7, జులై 2019, ఆదివారం

నా ఉద్యోగ ప్రయాణం - 2

దీని ముందు భాగం ఇక్కడ చదవండి...
సరిగ్గా వారం ఉందనగా అడ్మిట్ కార్డు వచ్చింది..అప్పటికప్పుడు OBC సర్టిఫికెట్ అదీ వాళ్ళు నిర్దేశించిన ఫార్మేట్ లో చేయించుకున్నా..నాకు ఇంకో సందేహం ఉండేది..ఇపుడు ఇంతా కష్టపడి చెన్నై వెళ్ళొచ్చాక ఫైనల్ లిస్ట్ లో నాకు రాకపోతే ఎలా అని😣..ఎందుకంటే మార్కులు తెలియవు కదా..కానీ ఎలాగైతేనేం చెన్నై కి వెళ్ళేముందే మా మార్కులు వచ్చేసాయి😃..129.75..150 కి నాకు వచ్చిన మార్కులు..మా దగ్గర్నుంచి చెన్నై కి సర్కార్ కి రిజర్వేషన్ దొరకలేదు..అంటే భీమవరం నుండి సర్కార్ కి అన్నమాట.. చివరికి ఎలాగోలాగ విజయవాడ నుండి జనశతాబ్ది కి రిజర్వేషన్ దొరికింది🚂..అలా నాగర్సోల్ express ద్వారా విజయవాడ వెళ్ళి జనశతాబ్ది ని అందుకున్నాం నేను, మా నాన్న...

నేను మొట్టమొదట చూసిన పక్క రాష్ట్రం తమిళనాడు అయింది..నేను ఇప్పటివరకు కేవలం 5 జిల్లాలు మాత్రమే తిరిగా..విజయనగరం, విశాఖ, తూగో, పగో, కృష్ణా..ఉదయం పాలకొల్లులో మొదలైన మా ప్రయాణం కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ల మీదుగా చెన్నై సెంట్రల్ లో రాత్రి 10.30 కి ముగిసింది..తెల్లారితే DV కి వెళ్ళాలి..ఆ రాత్రి వేళ ఎక్కడికెళ్తాం..పోనీ మాలాగా వచ్చిన వాళ్ళెవరూ తగల్లేదు..ఇక ఆ సెంట్రల్ లోనే హాలులో కుర్చీల్లో కూర్చున్నాం తెల్లారేవరకు... మహానటి సినిమాలో కీర్తి, రాజేంద్ర ప్రసాద్ మద్రాసులో దిగి గుర్రబ్బండి వాడితో బేరమాడుతారు కదా..అదే చెన్నై సెంట్రల్...బిల్డింగ్ ఎంత బాగుందో😍...అందులో రైళ్ళు ఒక వైపే వెళ్ళడానికి వీలవుతుంది.హాల్లో ఆ రైల్వే స్టేషన్ కట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎలా మారిందో పెద్దపెద్ద ఫోటోలు పెట్టారు. వచ్చి పోయే రైళ్ళతో ఏం నిద్ర పడుతుంది..అందుకే అక్కడ ఉన్న ఫ్రీ వైఫై తో ఆ రోజే విడుదల చేసిన మా టెట్ కీ చూసుకున్నా..నిజంగా నిద్ర పట్టకపోవడం కంటే ఇంకో నరకం ఉండదని అప్పుడే అర్థమైంది..😟



