8, మార్చి 2020, ఆదివారం

అదివో..అల్లదివో.. శ్రీహరివాసము!!!

ఆదివారం, మార్చి 08, 2020 0 Comments







ఎప్పుడైనా ఎవరితో అయినా మాటల సందర్భంలో " నేను ఇప్పటిదాకా తిరుపతే వెళ్ళలేదు" అని అన్నానంటే ... విన్న వాళ్ళ ప్రతిస్పందన మామూలుగా ఉండదు. ఏదో ఘోరమైన పాపం చేసినట్టే చూస్తారు. మరేం చేయను..ఏమో..అలా అయిపోయింది. ఇలా కాదు…"నేను కూడా తిరుపతి వెళ్ళాను అని పదిమందితో సగర్వంగా చెప్పుకోవాల్సిందే" అని నిర్ణయించుకుని 😜 తిరుపతికి కుటుంబ సమేతంగా యాత్ర పథకం వేసుకున్నాం. తిరుపతిలో ఎప్పుడూ ఆ జన సందోహం అలానే ఉంటుంది కదా!! ఫిబ్రవరి, మార్చి నెలల్లో గుడ్డిలో మెల్ల లా కాస్తంత పలచగా ఉంటుంది జనాభా అని విని అప్పుడే అంటే ఫిబ్రవరి నెలాఖరు లో రెండు రోజులు ఎంపిక చేసాము. నేనేమో ఇక్కడి నుండి తిరుపతి వెళ్లేలాగ, అమ్మ డాడీ చెల్లి ఏమో అక్కడి నుండి తిరుపతి వచ్చే లాగా. చెల్లి నేను ఇద్దరమూ సెలవులు తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అప్పటి నుండి నా ఆనందం అంతా ఇంతా కాదు. మా వాళ్ళని కల్సి రెండు నెలలు అవుతోంది..వాళ్ళని కలవొచ్చు👨‍👩‍👧‍👧...ఇంకా ముఖ్యంగా తిరుపతి చూడబోతున్నా అనే ఆతృత ఇంకో వైపు🤩

అక్కడ వసతి సముదాయాల లో అద్దె గది రెండో రోజుకి మాత్రమే దొరికింది. మొదటి రోజుకి దొరకలేదు. మొదట అయితే కాలి నడకన కొండ ఎక్కుదాం అనుకున్నాం. కానీ తర్వాత ఎండ ఎక్కువగా ఉంటుంది...రిస్కు తీసుకోవడం ఎందుకు అని సర్వదర్శనం కి మారిపోయాము. 

అంతా అయిపోయింది. ఇక స్కూల్లో సెలవు తీసుకోవడం మిగిలింది. మూడు రోజులు casual లీవు అని లీవ్ లెటర్ రాసి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తే మూడు రోజులా.. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు. అప్పటికే డాడీ చెప్పారు ...తిరుపతి అని చెప్పకు..దగ్గరి వాళ్ళ పెళ్లి అనేదో చెప్పు అని..కానీ ఆ సమయానికి నోట్లోంచి అలా వచ్చేసింది.😒🙄 దానికి ఆయన .."పక్కనేగా..ఒక్కరోజు సరిపోతుంది "గా అన్నట్టు అన్నారు..నేనేం అనకుండా అలా నిలబడిపోయాను. HM మేడం చేత సంతకం తెచ్చుకో అన్నారు.. హ్మ్...🥴అదేదో ముందే తెల్సి ఉంటే బాగుండు నే అనుకుంటూ...తర్వాతి రోజు ఆవిడ దగ్గరికి వెళ్ళాను. ఆవిడ కూడా అదే ప్రశ్న వేశారు..ఎక్కడికి అని..నేను కూడా అదే సమాధానం చెప్పాను.." అబ్బాయిని చూడటానికా" అని నవ్వుతుంది సంతకం పెడుతూ🙈🙃 " కాదు మేడమ్" అంటూ పళ్ళు ఇకిలించా 🤦..మూడు రోజుల సెలవు కోసం ఇన్ని పాట్లు పడాల్సి వచ్చింది నాకు…
Google image

