6, సెప్టెంబర్ 2018, గురువారం

'స్మార్ట్' కిడ్స్

గురువారం, సెప్టెంబర్ 06, 2018 2 Comments



ఈ కాలం పిల్లలని ఫోన్లకి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదని నా అభిప్రాయం. చిన్న పిల్లలు ఫోన్ ను కూడా ఆటవస్తువులాగే భావిస్తారు. ఒక వయసొచ్చాక ఇచ్చినా ఫర్వాలేదు..కానీ మరీ పసివయసులోనే అలవాటు చేస్తే ఇబ్బందే మరి. ఒక్కసారి చేతికిస్తే చాలు, మళ్ళీ అది మన చేతికి ఎప్పుడు వస్తుందో ఆ దేవుడికే తెలియాలి. ఫోనులో ఎక్కడ ఏమేమున్నాయో మనక్కూడా తెలియనంతగా వారి తెలివిని ప్రదర్శిస్తారు. నా అనుభవంలో జరిగిన సంఘటనలు చెబుతాను!!

ఒక ముఖ్యమైన పోటీ పరీక్షకి విశాఖపట్నం వెళ్ళాల్సి వచ్చింది. మామూలుగా ఇలా పరీక్షల కోసం రాజమండ్రి, విజయవాడ వరకే వెళ్ళాను. ఇవైతే ఒక్కరోజులో వెళ్ళి వచ్చేయొచ్చు. కానీ విశాఖపట్నం అలా కుదరదు మాకు! పోనీ వెళ్ళకుండా మానలేని పరీక్ష, అందుకని ముందురోజు ఉదయమే "సింహాద్రి" (అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు "హింసాద్రి". అందరి అభిమానం తట్టుకోలేక రైల్వే వాళ్ళు ఈ లింక్ ఎక్స్ ప్రెస్ ని నడపట్లేదు ఇప్పుడు) కి బయల్దేరాం. విశాఖలో దిగేసరికీ రాత్రి అయింది. ఆ రాత్రి, మా దగ్గరి బంధువుల ఇంటి దగ్గర ఉన్నాము. 


నేను ట్రయిన్ లో కాలక్షేపానికి పనికి వస్తుందని నా Tablet ని తీసుకెళ్ళా (8-9 గంటల ప్రయాణం మరి). ఆ బంధువులింట్లో చిన్న పిల్లాడు ఉన్నాడని తెల్సి ముందు జాగ్రత్తగా నా ట్యాబ్ ని ట్రయిన్ దిగక ముందే నా బ్యాగ్ లో కనిపించకుండా సర్దేశాను. వాడెప్పుడూ ఫోన్లతోనే ఉంటాడట. మా డాడీ తన ఫోన్ బయటికి తియ్యగానే అది తీసేసుకున్నాడు. లాక్ వేసి ఉన్నా తీయడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ తిరిగి ఇవ్వడం లేదు. వాళ్ళ అమ్మ ఇచ్చేయమని బతిమాలితే తప్ప కనికరించలేదు.దానికి చార్జింగ్ పెట్టనిస్తే ఒట్టు.. మా డాడీ ఇలా చార్జింగ్ పెట్టడం వాడు అలా తీసేయడం...ఇదే వరుస!. వాడికి అప్పటికే ఒక పాత ఫోను, ట్యాబ్ ఉన్నాయి. ఏది కొత్తదొస్తే అదే కావాలట. నా దగ్గర ట్యాబ్ ఉందని బయటపెట్టని నా ముందుజాగ్రత్తని మెచ్చుకున్నా!


తర్వాతి రోజు ఆదివారం..పరీక్ష రోజు. మా బ్యాగులూ అవీ అక్కడే ఉంచేసి, పరీక్షకి కావల్సినవి తీసుకుని బయల్దేరాం. పరీక్ష ఐతే బాగానే రాశాను. ఇంతా చేసి వైజాగ్ వస్తే...అది అరగంట పరీక్షే!! ఆ రోజు ఇక అక్కడే ఉండి మర్నాడు తెల్లారగానే ట్రయిన్ కి వెళ్దామని మా ప్లాన్. పరీక్ష అవ్వగానే ఇంటికి వెళ్ళాం. 


