29, ఏప్రిల్ 2021, గురువారం
10, ఏప్రిల్ 2021, శనివారం
పోలింగ్ ఆఫీసర్ అయ్యానోచ్!!!
డిసెంబర్లో వింటర్ బ్రేక్ అయిపోయాక స్కూలు తిరిగి తెరిచే రోజు వచ్చేటపుడు ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో తెచ్చుకోమన్నారు. వెళ్ళాక తెల్సింది ఏమిటంటే, ఈ సంవత్సరం జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల విధులు కోసం మా స్కూలు నుండి కూడా టీచర్లను పంపించడం కోసం, దరఖాస్తులు నింపమన్నారు. దానికన్న మాట ఆ ఫోటో. మొత్తానికి అందరూ పూర్తి చేసి పంపేసాం.
చిన్నప్పటి నుండి నాకు ఇలాంటి ఎలక్షన్ డ్యూటీ అన్నా, జనాభా లెక్కల పని అన్నా మహా ఆసక్తిగా ఉండేవి. ఎందుకంటే మా హైస్కూల్లో టీచర్లు వెళ్ళేవారు గా. వాళ్ళని చూసి నాకూ అలాంటి అవకాశం వస్తే బాగుణ్ణు అనుకునేదాన్ని...అందుకే అన్నమాట ఈ ఉత్సాహం.
కానీ ఆ ఉత్సాహం అంతా ఒక రోజు నీరు కారిపోయింది. ఎలాగంటే ఇదివరకు ఎన్నికల విధులకు వెళ్ళినవాళ్ళు చెప్పారు ఇలా అని. ట్రైనింగ్ క్లాసులు ఆదివారాలే పెడతారు, పైగా ఈసారి కోవిడ్ టీకా తీసుకోవడం తప్పనిసరి అని. ఆదివారం ఒక్కరోజే మనకు కాస్త సమయం చిక్కేది. కానీ అప్పుడు కూడా డ్యూటీ కి వెళ్ళాలంటే కష్టం అనిపించింది.
ఒక మంచిరోజున ఎన్నికల విధులకు సంబంధించిన appointment order వచ్చింది. నాతో సహా చాలా మందికి పోలింగ్ ఆఫీసర్-3 ఇచ్చారు. మరుసటి ఆదివారం దగ్గర్లో ఒక ఇంజనీరింగ్ కాలేజీ లో శిక్షణ కి హాజరు అవ్వమని దాని సారాంశం. అందరం ఎంచక్కా కలిసి వెళ్ళి మళ్ళీ కలిసి వచ్చేసాం. అక్కడ వాళ్ళు ఏం చెప్పింది లేదు, మేమేం చేసింది లేదు. హాజరు పట్టి లో ఒక సంతకం తప్ప. ఆ తర్వాతి ఆదివారం కూడా ఉంటుందని అనుకున్నాం. కానీ ఎవరికి ముందు రోజు sms రాలేదు. హమ్మయ్య.. ఆ ఆదివారం ఎలాంటి కార్యక్రమం లేదు. తర్వాత ఇంకో 3-4 రోజులకు ఇంకో ఆర్డర్ వచ్చింది అందరికీ.
అందులో ఏ ఏ తేదీల్లో హాజరు కావాలి, ఏ నియోజకవర్గంలో పని చేయాలి, ఇంకా టీమ్ కోడ్ ఇలాంటివన్నీ ఉన్నాయి. మనం వెళ్లాల్సిన పోలింగ్ బూత్ మాత్రం ఎన్నికల ముందు రోజు మాత్రమే తెలుస్తుందట. నాకు వచ్చిన నియోజకవర్గం "పొన్నేరి". అక్కడ వేళమ్మల్ హైస్కూల్లో -3 సార్లు వెళ్ళాలి. నాతో పాటు మా రేణు కి కూడా అక్కడే వచ్చింది. ఏంటో మా ఇద్దరికీ ఎప్పుడూ అన్ని ఇలా కలిసి వస్తాయి😀 మా అందరికీ ఇంచుమించు దగ్గర దగ్గరే వచ్చాయి కొంతమందికి మాత్రం దూరంగా తిరుత్తణి, గుమ్మిడి పూండి లాంటివి ఇచ్చారు.
మాకు పోన్నేరి కాస్త దూరమే. 25-30 km దాకా ఉంటుందేమో cabs ఏమో out station ride అని చూపిస్తున్నాయి. ఇక బస్సుల్నే నమ్ముకున్నాం. ఇక్కడి నుండి రెడ్ హిల్స్ దాకా ఒక బస్సు, అక్కడి నుండి పొన్నేరి లో ఆ స్కూలుకు ఇంకో బస్సు. బస్సులకేం... బోలెడు ఉన్నాయి. కానీ జనాలు కూడా అలాగే ఉండేవారు. నిల్చొడానికి కూడా ఖాళీ ఉండేది కాదు. ఈ కొవిడ్ భయం ఒకటి ఉండనే ఉంది. కానీ ఏం చేస్తాం. తప్పని పని..అలా రెండు రోజులు వెళ్ళాం.
మా టీమ్ లో ఎవరెవరు ఉంటారో మొదటి రోజునే తెలిసిపోయింది నాకు. మా దాంట్లో ఒక ప్రేసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ ఆఫీసర్లు 1,2,3 ఉన్నారు. అక్కడంతా తమిళమే ఉండేది. పైగా ప్రభుత్వాలు ఎలాంటి భాషను వాడుతాయో తెల్సు గా. అదేమో నాకర్థమే కాలేదు. మా ప్రిసైడింగ్ ఆఫీసర్ స్టేట్ స్కూల్లో HM అంట. మొదట్లో ఆవిడతో ఇంగ్లీషులో మాట్లాడా. అలా మాటల్లో నాది ఇలా ఆంధ్ర అంటే ఎక్కడో చెప్పు అన్నది. పాలకొల్లు అన్నా, మాది భీమవరం అంది. అంతే..దెబ్బకి నా భయం ఎగిరిపోయింది. ఆశ్చర్యపడాల్సినది ఏమంటే మా టీమ్ లో మిగతా ఇద్దరికీ కూడా తెలుగు తెల్సు. PO-1 ఏమో ఆర్ట్ టీచర్, PO-2 ఏమో అంగన్వాడీ కార్యకర్త. నాకైతే చాలా ఆనందమనిపించింది. పైగా మా presiding officer గారికి ఇది 13 వ ఎలక్షన్ డ్యూటీ అంట. ఇంకేం భయం ఉంటుంది.