చెన్నై నుండి తిరుపతికి వెళ్లే సప్తగిరి ఎక్స్ప్రెస్ కి ఇక్కడ హాల్టు లేదు. అంబత్తూర్ వెళ్ళాలి లేక తిరువళ్లూరు...ఇది దూరం అవుతుంది నాకు. అందుకు మొదటిది ఎంచుకున్నా. ప్రయాణము అయ్యే రోజు రానే వచ్చింది. 5:30 కల్లా బయటపడి మా లోకల్ రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోయా. చీకటి ఇంకా పోలేదు. టికెట్టు కౌంటర్ 6:30 కి తెరుస్తారు అంట. ఇంక నాకేం చేయాలో తెలీక టికెట్టు లేకుండానే వేళచ్చేరి వెళ్లే ట్రైన్ ఎక్కేసి అంబత్తుర్ లో దిగిపొయాను.🤫 సరైన సమయానికి సప్తగిరి వచ్చేసింది. ఏమీ తినకపోవడం తో చాలా ఆకలి వేసింది. తిరుపతిలో దిగేసరికి 10 అయింది. మా వాళ్ళ ట్రైన్ చాలా ఆలస్యం అయిపోయింది. స్పెషల్ ట్రైన్ అట. నేను అక్కడే టిఫిన్ చేసి అలాగే కూర్చున్నా. 

మా అమ్మ నన్ను చూసిన వెంటనే మొదట అన్నమాటలు...చిక్కిపోయావు...నల్లగా అయిపోయావు….అని😣 నలుగురూ వెంటనే పక్కనే ఉన్న "విష్ణునివాసం" కి వెళ్ళిపోయాం. గదుల కోసం ఇంత పెద్ద లైను ఉంది. అక్కడే ఉన్న ఒకాయన డాడీ తో అన్నారట. ..కొండ మీద పద్మనాభ నిలయం లో ఫ్రీగా లాకర్లు ఉంటాయి. అక్కడే ఉండొచ్చు కూడా అని. సరే...ఇక్కడ ఇలా సమయం వృధా ఎందుకు చేయటం..రేపటికి ఎలాగూ రూం ఉంది కదా అని నలుగురం అదే రోజు రాత్రి 7 గం. సమయానికి సర్వదర్శనం టికెట్లు తీసుకున్నాం. తర్వాత బయటికి వచ్చి తిరుమల వెళ్లే బస్సు ఎక్కేసాం. దాని ముందు లగేజీ చెకింగ్ కూడా ఉంది టోల్ దగ్గర. ఘాట్ రోడ్ ప్రయాణం భలేగా ఉంది. తిరుమల బస్టాప్ నుండి కొన్ని అడుగుల దూరం లో పద్మనాభ నిలయం ఉంది. అక్కడికి వెళ్లేసరికి మధ్యాహ్నం 1 అయింది. మా లగేజీ అంతా లాకరులో పెట్టుకుని..అన్నప్రసాదం తిని తలనీలాలు ఇవ్వడానికి కళ్యాణ కట్టకి వెళ్ళాము. చిన్నా..నేను మూడు కత్తెర్లు ఇచ్చాము. మూడు కత్తెర్లు అంటే మూడు సార్లు కత్తిరిస్తుంది అనుకున్నా .. పిచ్చిదాన్ని...ఒకేసారి కత్తిరించి..పైన మూడు వెంట్రుకలని కత్తిరించింది.🤔😳..బానే ఉంది తెలివి...అసలు నేను కత్తెర్లు కూడా ఇవ్వను అంటే...మా అమ్మ ఊరుకోదు గా😓…

తర్వాత పద్మనాభం కి వెళ్లిపోయి స్నానాలు కానిచ్చి తయారు అయిపోయాం. సాయంత్రం 4 కల్లా బయటికి వచ్చేసి క్యూ దగ్గరికి వెళ్ళాము. 7 గం. వాళ్ళని అప్పుడే లోనికి పంపము అని అన్నారని..అక్కడి నుండి ఒక అర కిలోమీటరు దూరం లో ఉన్న ఎస్వీ మ్యూజియం కి నడుచుకుంటూ వెళ్ళాము. కొండ మీద తిరగటానికి ఉచిత బస్సులు అందుబాటులో ఉన్నాయి.
మ్యూజియం చాలా బాగుంది. శ్రీవారి విగ్రహాలు, చిత్రపటాలు, తిరుపతి చరిత్ర, రోజ్వుడ్ విగ్రహాలు, బ్రహ్మోత్సవ వాహన నమూనాలు, ముఖ్యంగా ఇద్దరు రాణులతో ఉన్న శ్రీ కృష్ణ దేవరాయలు విగ్రహాలు నాకు బాగా నచ్చాయి. 


