29, ఆగస్టు 2021, ఆదివారం

పుల్లయ్య వేమవరం వెళ్లినట్టు!

ఆదివారం, ఆగస్టు 29, 2021 3 Comments

 చెన్నై లో ఉన్నా అన్న పేరేగాని అక్కడికి ఇక్కడికి తిరిగింది లేదు. ఒక పక్క వైరస్ భూతం ఒకటి భయపడుతూనే ఉంది. పోయిన వారం ఓణం అప్పుడు, రెండు రోజులు సెలవులు రావడంతో చెల్లి నా దగ్గరికి వచ్చింది. అసలు అయితే వండలూర్ జూ కి వెళ్దామని అనుకున్నాం మొదట. కానీ కోవిడ్ నిబంధనల దృష్ట్యా అది కాస్తా మూతబడి ఉంది. ఇక తర్వాతి జాబితా లోని ప్రదేశాలు మహాబలిపురం మరియు కాంచీపురం. 

మహాబలిపురం ఇంతకు పూర్వమే నేను వెళ్లి ఉండటంతో, ఇద్దరూ చూడలేనిది కాంచీపురాన్ని ఎంపిక చేశాం. అక్కడ ఇంకా బోలెడు గుళ్ళు కూడా చూడొచ్చు అని సంబరపడ్డాము. అంతకు ముందే వెళ్లిన నా స్నేహితురాలిని అడిగి ఎలా వెళ్లాలి అని ఆ వివరాలన్నీ తెలుసుకున్నాను. 

శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కదా! గుడి ఖాళీ ఉండదేమో అని శనివారం పెట్టుకున్నాం ప్రయాణం. దానికోసం ఓలా లో పొద్దున 5 కి రైడ్ ని షెడ్యూల్ చేశాం. 


శనివారం పొద్దున్నే మూడు గంటలకే లేచి, ముస్తాబయ్యి క్యాబ్ వాడి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాము. సరిగ్గా అనుకున్న సమయానికి వచ్చేసాడు. డ్రాపింగ్ పాయింట్ అడిగితే ఇలా కంచి కామాక్షి ఆలయం అని చెప్తే "అది అవుట్ స్టేషన్ రైడ్ మేడం! 250 రూపాయలు డీజిల్ చార్జీలు ఎక్స్ ట్రా ఇవ్వాలి" అని చెప్పాడు. మరి బుక్ చేసినప్పుడు బాగానే అయింది గా, అవుట్ స్టేషన్ అని ఏమి చూపించలేదు. సరే అనుకుని కారు ఎక్కాము. మేము ఏమి తినలేదు తాగలేదు. ముందు దర్శనం చేసుకున్నాక అక్కడే ఏదో ఒక హోటల్లో టిఫిన్ చేద్దామని ఆగాము. 


అలా ఆరున్నరకి కాంచీపురం చేరుకున్నాం. గుడి ఉత్తర ద్వారం దగ్గర కారు ఆపి డ్రైవరు "వీకెండ్స్ గుడి క్లోస్ ఉంటుంది" అన్నాడు. అప్పుడు నాకు వాడు చెప్పింది ఎక్క లేదు. అక్కడే వాకింగ్ చేస్తున్న వాళ్ళని కనుక్కున్నాడు. మూడు రోజులు గుడి మూసి వుంటుంది అని అన్నారు వాళ్ళు. 


ఒక్కసారిగా ఇద్దరం నీరుకారి పోయాం. ఎంతో ఆశ పడి, ఆనందపడి ఇంత దూరం వస్తే ఇదేంటి ఇలా అయిందని. 1330+ 250= 1580 రూపాయలు అయింది అని చెప్పి ఇక్కడే ఉంటారా వెనక్కి వచ్చేస్తారా అని అడిగాడు. మేము డబ్బులు ఇచ్చేసి షాపింగ్ చేసుకోవాలని వాణ్ణి వెళ్ళిపొమ్మన్నాము. ఆ డ్రైవర్ కి తమిళనాడులో వారాంతాల్లో ఆలయాలు మూసి ఉంటాయని ముందే తెలుసు. ఆ మాటేదో ఎక్కక ముందే చెప్తే అసలు రాకపోదుము కదా! కానీ ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదు. 