ఇక ఎన్నికల ముందు రోజు ఊరికి వెళ్తున్నట్టు అన్నీ బ్యాగులో పెట్టుకుని బయలు దేరాం. మరి ఆ రెండు రోజులూ అక్కడే బస చేయాలిగా. మా పోలింగ్ బూత్ ఆర్డర్ చేతిలో పెట్టారు వెళ్ళాక. అది కూడా దూరమే మాకు. పైగా చాలా లోపలికి అంట. అందరూ అక్కడనుండి ఆటో తీసుకుని వాడికి 500 సమర్పించి పోలింగ్ బూత్ చేరుకున్నాం. స్కూలు అయితే బాగుంది నీట్ గా. అక్కడ మొత్తంగా 5 బూత్ లు ఉన్నాయట. సాయంత్రం దాకా అలా కాలక్షేపం చేశాం. సాయంత్రం సామగ్రి అంతా వచ్చింది. అవన్నీ అమర్చడం లో టైమే తెలియలేదు. పోస్టర్లు అంటించాలి, ఓటర్ స్లిప్పులు తయారు చేయాలి, చెక్ లిస్ట్ లో చూసుకోవాలి అన్నీ వచ్చాయో లేదో. ముఖ్యంగా EVM, VVPAT సరిగా పని చేస్తున్నాయో లేదో చూడాలి. ఇక ఆ రాత్రి వాళ్ళిచ్చిన దోశలు తిని ఆ గదిలోనే పడుకున్నాం. బెంచీలు రెండు ఒకదానికొకటి పక్కన పెట్టి, అదే ఆరోజుకి మంచం.
ఎన్నికల రోజు రానే వచ్చింది. రాత్రి నిద్ర సరిగా పడితే కదా. తెల్లవారి 3 కి లేచి 5 కల్ల తయారైపోయాము. పొద్దున టిఫిన్ ఎప్పటికి వస్తుందో తెలీదు అని మా మేడం బ్రెడ్ పాకెట్ తెచ్చింది. అవే తలొక రెండు జాం రాసుకుని తిన్నాము. పొద్దున 6 కి పోలింగ్ ఏజెంట్లు వచ్చారు హడావిడి గా. వాళ్ళ సమక్షంలోనే 50 ఓట్లకి mock poll పెట్టాలి. అప్పుడు నాకు పూర్తిగా అర్థం అయిపోయింది. కంట్రోల్ యూనిట్ ని ఎలా ఆపరేట్ చేయటం అనేది. నమ్మకం వచ్చింది కొంచెం.
ఇక 7 గం.కి పోలింగ్ మొదలైంది. మా బూత్ లో మొత్తం ఓటర్లు 647. నా పని ఏమంటే PO-2 దగ్గర్నుండి వచ్చిన వాళ్ళకి ఇంక్ పెట్టడం, వల్ల దగ్గర్నుండి ఓటర్ slip తీసుకుని 50 కలిపి ఒక కట్టగా కట్టడం, వోట్ వేసే ముందు కంట్రోల్ యూనిట్ లోని ballot బటన్ నొక్కడం. బాగుంది మొత్తానికి. ఎంజాయ్ చేశాను పనిని. ఒకే ఒక్క ఇబ్బంది ఏమిటంటే ఆ ఇరుకు బెంచి మీద రోజంతా కూర్చుని ఉండటం వల్ల నడుం నొప్పి, ఇంకా రెండు రోజులు సరిగా నిద్ర లేకపోవడం.
ఆరోజు 7 కి పోలింగ్ పూర్తి చేసేసాం. పోలింగ్ శాతం 73% వచ్చింది మాకు. అప్పట్నుంచి చాలా పని ఉంది presiding officer గారికి. VVPAT, EVM, కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ అన్నిటినీ బాక్సుల్లో భద్రపరచి సీల్స్ వేయాలి. వాళ్ళు ఇచ్చిన ఫారాల్ని పూర్తి చేయాలి. మేం చేయగల్గినంత సహాయం చేశాం. ఆ జోనల్ ఆఫీసర్లు వచ్చి మా సామగ్రి అంతా తీసుకునే సరికి రాత్రి 9 దాటింది.
ఒక వయసు మళ్ళిన ఓటర్, తన గుర్తింపు కార్డు చూపించమని అడిగినపుడు ఈ ఊరిలో నా పేరుతో నేను ఒక్కడినే ఉన్నాను..అదీ..ఇదీ..అని వితండవాదం చేశాడు. చివరికి అందరూ నచ్చ చెప్పడంతో ఓటర్ id బయటికి తీసాడు. ఇంకోటి ఏమంటే ఈ పోలింగ్ ఏజెంట్లు ఉన్నారు కదా. వాళ్ళు వోట్ వేసేటపుడు ఇంక్ తక్కువగా అంటించమన్నారు. నేను మామూలుగానే పెట్టేసాను. వెంటనే చేరిపేసుకుంటున్నారు. అదేం చిత్రమో మరి…?? నాకైతే అర్థం కాలేదు🙄
హ్మ్..ఆ రాత్రికి అక్కడే ఉందాం అని నిర్ణయించుకున్నాం. అప్పుడు స్కూల్లో మేం తప్ప ఇంకెవరు లేరు. ఇక మర్నాడు పొద్దునే 4 కే లేచి ఆటో లో దగ్గర్లో ఉన్న "అత్తిపట్టు" రైల్వే స్టేషన్ కి చేరుకున్నాం. అక్కడ్నుంచి సబర్బన్ ట్రైన్లో ఇంటికి వచ్చేసాను.
మొత్తానికి ఇలా నా చిన్నప్పటి కోరిక తీరింది అన్నమాట😇😇🤩
17, మార్చి 2021, బుధవారం
నా కొత్త కళ
ఈమధ్య ఇలాంటి చిత్రాలు ఇన్స్టా లో చూసాను. చాల నచ్చాయి నాకు. నాకు కూడా గీయాలనిపించింది. మొట్ట మొదటి సారిగా ఇది ప్రయత్నించాను. బాగా వచ్చింది. నేను కూడా బాగా గీయగలను అని నమ్మకం వచ్చింది. కొన్ని చిత్రాలను ఇన్స్టా నుండి ఇంకా పింటెరెస్ట్ నుండి తీసుకొని అప్పుడప్పుడు ఇలా వేస్తున్నాను. ప్రస్తుతానికి నా దగ్గర ఉండే నల్ల జెల్ పెన్నులనే వాడుతున్నాను. మంచి ఫైన్ లైనర్స్ కొనుక్కొవాలి ఎలాగైనా..