క్యూ కాంప్లెక్స్ లోకి వెళ్ళాక పులిహోర ప్రసాదం పెట్టారు. చాలా బాగుంది😋 ఇంకా లోపలికి వెళ్ళాక మొబైల్స్ లాకర్లు లో పెట్టుకోడానికి ఉంది. అక్కడే టికెట్ల వెరిఫై చేసి కంపార్ట్మెంట్ నెంబర్లను ఇచ్చారు...ఎక్కడ కూర్చోవాలి అనేది. అలా క్యూ కాంప్లెక్స్ లో ఒక కంపార్ట్మెంట్ లో గంట పాటు ఎస్విబిసి చూస్తూ గడిపేసాం. తర్వాత్తర్వాత లైన్ అలా ముందుకు కదులుతూ...వెండి వాకిలి దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా క్యూ చాలా ఇరుకుగా అయిపోయింది...నాకు భయమేసి అమ్మ మెళ్లో చేతులు వేసి అలాగే వెనుక వాళ్ళు తోస్తుంటే ముందుకు అలా వెళ్ళిపోయాను😰. రెండు మూడు సెకన్ల పాటు దేవుణ్ణి చూసా. చీకటి లో ఉంది. దర్శనమ్ సరిగ్గా పావు తక్కువ తొమ్మిదికి అయింది. తర్వాత లడ్డూ కౌంటర్ దగ్గరికి వెళ్లి లడ్డూలు తీసుకున్నాం. ఒక్కక్కరికి ఒక్కో ఉచిత లడ్డూ ఇచ్చారు. ఇంకా కావాలంటే ఒక్కొక్కరు 10 లడ్డూలు దాకా తీసుకోవచ్చు. ఒక్కో లడ్డూ ఖరీదు 50రు. 

తర్వాత శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన కేంద్రానికి వెళ్ళి భోజనం చేశాం. చక్కెర పొంగలి చాలా బాగుంది...తర్వాత నడుచుకుంటూ మా లాకర్ల రూంకి వెళ్ళిపోయాం. పెద్ద హాలు లో చాపలు వేసుకుని పడక. నాకైతే ఏం నిద్ర పట్టలేదు..ఒక వైపు చలి...మరోవైపు వచ్చే వాళ్ళు వెళ్లే వాళ్ల గోల..ఇంకెలా పడుతుంది...ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూసా…

4:30 తర్వాత నా వల్ల కాలేదు. లేచి...చిన్నా ను కూడా లేపేసి ఇద్దరం కూర్చుని కబుర్లు చెప్పుకున్నాం. 5 దాటాక ముఖాలు కడుక్కుని లగేజ్ తీసుకుని బయలు దేరాం. వేకువ జామునే ఘాట్ రోడ్ మీద అప్పుడే నిద్ర లేస్తున్న సూర్యుని కిరణాలు మీద పడుతుంటే.. హెయిర్ పిన్ మలుపుల్లో ప్రయాణ అనుభూతి బాగుంది🌄. మాకు శ్రీనివాసం లో రూం దొరకటం తో అక్కడికి వెళ్ళాం. గదిని ఆ రోజు ఉదయం 8 కి వీళ్లు ఇక్కడ కేటాయిస్తారు అంట. మేం ఏసీ గది తీసుకున్నాం. గది మాత్రం సకల సౌకర్యాలతో చాలా అంటే చాలా బాగుంది. ఇక అక్కడ స్నానాలు అవి చేసి తిరుచానూరు బయల్దేరాం. అది తిరుపతి నుండి 5km. అక్కడ ఆ రోజు శుక్రవారం కావడం తో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. దర్శనమ్ ఇపుడపుడే అయ్యే అవకాశాలు కనబడక పోవటంతో ఆ ఆలోచన విరమించుకుని ..తిరుగు ప్రయాణం అయ్యాము. మా అమ్మ ఏమో " ఇంత దూరం వచ్చి చూడకుండా వెళ్లిపోతామా…?" అంటూ ఒకటే గొడవ. 

