6, సెప్టెంబర్ 2018, గురువారం

'స్మార్ట్' కిడ్స్
ఈ కాలం పిల్లలని ఫోన్లకి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదని నా అభిప్రాయం. చిన్న పిల్లలు ఫోన్ ను కూడా ఆటవస్తువులాగే భావిస్తారు. ఒక వయసొచ్చాక ఇచ్చినా ఫర్వాలేదు..కానీ మరీ పసివయసులోనే అలవాటు చేస్తే ఇబ్బందే మరి. ఒక్కసారి చేతికిస్తే చాలు, మళ్ళీ అది మన చేతికి ఎప్పుడు వస్తుందో ఆ దేవుడికే తెలియాలి. ఫోనులో ఎక్కడ ఏమేమున్నాయో మనక్కూడా తెలియనంతగా వారి తెలివిని ప్రదర్శిస్తారు. నా అనుభవంలో జరిగిన సంఘటనలు చెబుతాను!!

ఒక ముఖ్యమైన పోటీ పరీక్షకి విశాఖపట్నం వెళ్ళాల్సి వచ్చింది. మామూలుగా ఇలా పరీక్షల కోసం రాజమండ్రి, విజయవాడ వరకే వెళ్ళాను. ఇవైతే ఒక్కరోజులో వెళ్ళి వచ్చేయొచ్చు. కానీ విశాఖపట్నం అలా కుదరదు మాకు! పోనీ వెళ్ళకుండా మానలేని పరీక్ష, అందుకని ముందురోజు ఉదయమే "సింహాద్రి" (అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు "హింసాద్రి". అందరి అభిమానం తట్టుకోలేక రైల్వే వాళ్ళు ఈ లింక్ ఎక్స్ ప్రెస్ ని నడపట్లేదు ఇప్పుడు) కి బయల్దేరాం. విశాఖలో దిగేసరికీ రాత్రి అయింది. ఆ రాత్రి, మా దగ్గరి బంధువుల ఇంటి దగ్గర ఉన్నాము. 


నేను ట్రయిన్ లో కాలక్షేపానికి పనికి వస్తుందని నా Tablet ని తీసుకెళ్ళా (8-9 గంటల ప్రయాణం మరి). ఆ బంధువులింట్లో చిన్న పిల్లాడు ఉన్నాడని తెల్సి ముందు జాగ్రత్తగా నా ట్యాబ్ ని ట్రయిన్ దిగక ముందే నా బ్యాగ్ లో కనిపించకుండా సర్దేశాను. వాడెప్పుడూ ఫోన్లతోనే ఉంటాడట. మా డాడీ తన ఫోన్ బయటికి తియ్యగానే అది తీసేసుకున్నాడు. లాక్ వేసి ఉన్నా తీయడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ తిరిగి ఇవ్వడం లేదు. వాళ్ళ అమ్మ ఇచ్చేయమని బతిమాలితే తప్ప కనికరించలేదు.దానికి చార్జింగ్ పెట్టనిస్తే ఒట్టు.. మా డాడీ ఇలా చార్జింగ్ పెట్టడం వాడు అలా తీసేయడం...ఇదే వరుస!. వాడికి అప్పటికే ఒక పాత ఫోను, ట్యాబ్ ఉన్నాయి. ఏది కొత్తదొస్తే అదే కావాలట. నా దగ్గర ట్యాబ్ ఉందని బయటపెట్టని నా ముందుజాగ్రత్తని మెచ్చుకున్నా!


తర్వాతి రోజు ఆదివారం..పరీక్ష రోజు. మా బ్యాగులూ అవీ అక్కడే ఉంచేసి, పరీక్షకి కావల్సినవి తీసుకుని బయల్దేరాం. పరీక్ష ఐతే బాగానే రాశాను. ఇంతా చేసి వైజాగ్ వస్తే...అది అరగంట పరీక్షే!! ఆ రోజు ఇక అక్కడే ఉండి మర్నాడు తెల్లారగానే ట్రయిన్ కి వెళ్దామని మా ప్లాన్. పరీక్ష అవ్వగానే ఇంటికి వెళ్ళాం. 