3, జనవరి 2021, ఆదివారం
నాతో సైకిలు ఎక్కుతారా..??🚲
ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు..🥳
![]() |
| Google image |
ఈనాటి ఈ బంధమే నాటిదో..ఈనాడు పెనవేసి ముడి వేసెనో.. ఓ..🎶 నాకూ..సైకిల్ కూ ఉన్న అనుబంధం ఈ నాటిది కాదు. నాకు 6-7 ఏళ్లు అప్పటి ది. చిన్నప్పుడు ఏం చేసే వాళ్ళమో తెలుసా.. సైకిల్ పక్కనే చతికిలబడి బుల్లి బుల్లి చేతులతో పెడల్ ను గిరగిరా తిప్పే వాళ్లం కదా. ఇలా చేయటం ఎంత సరదా ఇచ్చేది అంటే మాటల్లో చెప్పలేం. సరిగా తిప్పక పోతే సైకిల్ మీద పడే అవకాశాలు కూడా లేకపోలేదండొయ్..
కాస్త పెద్దయ్యాక... ఈ పని అందరూ చేసే ఉంటారేమో! స్టాండ్ వేసి ఉన్న నాన్నగారి సైకిలు పెడల్స్ మీద మన కాళ్ళు వేసి డెక్కుతుంటే (అలా తొక్క డాన్ని మా వైపు డెక్కడం అంటారు) వెనుక చక్రం తిరిగేది. ఆ మాత్రం దానికే సైకిల్ తొక్కడం వచ్చేసిందోచ్ అని బీరాలు పోయేవాళ్ళం. 😆
అద్దె సైకిళ్ళ జమానా.. మా ఇంటికి పక్కనే సైకిల్ షాప్ అంకుల్ ఉండేవారన్నమాట. వాళ్ళ ఇంటి దగ్గరే కొన్ని సైకిళ్లు పెట్టుకొని అద్దెకి ఇస్తుండేవారు. అందులో రకరకాల సైకిళ్ళు ఉండేవి. మొదటివి బుల్లి సైకిళ్ళు.. ఇవి మాలాంటి పిల్లకాయలు తొక్కుకునేవి. రెండో వి కొంచెం పెద్ద సైకిళ్లు.. ఇవి కాలేజీలకు వెళ్లే కుర్రకారు తొక్కేవి. మూడో రకం పే..ద్ద సైకిళ్లు.. ఇవి పెద్ద వాళ్ళు తొక్క గలిగేవి.
ఆ బుల్లి సైకిళ్ల లో మళ్లీ.. అక్కడ రెండే ఉండేవి. ఒకటేమో చిన్నగా ఉండి, వెనకాల టైర్ కి అటూ ఇటూ ఇంకో రెండు చిన్న చిన్న చక్రాలు ఉండేవి పడిపోకుండా. ఇంకోటి దీనికంటే కొంచెం పెద్దగా ఉండి, అలాంటి చక్రాలు ఉండేవి కాదు. ఆ అంకుల్ గంటకి ఐదు రూపాయల చొప్పున అద్దెకు ఇచ్చే వారు. ఎప్పుడు చూసినా ఆ బుల్లి చక్రాల సైకిలు దొరికేదే కాదు..😏 అందుకే మా చెల్లి నేను ఆదివారాలు పొద్దున్నే లేచి ఆ సైకిల్ కోసం వెళ్ళేవాళ్ళం. మా ఇంటి ఎదురుగా గ్రామ దేవత గుడి ఉండేదన్నమాట. గుడి చుట్టూ చాలా ఖాళీ స్థలం కూడా ఉండేది. అక్కడికి పోయి సైకిల్ పై తెగ తిరిగే వాళ్ళం వంతుల వారీగా. ఇంకో చక్రాలు లేని సైకిల్ కూడా తొక్కాలని ఉండేది కానీ భయం వేసేది. దాన్ని మేం అద్దెకు తీసుకున్న దాఖలాలే లేవు.
నేను నాలుగో తరగతిలో ఉన్నప్పుడు డాడీ, ఎవరో పాత సైకిల్ అమ్మే స్తుంటే దాన్ని తీసుకుని ఇంటికి తెచ్చారు మేము నేర్చుకుంటామని. ఇదే ఆ సైకిల్. మిస్ ఇండియా.. దాని హ్యాండిల్స్ మన వైపు వంగి ఉంటాయి. అలా ఉండటం నాకు అంతగా నచ్చేది కాదు. కానీ నేర్చుకోవడానికి ఏదైతేనేం..
![]() |
| ఇదే నా మొదటి సైకిలు..కాకపొతే చెప్పాగా..హ్యాండిల్స్ వంగి ఉండేవి..(Google image) |
చిన్నప్పుడు మనందరినీ ఇలాగే భయపెట్టి ఉంటారు కదా...మోచిప్పలు కొట్టుకోకుండా సైకిల్ తొక్కడం నేర్చుకోలేం అని. నాకు మరి ఆ రేంజ్ లో దెబ్బలు తగలలేదు కానీ.. తగిలేవి. చాలాసార్లు సైకిల్ పై నుండి పడ్డాను. తుప్పల్లోకి పోనిచ్చేసాను. రోడ్డుమీద అనుభవాలు వేరేగా ఉండేవి లెండి. చెప్తా ముందు ముందు. రోజూ స్కూల్ నుండి రావడం, సైకిల్ వేసుకొని ఖాళీ రోడ్లోకి పోవడం ఇదే పని.