శ్రీనివాసం వసతి సముదాయం

గోవింద రాజస్వామి ఆలయ గోపురం

తర్వాత అక్కడ నుండి గోవింద రాజ స్వామి గుడికి వెళ్ళాము. అది రైల్వే స్టేషన్ కి చాలా దగ్గర. అక్కడ జనం కొంచెం తక్కువగా ఉన్నారు. దర్శనమ్ బాగానే అయింది. తర్వాత మా గదికి వెళ్లిపోయి పడుకున్నాం. మళ్లీ తెల్లారితే ప్రయాణం…

ఈ వ్యూ చాలా బాగుంది🤩


ఒకసారి ఎవరో అనగా విన్నాను..తిరుపతికి అర్థం "తియ్ రూపాయ్ తియ్ " అని. నిజమే నేమో అనిపించింది...అక్కడ సదుపాయాలన్నీ ఉచితమే అయినా...కొన్ని కొన్ని చోట్ల డబ్బు ఇవ్వక తప్పలేదు.. అన్నిటి కంటే నాకు నచ్చింది మాత్రం లడ్డూ నే...ఏమైనా అనుకోండి ..ఇదిగో ఇప్పుడు కూడా లడ్డు తింటూ నే ఈ టపా వ్రాసాను🙃🤪….ఉంటా మరి..టాటా..👋

P.s. ఇంతకంటే ఫోటోలు ఎక్కువ తీయడానికి అసలు కాలేదు...మొబైల్స్ లాకర్లో ఉంచేయటం వలన...

25, ఫిబ్రవరి 2020, మంగళవారం

ఎన్నాళ్ళకో మళ్లీ ఇలా.....

మంగళవారం, ఫిబ్రవరి 25, 2020 0 Comments
ఇలా బొమ్మలు చూసి వెయ్యటం అంటే చిన్నప్పటి నుండి ఒక పిచ్చి...కానీ చదువు..ఉద్యోగం లో పడి బొమ్మలు వేయటం మొత్తానికి వదిలేసాను అనే చెప్పొచ్చు. ఈ మధ్య కొంచెం తీరిక చిక్కటం తో ఎలా అయినా మళ్లీ నా కళకి పునర్జన్మ నివ్వాలి అని సూపర్ మార్కెట్ నుండి క్లాస్ మేట్ drawing పుస్తకము..రంగులు తెచ్చేసుకున్నా🤩..పోయిన ఆదివారం ఇలా ప్రయత్నించా అన్నమాట...మా అమ్మేమో అందరి బొమ్మలు వేస్తున్నావ్...నా బొమ్మ కూడా వెయ్యి అని మూతి ముడుచుకుంది😜..

పెన్సిల్ తో షేడింగ్ చేయటం నాకంత రాదు..నేర్చుకోవాలి🙄 పెదాల దగ్గర కొంచెం తేడా ఉంది కానీ...మొత్తానికి బాగానే వచ్చింది అనిపించింది...మీరేం అంటారు...🤗



13, జనవరి 2020, సోమవారం

2019 లో ఏమైందంటే....

సోమవారం, జనవరి 13, 2020 13 Comments


మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు...🤝👍2019 ...నా జీవితంలో ప్రత్యేకమైన సంవత్సరం🤗🤩. మర్చిపోలేని సంఘటన ఏమిటంటే కేంద్రీయ విద్యాలయ లో టీచరుగా👩‍🏫 ఉద్యోగం రావడం...అదీ ఒక ఉద్యోగం లో చేరిన కొద్ది నెలలకే..ఇంతకంటే గొప్ప విషయం నాకేం ఉంటుంది. నెలల వారీగా జరిగిన కథేంటో చెప్తా మరి...సరేనా…!!!😉

జనవరి: మొదటి రోజును నల్ల డ్రెస్సు తో మొదలు పెట్టాను. మా అమ్మకి తెలీదు కానీ...తెలిస్తే "కొత్త సంవత్సరం మొదటి రోజున ఆ రంగు ఎవరైనా వేస్తారెంటే..నీకు నేను చెప్పలేను..మతానికి ఎదురు మంచానికి అడ్డం" అని పురాణం విప్పుతుంది😁🤓...మనం అవన్నీ నమ్మం కాబట్టి లైట్ తీసుకుంటాం. KVS PRT పరీక్ష 'key' చూసుకుంటే...ఆశలు పెట్టుకునే లా మార్కులు వచ్చాయి. ఈ లోపు నా పని చూసుకుంటూ ఇంటర్వ్యూ కి తయారయ్యే దాన్ని. చిన్నా తో గోల్కొండ వెళ్ళటం మర్చిపోలేని అనుభూతి 😊 మేమిద్దరమే ఉంటే ఇంకెవరూ అక్కర్లేదు👭 ఇక..నెలాఖరున ఇంటర్వ్యూ selected list వచ్చింది. అందులో నా పేరు చూసుకుని ఎగిరి గంతేశా. ఇక ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ముమ్మరం చేశాను. ఒక్క నెల మాత్రమే టైముంది మరి. మధ్యలో ఈ NOC గోల ఒకటి..అప్పటికే ఉద్యోగంలో ఉండటంతో...ఆ తర్వాత మళ్లీ PRT పోస్టులను నోటిఫికేషన్ లో ఇచ్చినట్టు కాక 5300 నుండి 3000 కి తగ్గించేయటం తో ఒక్కసారిగా నిరాశలో కి వెళ్ళిపోయాను. పోటీ ఇప్పుడు ఇంకా పెరిగింది గా మరి. గుడ్డిలో మెల్ల ఏంటంటే ఇంటర్వ్యూ కోసం ఏ ఢిల్లీ కో వెళ్ళాలేమో అని డబ్బులు పోగేసుకున్నా...కానీ ఎంచక్కా హైదరాబాదే వచ్చింది పెద్ద కష్టం లేకుండా..😋