అక్కడి దృశ్యం చూసి నా కళ్ళు బైర్లు కమ్మాయి. వాడు చిద్విలాసంగా సోఫాలో కూర్చుని నా ట్యాబ్ లో ఆటలు ఆడుతున్నాడు. 😣మనకసలే మొహమాటం ఎక్కువాయే. ఇవ్వమని అడగలేకుండా ఉంది నా పరిస్థితి. "ఈ పిల్లకి మరీ ఇంత ఇదేంటో..ఒకసారి తీసుకున్నంత మాత్రాన నీ ట్యాబ్ ఏమీ అరిగిపోదులే" అన్నట్టు చూస్తారేమోనని భయం నాకు. అందుకే ఏం మాట్లాడకుండా నా బాధని దిగమింగుకుని సైలెంట్ గా ఉన్నా. ఇంతలో వాళ్ళమ్మ చెప్పింది...మేం వెళ్ళగానే మా బ్యాగ్ తెరిచేసి అన్నీ కెలికేసాడంట. ఇస్త్రీ చేసి పెట్టుకున్న బట్టలు అన్నీ చెల్లాచెదురు చేసేసాడు. ట్యాబ్ దొరికింది..ఇక అన్నీ అలాగే వదిలేశాడు. నేను ట్యాబ్ ని దాని స్పెషల్ బ్యాగ్ లో పెట్టి లగేజ్ బ్యాగ్లో ఉంచాను..అన్నీ తీసేశాడు.


ట్యాబ్ కి పాటర్న్ లాకులు, పాస్వర్డ్ లు పెట్టే అలవాటు నాకు లేదు. సాధారణ స్లైడ్ లాక్ ఒక్కటే ఉంటుంది. బ్యాగ్లో పెట్టేముందు షట్ డౌన్ చేసే పెట్టాను. అయినా ఆన్ చేసేశాడు. పట్టుమని పదేళ్ళు కూడా లేవు వాడికి..ఎంత తెలివో!! వాడి అమ్మావాళ్ళేమో "ఏం చెయ్యడులే", "అన్నీ తెలుసు మావాడికి" అని అంటున్నారు. అయినా నా భయాలు నావి. అది వాడి చేతిలోంచి జారిందంటే అంతే చాలు లేదా కోపం వచ్చి దాన్ని విసిరికొట్టాడంటే!!అమ్మో...ఆ ఊహే ఎంతో భయంకరం..నా ట్యాబ్ ని ఒక కంట కనిపెడుతూ బట్టలు మడత పెట్టాను. చివరికి ఏదోలా మభ్యపెట్టి ట్యాబ్ ని నా చేతిలో పెట్టారు. నేను ఇచ్చిందే తడవుగా పాస్వర్డ్ పెట్టేశా!.ఏమేం తెరిచాడో చూద్దామని Recent Apps చూస్తే ఒక గేం ఆడాడు, కొన్ని ఎవేవో ఫోటోలు తీశాడు.. ఇంక తర్వాత మేము వచ్చేయడంతో అది అక్కడితో ముగిసింది.

ఇలా చెప్తుంటే నాకు ఇంకా ముందు జరిగిన సంఘటన ఒకటి గుర్తుకొచ్చింది.

ఒకరోజు మా ఇంటికి తెల్సినవాళ్ళు వచ్చారు. వాళ్ళతో పాటు మూడేళ్ళ పాప కూడా వచ్చింది. నేను అప్పటికి ట్యాబ్ లో ఏదో చదువుకుంటున్నాను. మావాళ్ళు, ఆ వచ్చినవాళ్ళు కబుర్లు చెప్పుకుంటుంటే, ఆ పిల్ల నా దగ్గరికి వచ్చింది. చిన్నపిల్ల కదా అని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నా. పక్కనే పెట్టిన ట్యాబ్ తీసుకుంది. Gallery తెరిచింది. ఒక్కొక్కటి తిప్పుతూ ఫోటోలు చూస్తుంది. Gallery లో ఒక mode లో కిందకు తోస్తే డిలీట్ అయిపోతాయి కదా..అలా తను మూడు ఫోటోలు డిలీట్ చేసేసింది. అవేమంత ముఖ్యమైన ఫోటోలు కాదు కాబట్టి సరిపోయింది. లేదంటేనా!!(ఒక వేళ అయినా చేసేదేమీ లేదు)..


అందుకనే చిన్నపిల్లలకి ఫోన్లూ అవీ అలవాటు చేయకపోవటమే మంచిది. (మా పిల్లలు టెక్నాలజీకి దూరంగా ఉండాలా? అని ఎదురు ప్రశ్న వేస్తే నేనేం చేయలేను మరి) మనం చూస్తూనే ఉన్నాం..స్మార్ట్ ఫోన్ల కాలంలో పసివాళ్ళు ఎలా మారిపోయారో!! ఒక పిల్లేమో ఫోన్లో పాటలు పెట్టందే ముద్ద తినదు..ఇంకొకడేమో వాళ్ళ డాడీ ఫోన్ ఇవ్వనంటే ఇల్లెగిరిపోయేలా ఆరున్నొక్కరాగం ఆలపించడానికి గొంతు సవరిస్తాడు. ఒకవేళ ఫోన్లు అలవాటు చేసినా, ఇంకొకరి ఫోన్లని కూడా లాక్కోవడం మంచిది కాదని చెప్తే సరి!!! (వాళ్ళు వింటే మంచిది, లేకపోతే నాలాంటి వాళ్ళు బలైపోతారు)....

2 కామెంట్‌లు:

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...