు ప్రయాణం కి ఎందుకైనా మంచిది అని స్లీపర్ టికెట్ కూడా చేసి పెట్టాను. అది కానీ కన్ఫర్మ్ కాకపోతే కనీసం SL లో rac అయినా వస్తుంది కదా అని. ఆ ఆదివారం ప్రయాణం కి కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నా. NCERT బుక్స్ తెచ్చుకోమని అన్నారు కానీ….అన్నీ ఎలా మోసుకుని వెళ్లగలం అందుకే అన్నీ soft copies ఇంకా నా దగ్గర ఉన్న రెండు పుస్తకాలు తీసుకెళ్ళా. 

ఇక తర్వాతి రోజు సోమవారం స్కూలు నుండి వచ్చేసరికి 5 అయింది. వెంటవెంటనే బ్యాగ్స్ సర్దేసి రాత్రి హాస్టల్ లో పెట్టిన చపాతీ లు తినేసి..7:30 కల్ల దగ్గర్లోని సబర్బన్ స్టేషన్ కి వెళ్ళాను. అక్కడి నుండి తిరువళ్ళూరు ఒక అరగంట...ఇంకో madam ఏమో అరక్కోణం లో ఎక్కుతారు. 9 నుండి 10 దాకా ఒక్కదాన్నే అలా స్టేషన్ లో కూర్చున్నా. ఏసీ కోచ్ ప్రయాణం నాకు ఇదే మొదటిసారి. లోయర్ బెర్త్ వచ్చింది నాకు. దుప్పట్లు, చిన్న తలగడ, రగ్గు ఉన్నాయి. బాగా అనిపించింది. ఎక్కినట్టు ఇంటికి ఫోన్ చేసి వెంటనే పడుకున్నాను. బాగా నిద్ర పట్టింది. 

హైదరాబాదు లో ట్రైన్ లో ఉంటే అస్సలు నెట్ కనెక్ట్ అయ్యేదే కాదు నాకు..కానీ ఇక్కడ బాగానే అవుతుంది. పొద్దునే లేచి ఫోన్ చూసేసరికి బర్త్ డే విషెస్ ఉన్నాయి..కొంతమంది ఫోన్ చేసి మరీ విష్ చేశారు🤩..మైసూర్ చేరేసరికి 7 అయింది. ఆవిడ చెప్పిన బోగీ దగ్గరికి వెళ్ళాను. బాగానే గుర్తు పట్టాను. పచ్చ చీర అని మాత్రమే చెప్పారు😁. బయటకి వచ్చి ఓలా పాయింట్ లో ZIET కి క్యాబ్ బుక్ చేసుకున్నాం. చేరుకోవటానికి ఒక పది నిముషాలు పట్టింది. మేం ఇద్దరం కలిపి ఒక రూం తీసుకున్నాం అక్కడి గెస్ట్ హౌస్ లో. 




ఈ Zonal Institute of research and training అనేది దేశంలో ఉన్న 5 ZIET s లో ఒకటి. దీని పరిధిలోకి కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, పుదుచ్చేరి, మరియు మహే వస్తాయి. త్వరత్వరగా రెడీ అయిపోయి టిఫిన్ చేసి, registration కార్యక్రమాలు ముగించకొని lecture hall కి వెళ్ళాము. అసలు workshop దేనికీ అంటే "workshop on enrichment programmes in maths and evs for gifted students for classes 3-5" . మొదటి రోజు పొద్దున నుండి సాయంకాలం వరకు lectures ఇచ్చారు. మధ్యలో కొంత సేపు గ్రూప్ ఫోటో సెషన్. మా 34 మందినీ evs, maths ఇలా రెండు గ్రూపులు చేశారు. మళ్లీ అందులో 5-6 మందిని తరగతుల వారీగా విడగొట్టారు. అలా నాకు 5th evs వచ్చింది. ...అలా ఒక్కొక్కరికి కొన్ని chapters కేటాయించి ఒక్కో చాప్టర్ కి సంబంధించి theme mapping, preparing enrichment projects for gifted అలాగే HOTS ప్రశ్నలు తయారు చేయడం లాంటివి assignments గా ఇచ్చారు. అవన్నీ soft copies కావాలని అన్నారు. 