హ్మ్.. మొత్తానికి తంటాలు పడి పడి.. సైకిల్ ను ఐదో తరగతి లో కి వచ్చేసరికల్లా నేర్చుకో గలిగాను. చెల్లి కూడా నాతో పాటు నేర్చేసుకుంది. కానీ.. దానికంటే నేను రెండు ఆకులు ఎక్కువే చదివాను. అదేంటి అంటారా.. డబల్సు తొక్కడం. అదేనండి.. వెనకాల ఇంకొకరిని కూర్చోబెట్టుకొని తొక్కడం. హహహ.. డబల్సు తొక్కే మొదట్లో ఎవరో సలహా ఇచ్చారు. స్కూలు బ్యాగు వెనకాల పెట్టుకొని తొక్కితే ఈజీగా వస్తుందని. అది బాగానే పనిచేసిందనే చెప్పుకోవాలి..🤷
హా... ఒకసారి ఏమైందంటే........ నా ఐదో తరగతి లోనూ, చిన్నా ఐదో తరగతి లోనూ నవోదయ పరీక్ష రాసేందుకు కోచింగ్ కి వెళ్ళే వాళ్ళం. అది మాకు కొంచెం దూరమే. నేను అప్పుడప్పుడూ సైకిల్ వేసుకెళ్ళే దాన్ని. అమ్మ వాళ్లకి భయం కొద్దీ ఇచ్చేవారు కాదు. చీకట్లో రోడ్డుమీద తొక్కడం కష్టమని. వెళ్లడం కోసం రోడ్డు దాటాల్సి వచ్చేది. అలాగే ఒక రోజు రోడ్డు దాటుతుండగా, సడన్ గా బైక్ మీదకి వచ్చేయడంతో భయమేసి సైకిల్ వదిలేసే సరికి అది కాస్తా.. నన్ను కింద పడేసింది. మోకాళ్లు కొట్టుకుపోయాయి. పైగా శీతాకాల మేమో.. చాలా నొప్పి వేసింది. ఇంట్లో ఇలా పడ్డా అని చెప్పలేదు. చెప్తే తెలుసుగా ఏమవుతుందో. మనల్ని తిరిగి తిడతారు, జన్మలో సైకిల్ మళ్లీ ఇవ్వరు. అందుకే గప్ చుప్ గా ఉండిపోయా. 🤫
ఆ దెబ్బ మానుతున్న రోజుల్లో ఊరికే స్నేహితులతో కలిసి సైకిల్ తొక్కాము. నేనేమో చిన్నా ను వెనుక ఎక్కించుకున్న. అప్పుడు ఏమైందంటే.. అది కొంచెం ఇరుకు రోడ్డు అన్నమాట. ఇంకో పిల్ల నాకు దగ్గర కంటా వచ్చేయడంతో మా సైకిళ్ళ హాండిల్సు ఒకదానిమీద ఒకటి వచ్చి అందరం కింద పడి పోయాం. ఇక చూస్కోండి. నేను ఆరోజు మంచి పరికిణీ వేసుకున్నాను. అప్పుడప్పుడే తగ్గుతున్న దెబ్బ కాస్తా.. రాచపుండు లా తయారైంది. ఈసారి రక్తం కూడా వచ్చింది. ఆ దెబ్బతో కొన్నాళ్లు కోచింగ్ కి ఆటోలో వెళ్ళే దాన్ని. 🤕😵
తర్వాత నేను 6, చిన్నా 5 చదువుతున్నప్పుడు, దాన్ని ఒక్క దాన్నే కోచింగ్ కి పంపడానికి భయమేసి, అక్కగారి హోదాలో నేనే సైకిల్ పై తీసుకెళ్లి తీసుకు వచ్చే దాన్ని. అస్తమానం కోచింగ్ అంటుంది, స్కూలు సంగతి ఏంటి అనుకుంటున్నారా.. మా స్కూలు మాకు పక్కనే అండి. ఇలా వెళ్లి అలా వచ్చేవాళ్ళం. 'ఇంటర్బెల్లు' (interval+bell😜) లో కూడా ఇంటికి వచ్చే వాళ్ళం అప్పట్లో. ఈసారి పాత సైకిల్ తో పాటు కొత్త సైకిల్ కూడా వచ్చి చేరింది. నా కోసం అప్పుడు డాడీ కొన్నారు. తర్వాత ఆ పాత మిస్ ఇండియా షెడ్ కి వెళ్ళిపోయింది. ఈ కొత్త సైకిల్ కి హ్యాండిల్స్ ఇంచక్కా నిదానంగా ఉండేవి. ఈ సైకిల్ తోనే నాకు అనుబంధం ఎక్కువ.
![]() |
| నా సైకిలు ఎరుపు రంగులో ఉండేది..(Google image) |
హైస్కూల్లో ఎనిమిదో తరగతి లో చేరాక ఎక్కువగా వాడే దాన్ని. స్కూలు, ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉండేది. అలా పదో తరగతి దాకా ఆ సైకిల్ నన్ను మోసింది. ఇక్కడ ఒక అసందర్భ ప్రేలాపన ఒకటి చెప్పాలనిపిస్తుంది. అంటే మరీ అసందర్భం అని కాదు కానీ .. మనకి ఈ జీవితంలో అతి వేగంగా సైకిల్ తొక్కిన సందర్భం అంటూ ఒకటి ఉంటే నాకదన్న మాట..😛
ఆరోజు మా లెక్కలు సారు గారి అమ్మాయి పెళ్లి. మమ్మల్ని కూడా పిలిచారు. నేను, నా ఫ్రెండు పెళ్లి భోజనం చేసి, సైకిల్ మీద బయల్దేరాం. ఇద్దరము గాగ్రాలు వేసుకున్నాము. అవి వేసుకుని సైకిల్ తొక్కడం కొంచెం కష్టమే. సగం దూరం వచ్చాక బైకు మీద ఇద్దరు కుర్రాళ్ళు మా వెంట పడ్డారు 😤 మేమిద్దరం ఎటు వెళ్తే అటే వస్తున్నారు. హార్ట్ బీట్ పెరిగింది ఇద్దరికీ. అలా కాదని.. రూట్ మార్చేసి మేము సందుల్లోంచి ఇళ్లకు చేరుకున్నాం. అప్పుడే చాలా స్పీడ్ గా సైకిల్ తొక్కినట్టు గుర్తుంది నాకు. 😟
టెన్త్ తర్వాత నా సైకిలు అలాగే మూలన పడి ఉండేది. దానికి మోక్షం మళ్లీ రెండేళ్ల తర్వాత అంటే నేను డి .ఎడ్ చదివేటప్పుడు కలిగింది. అప్పుడు కాలేజీ మూడు కిలోమీటర్ల దూరంలో ఉండేది. తప్పింది కాదు. బస్సులో వెళ్లడం నాకు సుతరామూ ఇష్టం లేదు. ట్విస్ట్ ఏంటంటే మా యూనిఫామ్ చీర కదా... చీర కట్టుకొని సైకిల్ తొక్కడం. దానికి నేను ఏం చేసే దాన్ని అంటే.. యుద్ధానికి సిద్ధమయ్యే వాళ్ళు కవచాలు అన్ని ధరించినట్టు నేను... చీర కుచ్చిళ్ళు చెదిరిపోకుండా కింద ఒక పిన్ను పెట్టేదాన్ని... ముఖానికి స్కార్ఫ్ కట్టే దాన్ని... తొక్కడం ఎలా అంటే.. కుడి చేత్తో హ్యాండిల్... ఎడమచేతితో కుచ్చిళ్ళు.. చైన్ లోకి చీర వెళ్ళిపోకుండా అన్నమాట. అయినా రెండు మూడు సార్లు అలా జరిగి చీరంతా ఆయిల్ మరకలు అంటించాను లెండి😩 అప్పట్లో ఈ బాధలన్నీ పడలేక చాలాసార్లు డ్రెస్ వేసుకొని పోయేదాన్ని. ఏదో ఒక వంక చెప్పేదాన్ని టీచర్స్ అడిగితే. లేకపోతే చీర యూనిఫామ్ ఏంటో...🤦🤦 ఆ చదువులో గిట్టనిది ఏమైనా ఉంటే అదే. కథ పక్కదోవ పడుతుంది కదా.. సరే సరే వెనక్కి వచ్చేద్దాం..