ఫిబ్రవరి: ఈ నెల మొత్తం ఇంటర్వ్యూ..ఇంటర్వ్యూ..ఇంటర్వ్యూ...ఒక మూడు రోజులు సెలవులు పెట్టీ ఇంట్లో ప్రిపేరయ్యా. అక్కడ సరిగ్గా సాగటం లేదని. ఇక ఇంటర్వ్యూ రోజు..బాగుంది అని చెప్పలేను..బాగోలేదు అని కూడా చెప్పలేను🤷 ఎంతైనా మొదటి ఇంటర్వ్యూ కదా..60 కి ఒక 40 మార్కులు వస్తే చాలు అనుకున్నా..చివరికి అలాగే వచ్చాయి లే..😉 అది వేరే విషయం.

మార్చి: హ్మ్...పెద్ద విషయం ఏంటంటే ctet కి ఎలా తయారవ్వాలి అని ఒక వీడియో తెలుగులో చేసి YouTube లో పెట్టాను. 2500+ వీక్షణలు వచ్చాయి ఇప్పటిదాకా😇..మా ఆఫీసు లో నిర్వహించే సాంస్కృతిక అవగాహనా కార్యక్రమంలో భాగంగా వరంగల్ కోటను సందర్శించే భాగ్యం దక్కింది. ఆ kvs ఫలితాలు గురించి ఈ రోజు కాదు రేపు..రేపు కాదు ఎల్లుండి అని డ్రామా సాగింది. నాకేమో టెన్షన్ ఒక వైపు..ఎప్పుడు వస్తాయా అని. ఎంతకీ విడుదల చేయకపోవడం తో పట్టించుకోవటం మానేశా. (ఆశ నిరాశ పాఠం లోలా)

ఏప్రిల్: 2018 సెప్టెంబరు తర్వాత ఒక కొత్త బ్లాగ్ పోస్ట్ పెట్టాను చంద్రముఖి మీద. రెండు కామెంట్లు వచ్చేసరికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది💃

మే: చాలా భయపెట్టిన సంఘటన..నా ఫోన్ మొత్తం లాక్ పడిపోయింది📴 ఏం టచ్ అయిందో తెలీదు కానీ..ఎంత ప్రయత్నించినా వల్ల కాలేదు. కొన్నాళ్ళు టాబ్ నే ఫోనుగా వాడుకోవలసి వచ్చింది. ఇంకా చిన్నాకి NIT AP లో లాబ్ టెక్నీషియన్ గా పోస్ట్ రావడం మా కుటుంబం లో ఆనందాన్ని నింపింది. మధ్య మధ్య నా result ఎప్పుడు వస్తుంది దేవుడా అని ఆలోచనలు..ఎలక్షన్ కోడ్ అదీ ఇదీ అని కారణాలు చెప్పారు..సర్లే ఇక వాళ్ళు result ఇచ్చినట్టే అనుకున్నా. క్యాలెండర్ లో పేజీలు అయితే మారుతున్నాయి కానీ నా జీవితం ఏం మారట్లేదు అనే నిరాశలో బతికేదాన్ని అప్పట్లో..😒

జూన్: ఉష్…! సైలెన్స్...పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు మరి😛