ఇక ఉదయం 4 గంటలకే తయారైపోయి సెంట్రల్ నుండి పార్క్ స్టేషన్ (సబర్బన్)కి వెళ్ళాం..సబర్బన్ రైళ్ళ గురించి వినడమేగానీ నిజంగా చూడ్డం ఇప్పుడే...కనీస టికెట్టు 5రూ..అక్కడ ఎంత పెద్ద క్యూ ఉందో...పాపం డాడీనే నిల్చొని టికెట్లు పట్టుకొచ్చారు...మేము వెళ్ళాల్సింది DPI క్యాంపస్ రోడ్ లో ఉన్న పేరెంట్ టీచర్ అసోసియేషన్ బిల్డింగ్ కి..గూగుల్ మాప్ లో వెతికితే దానికి దగ్గరగా ఉన్న సబర్బన్ స్టేషన్ చేటిపట్టు..అలా పార్క్ స్టేషన్ నుండి 5 నిమిషాల్లో చేటిపట్టు కి వెళ్ళాం..సబర్బన్ రైళ్ళు ఎంత వేగంతో వెళ్తున్నాయో..చాలా ఉపయోగం ఇవి మాలాంటి వాళ్ళకి..😁..ఆ స్టేషన్ నుండి బయటికొచ్చేసరికి ఆటోవాడు ఉన్నాడు..DPI క్యాంపస్ కి వెళ్ళాలి అని చెబితే 100 రూపాయలన్నాడు...చాలా ఎక్కువే మరి మాకు వేరే దారి లేదు..సిటీ బస్సులున్నా వాటి నెంబర్లు అవి మనకు తెలియదు కదా...ఆశ్చర్యం ఏంటంటే అక్కడ చాలామందికి మన తెలుగు అర్ధం అవుతుంది..కానీ మనకి తమిళంలోనే సమాధానమిస్తారు😝..మనకీ అది అర్ధం అవుతుంది(పైపైన)😀..

నాది ఫస్ట్ డే, ఫస్ట్ బ్యాచ్..ఆటోవాడు సరిగ్గా PTA బిల్డింగ్ ముందు ఆపాడు...10 నిమిషాల ప్రయాణం అంతే.. తమిళనాడు టెక్స్ట్ బుక్ బిల్డింగ్ కూడా పక్కనే ఉంది. మేము వెళ్ళేసరికే అంతా చీకటిగానే ఉంది. బయట కూర్చోడానికి కూడా లేదు..పోనీ కదా అంటే దోమలు ఓ పక్క కుట్టేస్తున్నాయి...అవి మా దోమల కన్న చాలా పెద్దగా ఉన్నాయి...పక్కనే చిన్న బడ్డీ కొట్టు లాంటిది ఉంటే అక్కడే కూర్చున్నాం..ఆ షాపతను అప్పుడే టిఫిన్ చేయడానికి అన్నీ సిధ్దం చేస్తున్నాడు..గారెలు తప్పితే అక్కడేం లేవు..అవే చెరో రెండు తిన్నాం...చట్నీ కూడా లేదు..కానీ చాలా బావున్నాయి...మాలాగే కడప నుండి ఒకబ్బాయి వచ్చాడు. అడ్రస్ చూసుకుని వెళ్ళిపోయాడు. తనది మధ్యాహ్నం బ్యాచ్ అట..8 అయ్యే సరికీ చాలా మంది వచ్చేసారు..9 దాటాక లోపలకి పిలిచారు. బయోమెట్రిక్ అథెంటికేషన్, డాక్యుమెంట్ల పరిశీలన కార్యక్రమాలు అయ్యేసరికీ మధ్యాహ్నం 12 అయింది...నా OBC సర్టిఫికేట్ కొత్తది కదా...కానీ పాతది అంటే 2017 లోపు ఉండాలంట..అది మాకు తెలీదు మరి. అందుకని నాలాంటి వారందర్నీ Provisional లో పెట్టారు. ఈ ప్రాసెస్ అంతా కావడానికి  అంత టైం పట్టదు..కానీ అక్కడ చాలా ఆలస్యం చేసారు..హమ్మయ్య..అనుకొని బయటపడ్డా. చెన్నైలో ఎండ అప్పటికే విరగ్గొడుతుంది🌞😎. షేర్ ఆటో ఎక్కి ఎగ్మోర్ స్టేషన్ కి వెళ్ళాం. అక్కడ్నుంచి మాంబళం కి సబర్బన్ లో వెళ్ళాం..