అక్కడి దృశ్యం చూసి నా కళ్ళు బైర్లు కమ్మాయి. వాడు చిద్విలాసంగా సోఫాలో కూర్చుని నా ట్యాబ్ లో ఆటలు ఆడుతున్నాడు. 😣మనకసలే మొహమాటం ఎక్కువాయే. ఇవ్వమని అడగలేకుండా ఉంది నా పరిస్థితి. "ఈ పిల్లకి మరీ ఇంత ఇదేంటో..ఒకసారి తీసుకున్నంత మాత్రాన నీ ట్యాబ్ ఏమీ అరిగిపోదులే" అన్నట్టు చూస్తారేమోనని భయం నాకు. అందుకే ఏం మాట్లాడకుండా నా బాధని దిగమింగుకుని సైలెంట్ గా ఉన్నా. ఇంతలో వాళ్ళమ్మ చెప్పింది...మేం వెళ్ళగానే మా బ్యాగ్ తెరిచేసి అన్నీ కెలికేసాడంట. ఇస్త్రీ చేసి పెట్టుకున్న బట్టలు అన్నీ చెల్లాచెదురు చేసేసాడు. ట్యాబ్ దొరికింది..ఇక అన్నీ అలాగే వదిలేశాడు. నేను ట్యాబ్ ని దాని స్పెషల్ బ్యాగ్ లో పెట్టి లగేజ్ బ్యాగ్లో ఉంచాను..అన్నీ తీసేశాడు.


ట్యాబ్ కి పాటర్న్ లాకులు, పాస్వర్డ్ లు పెట్టే అలవాటు నాకు లేదు. సాధారణ స్లైడ్ లాక్ ఒక్కటే ఉంటుంది. బ్యాగ్లో పెట్టేముందు షట్ డౌన్ చేసే పెట్టాను. అయినా ఆన్ చేసేశాడు. పట్టుమని పదేళ్ళు కూడా లేవు వాడికి..ఎంత తెలివో!! వాడి అమ్మావాళ్ళేమో "ఏం చెయ్యడులే", "అన్నీ తెలుసు మావాడికి" అని అంటున్నారు. అయినా నా భయాలు నావి. అది వాడి చేతిలోంచి జారిందంటే అంతే చాలు లేదా కోపం వచ్చి దాన్ని విసిరికొట్టాడంటే!!అమ్మో...ఆ ఊహే ఎంతో భయంకరం..నా ట్యాబ్ ని ఒక కంట కనిపెడుతూ బట్టలు మడత పెట్టాను. చివరికి ఏదోలా మభ్యపెట్టి ట్యాబ్ ని నా చేతిలో పెట్టారు. నేను ఇచ్చిందే తడవుగా పాస్వర్డ్ పెట్టేశా!.ఏమేం తెరిచాడో చూద్దామని Recent Apps చూస్తే ఒక గేం ఆడాడు, కొన్ని ఎవేవో ఫోటోలు తీశాడు.. ఇంక తర్వాత మేము వచ్చేయడంతో అది అక్కడితో ముగిసింది.

ఇలా చెప్తుంటే నాకు ఇంకా ముందు జరిగిన సంఘటన ఒకటి గుర్తుకొచ్చింది.

ఒకరోజు మా ఇంటికి తెల్సినవాళ్ళు వచ్చారు. వాళ్ళతో పాటు మూడేళ్ళ పాప కూడా వచ్చింది. నేను అప్పటికి ట్యాబ్ లో ఏదో చదువుకుంటున్నాను. మావాళ్ళు, ఆ వచ్చినవాళ్ళు కబుర్లు చెప్పుకుంటుంటే, ఆ పిల్ల నా దగ్గరికి వచ్చింది. చిన్నపిల్ల కదా అని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నా. పక్కనే పెట్టిన ట్యాబ్ తీసుకుంది. Gallery తెరిచింది. ఒక్కొక్కటి తిప్పుతూ ఫోటోలు చూస్తుంది. Gallery లో ఒక mode లో కిందకు తోస్తే డిలీట్ అయిపోతాయి కదా..అలా తను మూడు ఫోటోలు డిలీట్ చేసేసింది. అవేమంత ముఖ్యమైన ఫోటోలు కాదు కాబట్టి సరిపోయింది. లేదంటేనా!!(ఒక వేళ అయినా చేసేదేమీ లేదు)..