అక్కడి దుకాణాలు 8 కి కానీ తెరవరట. ఏం చేస్తాం అప్పటిదాకా. అయినా గుడినే సందర్శించనప్పుడు ఇంకేం కొనుక్కుంటాము లే అని  కనీసం ఏమైనా తినడానికి కూడా ఒక్క హోటలూ తెరిచి లేదు. ఇంకేం చేసేదిలేక, అలా గుడి చుట్టూ ఒకసారి తిరిగేసి బస్ స్టాండ్ వైపు నడిచాము. 


ఇదొక్కటి మాత్రం తీసుకున్నాం.


అనుకోకుండా ఒక డైరెక్ట్ బస్సు దొరికింది. ఇలాంటి బస్సులు ఉంటాయి నాకు మునుపు తెలీదు. హమ్మయ్య అనుకొని అది ఎక్కేసాం. తెచ్చుకున్న బిస్కెట్లు మాత్రం బస్సులో తిన్నాము. 


మొత్తానికి అలా కాంచీపురం వెళ్లినట్టు వెళ్లి వెనక్కి వచ్చేసాం. పుల్లయ్య వేమవరం వెళ్లాడు అంటారే.. అలా అయ్యింది మాకు. 

10, ఏప్రిల్ 2021, శనివారం

పోలింగ్ ఆఫీసర్ అయ్యానోచ్!!!

శనివారం, ఏప్రిల్ 10, 2021 2 Comments

 డిసెంబర్లో వింటర్ బ్రేక్ అయిపోయాక స్కూలు తిరిగి తెరిచే రోజు వచ్చేటపుడు ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో తెచ్చుకోమన్నారు. వెళ్ళాక తెల్సింది ఏమిటంటే, ఈ సంవత్సరం జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల విధులు కోసం మా స్కూలు నుండి కూడా టీచర్లను పంపించడం కోసం, దరఖాస్తులు నింపమన్నారు. దానికన్న మాట ఆ ఫోటో. మొత్తానికి అందరూ పూర్తి చేసి పంపేసాం.


చిన్నప్పటి నుండి నాకు ఇలాంటి ఎలక్షన్ డ్యూటీ అన్నా, జనాభా లెక్కల పని అన్నా మహా ఆసక్తిగా ఉండేవి. ఎందుకంటే మా హైస్కూల్లో టీచర్లు వెళ్ళేవారు గా. వాళ్ళని చూసి నాకూ అలాంటి అవకాశం వస్తే బాగుణ్ణు అనుకునేదాన్ని...అందుకే అన్నమాట ఈ ఉత్సాహం.


కానీ ఆ ఉత్సాహం అంతా ఒక రోజు నీరు కారిపోయింది. ఎలాగంటే ఇదివరకు ఎన్నికల విధులకు వెళ్ళినవాళ్ళు చెప్పారు ఇలా అని. ట్రైనింగ్ క్లాసులు ఆదివారాలే పెడతారు, పైగా ఈసారి కోవిడ్ టీకా తీసుకోవడం తప్పనిసరి అని. ఆదివారం ఒక్కరోజే మనకు కాస్త సమయం చిక్కేది. కానీ అప్పుడు కూడా డ్యూటీ కి వెళ్ళాలంటే కష్టం అనిపించింది. 


ఒక మంచిరోజున ఎన్నికల విధులకు సంబంధించిన appointment order వచ్చింది. నాతో సహా చాలా మందికి పోలింగ్ ఆఫీసర్-3 ఇచ్చారు. మరుసటి ఆదివారం దగ్గర్లో ఒక ఇంజనీరింగ్ కాలేజీ లో శిక్షణ కి హాజరు అవ్వమని దాని సారాంశం. అందరం ఎంచక్కా కలిసి వెళ్ళి మళ్ళీ కలిసి వచ్చేసాం. అక్కడ వాళ్ళు ఏం చెప్పింది లేదు, మేమేం చేసింది లేదు. హాజరు పట్టి లో ఒక సంతకం తప్ప. ఆ తర్వాతి ఆదివారం కూడా ఉంటుందని అనుకున్నాం. కానీ ఎవరికి ముందు రోజు sms రాలేదు. హమ్మయ్య.. ఆ ఆదివారం ఎలాంటి కార్యక్రమం లేదు. తర్వాత ఇంకో 3-4 రోజులకు ఇంకో ఆర్డర్ వచ్చింది అందరికీ. 