జూలై: ఎదురుచూపు కి తెరపడింది. మా KVS పరీక్ష ఫలితాలు ఇచ్చేశారు. నాకు PRT జాబ్ వచ్చేసిందోచ్. 🤩🤗 ఇప్పుడు ఇంకో సమస్య ..రాజీనామా ఎప్పుడు చేయాలి అని ..ఎందుకంటే పోస్టింగులు ఇంకా ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారో తెలీదు. ఇంకా.. resignation ఢిల్లీ లో ఆమోదం పొంది రావాలి అంటే కొంచెం టైం పడుతుంది..ఇలా అన్నమాట🤦

ఆగస్టు: కొత్త ఫోన్ LG W30 కొనటం నేను చేసిన ఒక తెలివైన పని. 🤪 9 వేలకే మంచి ఫోను వచ్చేసింది. 20 వ తారీఖున పోస్టింగ్ ఎక్కడ వచ్చిందీ తెలిసిపోయింది. Ernakulam, Bangalore, Hyderabad అన్నీ పోగా నా పేరు చెన్నై రీజన్ లో కనబడింది🧐. చాలా కంగారు పడ్డాను. నేనేంటి..చెన్నై ఏంటీ అని. కానీ తప్పదుగా. అత్త కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అన్నట్టు నాకు తమిళనాడు వచ్చినందుకు కాదు కానీ మా ఫ్రెండ్స్ ఇద్దరికీ ఆంధ్ర నే రావడం చాలా బాధ అనిపించింది😯 ప్చ్..ఇక ఇంకా 20 రోజులే టైము ఇవ్వడంతో ఆ జాబుకి రాజీనామా చేసేసా. హైదరాబాదు ని విడిచి వచ్చేసేటపుడు చివరిగా చార్మినార్ చూసాను..చాలా నచ్చింది😻

సెప్టెంబరు: ఇంకేముంటుంది….నా రాజీనామా పని మా మేడం వల్ల త్వరగా అవ్వడం, చెన్నై లో పడటం, కొత్త జాబ్, కొత్త మనుషులు, కొత్త ప్రదేశం..సర్దుబాటు సమస్యలు..వాటి మధ్య నేను.. అంతే ఇక💁👩‍🏫

అక్టోబరు: చెన్నైలో చేరాక మొదటి సారి దసరా కి ఇంటికొచ్చాను. ఇంట్లో వాళ్ళతో ఆ పది రోజులు సరదాగా గడిచిపోయాయి. సిటీ బస్సులతో..క్యాబ్ లతో అష్టకష్టాలు పడలేక శుభ్రంగా ఒక సైకిలు కొనేసుకున్నాను🚲 ఇప్పుడిక ప్రశాంతంగా ఉంది. 

నవంబరు: స్కూలు తరపున వర్క్ షాప్ లో పాల్గొనడానికి మైసూర్ వెళ్ళడం మర్చిపోలేను. ఆ ఊపిరి సలపని 3 రోజులు అస్సలు..మై గాడ్😵 మా స్టాఫ్ కొంతమంది తో మహాబలిపురం వెళ్ళడం మంచి అనుభవం. నేను చూసిన మొదటి ప్రపంచ వారసత్వ కట్టడం అదే అయింది. 

డిసెంబరు: ఆటం బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో పది రోజులు వింటర్ బ్రేక్. ఈ సారి మకాం వైజాగ్ లో వేశాం. చాలా బాగా అనిపించింది. 🤩🤩👌

మొత్తానికి ఇలా గడిచింది అన్నమాట...2019🤗😊



15, డిసెంబర్ 2019, ఆదివారం

మహాబలిపురం...మహాబలిపురం....మహాబలిపురమ్మ్...

ఆదివారం, డిసెంబర్ 15, 2019 0 Comments

బాలరాజు కథ సినిమా డాడీ చిన్నప్పుడు వచ్చిందట. ఆ సినిమాలో "మహాబలిపురం " పాటను డాడీ అప్పట్లో తెగ పాడేవారు అని మా నానమ్మ మురుస్తూ చెప్పేది. ఇంకా పోటీ పరీక్షల్లో ఎప్పుడు మహాబలిపురం కి సంబంధించిన ప్రశ్న వచ్చినా ఆ పాటే గుర్తు వచ్చేది "కట్టించాడు ఈ ఊరు పల్లవ రాజు " అంటూ. దాని ద్వారా సులభంగా సమాధానం పట్టేయొచ్చు గా😜 అసలే SSC పరీక్షల్లో ఎక్కువగా అడిగే అవకాశం ఉన్న అంశం అది. అలాగే ఇంకోసారి ASI ఉద్యోగిని గా ఉన్నపుడు Google arts & culture project లో ASI కి సంబంధించిన పేజ్ చూసాను. అందులో మహాబలిపురం 360 డిగ్రీ దృశ్యాలు చూసి ఆసక్తి ఇంకా పెరిగింది. ఎప్పటికైనా చూసి తీరాల్సిన నా ప్రదేశాల జాబితాలో మహాబలిపురం రెండు మూడు స్థానాలు ఎగబాకింది. 