పొద్దున breakfast, lunch వాళ్ళే పెట్టారు కానీ..రాత్రి భోజనం మనమే చూసుకోవాలి. అలా మొదటి రోజు దగ్గర్లోని రెస్టారెంట్ "దోశ కార్నర్" కి వెళ్లి ఉల్లి దోశ తిన్నాను. తర్వాతి రోజు సగం సమయం assignments చేయటానికి కేటాయించారు. ఆ రోజు ZIET వాళ్ళే ఒక బస్సు మాట్లాడి పెట్టారు శ్రీ రంగపట్నం, చాముండి హిల్స్ కి. డబ్బులు అందరూ పంచుకునేట్లు గా...క్లాసులు అవ్వగానే సాయంత్రం 6 కి బస్సు బయల్దేరింది. మొదటగా శ్రీ రంగనాథ స్వామి గుడికి వెళ్ళాము. అక్కడేమో స్వామి వారికి అలంకరణ చేస్తున్నారు. అందుకే పరదాలతో కప్పేసారు...అప్పటికే అక్కడ చాలా మంది ఎదురు చూస్తున్నారు. 5నిముషాలు..10 నిముషాలు..అంటూ గంట పాటు అక్కడే ఉన్నాం. చివరికి దర్శనం బాగా చేసుకున్నాం. శేష పాన్పు పైన పవళిస్తున్న నల్ల రాతి విగ్రహం చూడ్డానికి రెండు కళ్ళు చాలవు. 😻ఆలయ ప్రాంగణం కూడా చాలా చల్లగా అనిపించింది. ఇప్పుడు చలికాలం అయినా చెన్నై లో అలాంటి ఫీలింగ్ యే రావట్లేదు. కానీ అక్కడ ఎప్పుడూ అలాగే చల్లగా ఉంటుంది అంట మైసూరు లో. చాముండేశ్వరి గుడి 9 కి మూసేస్తారు అని వెంటనే మళ్లీ 8 కి బస్సు ఎక్కేసాం. ఘాట్ రోడ్ ప్రయాణం భలేగా ఉంది. ఉత్తరాది వారు పాటలు పాడుతూ వాతావరణాన్ని ఉల్లాస పర్చారు. మధ్యలో కొండ పైనుండి మైసూరు నగర వీక్షణ ఎంత బాగుందో!!😍🤩😍😍 మాటల్లో చెప్పలేం. అక్కడ కూడా వెంటవెంటనే దర్శనం అయిపోయింది. అలా నేను దర్శించిన మొట్ట మొదటి శక్తి పీఠం మైసూరు అయింది. 

ఫోటో లన్నీ చీకట్లో తీయాల్సి వచ్చింది..అందుకే కొంచెం ఎడిట్ చేసా🤫







మధ్యలో ఒక రెస్టరెంట్ దగ్గర బస్ ఆపారు... భోజనం కోసం. నేనేమో ఫ్రైడ్ వెజ్ రైస్ చెప్పాను. నాలాగ ఇంకో ముగ్గురు ఉన్నారు. 10 దాటింది అప్పటికే. కడుపులో ఎలుకలు పరుగు పందెం పెట్టుకున్నట్టు ఉంది. అలా ఇంచుమించు అరగంట వెయిట్ చేయించారు. కానీ ఆర్డర్ తేవట్లేదు. ఐటమ్స్ లేవు అని చావు కబురు చల్లగా చెప్పాడు.😬😖మేము ముగ్గురం బయటకు వచ్చేసి క్యాబ్ బుక్ చేసుకుని దగ్గర్లోని "లెమన్ ట్రీ" కి వెళ్లి తిన్నాం. 11కి తింటే ఏం సయిస్తుంది. తినాలి కాబట్టి మమ అనిపించాను. అక్కడి నుండి నడుచుకుంటూ ziet కి 11:30 కల్ల వచ్చేశాం...ఇదొక అడ్వెంచర్😝😜

చివరి రోజు అయిన గురువారం కొంచెం బోరింగ్ గా జరిగింది. కంప్యూటర్ లాబ్ లో కూర్చుని అసైన్మెంట్స్ పూర్తి చేసి ...class wise..subject wise..అన్నీ ఒక ఫైల్ గా చేశాం..దానికే చాలా టైం పట్టేసింది. Ziet డైరెక్టర్ అయిన శ్రీమతి లక్ష్మి చారి mam , "students safety in schools" (sss) మీద తీసుకున్న సెషన్ బాగుంది. కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. ఆ రోజు సాయంత్రం presentations అయ్యాక అందరికీ ప్రశంసా పత్రాలు, "మైసూర్ పాక్" పాకెట్ ఇచ్చారు😋. ఇక వెంటనే మేము మా లగేజ్ సర్దేసుకునీ వెళ్లడానికి తయారయ్యాం. మా ఇద్దరికీ ఇంకొకరు తోడయ్యారు. ఆమె కూడా కావేరి కే వస్తున్నారు. అలా ముగ్గురం కల్సి స్టేషన్ కి వచ్చేశాం. అక్కడ సెల్ఫీ పాయింట్ దగ్గర కొన్ని ఫోటోలు తీసుకున్నాం.🤳 స్టేషన్ దగ్గర్లో ఉన్న "adyar anand bhavan" లో టిఫిన్ చేసి రైలెక్కాము. నాకు 3AC RAC వచ్చింది. బెర్త్ ఏమైనా దొరుకుతుందా అని టీసి నీ అడిగితే బెంగుళూరు దాటాక నే అన్నాడు. ఒంటి గంట కి ఒక బెర్తు ఇచ్చాడు😴💤 అలా హాస్టల్ కీ వచ్చేసి గబగబా తయారయ్యి స్కూలుకు వెళ్ళిపోయాను. మూడు రోజులు నిద్ర సరిగా లేక బాగా నీరసం అనిపించింది. కానీ తప్పదు గా…

ఇంకొన్ని ...