అందులో ఏ ఏ తేదీల్లో హాజరు కావాలి, ఏ నియోజకవర్గంలో పని చేయాలి, ఇంకా టీమ్ కోడ్ ఇలాంటివన్నీ ఉన్నాయి. మనం వెళ్లాల్సిన పోలింగ్ బూత్ మాత్రం ఎన్నికల ముందు రోజు మాత్రమే తెలుస్తుందట. నాకు వచ్చిన నియోజకవర్గం "పొన్నేరి". అక్కడ వేళమ్మల్ హైస్కూల్లో -3 సార్లు వెళ్ళాలి. నాతో పాటు మా రేణు కి కూడా అక్కడే వచ్చింది. ఏంటో మా ఇద్దరికీ ఎప్పుడూ అన్ని ఇలా కలిసి వస్తాయి😀 మా అందరికీ ఇంచుమించు దగ్గర దగ్గరే వచ్చాయి  కొంతమందికి మాత్రం దూరంగా తిరుత్తణి, గుమ్మిడి పూండి లాంటివి ఇచ్చారు. 


మాకు పోన్నేరి కాస్త దూరమే. 25-30 km దాకా ఉంటుందేమో  cabs ఏమో out station ride అని చూపిస్తున్నాయి. ఇక బస్సుల్నే నమ్ముకున్నాం. ఇక్కడి నుండి రెడ్ హిల్స్ దాకా ఒక బస్సు, అక్కడి నుండి పొన్నేరి లో ఆ స్కూలుకు ఇంకో బస్సు. బస్సులకేం... బోలెడు ఉన్నాయి. కానీ జనాలు కూడా అలాగే ఉండేవారు. నిల్చొడానికి కూడా ఖాళీ ఉండేది కాదు. ఈ కొవిడ్ భయం ఒకటి ఉండనే ఉంది. కానీ ఏం చేస్తాం. తప్పని పని..అలా రెండు రోజులు వెళ్ళాం.


మా టీమ్ లో ఎవరెవరు ఉంటారో మొదటి రోజునే తెలిసిపోయింది నాకు. మా దాంట్లో ఒక ప్రేసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ ఆఫీసర్లు 1,2,3 ఉన్నారు. అక్కడంతా తమిళమే ఉండేది. పైగా ప్రభుత్వాలు ఎలాంటి భాషను వాడుతాయో తెల్సు గా. అదేమో నాకర్థమే కాలేదు. మా ప్రిసైడింగ్ ఆఫీసర్ స్టేట్ స్కూల్లో HM అంట. మొదట్లో ఆవిడతో ఇంగ్లీషులో మాట్లాడా. అలా మాటల్లో నాది ఇలా ఆంధ్ర అంటే ఎక్కడో చెప్పు అన్నది. పాలకొల్లు అన్నా, మాది భీమవరం అంది. అంతే..దెబ్బకి నా భయం ఎగిరిపోయింది. ఆశ్చర్యపడాల్సినది ఏమంటే మా టీమ్ లో మిగతా ఇద్దరికీ కూడా తెలుగు తెల్సు. PO-1 ఏమో ఆర్ట్ టీచర్, PO-2 ఏమో అంగన్వాడీ కార్యకర్త. నాకైతే చాలా ఆనందమనిపించింది. పైగా మా presiding officer గారికి ఇది 13 వ ఎలక్షన్ డ్యూటీ అంట. ఇంకేం భయం ఉంటుంది. 


ఇక ఎన్నికల ముందు రోజు ఊరికి వెళ్తున్నట్టు అన్నీ బ్యాగులో పెట్టుకుని బయలు దేరాం. మరి ఆ రెండు రోజులూ అక్కడే బస చేయాలిగా. మా పోలింగ్ బూత్ ఆర్డర్ చేతిలో పెట్టారు వెళ్ళాక. అది కూడా దూరమే మాకు. పైగా చాలా లోపలికి అంట. అందరూ అక్కడనుండి ఆటో తీసుకుని వాడికి 500 సమర్పించి పోలింగ్ బూత్ చేరుకున్నాం. స్కూలు అయితే బాగుంది నీట్ గా. అక్కడ మొత్తంగా 5 బూత్ లు ఉన్నాయట. సాయంత్రం దాకా అలా కాలక్షేపం చేశాం. సాయంత్రం సామగ్రి అంతా వచ్చింది. అవన్నీ అమర్చడం లో టైమే తెలియలేదు. పోస్టర్లు అంటించాలి, ఓటర్ స్లిప్పులు తయారు చేయాలి, చెక్ లిస్ట్ లో చూసుకోవాలి అన్నీ వచ్చాయో లేదో. ముఖ్యంగా EVM, VVPAT సరిగా పని చేస్తున్నాయో లేదో చూడాలి. ఇక ఆ రాత్రి వాళ్ళిచ్చిన దోశలు తిని ఆ గదిలోనే పడుకున్నాం. బెంచీలు రెండు ఒకదానికొకటి పక్కన పెట్టి, అదే ఆరోజుకి మంచం. 