అందుకనే చిన్నపిల్లలకి ఫోన్లూ అవీ అలవాటు చేయకపోవటమే మంచిది. (మా పిల్లలు టెక్నాలజీకి దూరంగా ఉండాలా? అని ఎదురు ప్రశ్న వేస్తే నేనేం చేయలేను మరి) మనం చూస్తూనే ఉన్నాం..స్మార్ట్ ఫోన్ల కాలంలో పసివాళ్ళు ఎలా మారిపోయారో!! ఒక పిల్లేమో ఫోన్లో పాటలు పెట్టందే ముద్ద తినదు..ఇంకొకడేమో వాళ్ళ డాడీ ఫోన్ ఇవ్వనంటే ఇల్లెగిరిపోయేలా ఆరున్నొక్కరాగం ఆలపించడానికి గొంతు సవరిస్తాడు. ఒకవేళ ఫోన్లు అలవాటు చేసినా, ఇంకొకరి ఫోన్లని కూడా లాక్కోవడం మంచిది కాదని చెప్తే సరి!!! (వాళ్ళు వింటే మంచిది, లేకపోతే నాలాంటి వాళ్ళు బలైపోతారు)....

31, జులై 2018, మంగళవారం

గ్రహణం

మంగళవారం, జులై 31, 2018 7 Comments
ఆ శతాబ్దపు సుదీర్ఘ చంద్ర గ్రహణం 27 జూలై న ఏర్పడ్తుందని రేడియో మరియు పత్రికల ద్వారా తెల్సుకుని, ఈ ఖగోళ అద్భుతాన్ని  ఎలాగైనా చూసి తీరాలని మంగమ్మ శపధం లాంటిది చేసాం...అదీగాక అరుణ గ్రహాన్ని కూడా పనిలో పనిగా చూడొచ్చంటగా...చంద్రుడికి దగ్గరగా వస్తాదట..కానీ అది అర్ధరాత్రిలో జరుగుతుందని తెల్సి నిరాశపడ్డా!! అయినా నా పిచ్చి గాని చంద్రుడు పగలు వస్తాడా ఏంటి!!!ప్చ్..కనీసం రాత్రి పది లోపు కూడా కాదు..

రాత్రి పడుకునే ముందు పైకెక్కి చూస్తే చంద్రుడు ఎక్కడా లేడు..నా మట్టిబుర్ర అప్పుడు వెలిగింది..పౌర్ణమి నుంచి చంద్రుడు ఆలస్యంగా తీరిగ్గా వస్తాడు కదా... ఆకాశం అంతా మబ్బుపట్టి ఉంది. ఒక్క చుక్క కూడా లేదు...ఇలా ఐతే గ్రహణాన్ని చూడ్డం కష్టమే మరి...ఏమో ఆ టైం కి ఎలా ఉంటుందో మరి.. నేను చూసే సమయానికి మేఘాలని కొంచెం పక్కకి తప్పుకోమని శరణు వేడుకొని కిందకి వచ్చేశా..!!