అలా మొత్తానికి మైసూరు ప్రయాణం చాలా బాగా జరిగింది. బోలెడు జ్ఞాపకాలు ను మిగిల్చింది. Busy schedule అయినా కూడా అంత టెన్షన్ అనిపించలేదు. అక్కడ కల్సిన వాళ్ళందరూ చాలా బాగా మాట్లాడారు. నాకు కేవీ ఇంటర్వ్యూ లో నా ముందు నెంబర్ అయిన నమ్రత అనే అమ్మాయి ఇక్కడ పరిచయం అయింది. నేనే గుర్తు పట్టి పలకరించాను. ఇంకా చాలా మంది తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు.. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి...🤗🤗 కానీ ఇప్పటికే ఆంజనేయుడి తోక లాగా అయింది కదా..అని ఇక్కడితో ఆపేస్తున్న...ఉంటా మరి!!!👋


28, అక్టోబర్ 2019, సోమవారం

నా ఉద్యోగ ప్రయాణం - 5 @భాగ్యనగరం

సోమవారం, అక్టోబర్ 28, 2019 2 Comments

అక్టోబర్ 4, 2018 నుండి….


Google image

హైదరాబాదు ప్రయాణం..మా డాడీ కి నాకు RAC లో సైడ్ లోయర్ బెర్త్ వచ్చింది. ఆ రాత్రి సరిగా నిద్ర పట్టలేదు. ఉదయం 4:30 కి సికింద్రాబాద్ లో దిగాము. ఆ రోజు గురువారం. దగ్గర్లో ఒక లాడ్జి కి వెళ్లి ఫ్రెష్ అయ్యి, కొంచెం సేపు పడుకుని 8 కి ఆఫీసు కి బయల్దేరాం. (CGO టవర్స్, కవాడిగూడ, సికింద్రాబాదు) క్యాంటీన్ లోనే టిఫిన్ చేసి అక్కడే కూర్చున్నాం. 9:30 తర్వాత స్టాఫ్ అందరూ వచ్చాక నా joining process అంతా చేశారు. స్టాఫ్ ఐడీ కార్డు ఇచ్చారు. ఆధార్ బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్ లో నమోదు ప్రక్రియ అయింది.

ఆ రోజంతా సర్వీస్ బుక్ తెరవడం..home town details ఇవ్వటం...వీటితో నే సరిపోయింది. మా డాడీ నన్ను ఆఫీస్ లో వదిలేసి దగ్గర్లో ఉన్న హాస్టల్స్ వెతికారు. ఒక km దూరం లో నడిచి వెళ్లేలా ఒకటి దొరికింది. సాయంత్రం డాడీ నన్ను అక్కడ దిగబెట్టి మళ్లీ రైల్వే స్టేషన్ కి వెళ్లిపోయారు. నేను వెంటనే జాయిన్ చేసుకుంటారు అని అనుకోలేదు. మళ్లీ రావాల్సి వస్తుందేమో అని 3-4 జతల బట్టలు మాత్రమే తెచ్చుకున్నా అంతే..😏

ఇదే మా cgo టవర్స్


నాకేంటో హాస్టల్ కీ, ఆఫీస్ కి రూటంతా గజిబిజి గా అనిపించేది. 😵ఆ మూడు రోజులు డాడీ పక్కన ఉన్నారు కాబట్టి ఏం భయం వేయలేదు. శనివారము డాడీ వెళ్ళిపోతారు.. అప్పుడు పరిస్థితి ఏంటో అర్థం కాలేదు. ఫోన్లో గూగుల్ మ్యాప్స్ ఉన్నా కూడా..ఎందుకో భయం వేసేది. దాన్ని వాడటం అప్పటికి నాకంత తెలీదు. అందుకే తీవ్రంగా ఆలోచించి ఒక పరిష్కారం కనిపెట్టాను😁 సౌండ్ రికార్డర్ ద్వారా దార్లో ఉన్న లాండ్ మార్క్స్, షాపుల పేర్లు అన్నీ రికార్డ్ చేసుకున్నా..వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు...అలా రెండు మూడు సార్లు తిరిగి ఒక అవగాహన కి వచ్చాను. తర్వాత శనివారం సెలవు కాబట్టి ఇంటి నుండి తెచ్చుకోనివి అన్నీ షాపింగ్ చేశాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర స్ట్రీట్ షాపింగ్ చేశాం. అక్కడ నేను కొన్నవి ఒక చెప్పుల జత, చేతి గడియారం, పర్సు..ఆశ్చర్యం ఏంటంటే ఇవి ఇప్పటికీ పని చేస్తున్నాయి..ఇది నేను ఊహించనిది. 


డాడీ ఆ రోజు సాయంత్రమే బయల్దేరిపోయారు. 😔నా దగ్గర అప్పటికి మొబైల్ లో balance కూడా లేదు.. కొన్ని రోజుల క్రితమే MNP ద్వారా docomo నుండి bsnl కి మార్పించాము. అది ఇంకా ఎనేబుల్ కాకపోవడం వలన ఇబ్బంది అయింది. హాస్టల్ ముఖం ఎరిగిన దాన్నే కానీ ఇక్కడ ఏమో అంతా కొత్తగా అనిపించింది. 