ఎన్నికల రోజు రానే వచ్చింది. రాత్రి నిద్ర సరిగా పడితే కదా. తెల్లవారి 3 కి లేచి 5 కల్ల తయారైపోయాము. పొద్దున టిఫిన్ ఎప్పటికి  వస్తుందో తెలీదు అని మా మేడం బ్రెడ్ పాకెట్ తెచ్చింది. అవే తలొక రెండు జాం రాసుకుని తిన్నాము. పొద్దున 6 కి పోలింగ్ ఏజెంట్లు వచ్చారు హడావిడి గా. వాళ్ళ సమక్షంలోనే 50 ఓట్లకి mock poll పెట్టాలి. అప్పుడు నాకు పూర్తిగా అర్థం అయిపోయింది. కంట్రోల్ యూనిట్ ని ఎలా ఆపరేట్ చేయటం అనేది. నమ్మకం వచ్చింది కొంచెం. 


ఇక 7 గం.కి పోలింగ్ మొదలైంది. మా బూత్ లో మొత్తం ఓటర్లు 647. నా పని ఏమంటే PO-2 దగ్గర్నుండి వచ్చిన వాళ్ళకి ఇంక్ పెట్టడం, వల్ల దగ్గర్నుండి ఓటర్ slip తీసుకుని 50 కలిపి ఒక కట్టగా కట్టడం, వోట్ వేసే ముందు కంట్రోల్ యూనిట్ లోని ballot బటన్ నొక్కడం. బాగుంది మొత్తానికి. ఎంజాయ్ చేశాను పనిని. ఒకే ఒక్క ఇబ్బంది ఏమిటంటే ఆ ఇరుకు బెంచి మీద రోజంతా కూర్చుని ఉండటం వల్ల నడుం నొప్పి, ఇంకా రెండు రోజులు సరిగా నిద్ర లేకపోవడం.


ఆరోజు 7 కి పోలింగ్ పూర్తి చేసేసాం. పోలింగ్ శాతం 73% వచ్చింది మాకు. అప్పట్నుంచి చాలా పని ఉంది presiding officer గారికి. VVPAT, EVM, కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ అన్నిటినీ బాక్సుల్లో భద్రపరచి సీల్స్ వేయాలి. వాళ్ళు ఇచ్చిన ఫారాల్ని పూర్తి చేయాలి. మేం చేయగల్గినంత సహాయం చేశాం. ఆ జోనల్ ఆఫీసర్లు వచ్చి మా సామగ్రి అంతా తీసుకునే సరికి రాత్రి 9 దాటింది. 


ఒక వయసు మళ్ళిన ఓటర్, తన గుర్తింపు కార్డు చూపించమని అడిగినపుడు ఈ ఊరిలో నా పేరుతో నేను ఒక్కడినే ఉన్నాను..అదీ..ఇదీ..అని వితండవాదం చేశాడు. చివరికి అందరూ నచ్చ చెప్పడంతో ఓటర్ id బయటికి తీసాడు. ఇంకోటి ఏమంటే ఈ పోలింగ్ ఏజెంట్లు ఉన్నారు కదా. వాళ్ళు వోట్ వేసేటపుడు ఇంక్ తక్కువగా అంటించమన్నారు. నేను మామూలుగానే పెట్టేసాను. వెంటనే చేరిపేసుకుంటున్నారు. అదేం చిత్రమో మరి…?? నాకైతే అర్థం కాలేదు🙄


హ్మ్..ఆ రాత్రికి అక్కడే ఉందాం అని నిర్ణయించుకున్నాం. అప్పుడు స్కూల్లో మేం తప్ప ఇంకెవరు లేరు. ఇక మర్నాడు పొద్దునే 4 కే లేచి ఆటో లో దగ్గర్లో ఉన్న "అత్తిపట్టు" రైల్వే స్టేషన్ కి చేరుకున్నాం. అక్కడ్నుంచి సబర్బన్ ట్రైన్లో ఇంటికి వచ్చేసాను. 