మళ్లీ సైకిల్ కథ ఎక్కడ మొదలైంది అంటే.. నేను కేవీ లో చేరాక. చేరిన నెల కే మిస్స్ ఇండియా పెటల్ కొనుక్కున్నాను. చాలామంది అన్నారు.. స్కూటీ కొనుక్కోవచ్చు కదా అని. కానీ సైకిల్ తొక్కటం ఆరోగ్యానికి మంచిది అది ఇది అని అనను కానీ, లైసెన్సు లేకపోవడం, స్కూటీ నడపడం రాకపోవడం వల్ల అప్పట్లో స్కూటీ జోలికి పోలేదు. పిల్లలతో పాటు నేను కూడా సైకిల్పై రావడం చూసి అందరూ వింతగా చూసేవారు. హేహే 🤭
![]() |
| ఇదే అన్నమాట..నా ప్రస్తుత సైకిలు(Google image) |
అదన్నమాట నా సైకిల్ కథ. మొన్న వింటర్ బ్రేక్ లో నేను కూడా స్కూటీ నడపడం నేర్చుకున్నాను లేండి 🥴
P.S : అసలు ఈ టపా వేయడానికి చాలా తంటాలు పడాల్సి వచ్చింది. టైప్ చేసి ప్రివ్యూ చూస్తుంటే అంతా గజిబిజి గా వస్తుంది పేజీ. టెంప్లేట్ లో సమస్య ఏమో అని మార్చి కూడా చూసాను. కానీ నాకు ప్రస్తుతం ఉన్న టెంప్లేట్ చాలా ఇష్టం. మార్చడం నచ్చలేదు నాకు. ఇలా కాదని..అదంతా delete చేసి మళ్లీ కొత్త టపాలో ఇదంతా రాశాను. ఇప్పుడు బాగానే వస్తుంది. ఈ ప్రక్రియ అంతా అయేసరికి గంట పైనే పట్టేసింది.😩మీకు ఈ template ఎలా అనిపించింది.. కామెంట్లలో చెప్పండే..టాటా
21, జూన్ 2020, ఆదివారం
లాక్ డౌన్ లో చెన్నై కి ...🚆
జూన్ వచ్చేస్తుంది అంటే మళ్లీ భయం మొదలైంది. ఎందుకంటే 20 న వేసవి సెలవుల అనంతరం స్కూలు తెరిచే రోజు. మామూలు రోజులు అయితే భయమే లేదు..కానీ ఇప్పటి పరిస్థితి వేరు కదా..స్కూలు తెరవడం అంటే పిల్లలు ఎలాగూ రారు. మరి టీచర్స్ స్టేషన్ లో అందుబాటులో ఉండాలి గా. మా స్కూలు నుండి ఇలా పది మందిమి స్వ రాష్ట్రాలకి వెళ్ళాము. మళ్లీ ఇప్పుడు చెన్నై వెళ్ళాలంటే బోలెడు భయాలు. అది ఫుల్ రెడ్ జోన్. బస్సులు ఎలాగూ లేవు..trains ఉన్నాయో లేదో తెలీదు.. quarantine కి గానీ పంపారంటే అదో తలపోటు. హాస్టల్ తీయరు..వెళ్తే అక్కడ ఎక్కడ ఉండాలి..? ఓ వైపు తమిళనాడు epass తప్పనిసరి చేసింది. ఇప్పుడు మళ్లీ అప్లై చేస్తే వస్తదో రాదో అని..ఇలా అన్నమాట..!!
సమ్మర్ వెకేషన్ ఏమైనా Corona గురించి పొడిగిస్తారేమో అన్న చిన్న ఆశతో 19 కి trains వెతికా… ఒకే ఒక ట్రైన్ ఉంది. న్యూ ఢిల్లీ - చెన్నై రాజధాని ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మనకి విజయవాడ మాత్రమే halt ఉంది. దానికి డాడీ కి నాకు tickets బుక్ చేశాను. ఆ టికెట్ pnr నంబర్ తో epass అప్లై చేసా. ఆ రాత్రే pass approve అయిపోయింది. ఒక టెన్షన్ తీరింది. ఇదంతా జూన్ 3 నాటి కథ. తర్వాత పని ఇల్లు వెతుక్కోవడం. సడన్ గా నా అమోఘమైన బుర్రకి ఒక సంగతి గుర్తుకు వచ్చింది. పోయిన జనవరి లో మా స్కూల్ టీచర్ ఒకావిడ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఆ ఇల్లు అప్పటి నుండి ఖాళీ గానే ఉంటుంది. ఆవిడ ను అడిగి ఆ ఓనర్ గారి ఫోన్ నంబర్ తీసుకున్నాము. ఫోన్ చేసి ఇలా మాకు ఆ ఇల్లు కావాలి అంటే సరే అన్నారు. హమ్మయ్య...అన్నీ సెట్ ….అనుకునే లోపు అంతలోనే చెన్నై లో 19 నుండి 30 దాకా లాక్ డౌన్ అన్నారు.🥴😵
మా అందరి బాధ ఏంటంటే జరిగేవి ఆన్లైన్ క్లాసులే..అయినప్పుడు ఇంటి దగ్గర ఉండి చేస్తే ఏంటి అని. ఎవరికీ ఇల్లు వదిలి వెళ్ళడం సుతారమూ ఇష్టం లేదు (నాక్కూడా😒) అందుకే 19 దాకా ఎదురు చూసా...kvs hq నుండి ఏమైనా దానికి సంబంధించిన letter/circular వస్తుందేమో అని…. ఊహూ...ఏం రాలేదు. ఇక ఇప్పుడు అయితే టికెట్ .. పాస్ ...ఇల్లు ఉన్నాయి..ఇంకా ఆలస్యం చేస్తే మళ్లీ ఉంటాయో లేదో అని ఇక వెళ్ళడానికే నిర్ణయించుకున్నాం.