ఆదివారం తర్వాతి సోమవారమే ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది 😳grade up app ద్వారా. ఇక్కడికి వచ్చే ముందు అప్లై చేసిన kvs prt పరీక్ష డిసెంబర్ చివర్లో ఉంటుందని. నేను జనవరిలో ఉంటుందేమో అని అనుకున్నాను. కానీ ctet కీ దీనికీ అంత వ్యవధి లేదు. ఇక అప్పటి నుండి నిర్ణయించుకున్న రోజూ కొంచెం సేపు అయినా చదవాలి అని. అప్పటికి నా దగ్గర పుస్తకాలు ఏమీ లేవు...కానీ YouTube నుండీ, unacademy నుండీ వీడియో లు చూస్తూ notes రాయడం మొదలు పెట్టాను. Grade up నుండి నెలవారీ గా వచ్చే కరెంట్ అఫైర్స్ pdf డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసి పెట్టాను. అలాగే హిందీ గ్రామర్ కి ఒక మంచి notes pdf పుస్తకం దొరికింది. అది నాకు చాలా అంటే చాలా ఉపయోగపడింది. 😇

ఒక రోజు ఏమైంది అంటే...ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువై maps చూడకుండా అమ్మ, చెల్లితో మాట్లాడుతూ ఆఫీసు కు నడుస్తున్నా. చాలా చిన్న గల్లీలు కావటం వల్ల దారి తప్పిపొయాను🤕 ఒక్కసారిగా భయం వేసి కాల్ ఆపేసి మ్యాప్స్ లో లొకేషన్ చూసాను. ఆఫీసుకు ఇంకా 10 నిముషాల దూరం లో ఉన్నట్టు చూపిస్తుంది.🤥బాబోయ్..చివరికి అలా మాప్స్..ఇంకా దారిలో కనబడిన వాళ్ళ సహాయంతో చేరుకో గలిగాను. ఆ తర్వాత ఇంకెప్పుడూ ఏమరుపాటు తో నడవలేదు.🙁

జాయిన్ అయిన 15 రోజులకే దసరా!!..అప్పుడే ఇంకో విషయం తెలిసింది. Kvs LDC typing టెస్టు కి సెలెక్ట్ అయ్యా కదా..దాని dates ఎనౌన్స్ చేశాడు. నవంబర్ లో అది కూడా..డిల్లీ లో అంట..అంతకు ముందు వరకు టైపింగ్ టెస్ట్ కి వెళ్ళాలి అనే ఉత్సాహం ఉండేది. కానీ ఇప్పుడు అంతగా అనిపించలేదు. ..అందుకే వదిలేసా. 😏

దసరా కి ఇంటికి రావడం కుదరదు ఏమో అనుకున్నా అప్పుడు..కానీ 3 రోజులు సెలవులు రావడం తో ఇంటి మీద బెంగ ఎక్కువైంది. శుక్రవారం దసరా సెలవు.. శని, ఆదివారాలు కలిసొచ్చేయి.  ఇంటికి తీసుకు వెళ్లడానికి డాడీ వచ్చారు మళ్లీ🙆..ఆ రోజు RAC కన్ఫర్మ్ అయ్యి బెర్తులు దొరికాయి కాబట్టి సరిపోయింది. కానీ తిరుగు ప్రయాణం ఎలాగో ప్లాన్ చేసుకోలేదు. దసరా మూడు రోజులు ఇంటి దగ్గర గడిపేసి హాస్టల్ కీ కావాల్సినవి..పుస్తకాలు గట్రా సర్దేసుకుని ప్రయాణమయ్యాను. 

బస్సు టికెట్ కోసం ప్రయత్నించాము కానీ దొరకలేదు. ఇక జనరల్ భోగి ప్రయాణమే గతి. ఆ రోజు నిజంగా నరకం కళ్ళ ముందు కనపడింది.😱😱 ఆదివారం కావటం వలన హైదరాబాద్ ఎక్స్ప్రెస్ (7 గం.) కాకుండా ఇంకో స్పెషల్ ఫేర్ ట్రైన్ ఉంటుంది. మాకిక్కడ seat దొరకదు అని డాడీ నరసాపురం వెళ్లి seat పట్టుకున్నారు. అక్కడ కూడా చాలా ఎక్కువ మంది జనం ఉన్నారట. పోలీసులు క్యూ ద్వారా ట్రైన్ ఎక్కించారు అంట. ఒక seat అయితే దొరికింది. కానీ రాత్రంతా కదలటానికి , కాలు కదపటానికి వీల్లేకుండా అయింది. 😰విజయవాడ దాకా కొంచెం బాగానే అనిపించినా తర్వాత అక్కడ చాలా మంది ఎక్కేసారు. ఎక్కడ చిన్న ఖాళీ దొరికినా కూర్చునిపోయారు...కొంతమంది అయితే పడుకున్నారు కూడా.. దానికి తోడు పొద్దున 6కి హైదరాబాద్ చేరాల్సినది 9 కి చేరింది. చాలా నీరసం అనిపించింది. ఆ రోజు ఆఫీసు లో మధ్యాహ్నం నిద్ర వచ్చినా ఆపుకున్నా😩😴….రద్దీ సమయాల్లో రిజర్వేషన్ లేని ప్రయాణం ఆరోగ్యానికి హానికరమని తెల్సుకున్నాను..అలా మొట్ట మొదటిసారి ఒక్కదాన్నే హైదరాబాద్ వచ్చేసాను...🤩
ఈ టపా ఎలా ఉందో చెప్పడం మరవకండి..!!