మొత్తానికి ఇలా నా చిన్నప్పటి కోరిక తీరింది అన్నమాట😇😇🤩


ఒక ఐదు నిముషాల పాటు గ్లవ్స్ తీస్తే ఇదీ పరిస్థితి..😐


17, మార్చి 2021, బుధవారం

నా కొత్త కళ

బుధవారం, మార్చి 17, 2021 9 Comments

 ఈమధ్య ఇలాంటి చిత్రాలు ఇన్స్టా లో చూసాను. చాల నచ్చాయి నాకు. నాకు కూడా గీయాలనిపించింది. మొట్ట మొదటి సారిగా ఇది ప్రయత్నించాను. బాగా వచ్చింది. నేను కూడా బాగా గీయగలను అని నమ్మకం వచ్చింది. కొన్ని చిత్రాలను ఇన్స్టా నుండి ఇంకా పింటెరెస్ట్ నుండి తీసుకొని అప్పుడప్పుడు ఇలా వేస్తున్నాను. ప్రస్తుతానికి నా దగ్గర ఉండే నల్ల జెల్ పెన్నులనే వాడుతున్నాను. మంచి ఫైన్ లైనర్స్ కొనుక్కొవాలి ఎలాగైనా..


ఈమధ్య కాలం లో వేసినవి ఇవే.. ఎలా ఉన్నాయి??

3, జనవరి 2021, ఆదివారం

నాతో సైకిలు ఎక్కుతారా..??🚲

ఆదివారం, జనవరి 03, 2021 2 Comments

 ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు..🥳

Google image


ఈనాటి ఈ బంధమే నాటిదో..ఈనాడు పెనవేసి ముడి వేసెనో.. ఓ..🎶 నాకూ..సైకిల్ కూ ఉన్న అనుబంధం ఈ నాటిది కాదు. నాకు 6-7 ఏళ్లు అప్పటి ది. చిన్నప్పుడు ఏం చేసే వాళ్ళమో తెలుసా.. సైకిల్ పక్కనే చతికిలబడి బుల్లి బుల్లి చేతులతో పెడల్ ను గిరగిరా తిప్పే వాళ్లం కదా. ఇలా చేయటం ఎంత సరదా ఇచ్చేది అంటే మాటల్లో చెప్పలేం. సరిగా తిప్పక పోతే సైకిల్ మీద పడే అవకాశాలు కూడా లేకపోలేదండొయ్..

కాస్త పెద్దయ్యాక... ఈ పని అందరూ చేసే ఉంటారేమో! స్టాండ్ వేసి ఉన్న నాన్నగారి సైకిలు పెడల్స్ మీద మన కాళ్ళు వేసి డెక్కుతుంటే (అలా తొక్క డాన్ని మా వైపు డెక్కడం అంటారు) వెనుక చక్రం తిరిగేది. ఆ మాత్రం దానికే సైకిల్ తొక్కడం వచ్చేసిందోచ్ అని బీరాలు పోయేవాళ్ళం. 😆


అద్దె సైకిళ్ళ జమానా.. మా ఇంటికి పక్కనే సైకిల్ షాప్ అంకుల్ ఉండేవారన్నమాట. వాళ్ళ ఇంటి దగ్గరే కొన్ని సైకిళ్లు పెట్టుకొని అద్దెకి ఇస్తుండేవారు. అందులో రకరకాల సైకిళ్ళు ఉండేవి. మొదటివి బుల్లి సైకిళ్ళు.. ఇవి మాలాంటి పిల్లకాయలు తొక్కుకునేవి. రెండో వి కొంచెం పెద్ద సైకిళ్లు.. ఇవి కాలేజీలకు వెళ్లే కుర్రకారు తొక్కేవి. మూడో రకం పే..ద్ద సైకిళ్లు.. ఇవి పెద్ద వాళ్ళు తొక్క గలిగేవి. 