కరెంటు కుక్కరు..కరెంటు పొయ్యి...ఇంకా కొన్ని ముఖ్యమైన పప్పులు ఉప్పులు లాంటివి సర్దాం. 19 పొద్దునే మా పాలకొల్లు నుండి భీమవరం ఆటో లో వెళ్ళాం. అక్కడి నుండి విజయవాడ కి బస్ దొరికింది. Temperature check చేసి ఎక్కించారు. విజయవాడ వెళ్లేసరికి సుమారు 11 అయింది. మా ట్రైన్ 2:40 కి. విజయవాడ రైల్వే స్టేషన్లో టికెట్ ఉంటేనే లోపలికి పంపుతున్నారు. అది కూడా ట్రైన్ వచ్చే రెండు గంటల ముందు. మాకు కొంచెం ముందుగానే పంపారు. లోనికి వెళ్లే ముందు లగేజ్ మీద స్ప్రే కొట్టారు. మెటల్ డిటెక్టర్ లాంటి థర్మల్ స్కానర్ ఉంది. అందులోంచి నడిచి లోపలికి వెళ్ళాలి...అసలు ఎలాంటి విజయవాడ రైల్వే స్టేషన్ ఎలా అయిపోయిందో..ఎప్పుడూ జనంతో ...వచ్చే పోయే రైళ్ళతో కళకళ లాడుతూ ఉండేది కాస్తా నిర్మానుష్యంగా ఉంది.
ట్రైన్ దిగాక ఇంటికి తీసుకు వెళ్ళడానికి prepaid taxi లకి అనుమతి ఉందని తెలిసింది. అప్పుడు నన్ను చెన్నై నుండి తీసుకొచ్చిన డ్రైవర్ కి ఫోన్ చేస్తే స్టేషన్ కి వస్తా అన్నాడు. అతని పేరు మీద pass కూడా జెనరేట్ చేసాము. అలా ట్రైన్ వచ్చే దాకా వెయిటింగ్ హాల్ లో కూర్చున్నాం. ట్రైన్ కొంచెం ముందే వచ్చేసింది. నాకు డాడీ కి వేరు వేరు బోగీలు వచ్చాయి. కానీ ఇద్దరం ఒకే చోట కూర్చున్నాం. ట్రైన్ అంతా ఖాళీ నే. చాలా తక్కువ మంది ఉన్నారు. TC వస్తాడేమో అనుకుంటే రాలేదు. ట్రైన్ లో చాలా బోర్ కొట్టేసింది.
చెన్నై సెంట్రల్ లో దిగేసరికి రాత్రి 8:30 అయింది. దిగిన వాళ్ళందర్నీ వరుస లో నిల్చో బెట్టి లగేజ్ మీద స్ప్రే చేశారు. అందరికీ home quarantine stamps ఎడమ చేతి మీద వేశారు (అది అప్పుడే వెలిసిపోయింది😑) ముందుగా టాక్సీ బుక్ చేసుకున్న వారిని వేరే వైపు నుండి temperature check చేసి పంపేశారు. 😊
నాకు ఆశ్చర్యం అనిపించినది ఏంటంటే ...epass గురించి అంత టెన్షన్ పడ్డాము. అసలు అది చూడనేలేదు...🤕 ఇంకా ... స్టాంప్స్ అయితే వేశారు ..వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు..ఎక్కడికి వెళ్తున్నారు అవేం వివరాలు తీసుకోలేదు.. ఏంటో మరి..🤷
ఇక ఇంటికి వచ్చేసి స్నానాలు కానిచ్చి.. ఓట్ మీల్ చేసుకుని తినేసి పడుకున్నాము. మా పది మందిలో ముగ్గురం మాత్రమే చెన్నై నుండి తిరిగి వచ్చాం..మిగిలిన వారి సంగతి ఏమో మరి..20 న mail ద్వారా జాయినింగ్ report ...station చేరుకున్నట్లు ఆధారాలు గా ట్రైన్ టికెట్, epass కాపీ తో సహా పంపేసాను...హ్మ్…ప్రస్తుతానికి అంతే ఇక..👻
2, జూన్ 2020, మంగళవారం
కరోనా కాలం లో నేను -2
Lockdown 1.0 :-
ఆ మర్నాడు అందరూ వాట్సప్ status లు పెట్టేదాక తెలియలేదు ఉగాది అని... హ్మ్..
స్కూలు వాళ్ళు మాకో పని అప్పగించారు. ఒక్కో టీచరు బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు తయారు చేయాలని. నాకేమో 4 వ తరగతి ఇంగ్లీషు, రేణు కేమో 4 వ తరగతి హిందీ వచ్చాయి. ఇద్దరం ఆ పనిని కొన్ని రోజుల్లోనే చేసేసాము.
మొదట్లో రోజూ చపాతీ తినడం భయం వేసేది. ఆహార అలవాట్లు మారటం వల్ల ఏమైనా అవుతుందేమో అని.. కానీ త్వరగానే అలవాటు పడిపోయాను.
మధ్య మధ్య లో పక్కింటి తెలుగు ఆంటీ.. రవ్వ కేసరి, గోంగూర పచ్చడి, దోశలు, ఆమ్లెట్, మామిడికాయ పులిహోర లాంటివి ఇస్తుండే వారు.. అప్పుడు అమ్మ గుర్తు వచ్చేది😞
అప్పట్లో ఉత్తినే కన్నీళ్లు వచ్చేసేవి. చాలా డెప్రెషన్ లో ఉండేదాన్ని. మా స్కూల్లో ఒక సీనియర్ టీచర్ ఒకరోజు మెసేజ్ చేశారు.." ఏం మోహనా!! ఎలా ఉన్నావ్ ఎక్కడ ఉన్నావ్?" అని. ఆ మాత్రానికే చాలా సంతోష పడ్డాను.
నా ఫోన్ కి అసలు సిగ్నల్ యే ఉండేది కాదు. వాట్సప్ తప్ప ఇంకేం సరిగ్గా వచ్చేవి కాదు మరి. ఒక్క ఐదు ని|| వీడియోను ...అదీ 240p లో చూడటానికి 20 ని|| పట్టేది. అందుకే YouTube వాడటమే మానేశాను.
ఒక రోజు రేణు వాళ్ళమ్మ గారు కాటుక తయారు చేశారు. దూది లో వేపాకు, వాము పెట్టీ దానికి ఆవ నూనె పట్టించి దాన్ని మండించారు. ఆ పొగకి వచ్చే మసిని పోగేయటమే...బాగుంది భలేగా..!!
Lockdown 2.0 :-
TV లో lockdown పొడిగింపు మే 3 వరకు అనేసరికి ఇంచుమించు ఏడుపు ముఖమే అయింది. May 2 నుండి మాకు వేసవి సెలవులు. ఇంటికి వెళ్ళడానికి 2 న బయల్దేరే లా టికెట్ చేసుకున్నాను ఎప్పుడో! పైగా వేసవి కాలం కదాని 2AC తీసుకున్నా. ఇప్పుడది గోవిందా!!🙄 అసలు ఇంటికి వెళ్ళడం ను ఊహించ లేక పోయే దాన్ని.
