23, ఆగస్టు 2014, శనివారం

భాషాభిమానం

శనివారం, ఆగస్టు 23, 2014 0 Comments

ఈ రోజు ఉదయం NHK World TV అనే జపాన్ చానెల్లో ఒక కార్యక్రమం చూశా.జపాన్ లో భూకంపాల బెడద ఎక్కువ కదా!అందుకని నగోయా అనే విశ్వవిద్యాలయం వాళ్ళు,భూకంపాలకు కూడా తట్టుకుని నిలబడేలా ఉండే భవనాల నిర్మాణాలపై పరిశోధన చేస్తున్నారు.ఆ భవనాలు భూకంపాలకు ఊగుతాయే తప్ప పడిపోవు.అది అలా ఉంచితే ఇంతకీ విషయం ఏంటంటే...
ఆ నగోయా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు టీవీలో మాట్లాడేటప్పుడు కూడా జపనీస్ లోనే మాట్లాడుతున్నారు.ఆ చానెల్ వారు దానికి ఆంగ్లంలో అనువాదం చేస్తున్నారు.చూడండి,అంత పెద్ద విశ్వవిద్యాలయం లో ప్రొఫెసర్లు అయ్యుండి కూడా వారు తమ మాతృభాషను వదలడం లేదు.మనమేమో ఒకటో తరగతి పిల్లలకి అ,ఆ,ఇ,ఈ..లను వదిలేసి A,B,C,D...లను నేర్పుతున్నాం.మన చుట్టూ ఉండే చిన్నపిల్లల్ని అ,ఆ,ఇ,ఈ లు వచ్చా అనడిగితే,ఎక్కువగా రాదు అనే సమాధానం వస్తుంది.



మన దేశంతో పోలిస్తే జపాన్ చాలా చిన్న దేశం.కానీ భాషాభిమానంలో మన కన్నా పెద్ద దేశం.ఆంగ్లం నేర్చుకుంటేనే అభివృద్ధి సాధ్యమనుకునే మన లాంటి వాళ్ళు,జపనీయుల్ని చూసి చాలా నేర్చుకోవాలి.

21, ఆగస్టు 2014, గురువారం

వేమన పద్యాలు

గురువారం, ఆగస్టు 21, 2014 0 Comments

ఉర్వివారికెల్ల నొక్క కంచముబెట్టి
పొత్తు గుడిపి,కులము పొలయజేసి
తలను చేయిపెట్టి తగనమ్మజెప్పరో
విశ్వదాభిరామ వినురవేమ!

కోపమునను ఘనత కొంచెమైపోవును
కోపమునను మనసు కుందుజెండు
కోపమడచెనేని కోరికలీడేరు
విశ్వదాభిరామ వినురవేమ!

చంపదగినయట్టి శత్రువు తనచేత
జిక్కెనేని కీడు సేయరాదు
పొసగమేలు జేసి పొమ్మనుటే చావు
విశ్వదాభిరామ వినురవేమ!

చాకి,కోక లుతికి చీకాకు పడజేసి
మైల తీసి లెస్స మడచినట్లు
బుద్ధి చెప్పువాడు గ్రుద్దితేనేమయా
విశ్వదాభిరామ వినురవేమ!

అనగననగ రాగమతిశయిల్లుచు నుండు
తినగతినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ!

మాటలాడగల్గు మర్మము లెరిగిన,
పిన్న పెద్దతనము లెన్నవలదు
పిన్నచేతిదివ్వె పెద్దగా వెలుగదా?
విశ్వదాభిరామ వినురవేమ!

ఇచ్చువాని యొద్ద నీయని వాడున్న
చచ్చుగాని ఈవి సాగనీడు
కల్పతరువు క్రింద గచ్చచెట్టున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ!

ధనము కూడబెట్టి దానంబు సేయక
తాను తినక లెస్సదాచు లోభి,
తేనేటీగ కూర్చి తెరువరికిత్తదా
విశ్వదాభిరామ వినురవేమ!

కలిమిగల్గునాడు,కానడు మదమున
లేమి నాడు మొదలె లేదుపెట్ట,
కలిమిలేమి లేని కాలమ్ము గలుగునా!
విశ్వదాభిరామ వినురవేమ!

పుత్తడిగలవాని పుండు బాధైనను
వసుధలోన చాలవార్త కెక్కు
పేదవాని ఇంటిపెండ్లైన ఎరుగరు
విశ్వదాభిరామ వినురవేమ!

తుమ్మచెట్టు ముండ్లు తోడనే పుట్టును
విత్తులోన నుండి వెడలునట్లు,
మూర్ఖునకు బుద్ధి ముందుగాబుట్టును
విశ్వదాభిరామ వినురవేమ!

పాముకన్న లేదు పాపిష్టి యగు జీవి
అట్టి పాము చెప్పినట్టు వినును
ఇలను మూర్ఖుజెప్ప నెవ్వరి తరమయా
విశ్వదాభిరామ వినురవేమ!