ఆ బుల్లి సైకిళ్ల లో మళ్లీ.. అక్కడ రెండే ఉండేవి. ఒకటేమో చిన్నగా ఉండి, వెనకాల టైర్ కి అటూ ఇటూ ఇంకో రెండు చిన్న చిన్న చక్రాలు ఉండేవి పడిపోకుండా. ఇంకోటి దీనికంటే కొంచెం పెద్దగా ఉండి, అలాంటి చక్రాలు ఉండేవి కాదు. ఆ అంకుల్ గంటకి ఐదు రూపాయల చొప్పున అద్దెకు ఇచ్చే వారు. ఎప్పుడు చూసినా ఆ బుల్లి చక్రాల సైకిలు దొరికేదే కాదు..😏 అందుకే మా చెల్లి నేను ఆదివారాలు పొద్దున్నే లేచి ఆ సైకిల్ కోసం వెళ్ళేవాళ్ళం. మా ఇంటి ఎదురుగా గ్రామ దేవత గుడి ఉండేదన్నమాట. గుడి చుట్టూ చాలా ఖాళీ స్థలం కూడా ఉండేది. అక్కడికి పోయి సైకిల్ పై తెగ తిరిగే వాళ్ళం వంతుల వారీగా. ఇంకో చక్రాలు లేని సైకిల్ కూడా తొక్కాలని ఉండేది కానీ భయం వేసేది. దాన్ని మేం అద్దెకు తీసుకున్న దాఖలాలే లేవు. 


నేను నాలుగో తరగతిలో ఉన్నప్పుడు డాడీ, ఎవరో పాత సైకిల్ అమ్మే స్తుంటే దాన్ని తీసుకుని ఇంటికి తెచ్చారు మేము నేర్చుకుంటామని. ఇదే ఆ సైకిల్. మిస్ ఇండియా.. దాని హ్యాండిల్స్ మన వైపు వంగి ఉంటాయి. అలా ఉండటం నాకు అంతగా నచ్చేది కాదు. కానీ నేర్చుకోవడానికి ఏదైతేనేం..

ఇదే నా మొదటి సైకిలు..కాకపొతే చెప్పాగా..హ్యాండిల్స్ వంగి ఉండేవి..(Google image)


చిన్నప్పుడు మనందరినీ ఇలాగే భయపెట్టి ఉంటారు కదా...మోచిప్పలు కొట్టుకోకుండా సైకిల్ తొక్కడం నేర్చుకోలేం అని. నాకు మరి ఆ రేంజ్ లో దెబ్బలు తగలలేదు కానీ.. తగిలేవి. చాలాసార్లు సైకిల్ పై నుండి పడ్డాను. తుప్పల్లోకి పోనిచ్చేసాను. రోడ్డుమీద అనుభవాలు వేరేగా ఉండేవి లెండి. చెప్తా ముందు ముందు. రోజూ స్కూల్ నుండి రావడం, సైకిల్ వేసుకొని ఖాళీ రోడ్లోకి పోవడం ఇదే పని. 

హ్మ్.. మొత్తానికి తంటాలు పడి పడి.. సైకిల్ ను ఐదో తరగతి లో కి వచ్చేసరికల్లా నేర్చుకో గలిగాను. చెల్లి కూడా నాతో పాటు నేర్చేసుకుంది. కానీ.. దానికంటే నేను రెండు ఆకులు ఎక్కువే చదివాను. అదేంటి అంటారా.. డబల్సు తొక్కడం. అదేనండి.. వెనకాల ఇంకొకరిని కూర్చోబెట్టుకొని తొక్కడం. హహహ.. డబల్సు తొక్కే మొదట్లో ఎవరో సలహా ఇచ్చారు. స్కూలు బ్యాగు వెనకాల పెట్టుకొని తొక్కితే ఈజీగా వస్తుందని. అది బాగానే పనిచేసిందనే చెప్పుకోవాలి..🤷 


హా... ఒకసారి ఏమైందంటే........ నా ఐదో తరగతి లోనూ, చిన్నా ఐదో తరగతి లోనూ నవోదయ పరీక్ష రాసేందుకు కోచింగ్ కి వెళ్ళే వాళ్ళం. అది మాకు కొంచెం దూరమే. నేను అప్పుడప్పుడూ సైకిల్ వేసుకెళ్ళే దాన్ని. అమ్మ వాళ్లకి భయం కొద్దీ ఇచ్చేవారు కాదు. చీకట్లో రోడ్డుమీద తొక్కడం కష్టమని. వెళ్లడం కోసం రోడ్డు దాటాల్సి వచ్చేది. అలాగే ఒక రోజు రోడ్డు దాటుతుండగా, సడన్ గా బైక్ మీదకి వచ్చేయడంతో భయమేసి సైకిల్ వదిలేసే సరికి అది కాస్తా.. నన్ను కింద పడేసింది. మోకాళ్లు కొట్టుకుపోయాయి. పైగా శీతాకాల మేమో.. చాలా నొప్పి వేసింది. ఇంట్లో ఇలా పడ్డా అని చెప్పలేదు. చెప్తే తెలుసుగా ఏమవుతుందో. మనల్ని తిరిగి తిడతారు, జన్మలో సైకిల్ మళ్లీ ఇవ్వరు. అందుకే గప్ చుప్ గా ఉండిపోయా. 🤫