మా స్కూలు పిల్లలకు ఆన్లైన్ క్లాసులు మొదలు పెట్టాం. అసలైతే ఏప్రిల్ 1 నుండి 2020-21 మొదలు అవ్వాలి. సగం నెల వృధా అయిపోయింది. వాట్సప్ ద్వారా సెక్షన్ల వారీ గ్రూపులు క్రియేట్ చేసి, చిన్న చిన్న వీడియో లు , వర్క్ షీట్లు లాంటివి పంపే వాళ్ళం. ఇదంతా వన్ వే నే...అటు నుండి స్పందన తెల్సుకునే వీలు లేదు.
ఒక రోజు సరదాగా ఇంటికి దగ్గర్లో నే ఉన్న ఇంకో మేడం ఇంటికి వెళ్ళాం నేను, రేణు. ఆ ఇంటి గలావిడ మా వంక అదోలా చూస్తూ "ఇప్పుడు రాకూడదు" అన్నది. ఇంత దారుణంగా తయారు అయ్యాయా పరిస్థితులు అని అనిపించింది అప్పుడు.
మధ్యలో ఒకరోజు హాస్టల్ వార్డెన్ తనకు తానుగా ఫోన్ చేసి మే 1 నుండి తెరుస్తాను.. వచ్చేసెయ్ అంది. లాక్ డౌన్ పొడిగించినా పర్లేదు నువ్వొచ్చెయ్ అంది. చాలా ఆనందమేసింది. కానీ తర్వాత ఫోన్ చేసి మళ్లీ అడిగితే ...ఆ వీధి లోకి ఎవర్నీ రానివ్వకుండా వీధి మొదట్లో అడ్డంగా పెట్టిన బ్యారికేడ్ల ఫోటోలు పంపింది.🤕
Lockdown 3.0 :-
లాక్ డౌన్ లో చిక్కుకు పోయిన వాళ్ళకి ఇంటికి వెళ్ళే అవకాశం ఉందని ప్రభుత్వం చెప్పడం తో దానికి సంబధించిన email address లకు emails పంపాను. Stranded citizen కింద ఇంకా మన స్పందన సైట్ లోనూ , తమిళనాడు కు సంబంధించిన సైట్ లోనూ రిజిస్టర్ కూడా చేశాను. ఏమైనా రైళ్లు, బస్సులు లాంటివి వేస్తారేమో అని పిచ్చి ఆశ...🥺
ఎంత కాలం ఇలా ఒకరింట్లో ఉంటాం...అని ధైర్యం చేసి మా హాస్టల్ దగ్గర్లోని ఇంకో కేవీ లో పని చేసే తెలుగు అమ్మాయి గౌతమి ఇంటికి వెళ్ళిపోయాను. ఆరోజు సైకిల్ లో గాలి లేకపోయినా కష్టపడి మెల్లగా వచ్చేసాను. గాలి కొట్టిద్దాం అంటే ఏం షాపులు లేవాయే. మధ్యలో ఎక్కడైనా ఆపుతారేమో అని చాలా భయపడ్డాను..కానీ ఏం కాలేదు.
ఆ నాలుగు జతల బట్టలతో నే గడపటం చాలా చిరాగ్గా అనిపించేది. ఇలా ఎంత కాలమో అర్ధమయ్యేది కాదు. చివరికి ఇంటికి వెళ్ళలేక పోయినా పర్వాలేదు.. హాస్టల్ తీస్తే చాలు అనుకునేదాన్ని.
కార్ అద్దెకి తీసుకుని TN epass కి అప్లై చేసుకోవచ్చు అని తెలిసింది. నేనేమో ముందు జంకాను. ఒక్కదాన్నే కార్లో ఎలా వెళ్ళడం అని. గౌతమి వాళ్ళు విజయనగరం వెళ్ళాలి. పోనీ వాళ్ళు వెళ్ళినా నేను ఒక్కదాన్నే ఇక్కడే ఉండొచ్చు లే అనుకున్నాను.
మా తెలుగు కేవీ టీచర్స్ వాట్సప్ గ్రూప్ ద్వారా ఇద్దరు కన్యాకుమారి నుండి తెలంగాణా వెళ్తున్నారు అని తెలిశాక నమ్మకం కుదిరింది. వెళ్ళాలనే కోరిక పెరిగింది. దగ్గర్లోని ఒక ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడి బండి నంబర్ తీసుకుని epass కి అప్లై చేశాం. వాళ్ళేమో విజయనగరం కి, నేనేమో పాలకొల్లు కి. ఆ మర్నాడు లేచేసరికి పాస్ వచ్చినట్టు sms వచ్చింది. ఇక నా ఆనందానికి అవధులు లేవు.🤩
బయల్దేరే ముందు రోజు హాస్టల్ కి వెళ్లి నా బట్టలు అవీ సర్దేసుకుని తెచ్చేసుకున్నా. 49 రోజులు సెలవులు కదా .(అప్పటికే వారం రోజులు వృధా) కారే కదా అని ఎక్కువగా నే luggage తయారు చేశా.
లాక్ డౌన్ లో చెన్నై లో ఉన్నంత కాలం నా స్నేహితులైన జలుబు, జ్వరం రాలేదు. చాలా భయ పడేదాన్ని .. ఎక్కడేం తేడా చేసి ఏం పట్టుకుంటుందో అని..కరోనా అంటే అంత భయం ను సృష్టించారు మరి..!
![]() |
ఎన్నాళ్ళో వేచిన ఉదయం : మే 8
డ్రైవర్లను పొద్దునే 4 కే రమ్మన్నాము. ఫోన్ కి వచ్చిన pass print తీసి కార్ ముందు అద్దం మీద అంటించాము. నేను మాస్క్..ఇంకా దాని పైన ముఖం అంతా స్కార్ఫ్ తో కప్పేసాను. రెండు నీళ్ల సీసాలు, రెండు డ్రింక్ సీసాలు, బిస్కెట్స్ ప్యాకెట్లు ఇవన్నీ ముందే సర్ది పెట్టుకున్నా….కానీ ఏం తినలేదు ఇంటికి వెళ్ళేదాకా...ఆరార గా ఆ డ్రింక్..నీళ్ళు మాత్రమే తాగాను. అసలు ఇలా ఇంటికి వెళ్ళ గల్గుతాను అని కల్లో కూడా ఊహించలేదు.