పొట్లకాయ రాయి పొసగ త్రాటను గట్ట
లీలతోడ వంక లేక పెరుగు,
కుక్కతోకగట్ట గుదురునా చక్కగా?
విశ్వదాభిరామ వినురవేమ!

ఎలుగు తోలు తెచ్చి యెన్ని నాళ్ళుదికిన
నలుపు నలుపెగాని తెలుపు కాదు,
కొయ్య బొమ్మదెచ్చి కొట్టిన పలుకునా;
విశ్వదాభిరామ వినురవేమ!

ఓగునోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని
భావమిచ్చి మెచ్చు పరమలుబ్ధు
బంది బురదమెచ్చు పన్నీరు మెచ్చునా?
విశ్వదాభిరామ వినురవేమ!

మృగము మృగమనుచు మృగమును దూషింత్రు
మృగము కన్న చెడ్డ మూర్ఖుడగును
మృగముకున్న గుణము మూర్ఖునకేదయా?
విశ్వదాభిరామ వినురవేమ!

హీనుడెన్ని విద్య లిల నభ్యసించిన
ఘనుడు గాడు మొరకు జనుడె గాని
పరిమళములు గార్ధభము మోయ ఘనమౌన
విశ్వదాభిరామ వినురవేమ!

విద్యలేనివాడు విద్వాంసు చేరువ
నుండగానె పండితుడు కాడు
కొలది హంసల కడ కొక్కెరలున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ!

అంతరంగమందు నపరాధములు సేసి
మంచివానివలెనె మనుజుడుండు,
ఇతరు లెరుగకున్న నీశ్వరుడెరుగడా?
విశ్వదాభిరామ వినురవేమ!

అల్పబుద్ధి వాని కధికారముచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు,
చెప్పు దినెడి కుక్క చెరకు తీపెరుగునా?
విశ్వదాభిరామ వినురవేమ!

అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను
సజ్జనుండు బల్కు చల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
విశ్వదాభిరామ వినురవేమ!

కాని వానితోడ గలసి మెలంగిన
హానివచ్చు నెంతవానికైన
కాకి గూడి హంస కష్టంబు పొందదా?
విశ్వదాభిరామ వినురవేమ!

గంగపారుచుండు కదలని గతి తోడ
మురికివాగు పారు మ్రోత తోడ
అధికుడోర్చునట్టు లధముడోర్వగలేడు
విశ్వదాభిరామ వినురవేమ!

వేరు పురుగుచేరి వృక్షంబు జెరుచును
చీడ పురుగు చేరి చేను జెరుచు
క్త్సితుండు చేరి గుణవంతు జెరుచును
విశ్వదాభిరామ వినురవేమ!

అల్పుడెన్ని పల్కులలయక పల్కిన
నధికు డూరకుండు నదిరిపడక
చెట్టు మీద కాకిరెట్ట వేసినయట్లు
విశ్వదాభిరామ వినురవేమ!

అధముడైన మనుజుడర్ధవంతుండైన
అతని మాట నడచు నవనిలోన
గజపతి కొలువందు గవ్వలు చెల్లవా?
విశ్వదాభిరామ వినురవేమ!

ఎంత చదువు చదివి యెన్ని నేర్చినగాని
హీనుడవగుణంబు మానలేడు
బొగ్గు పాలగడుగ బోవునా మలినంబు
విశ్వదాభిరామ వినురవేమ!

కుళ్ళుబోతునొద్ద గూడి మాటాడిన
గొప్ప మర్మములను జెప్పరాదు
పేరు తీరు దెల్ప నూరెల్ల ముట్టించు
విశ్వదాభిరామ వినురవేమ!

చెప్పులోన రాయి,చెవిలోన జోరీగ
కంటిలోన నలుసు,కాలిముల్లు
ఇంటిలోని పోరు,నింతింత గాదయా!
విశ్వదాభిరామ వినురవేమ!

తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు
పుట్టనేమి! వాడు గిట్టనేమి!
పుట్తలోన చెదలు పుట్టవా! గిట్టవా!
విశ్వదాభిరామ వినురవేమ!

పాలపిట్ట శకున ఫలమిచ్చునందురు;
పాలపిట్టకేమి ఫలము దెలియు?
తనదు మేలు కీళ్ళు తనతోడ నుండగ
విశ్వదాభిరామ వినురవేమ!

రామ నామ జపముచే మున్ను వాల్మీకి
పాపి బోయడయ్యు బాపడయ్యె!
కులము ఘనము గాదు గుణమే ఘనమ్మురా
విశ్వదాభిరామ వినురవేమ!

ఔనటంచు నొక్కడాడిన మాటకు
కాదటంచు బలుక క్షణము పట్టు,
దాని నిలువదీయ ధాతయె దిగవలె
విశ్వదాభిరామ వినురవేమ!

ఆత్మశుద్ధిలేని యాచార మదియేల?
భాండ శుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్ధిలేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ వినురవేమ!

బంధుజనులజూడు,బాధల సమయాన,
భయమువేళ జూడు,బంటుతనము,
పేదపడ్డ వెనుక,పెండ్లాము మతి జూడు
విశ్వదాభిరామ వినురవేమ!