ఆ దెబ్బ మానుతున్న రోజుల్లో ఊరికే స్నేహితులతో కలిసి సైకిల్ తొక్కాము. నేనేమో చిన్నా ను వెనుక ఎక్కించుకున్న. అప్పుడు ఏమైందంటే.. అది కొంచెం ఇరుకు రోడ్డు అన్నమాట. ఇంకో పిల్ల నాకు దగ్గర కంటా వచ్చేయడంతో మా సైకిళ్ళ హాండిల్సు ఒకదానిమీద ఒకటి వచ్చి అందరం కింద పడి పోయాం. ఇక చూస్కోండి. నేను ఆరోజు మంచి పరికిణీ వేసుకున్నాను. అప్పుడప్పుడే తగ్గుతున్న దెబ్బ కాస్తా.. రాచపుండు లా తయారైంది. ఈసారి రక్తం కూడా వచ్చింది. ఆ దెబ్బతో కొన్నాళ్లు కోచింగ్ కి ఆటోలో వెళ్ళే దాన్ని. 🤕😵


తర్వాత నేను 6, చిన్నా 5 చదువుతున్నప్పుడు, దాన్ని ఒక్క దాన్నే కోచింగ్ కి పంపడానికి భయమేసి, అక్కగారి హోదాలో నేనే సైకిల్ పై తీసుకెళ్లి తీసుకు వచ్చే దాన్ని. అస్తమానం కోచింగ్ అంటుంది, స్కూలు సంగతి ఏంటి అనుకుంటున్నారా.. మా స్కూలు మాకు పక్కనే అండి. ఇలా వెళ్లి అలా వచ్చేవాళ్ళం. 'ఇంటర్బెల్లు' (interval+bell😜) లో కూడా ఇంటికి వచ్చే వాళ్ళం అప్పట్లో. ఈసారి పాత సైకిల్ తో పాటు కొత్త సైకిల్ కూడా వచ్చి చేరింది. నా కోసం అప్పుడు డాడీ కొన్నారు. తర్వాత ఆ పాత మిస్ ఇండియా షెడ్ కి వెళ్ళిపోయింది. ఈ కొత్త సైకిల్ కి హ్యాండిల్స్ ఇంచక్కా నిదానంగా ఉండేవి. ఈ సైకిల్ తోనే నాకు అనుబంధం ఎక్కువ. 

నా సైకిలు ఎరుపు రంగులో ఉండేది..(Google image)


హైస్కూల్లో ఎనిమిదో తరగతి లో చేరాక ఎక్కువగా వాడే దాన్ని. స్కూలు, ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉండేది. అలా పదో తరగతి దాకా ఆ సైకిల్ నన్ను మోసింది. ఇక్కడ ఒక అసందర్భ ప్రేలాపన ఒకటి చెప్పాలనిపిస్తుంది. అంటే మరీ అసందర్భం అని కాదు కానీ .. మనకి ఈ జీవితంలో అతి వేగంగా సైకిల్ తొక్కిన సందర్భం అంటూ ఒకటి ఉంటే నాకదన్న మాట..😛

ఆరోజు మా లెక్కలు సారు గారి అమ్మాయి పెళ్లి. మమ్మల్ని కూడా పిలిచారు. నేను, నా ఫ్రెండు పెళ్లి భోజనం చేసి, సైకిల్ మీద బయల్దేరాం. ఇద్దరము గాగ్రాలు వేసుకున్నాము. అవి వేసుకుని సైకిల్ తొక్కడం కొంచెం కష్టమే. సగం దూరం వచ్చాక బైకు మీద ఇద్దరు కుర్రాళ్ళు మా వెంట పడ్డారు 😤 మేమిద్దరం ఎటు వెళ్తే అటే వస్తున్నారు. హార్ట్ బీట్ పెరిగింది ఇద్దరికీ. అలా కాదని.. రూట్ మార్చేసి మేము సందుల్లోంచి ఇళ్లకు చేరుకున్నాం. అప్పుడే చాలా స్పీడ్ గా సైకిల్ తొక్కినట్టు గుర్తుంది నాకు. 😟