Google image





కొన్ని రోజుల క్రితం మా హాస్టల్ రూం లో ఒకమ్మాయి తన స్నేహితురాలి తో మహాబలిపురం వెళ్తున్నట్టు చెప్పింది. నేనూ రావొచ్చా అని అడిగేద్దాం అని అనిపించింది. కానీ ఆగిపోయా..మళ్లీ ఏమనుకుంటుందో అని. భక్తుడు కోరిందీ దేవుడు వరమిచ్చిందీ ఒకటే అన్నట్టు (సామెత సరిగా గుర్తు రాలేదు) ఒక శనివారం స్కూలు అయిపోయాక ఇళ్లకు వెళ్ళిపోతున్న సమయం లో రేణు చెప్పింది. (తను నాతో పాటే మా స్కూల్లో చేరింది) "రేపు కొంతమంది tgt లు, నేను మహాబలిపురం వెళ్తున్నాం...వస్తావా" అని🤩...ఓ ...తప్పకుండా అని బుర్ర ఊపాను ఆనందంతో. ప్రయాణం ఎలా... ఏ సమయానికి అవన్నీ ఇంటికెళ్ళాక చెప్తా అంది. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్న మాదిరిగా ...హుషారుగా సైకిల్ తొక్కుకుంటూ రూం కి వచ్చేసా. మళ్లీ పొద్దునే తలస్నానం ప్రోగ్రాం పెట్టుకుంటే ఆలస్యం అవుతుంది ఏమో అని వెళ్ళగానే చేసేసా..😜


కాసేపటికి రేణు సందేశం పంపింది. రేపు ఉదయం 11 కి కార్ బయల్దేరుతుంది. 10:30 కల్లా మా ఇంటికి వచ్చేయ్ అని. అలా ఆదివారం పదకొండుంపావు దాటేక ఇక్కడి నుండి బయల్దేరాం. సరిగ్గా రెండు గంటల ప్రయాణం. మా బ్యాచ్ లో నేను తప్ప అందరూ ఉత్తర భారతీయులే. 😕


మహాబలిపురం ముందు 5km దూరం లో టైగర్ కేవ్ అని ఒక ప్రదేశం ఉంది చూస్తారా.. ఆపనా అని డ్రైవర్ అంటే...మేం ఒప్పుకున్నాము. అప్పటికే టైము ఒంటిగంట అయింది. సూర్యుడు నడినెత్తిన సుర్రుమంటున్నాడు. 🌞😵నేను ముందు జాగ్రత్తగా ముఖానికి సన్ స్క్రీన్ పులుముకున్నా..ఇంకా నల్ల కళ్లద్దాలు కూడా బ్యాగ్ లో వేసుకున్నా..😎 నేనింకా టైగర్ కేవ్ అంటే ఏమైనా పులులు ఉంటాయేమో అనుకున్నా...ఉష్..😉కాదు...ఇదే ఆ పులి గుహ...కానీ భలేగా చెక్కారు పులి బొమ్మలు.




టైగర్ కేవ్ దగ్గర బీచ్😍

చెట్టు మీద కోతి🐒

అక్కడ కాసేపయ్యాక మహాబలిపురం షోర్ టెంపుల్ కి చేరుకున్నాం. అక్కడే ఒక చోట కూర్చుని తెచ్చుకున్న ఆలూ పరాఠా లు, పూరీలు తినేసాం. ఆదివారం కావటం వల్లన చాలా మంది జనం ఉన్నారు. సముద్ర ప్రాంతం కావడంతో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. సన్ స్క్రీన్ రాసినా ఏం ఉపయోగం లేదు. పైగా ముఖం అంతా జిడ్డుగా తయారైంది😣 రెండు బొట్టు బిళ్ళలు పెట్టాను. రెండూ పడిపోయాయి😒 మహాబలిపురం అనగానే అందరూ కళ్ల ముందు మెదిలే సీ షోర్ టెంపుల్ ఎంత బాగుందో..చుట్టూ బుజ్జి నంది బొమ్మలతో. 



