31, జులై 2018, మంగళవారం

గ్రహణం

ఆ శతాబ్దపు సుదీర్ఘ చంద్ర గ్రహణం 27 జూలై న ఏర్పడ్తుందని రేడియో మరియు పత్రికల ద్వారా తెల్సుకుని, ఈ ఖగోళ అద్భుతాన్ని  ఎలాగైనా చూసి తీరాలని మంగమ్మ శపధం లాంటిది చేసాం...అదీగాక అరుణ గ్రహాన్ని కూడా పనిలో పనిగా చూడొచ్చంటగా...చంద్రుడికి దగ్గరగా వస్తాదట..కానీ అది అర్ధరాత్రిలో జరుగుతుందని తెల్సి నిరాశపడ్డా!! అయినా నా పిచ్చి గాని చంద్రుడు పగలు వస్తాడా ఏంటి!!!ప్చ్..కనీసం రాత్రి పది లోపు కూడా కాదు..

రాత్రి పడుకునే ముందు పైకెక్కి చూస్తే చంద్రుడు ఎక్కడా లేడు..నా మట్టిబుర్ర అప్పుడు వెలిగింది..పౌర్ణమి నుంచి చంద్రుడు ఆలస్యంగా తీరిగ్గా వస్తాడు కదా... ఆకాశం అంతా మబ్బుపట్టి ఉంది. ఒక్క చుక్క కూడా లేదు...ఇలా ఐతే గ్రహణాన్ని చూడ్డం కష్టమే మరి...ఏమో ఆ టైం కి ఎలా ఉంటుందో మరి.. నేను చూసే సమయానికి మేఘాలని కొంచెం పక్కకి తప్పుకోమని శరణు వేడుకొని కిందకి వచ్చేశా..!!

అర్ధరాత్రి మెలకువ రావడం కష్టమని సెల్లులో ఒంటిగంటకి అలారం పెట్టుకుని పడుకున్నా..కాసేపయ్యాక సడెన్ గా మెలకువ వచ్చింది..ఒహ్హో..అలారం అక్కర్లేకుండానే మెలకువ వచ్చిందే. నువ్ గ్రేట్ మోహనా అని నాకు నేనే భుజం తట్టుకున్నా...త్వరగా డాబా పైకి వెళ్ళి చంద్రుడి దోబూచులాట చూడాలనుకుంటూ.. అనందపడుతూ టైం చూశా... అంతే కత్తివేటుకి చుక్క నెత్తురు లేదన్న మాదిరి టైడ్ యాడ్ లో లాగా షాక్ అయ్యావా! అని చెవిలో ఎవరో అరిచినట్లయింది ఒక్కసారిగా..నేనేమో ఏ 12 అయ్యిందో అనుకున్నా...కానీ అంతలోనే నా ఆనందం అంతా ఆవిరి అయిపోయింది ఈ ఆషాఢం ఉక్కపోతకి..ఇంతకీ టైమెంతో తెల్సా??...తెల్లవారుజాము 4...హ్మ్..ఏం చేస్తాం..ఇంక మా చెల్లినేం లేపుతాను..పోనీ ఒకేఒక్క లాస్ట్ చాన్స్ అనుకుని, టైం చచ్చినా ఆశ చావక..(సామెత మార్చాన్లెండి!!)ఒకసారి చూసి వస్తే ఏమవుతుందని మెల్లగా తలుపులు తీసుకుని మా ఇంటికి రోజూ వచ్చే పిల్లిలా మెట్లెక్కా.. శబ్దం చేస్తే ఏ దొంగ వెధవో వచ్చాడనుకుంటారుగా మరి..