దారిలో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయో! ప్రతీసారి దిగి అక్కడికి వెళ్ళడం...పేరు..ఫోన్ నంబర్.. బండి నంబర్..ఎక్కడి నుండి ఎక్కడికి ఇవి రాసుకోవడం...ఇంకా నెల్లూరు లో సరిహద్దు మొదట్లో నే థర్మల్ స్క్రీనింగ్ చేశారు. దారంతా లొకేషన్ ఆన్ లోనే పెట్టాను. డాడీ నన్ను ట్రాక్ చేస్తుండేవారు. అలా పొద్దున 5 కి బయల్దేరితే సాయంత్రం 5 అయింది వచ్చేసరికి.. అలా..సుమారు నాలుగు నెలల తర్వాత ఇంటి ముఖం చూసే అదృష్టం దక్కింది...🏠👨👩👧👧
21, మే 2020, గురువారం
కరోనా కాలంలో నేను -1
18 మార్చి 2020 నుండి మొదలుపెడదాం.....
ఆరోజు పదవ తరగతి సి బి ఎస్ ఈ సోషల్ పరీక్ష. నాకు ఇన్విజిలేషన్ రావడం రెండోసారి. కరోనా వ్యాధి నేపధ్యంలో సి బి ఎస్ ఈ పరీక్షలకి సంబంధించి కొన్ని మార్పులు చేసింది . అందరూ మాస్కులు వేసుకోవాలి శానిటైజర్ నీళ్ల సీసా లాంటివి తెచ్చుకోవచ్చు.. గదిలో ఇద్దరి మధ్య ఒక మీటరు దూరం ఉండాలి ఇలా అన్నమాట.. అప్పటివరకు ఒక గదిలో 25 మంది విద్యార్థులు, ఇద్దరు ఇన్విజిలేటర్లు (అసిస్టెంట్ సూపరింటెండెంట్) తో పరీక్షలు జరిగాయి. కానీ ఇప్పుడు ఒక గదిలో 12మంది విద్యార్థులు ఒక ఇన్విజిలేటర్ మాత్రమే ఉంటారు. దానికోసం ప్రైమరీ తరగతి గదులను కూడా వాడాల్సి వచ్చింది. కంట్రోల్ రూమ్ కి కొంచెం ముందుగానే వెళ్ళాం. తర్వాత మాకు కేటాయించిన రూములోకి వెళ్ళిపోయాం. నా రూమ్ లో అందరూ అమ్మాయిలే ఉన్నారు. వాళ్ళందర్నీ చూస్తే నా పదవ తరగతి రోజులు గుర్తుకు వచ్చాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే అప్పుడు ఏ ఒక్కరూ మాస్క్ వేసుకోవడం కానీ ముఖాన్ని కప్పుకోవడం కానీ చేయలేదు. నేను కూడా. నిజం చెప్పాలంటే అప్పట్లో మాస్కులు శానిటైజర్ లు ఎక్కడా దొరికేవి కాదు.. స్టాకు ఖాళీ అయిపోయేది.🥺
ఆ తర్వాతి రోజు పొద్దున్నే ఫ్లాష్ న్యూస్ ఏంటంటే మార్చి 31 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను సి బి ఎస్ ఈ వాయిదా వేసిందని. అలాగే 31 వరకు అన్ని స్కూళ్లను మూసేయాలని కె వి ఎస్ హెచ్ క్యూ నుండి ఆర్డర్ వచ్చింది. మార్చి 20న మాకు ఒక సర్క్యులర్ వచ్చింది. ప్రైమరీ స్టాఫ్ కి మొదట మూడు రోజులు సెలవులు ఆ తర్వాత సెకండరీ స్టాఫ్ కి సెలవులు. వాళ్లకి సెలవులు అయినప్పుడు మేం వెళ్ళాలి అన్నమాట. ఆ ఆదివారమే ప్రధాని జనతా కర్ఫ్యూ ప్రకటించారు (మార్చి 22).
సోమవారం సాయంత్రం హాస్టల్ వార్డెన్ వచ్చి చెప్పింది .."మంగళవారం అర్ధరాత్రి నుండి 31 దాకా తమిళనాడులో కర్ఫ్యూ అంట. హాస్టల్ మూస్తున్నాం" అని. నాకేం చెయ్యాలో తోచలేదు. ఇలాంటి పరిస్థితి వస్తుంది అని అనుకున్నా కానీ మరీ మొత్తానికి మూస్తుంది అని అనుకోలేదు.🤯😵😫 మా రూమ్ లో లో అప్పటికి ఇద్దరమే ఉన్నాం. ఆ అమ్మాయి ఆ రాత్రికే ఏదో కార్ పట్టుకొని వాళ్ల ఊరు trichy వెళ్ళిపోయింది. నేను ఒక్కదాన్నే మిగిలాను. ఇక చేసేది ఏమి లేక రేణు ని అడిగా... కొన్ని రోజులు మీ ఇంట్లో ఉంటాను అని.. తన ఒప్పుకుంది.
మంగళవారం హాస్టల్లో నేనొక్కదాన్నే ఉన్నాను. అందరూ ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. ఆ రోజున చాలా ఒంటరితనం అనిపించి ఏడ్చేశా🤧. సాయంత్రం 3:30 కి నాలుగు జతల బట్టలు ఇంకా కొన్ని నిత్య అవసరం అనిపించినవి బ్యాక్ పాక్లో సర్దుకొని నా సైకిల్ మీద రేణు వాళ్ల ఇంటికి బయలుదేరాను. అప్పటిదాకా హాస్టల్ గది నాలుగు గోడల కి పరిమితమైన నాకు మనుషుల్ని చూడగానే కొంచెం బాగా అనిపించింది. ఆ రోజే ఇరవై ఒక్క రోజుల లాక్ డౌన్ ప్రకటన చేశారు. ఆ రాత్రి సరిగా నిద్ర పట్టలేదు. కొత్త ప్రదేశం ఇంకా 21 రోజులు... 31 దాకానే అనుకున్న.. అన్ని రోజులు ఇప్పుడు ఇక్కడ ఎలా ఉండటం అని… వీళ్ళకి ఇబ్బంది అవుతానేమో అని.. ఇవే ఆలోచనలు బుర్రనిండా..🙄😣
తర్వాత జరిగింది తర్వాతి టపా లో....🥴
8, ఏప్రిల్ 2020, బుధవారం
నా ఉద్యోగ ప్రయాణం - 6 (My preparation in a nutshell)
8, మార్చి 2020, ఆదివారం
అదివో..అల్లదివో.. శ్రీహరివాసము!!!
![]() |
| Google image |
![]() |
| శ్రీనివాసం వసతి సముదాయం |
![]() |
| గోవింద రాజస్వామి ఆలయ గోపురం |
![]() |
| ఈ వ్యూ చాలా బాగుంది🤩 |





