అక్కడ మా డాడీకి తెల్సిన ఒక ఆర్టిస్ట్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళాం..ఆయన అప్పుడు ఏదో బొమ్మ వేస్తున్నారు. అక్కడ కొంచెం ఫ్రెష్ అయ్యి ఆయన చెప్పిన హోటెల్ కెళ్ళాం. భోజనం కాకుండా టిఫిన్స్ అడిగితే సాంబార్ రైస్ ఉందని చెప్పాడు. అదే తెమ్మన్నాం. స్టీల్ కంచంలో చక్కగా అరిటాకు వేసి పనసపొట్టు కూర, అప్పడంతో సాంబార్ రైస్ తెచ్చారు. నాకైతే చాలా నచ్చింది😋😋. ఎన్ని కూరగాయలున్నాయో..అది తింటే ఇంక భోజనం అక్కర్లేదు...( ఇంటికొచ్చాక దాని గురించి నెట్లో వెతికితే దాని పేరు "సాంబార్ సదం" అని తెల్సింది..హెబ్బార్స్ కిచెన్ లో ఎలా చేయాలో చూసి ఇంట్లో మళ్ళీ చేసుకుని తిన్నాం😂😂) ఇంతకీ ప్లేటు సాంబార్ రైస్ 30 యే నట..నాకు చాలా ఆశ్చర్యమనిపించింది. తర్వాత అక్కడ్నుంచి శరవణ స్టోర్స్ వీధిలోకి వెళ్ళాం..అబ్బో ఎంత పెద్ద మార్కెట్టో!!..ఎన్ని రకాలు అమ్మేస్తున్నారో..నేను ఇలాంటి మార్కెట్స్ మొదటి సారి చూడటం😮..భలే ముచ్చటేసింది. రెండు జతల చెవి పోగులు కొనుక్కుని మళ్ళీ మాంబళం స్టేషన్ కి వెళ్ళాం. సర్కార్ ఎక్స్ ప్రెస్ మనకి కాకినాడ లో బయల్దేరుతుంది..అక్కడేమో చెంగల్పట్టు లో బయల్దేరుతుంది. ఇప్పుడు మాకు రిజర్వేషన్ లేదు కాబట్టి జనరల్ బోగీలో సీటు దొరకాలంటే చెంగల్పట్టుకే వెళ్ళిపోవాలి..కానీ మేము ఎక్కిన సబర్బన్ రైలు తాంబరం వరకే వెళ్ళింది. పోనీ అక్కడ్నుంచి చెంగల్పట్టు కి వెళ్దామంటే ఇంకో అరగంట దాకా ఇంకో రైలు లేదంట😰. ఈ లోపున సర్కార్, చెంగల్పట్టులో బయల్దేరిపోవచ్చు...అప్పుడు తాంబరం స్టేషన్ లోకి వెళ్ళి ట్రెయిన్స్ చార్ట్ చూస్తే సర్కార్ కి తాంబరం లో హాల్టు ఉందని తెల్సింది...ఇంక అక్కడే భీమవరానికి టికెట్లు తీసుకున్నాం.ఎందుకంటే అది పాలకొల్లుకి వెళ్ళదు.  మా అదృష్టం..జనరల్ బోగీలు ఖాళీగానే ఉన్నాయి..నాకు, మా డాడీకి నిద్ర వచ్చేస్తూంది. రైలెక్కాక ఇంటికి ఫోన్ చేసి అమ్మ, చెల్లి తో మాట్లాడి పడుకున్నాం. కానీ రైళ్ళో రాత్రంతా ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళతో గోలగోలగానే ఉంది. రైళ్ళలో దూర ప్రయాణాలు చెయ్యాల్సి వస్తే రిజర్వేషన్ ఖచ్చితంగా ఉండాల్సిందే..కానీ ఇలా ఆకస్మికంగా వెళ్ళాల్సి వస్తే ఏం చేయలేం మరి!!💁.అలా ఉదయం భీమవరం చేరేసరికీ 7.30 అయింది. అక్కడే బ్రష్ చేసుకున్నాం. హైదరాబాద్ నుండి నరసాపురం వెళ్ళే ఎక్స్ ప్రెస్ వస్తుంది అప్పుడే..అదెక్కేసి అరగంటలో మా ఇంటికొచ్చేసాం. అంత సేపు ట్రైన్లలో ప్రయాణం చేయడం వల్ల, ఇంటికి వచ్చాక కూడా ఊగుతున్నట్లు, ట్రైన్ లోనే ఉన్నట్టు అనిపించింది..అలా మా చెన్నై ప్రయాణం సాఫీగా జరిగిపోయింది. చెన్నై లో ఏం ఫొటోలూ తీసుకోలేదు🙆..ఇందులో upload చేసినవి అన్నీ Google images..

(సశేషం)





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...