టెన్త్ తర్వాత నా సైకిలు అలాగే మూలన పడి ఉండేది. దానికి మోక్షం మళ్లీ రెండేళ్ల తర్వాత అంటే నేను డి .ఎడ్ చదివేటప్పుడు కలిగింది. అప్పుడు కాలేజీ మూడు కిలోమీటర్ల దూరంలో ఉండేది. తప్పింది కాదు. బస్సులో వెళ్లడం నాకు సుతరామూ ఇష్టం లేదు. ట్విస్ట్ ఏంటంటే మా యూనిఫామ్ చీర కదా... చీర కట్టుకొని సైకిల్ తొక్కడం. దానికి నేను ఏం చేసే దాన్ని అంటే.. యుద్ధానికి సిద్ధమయ్యే వాళ్ళు కవచాలు అన్ని ధరించినట్టు నేను... చీర కుచ్చిళ్ళు చెదిరిపోకుండా కింద ఒక పిన్ను పెట్టేదాన్ని... ముఖానికి స్కార్ఫ్ కట్టే దాన్ని... తొక్కడం ఎలా అంటే.. కుడి చేత్తో హ్యాండిల్... ఎడమచేతితో కుచ్చిళ్ళు.. చైన్ లోకి చీర వెళ్ళిపోకుండా అన్నమాట. అయినా రెండు మూడు సార్లు అలా జరిగి చీరంతా ఆయిల్ మరకలు అంటించాను లెండి😩 అప్పట్లో ఈ బాధలన్నీ పడలేక చాలాసార్లు డ్రెస్ వేసుకొని పోయేదాన్ని. ఏదో ఒక వంక చెప్పేదాన్ని టీచర్స్ అడిగితే. లేకపోతే చీర యూనిఫామ్ ఏంటో...🤦🤦 ఆ చదువులో గిట్టనిది ఏమైనా ఉంటే అదే. కథ పక్కదోవ పడుతుంది కదా.. సరే సరే వెనక్కి వచ్చేద్దాం..


మళ్లీ సైకిల్ కథ ఎక్కడ మొదలైంది అంటే.. నేను కేవీ లో చేరాక. చేరిన నెల కే మిస్స్ ఇండియా పెటల్ కొనుక్కున్నాను. చాలామంది అన్నారు.. స్కూటీ కొనుక్కోవచ్చు కదా అని. కానీ సైకిల్ తొక్కటం ఆరోగ్యానికి మంచిది అది ఇది అని అనను కానీ, లైసెన్సు లేకపోవడం, స్కూటీ నడపడం రాకపోవడం వల్ల అప్పట్లో స్కూటీ జోలికి పోలేదు. పిల్లలతో పాటు నేను కూడా సైకిల్పై రావడం చూసి అందరూ వింతగా చూసేవారు. హేహే 🤭

ఇదే అన్నమాట..నా ప్రస్తుత సైకిలు(Google image)


అదన్నమాట నా సైకిల్ కథ. మొన్న వింటర్ బ్రేక్ లో నేను కూడా స్కూటీ నడపడం నేర్చుకున్నాను లేండి 🥴

P.S : అసలు ఈ టపా వేయడానికి చాలా తంటాలు పడాల్సి వచ్చింది. టైప్ చేసి ప్రివ్యూ చూస్తుంటే అంతా గజిబిజి గా వస్తుంది పేజీ. టెంప్లేట్ లో సమస్య ఏమో అని మార్చి కూడా చూసాను. కానీ నాకు ప్రస్తుతం ఉన్న టెంప్లేట్ చాలా ఇష్టం. మార్చడం నచ్చలేదు నాకు. ఇలా కాదని..అదంతా delete చేసి మళ్లీ కొత్త టపాలో ఇదంతా రాశాను. ఇప్పుడు బాగానే వస్తుంది. ఈ ప్రక్రియ అంతా అయేసరికి గంట పైనే పట్టేసింది.😩మీకు ఈ template ఎలా అనిపించింది.. కామెంట్లలో చెప్పండే..టాటా