సీన్ కట్ చేస్తే చంద్రుడు మామూలుగానే ఉన్నాడు కానీ మబ్బుల ముసుగులో దాక్కున్నాడు..నన్ను ఎవరెవరు చూస్తున్నారా!!?? అని మేఘాల చాటు నుండి తొంగి తొంగి చూస్తున్నాడు. “నువ్వు నా గ్రహణంలో నన్ను చూడకుండా నిద్రపోయావ్ గా!! నీ ముఖం చూడను గాక చూడను ఫో!!”అంటూ మొత్తంగా మబ్బుల్లోకి దూరిపోయాడు..ఎంత జుట్టు పీక్కుని గింజుకున్నా కదిలిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేం గా!!నేనే మన్నా ‘24’ సినిమాలో సూర్య నా ఏంటీ!!!ఇంక చేసేదేంలేక కిందకివచ్చేసి తలుపులు జాగ్రత్తగా వేసేసి ఫ్యాన్ వేగం కాస్త పెంచి మళ్ళీ మంచమెక్కా...

ఇక ఆరింటికి మా చెల్లికి జరిగిన తతంగం చెబుదామని లేపాను...(అదింకా లేవ నేలేదు!!)..ఆవులిస్తూనే అప్పుడే ఒంటిగంట అయిపోయిందా అంది..నేను కొంచెం గట్టిగా ఒంటిగంట కాదే తెల్లారిందే అని అరిచినంత పని చేసా..అప్పుడు అసలు విషయం చెప్పింది..రాత్రి 12 కి దానికి మెలకువ వచ్చిందంట..ఎలాగూ ఇంకో గంటలో అలారం మోగుతుందిగా అప్పుడు లేవొచ్చులే అనుకుని పడుకుందట..అప్పుడు నిన్నూ లేపాల్సిందే అని బాధపడింది..మొత్తానికి ఈ సుదీర్ఘ చంద్రగ్రహణాన్ని చూసే అవకాశాన్ని కోల్పోయాం..మళ్ళీ 2028 లో ఇలాంటిది వస్తుందంటగా అప్పుడైనా చూస్తానో లేదో!!??

కానీ ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి..ఈ సంవత్సరంలో ఏర్పడిన మొదటి చంద్ర గ్రహణం జనవరి 31 న వచ్చింది కదా..దాని పట్టువిడుపులని ఆసాంతం రాత్రి పది దాటే వరకు ఉండి మరీ చూశాం..అప్పుడు గ్రహణం ఒకటే కాదు..సూపర్ మూన్+ రెడ్(బ్లడ్) మూన్+ బ్లూ మూన్..ఇవన్నీ ఒకేసారి ఏర్పడ్డాయంట..చూడ్డమే కాదు మా శక్తి కొలదీ ఆ దృశ్యాలను కేమెరా లో బంధించటానికి..సారీ సారీ ఇరికించటానికి ఎన్ని అగచాట్లు పడ్డామో...మరి అంత పేద్ద చందమామ మా బుల్లి కేమెరాలో పట్టాలి కదా!!అందులో ఒకటే ఈ ఫోటో..బాగోకపోయినా ఏం అనుకోకండే!!

7 కామెంట్‌లు:

  1. బావుంది బాగా try చేశారు
    కానీ చంద్రుడు శచీ దేవి తో మాట్లాడరు ఆవిడ ఇంద్రుడి భార్య .చంద్రుని భార్య రోహిణి .
    రాజేశ్వరి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రుడు, ఇంద్రుడు వేరు వేరని నాకు తెలీదండీ!!..తెలిపినందుకు ధన్యవాదాలు...

      తొలగించండి
  2. మూడేళ్ళ తర్వాత బ్లాగు ముఖం చూశా..ఎవరు చూస్తార్లే అనుకుంటూనే టపా వేసాను...కానీ బ్లాగులను ఇంకా ఫాలో అయ్యేవారున్నారని తెల్సి నాకు చాలా ఉత్సాహం వచ్చింది...

    రిప్లయితొలగించండి
  3. నా బ్లాగ్ లో కామెంట్ పట్టుకుని ఇక్కడ తేలాను.. బావుందండీ.. చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్లాగ్ తలుపులు తెరిచినట్లున్నారు కదా.. కీప్ బ్లాగింగ్.. అన్నట్లు మీ బ్లాగ్ టెంప్లేట్ చాలా ఆహ్లాదకరంగా బావుంది.

    రిప్లయితొలగించండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...