షోర్ టెంపుల్ ముందు ఉన్న వినాయక విగ్రహం

ఇది కూడా టెంపుల్ ముందే ఉంది..😇


రూట్ మ్యాప్







ముందు ఉన్న గోపురం లో ఉన్న విగ్రహాలు ఇవే!





తర్వాత అర్జునుడు పాశుపతం పొందిన ప్రదేశం గా చెప్పబడే Arjuna's penance చూసాము. రెండు పెద్ద పెద్ద శిలల మీద ఎన్ని బొమ్మలు చెక్కారో!!..ఇందులో ముల్లోకాలను చూపించారట. అక్కడి నుండి "కృష్ణ మండపం" చూశాం. కృష్ణుడు గోవర్ధన గిరి ని ఎత్తుతున్న సన్నివేశం ఎంత బాగుందో..😍 ఇక్కడ కింద గచ్చు మీద ఏవో బొమ్మలు ఉన్నాయి. వాటి అర్థం ఏమిటో మరి..ఇదేదో వైకుంఠ పాళీ ఆటలాగ ఉంది.
Arjuna's penance




ఇదే....ఏదో ఆట లాగా ఉంది అన్నాను గా

కృష్ణ మండపం



కృష్ణ మండపం తర్వాత నడుచుకుంటూ లైట్ హౌస్ ప్రాంతానికి చేరుకున్నాం. దారిలో ఈ⬇️ బొమ్మలు దర్శనం ఇచ్చాయి. ఆ లైట్ హౌస్ ప్రాంగణం లో ఉన్న maritime ప్రదర్శన శాల కూడా చూసాము. అక్కడున్న టైటానిక్ షిప్ నమూనా హైలెట్. లైట్ హౌస్ దగ్గర చాలా జనం ఉన్నారు. టైం పట్టేలా ఉందని ఇక పైకి ఎక్కలేదు. కింద నుండే చూసి ఆనంద పడ్డాం. 



ఇదే టైటానిక్ నమూనా

నౌక నడుపుతున్న ఫీలింగ్ వస్తుంది కదా!😁





తర్వాత చూసిన ప్రదేశం మహిష మర్దిని రాక్ కట్ మండపం. దాని పైకి ఎక్కినపుడు లైట్ హౌస్ వీక్షణ చాలా బాగుంది. 🤓 అక్కడి నుండి కొంచెం దూరం నడిచాక కృష్ణుని వెన్న ముద్ద దగ్గరికి వచ్చేశాం. అప్పటికి 5 దాటేసింది. అంత పెద్ద రాయి వాలుగా అసలు.. ఎలా నిల్చుందో 😲😯🤯 చాలా ఆశ్చర్యమేసింది. చాలా మంది ఆ రాయిని కిందకి తోస్తున్నట్లు ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు🤭 దార్లో దాహం వేసి కొబ్బరి బొండాల వాడి దగ్గర ఆగాం. కాయ ముప్పై రూపాయలట. లేతగా బాగున్నాయి.😋 లోపలి గుజ్జు కూడా తెరిచి ఇస్తా అన్నాడు. మా వాళ్ళకి అదేంటో తెలీదట. "మలై" అంటూ తినేశారు. 😆 నచ్చిందట బాగా వాళ్ళకి. 

మహిష మర్ధిని మండపం


మహిష మర్ధిని మండపం పై నుండి...😻


ఇదే కన్నయ్య వెన్న ముద్ద

ఇంకో అందమైన గుడి...


అసలైన విషయం ఏంటంటే ముఖ్యమైన పాండవుల పంచ రథాలు చూడలేక పోయాము..ప్చ్😔 వీళ్ళ బీచ్ ల పిచ్చి ఏమో గానీ….ఎక్కువ సమయం అక్కడే గడిపినట్టు అనిపించింది నాకైతే….మొదట ఏమో టైగర్ కేవ్ దగ్గర తర్వాత షోర్ టెంపుల్ దగ్గర...ఇక సాయంత్రం 6 దాటాక అక్కడి నుండి సెలవు తీసుకున్నాం. మళ్లీ తెల్లారితే సోమవారం..స్కూలు ఉండనే ఉంది. 






అలా "మహాబలిపురం" నేను కూడా చూసేసా అన్నమాట🤗🤗