Google image

22, ఆగస్టు 2019, గురువారం

I got my dream job!!

గురువారం, ఆగస్టు 22, 2019 2 Comments

    I am glad to say you all that I got the job of my dreams. Kendriya Vidayalaya Sanghathan announced final result of Teaching recruitment recently and selected as Primary Teacher (PRT) in one of the Kendriya Vidyalayas situated in Chennai...I will continue my posts in the series of నా ఉద్యోగ ప్రయాణం...Keep in touch with my blog...


10, ఆగస్టు 2019, శనివారం

నా ఉద్యోగ ప్రయాణం - 4 (కొన్ని సంగతులు)

శనివారం, ఆగస్టు 10, 2019 4 Comments
ముందు మూడు భాగాల్లోను అక్కడక్కడా ప్రస్తావించడం మరచిపోయిన విషయాలను ఈ టపాలో చెప్పాలనుకుంటున్నాను. అప్పటికి ఇవి అప్రాధాన్య సంగతులే...కానీ ఇప్పుడు ఇవే చాలా ముఖ్యం😁

2017 సంవత్సరం చివర్లో కేంద్రీయ విద్యాలయ సంఘఠన్ సుమారు 500 Lower division clerk పోస్టులకు ప్రకటన ఇచ్చింది. దీనికి ఇంటర్మీడియట్ అర్హత కావడంతో మా చెల్లీ, నేను ఇద్దరూ అప్లై చేశాం. దాని తాలూకు పరీక్ష 2018 ఫిబ్రవరి లో జరిగింది. మా ఇద్దరికీ పరీక్షా కేంద్రం విజయవాడలో ఒకటే వచ్చింది. కానీ తేదీలు వేరు. నాకేమో ఫిబ్రవరి 19 అయితే దానికి 20😢...అలా డాడీ పాపం రెండు సార్లు వెంటవెంటనే విజయవాడ తిరగాల్సి వచ్చింది.

తర్వాత మళ్లీ అదే ఫిబ్రవరి 23 న APTET పరీక్ష జరిగింది. నాకు శశి ఇంజనీరింగ్ కాలేజ్ తాడేపల్లి గూడెం వచ్చింది. పరీక్ష బాగా అయినట్టు నాకు అనిపించలేదు. మొత్తం ప్రశ్నలన్నీ స్కూల్ టెక్స్ట్ బుక్స్ లోనుండే ఇచ్చారు. మరీ అంతలా పేపరు ఉంటుందని అస్సలు అనుకోలేదు. చాలా నిరాశ పడ్డాను. మన ప్రభుత్వం మీద నమ్మకం లేక TET మీద ఆశలు వదులుకున్నాను. టెట్ ఫలితాలు 2018 మార్చిలో వచ్చాయి. నాకేమో 129/150 మార్కులు వచ్చాయి. సంతృప్తి గా అనిపించలేదు. 130+ నా టార్గెట్ మరి😒..


ఇక ఆ KVS LDC పరీక్ష ఫలితాలు మూడు నెలల తర్వాత మే నెలలో విడుదల అయ్యాయి. మార్కులు ఇవ్వకుండా తర్వాతి టైపింగ్ టెస్ట్ కి ఎంపికైన వారి పేర్లు లిస్ట్ మాత్రమే web site లో పెట్టారు. అందులో నా పేరు ఉంది.😍😍..కానీ ఆ టెస్ట్ ఎప్పుడు జరిగేదీ తేదీ అదేమీ ఇవ్వలేదు..ఢిల్లీ లో మాత్రం జరుగుతుంది అని తెలిసింది. దానికి మానసికంగా తయారవుతూ రోజూ laptop ముందేసుకుని టైపింగ్ ప్రాక్టీస్ చేసేదాన్ని. దానికోసం lappy తో పాటు ఒక హిందూ పేపరు ఇంకా స్టాప్ వాచ్ పెట్టుకునే దాన్ని. MS Word లో ఒక నిముషంలో ఎన్ని పదాలు వచ్చేవో చూసుకుంటూ టైపింగ్ చేసేదాన్ని. మొదట్లో 30 కన్నా ఎక్కువ వచ్చేది కాదు. అలా అలా చేస్తుంటే 35 దాటగలిగాను.

2018 ఆగస్టులో నేను ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న CTET నోటిఫికేషన్ CBSE ప్రకటించింది. దానికి పుస్తకాలు ముందే కొని పెట్టుకున్నా అని చెప్పాను కదా!! అప్పుడప్పుడు వాటి దుమ్ము దులిపే దాన్ని. CTET పరీక్ష తేదీ ముందే తెల్సు..డిసెంబరులో అని. అందుకే ఎక్కువ చదివేదాన్ని కాదు...చాలా సమయం ఉందని నిర్లక్ష్యం😝