అర్ధరాత్రి మెలకువ రావడం కష్టమని సెల్లులో ఒంటిగంటకి అలారం పెట్టుకుని పడుకున్నా..కాసేపయ్యాక సడెన్ గా మెలకువ వచ్చింది..ఒహ్హో..అలారం అక్కర్లేకుండానే మెలకువ వచ్చిందే. నువ్ గ్రేట్ మోహనా అని నాకు నేనే భుజం తట్టుకున్నా...త్వరగా డాబా పైకి వెళ్ళి చంద్రుడి దోబూచులాట చూడాలనుకుంటూ.. అనందపడుతూ టైం చూశా... అంతే కత్తివేటుకి చుక్క నెత్తురు లేదన్న మాదిరి టైడ్ యాడ్ లో లాగా షాక్ అయ్యావా! అని చెవిలో ఎవరో అరిచినట్లయింది ఒక్కసారిగా..నేనేమో ఏ 12 అయ్యిందో అనుకున్నా...కానీ అంతలోనే నా ఆనందం అంతా ఆవిరి అయిపోయింది ఈ ఆషాఢం ఉక్కపోతకి..ఇంతకీ టైమెంతో తెల్సా??...తెల్లవారుజాము 4...హ్మ్..ఏం చేస్తాం..ఇంక మా చెల్లినేం లేపుతాను..పోనీ ఒకేఒక్క లాస్ట్ చాన్స్ అనుకుని, టైం చచ్చినా ఆశ చావక..(సామెత మార్చాన్లెండి!!)ఒకసారి చూసి వస్తే ఏమవుతుందని మెల్లగా తలుపులు తీసుకుని మా ఇంటికి రోజూ వచ్చే పిల్లిలా మెట్లెక్కా.. శబ్దం చేస్తే ఏ దొంగ వెధవో వచ్చాడనుకుంటారుగా మరి..

సీన్ కట్ చేస్తే చంద్రుడు మామూలుగానే ఉన్నాడు కానీ మబ్బుల ముసుగులో దాక్కున్నాడు..నన్ను ఎవరెవరు చూస్తున్నారా!!?? అని మేఘాల చాటు నుండి తొంగి తొంగి చూస్తున్నాడు. “నువ్వు నా గ్రహణంలో నన్ను చూడకుండా నిద్రపోయావ్ గా!! నీ ముఖం చూడను గాక చూడను ఫో!!”అంటూ మొత్తంగా మబ్బుల్లోకి దూరిపోయాడు..ఎంత జుట్టు పీక్కుని గింజుకున్నా కదిలిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేం గా!!నేనే మన్నా ‘24’ సినిమాలో సూర్య నా ఏంటీ!!!ఇంక చేసేదేంలేక కిందకివచ్చేసి తలుపులు జాగ్రత్తగా వేసేసి ఫ్యాన్ వేగం కాస్త పెంచి మళ్ళీ మంచమెక్కా...

ఇక ఆరింటికి మా చెల్లికి జరిగిన తతంగం చెబుదామని లేపాను...(అదింకా లేవ నేలేదు!!)..ఆవులిస్తూనే అప్పుడే ఒంటిగంట అయిపోయిందా అంది..నేను కొంచెం గట్టిగా ఒంటిగంట కాదే తెల్లారిందే అని అరిచినంత పని చేసా..అప్పుడు అసలు విషయం చెప్పింది..రాత్రి 12 కి దానికి మెలకువ వచ్చిందంట..ఎలాగూ ఇంకో గంటలో అలారం మోగుతుందిగా అప్పుడు లేవొచ్చులే అనుకుని పడుకుందట..అప్పుడు నిన్నూ లేపాల్సిందే అని బాధపడింది..మొత్తానికి ఈ సుదీర్ఘ చంద్రగ్రహణాన్ని చూసే అవకాశాన్ని కోల్పోయాం..మళ్ళీ 2028 లో ఇలాంటిది వస్తుందంటగా అప్పుడైనా చూస్తానో లేదో!!??

కానీ ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి..ఈ సంవత్సరంలో ఏర్పడిన మొదటి చంద్ర గ్రహణం జనవరి 31 న వచ్చింది కదా..దాని పట్టువిడుపులని ఆసాంతం రాత్రి పది దాటే వరకు ఉండి మరీ చూశాం..అప్పుడు గ్రహణం ఒకటే కాదు..సూపర్ మూన్+ రెడ్(బ్లడ్) మూన్+ బ్లూ మూన్..ఇవన్నీ ఒకేసారి ఏర్పడ్డాయంట..చూడ్డమే కాదు మా శక్తి కొలదీ ఆ దృశ్యాలను కేమెరా లో బంధించటానికి..సారీ సారీ ఇరికించటానికి ఎన్ని అగచాట్లు పడ్డామో...మరి అంత పేద్ద చందమామ మా బుల్లి కేమెరాలో పట్టాలి కదా!!అందులో ఒకటే ఈ ఫోటో..బాగోకపోయినా ఏం అనుకోకండే!!