వెంటనే ఆ ఆగస్టు 15 స్వాతంత్ర్య దినాన ఓ చల్లని కబురు తెల్సింది. మళ్లీ KVS advertisement 14 పేరుతో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అందులో రకరకాల పోస్టులు మొత్తం 8000 ఉంటే కేవలం Primary Teacher (PRT) పోస్టులు 5300 ఉన్నాయి. నేను అప్లై చేసుకోదగింది PRT మాత్రమే. కానీ ఆనంద పడేలోగా ఇంకోటి తెల్సింది. దానికి అంతకు ముందే CTET అర్హత కలిగి ఉండాలట. కానీ నాకేమో లేదాయే. లేదు అంటే నా D.Ed అయ్యాక అసలు ఆ పరీక్షే పెట్టలేదు. కొత్తగా వ్రాస్తున్న. అలాంటపుడు ఇంకెలా ఉంటుంది. 😫😫..చాలా బాధేసింది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు CTET తయారైంది. కానీ కొన్ని రోజులకు KVS నా ఘోష విన్నదో ఏమో కానీ...CTET 2018 వ్రాయబోతున్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని అనుమతి ఇచ్చింది. దానికోసం CTET రిజిస్ట్రేషన్ సంఖ్య ఇస్తే చాలు...😇😇.. ఇంక దేనికి ఆలస్యం అని..దానికి కూడా అప్లై చేసేసా. ఓకే దెబ్బకి రెండు పిట్టలు..🐤🐤..ఆ రెండు పరీక్షలకు అటుఇటుగా సిలబస్ ఒకలానే ఉంటుంది. కాకపోతే PRT పరిధి ఎక్కువ. CTET కేవలం అర్హత కోసమే కాబట్టి అది కొంచెం సులువే.


రెండిటికీ అప్లై చేయడం అయితే చేశాను కానీ...చదివింది అంతంత మాత్రమే...😔వీలైనపుడు YouTube videos చూస్తూ notes రాసుకునే దాన్ని. అంతే….తర్వాత కథంతా హైదరాబాదు లోనే..అంటే జాబ్ లో చేరాక….

(సశేషం)

29, జులై 2019, సోమవారం

నా ఉద్యోగ ప్రయాణం - 3 (ఉద్యోగం వచ్చేసిందోచ్)

సోమవారం, జులై 29, 2019 6 Comments

ముందు భాగం ఇక్కడ

ఇంతకీ SSC మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పరీక్ష తుది ఫలితాలు మార్చి 31 న వస్తాయని సైట్లో ప్రకటించారు..ఆ రోజు కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసా..ఆ రోజు ఎన్ని సార్లు సైట్ తెలిచి రిఫ్రెష్ చేసానో నాకే తెలీదు. అలా ఏప్రిల్ 1, 2 తేదీలూ అంతే..ఇంక చిరాకొచ్చేసింది. రిజల్ట్ పెట్టలేదు కానీ..ఏప్రిల్ 27 న ఫలితాలు విడుదల చేస్తారని ఒక నోటీసు పడేసారు. అలా ఇంకో నెల రోజులు చూసాను..ఈ లోపల కొన్ని రోజులు DSC కి పుస్తకాలు తీసేదాన్ని..ఆ...ఇప్పుడు చదివినా Notification వస్తాదో రాదో అనుకుని మూసేసేదాన్ని. ఇంతలో దాన్ని మళ్ళీ ఏప్రిల్ 30 కి వాయిదా వేశారు.

ఆ రోజుల్ని ఎలా గడిపానో నాకే తెలీదు..వస్తుందో రాదో అని చాలా టెన్షన్ పడేదాన్ని. నాకు OBC రిజర్వేషన్ ఉంది. కానీ జాతీయ స్థాయిలో OBC కి UR కి పెద్ద తేడా ఏముండదు కదా కటాఫ్ విషయంలో...పోనీ విమెన్ రిజర్వేషన్ ఉందేమోననుకుని ఆనందపడ్డా..ఎందుకంటే సెలెక్టయిన వారిలో అమ్మాయిలు తక్కువగా ఉన్నారు. కంఫిర్మేషన్ కోసం ఓసారి నెట్ లో వెతికా..తెలిసినదేంటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ లేదు..దాన్ని తెచ్చే ప్రయత్నాలు ఇంకా జరుగుతున్నాయని.. ఇలా రిజర్వేషన్ లేదు కాబట్టే కనీసం అమ్మాయిల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతోనే పరీక్షలకి ఫీ కన్సెషన్ ఉంటుంది. అదే SSC పరీక్షలు ఏమైనా సరే అమ్మాయిలు ఫీజు కట్టక్కర్లేదు…కానీ మన ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళా కోటా ఉంది. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కూడా ఉంది..

ఇంతలో ఏప్రిల్ 28 న పోస్ట్ మాన్ ఉద్యోగానికి పరీక్ష హాల్ టికెట్ వచ్చింది.ఈ SSC రిజల్ట్ పాజిటివ్ గా వస్తే మానేద్దామనుకున్నా...వెళ్ళాలా వద్దా..అని చివరికి తెల్లారకుండానే బస్ ద్వారా విజయవాడకి వెళ్ళిపోయాం..అబ్బో ఏం ఎండ బాబూ...చాలా సేపటి వరకూ బయటే ఉంచేసారు మమ్మల్ని..అది ఆఫ్ లైన్ పరీక్షే..నోవా కాలేజీ వచ్చింది నాకు..చాలా మంది ఉన్నారు వెళ్ళేసరికే.. .కనీసం కూర్చోడానికి బల్లలు లాంటివేం లేవు అక్కడ. పరీక్ష ఐతే బాగానే రాసాను. మా D.Ed ఫ్రెండ్స్ చాలా మంది అప్ప్లై చేసారు దీనికి. అక్కడే మా కాలేజీ అమ్మాయి కనిపించింది. ఇంక వాళ్ళూ, మేమూ కలిసి మధ్యాహ్నం 2 కి ఉండే విజయవాడ - నర్సాపురం పాసింజర్ బండి ఎక్కేశాం..భోజనాలు చేసేంత సమయం దొరకలేదు మాకు. నరకం ఏంటంటే ఆ రైళ్ళో కనీసం నిల్చోడానికి కూడా ఖాళీ లేదు..అలాగే మా ఫ్రెండూ నేనూ కబుర్లు చెప్పుకుంటూ కాలం వెళ్ళదీశాం. సాధారణంగా గుడివాడ వచ్చేసరికీ చాలావరకూ ఖాళీ అయిపోతుంది..కానీ ఆ రోజు భీమవరం దాక కూడా జనాలు ఉన్నారు...ఆ రోజు చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయట..పైగా వేసవి సెలవులు కదా..అలాగే ఆ రైళ్ళో పరీక్ష కి వచ్చినోళ్ళు ఎక్కువ మందే ఉన్నారు. ఈ పరీక్ష ఏమవుతుందో మరి?? ఏదేమైతే ఇంటికి వచ్చేసరికీ 7.30 అయింది..ఏమీ తినలేదేమో చాలా ఆకలవుతూంది..భోజనం చేసేసి నెట్ ఆన్ చేసా..

 కానీ ఆ రోజునే సాయంత్రం ఊరికే సైట్ తెరిస్తే సరిగ్గా అప్పుడే లిస్ట్ అప్లోడ్ చేసారు.. 30 అని చెప్పి రెండు రోజుల ముందే ఇచ్చారు. నా పేరు ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఉందోచ్!!..నేను తెలంగాణ రాష్ట్రానికి ఎంపికయ్యా..ఎందుకంటే అదే నా మొదటి ప్రిఫరెన్స్. అప్లికేషన్ లో..అప్పుడు 3 4 కాకుండా 4 3 పెట్టా..(3-ఏపీ, 4-టీఎస్.. IIIT నుండి వచ్చేసి, D.Ed అయ్యాక ఇంట్లో ఖాళీగా కనిపించేదాన్ని అందరి దృష్టిలో...తెల్సిన వారు పిచ్చి పిచ్చి ఉచిత సలహాలు ఇచ్చేవారు..అందుకే వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకునేదాన్ని అప్పట్లో...ఈ చిరాకే కావొచ్చు ముందు తెలంగాణ పెట్టడానికి కారణం...అప్పుడు ఖచ్చితంగా వస్తుందని నాకు మాత్రం ఏం తెలుసు!!..). నాది OBC ఐనా జనరల్ లో సెలెక్టయ్యా..నా ఆల్ ఇండియా ర్యాంక్ 4288.. అతి తక్కువ కటాఫ్ 126..హైయస్ట్ కటాఫ్ అంటే 130 కంటే ఎక్కువున్న రాష్ట్రాలు బీహార్, యూపీ, హర్యనా లాంటివి ఉన్నాయి. ఉత్తర భారత రాష్ట్రాల కటాఫ్ ల కంటే దక్షిణ భారత రాష్ట్రాలవి తక్కువే...రాష్ట్రాల వారీగా కటాఫ్ ఉంది కాబట్టి ఎక్కువ తెలుగు వాళ్ళకీ అవకాశం వచ్చింది..అది కాకుండా ఇండియా అంతా ఒకే కటాఫ్ పెట్టి ఉంటే సుమారు 60%-70% ఉద్యోగాలు హిందీ వారికే వచ్చి ఉండేవి... ఎందుకంటే వారికి పోటీ ఎక్కువ..మార్కులూ ఎక్కువే.. CHSL, CGL లలో ఇలానే ఉంటుంది..

 నేనూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని కాబోతున్నా...వెంటనే ఎవరు క్రియేట్ చేసారో మరి...SSC MTS కి ఎంపికైన వారు ఫేస్ బుక్, పాగల్ గయ్ ల లో గ్రూపులు తెరిచేసారు..అందులో నేనూ చేరిపోయా..నా జీవితంలో మొదటిసారి  మా కుటుంబమంతా ఎంతో ఆనందపడ్డాం..మా కుటుంబంలో మొట్టమొదట ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికయ్యాను. ఇది చిన్న పోస్టని ఏం బాధ పడట్లేదు..ఎందుకంటే నిరుద్యోగం హెచ్చుస్థాయిలో ఉన్న ఈ రోజుల్లో 20 లక్షల మందితో పోటీ పడి, ఒక ఉద్యోగాన్ని సంపాదించడం అంటే చాలా కష్టమే!!.. పై స్థాయికి వెళ్ళడానికి ఇది ఒక నిచ్చెనలా ఉపయోగపడుతుంది..కింది స్థాయి ఉద్యోగమైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి దక్కే సౌకర్యాలన్నీ దీనికీ ఉన్నాయి. వారానికి 5 రోజులు మాత్రమే పని. మూడేళ్ళ సర్వీసు తర్వాత ప్రమోషన్లు ఇంకా డిపార్టుమెంటల్ పరీక్షలు కూడా రాసుకోవచ్చు.



దీని తర్వాతి ఘట్టం డిపార్ట్మెంట్ అలోకేషన్..అది ర్యాండంగా జరుగుతుంది.. ర్యాంక్ పాత్ర ఏమీ ఉండదు. ఈ లోపల యూట్యూబ్ లో SSC MTS తర్వాతి తతంగం గురించి ఎన్ని వీడియోలు పెట్టేశారో..చాలా వరకూ చూసా..అలోకేషన్ లిస్ట్ ఎపుడు పెడతారని, తెలంగాణ లో ఏఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయో కనుక్కుందామని, సదరన్ రీజన్ చెన్నై కి ఒక RTI అన్ లైన్ ద్వారా ఒక రిక్వెస్టు పెట్టా..రెండు రోజుల్లో సమాధానం వచ్చింది. మే 18 టెంటేటివ్ డేట్ అని, దానితో పాటు తెలంగాణ లో Department wise vacancies PDF (SSC MTS తెలంగాణకి సంబంధించి)  ఒకటి పంపారు. ఆ లిస్ట్ లో హైదరాబాద్ ఏజీ ఆఫీస్ లో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. అందులో వస్తే బాగుణ్ణు అనుకున్నా... మే 17 నే ఆంధ్రప్రదేశ్ లిస్ట్ పెట్టారు కానీ తెలంగాణ లిస్ట్ మాత్రం 22 న పెట్టారు. అందులో నాకు Archaeological Survey of India వచ్చింది..ఇపుడూ టెన్షన్ ఏంటంటే పోస్టింగ్ ఎక్కడొస్తుందీ అని..తెలంగాణ లో ఎక్కడైనా ఇవ్వొచ్చట.. నెట్లో వెతికితే తెలంగాణ లో ASI పరిధిలో ఉన్నవి కొన్ని తెలిశాయి... వరంగల్, గోల్కొండ, కొండాపూర్ మ్యూజియం..ఇలా ఉన్నాయి మరి.... ASI HQ నుండి లెటర్ ఎప్పుడొస్తదో ఏంటో!!? ఎందుకంటే అలోకేషన్ వరకే SSC పని..మిగతాది అంతా ఏ డిపార్ట్మెంట్ ఐతే అదే చూసుకుంటుంది. నా విజయం వెనుక మా కుటుంబం పాత్ర ఎంతో ఉంది. ఏ పరీక్ష ఐనా నన్ను రాయమని ప్రోత్సహిస్తారు మా అమ్మా నాన్నా..మా డాడీ ఐతే ఎంత దూరమైనా విసుక్కోకుండా దగ్గరుండి తీసుకెళ్తారు. ఇలాంటి తల్లిదండ్రులు మాకు దొరకడం మా అదృష్టం. ఇంకా GradeUp App మరియు Qmaths Site నా ప్రిపరేషన్ లో ఎంతో ఉపయోగపడ్డాయి..






నేనేమో ASI నుండి లెటర్ కోసం ఎదురు చూస్తుంటే కొన్ని రోజుల ముందు రాసిన పోస్ట్ మాన్ జాబ్ కి ఎంపిక అయినట్టు తెల్సింది..అది కూడా హైయెస్ట్ మార్కులు 100 కి 95 అయితే నాకు వచ్చినవి 94..చాలా ఆనందపడ్డాను..మా డివిజనే అయిన భీమవరానికే ఎంపికయ్యాను. ఇది తెల్సిన రెండు రోజులకే అపాయింట్మెంటు లెటర్ వచ్చేసింది. అక్టోబరు 4 న వచ్చి చేరాలని ఉంది. నాకేమో ఒక పక్క ఆందోళన, నేను ఎదురు చూసేది మాత్రం రావట్లేదు అని. సరే ఒక వారం చూద్దాము, ఇక రాకపొతే పోస్ట్ మాన్ కే వెళ్దాం అని నిర్ణయించుకున్నా. మొత్తానికి ఒక మూడు నాలుగు రోజుల తర్వాత ఎన్నాళ్ళో వేచిన ఉదయం రానే వచ్చింది. నాకు కేటయించిన కార్యాలయం "విజ్ఞాన శాఖ, భారతీయ పురాతత్వ సర్వేక్షణ, హైదరాబాదు". మొదటి నుండీ పొస్ట్ మాన్ ఉద్యోగము అంటే అంత ఇంట్రెస్టు లేదు నాకు...అమ్మాయిలకి అది సరిపోదు అని చాలా మంది చెప్పారు. ఇక అందుకే అటు వైపు వెళ్ళలేదు. ఈ లోపు జాయిన్ కావడానికి అవసరమైన మెడికల్, కారెక్టర్ సెర్టిఫికేట్ల లాంటివి చేసేసుకున్నాం. ఒక మంచి రోజు చూసుకుని డాడీ, నేనూ భాగ్యనగరానికి ప్రయాణం అయ్యాము.

తర్వాత ఏమేం సంఘటనలు జరిగాయి అనేది తర్వాతి టపాలలో చూద్దాము.
(సశేషం)