సుగుణవంతురాలు,సుదతియైయుండిన
బుద్ధి మతులైన పుత్రులొప్ప,
స్వర్గమేటికయ్య సంసారికింకను!
విశ్వదాభిరామ వినురమవేమ!

పుణ్యమంతగూడి,పురుషుడై జన్మింప
పాపమంత గూడి పడతి యగునె?
స్త్రీలు పురుషులనుచు ఏలయీ భేదమ్ము?
విశ్వదాభిరామ వినురవేమ!

ఉరుబలాఢ్యుడైన యుద్యోగి పరుడైన
తగిన విత్తమున్న తరుణమందె
పరులకుపకరించి పాలింపగల్గును
విశ్వదాభిరామ వినురవేమ!

ఓర్పు లేని భార్య యున్న ఫలంబేమి?
బుద్ధిలేని బిడ్డ పుట్టి యేమి?
సద్గుణంబులేని చదువది యేలరా?
విశ్వదాబహిరామ వినురవేమ!

కానివాని చేత కాసు వీసములుంచి
వెంట దిరుగువాదు వెర్రివాడు
పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా?
విశ్వదాభిరామ వినురవేమ!

కానివాని తోడ కలసి మెలగువాడు
కాని వాని గానె కానబడును.
తాటి క్రింద పాలు త్రాగిన చందమౌ
విశ్వదాభిరామ వినురవేమ!

కోతిబట్టి తెచ్చి కొత్త పుట్టము గట్టి
కొండముచ్చు లెల్ల గొల్చినట్టు,
నీతిహీనునొద్ద నిర్భాగ్యులుందురు
విశ్వదాభిరామ వినురవేమ!

గొర్రెలు పదివేలు కూడియుండిన చోట
తల్లినెరిగి వచ్చుదాని కొదమ,
పరమయోగి నెరిగి భక్తుండు వచ్చురా
విశ్వదాభిరామ వినురవేమ!

చిక్కియున్న వేళ సింహంబునైనను
బక్క కుక్కయైన బాధపెట్టు,
బలిమిలేని వేళ పంతముల్ చెల్లవు
విశ్వదాభిరామ వినురవేమ!

కల్లుకుండకెన్ని ఘనభూషణము లిడ్డ
అందులోని కంపు చిందులిడదె?
తులువ పదవిగొన్న తొలి గుణమేమగు?
విశ్వదాభిరామ వినురవేమ!

కసవు తినుడు గాదె పసరంబు లెప్పుడు
చెప్పినట్లు వినుచుజేయు బనులు,
వానిసాటియైన మానవుడొప్పడా?
విశ్వదాభిరామ వినురవేమ!

గాడ్దెమేను మీద గంధంబు పూసిన
బూదిలోన పడుచు,పొరలు మరల,
మోటువాని సొగసు మోస్తరియ్యది సుమీ
విశ్వదాభిరామ వినురవేమ!

రాతి బొమ్మలకేల రంగైన వలువలు?
గుళ్ళు గోపురములు కుంభములును,
కూడు గుడ్డ తాను కోరునా దేవుడు?
విశ్వదాభిరామ వినురవేమ!


25, జులై 2014, శుక్రవారం

విచిత్రమైన వ్యాధి!

శుక్రవారం, జులై 25, 2014 1 Comments

Lawrence kim peek


మా విశ్వవిద్యాలయం లో రోజూ ఇ-దినపత్రిక చదవడం నా అలవాటు.ఈనాడు,సాక్షి,ఆంధ్రజ్యోతి,హిందు చదువుతాను.ఒక రోజు ఆంధ్రజ్యోతి చదువుతున్నప్పుడు ఒక వార్త చాలా ఆశ్చర్యానికి గురిచేసింది.
అమెరికాలోని సాల్ట్ లేక్ సిటీలో ఉండే "లారెన్స్ కిం పీక్"కి విచిత్రమైన వ్యాధి ఉంది.అదే "మాక్రోసిఫిలీ".


"మాక్రోసిఫిలీ"--మెదడులోని రెండు భాగాల్ని కలిపి ఉంచాల్సిన నాడులు మెదడులో ఉండవు.మొత్తం ఒకటిగా కలిసి ఉండాల్సిన మెదడు,రెండుగా విడిపోయి ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా వ్యవహరిస్తుంది.దీన్నే "Split Brain Symdrome" అని కూడా అంటారు.దీని వల్ల ఆ వ్యాధి గ్రస్తునికి విపరీతమైన జ్ఞాపక శక్తి వస్తుంది.

మెదడులో "కార్పస్ కల్లోసం" ఉండదు,దాంతో మెదడులో రెండు భాగాల మధ్య భాషాపరమైన అనిసంధానం ఏర్పర్చుకునే లక్షణాన్ని స్వతహాగా మెదడే ఏర్పాటు చేసుకుంటుంది.దీని ఫలితంగా మెదడుకి వేగంగా చదవగలగటం,చదివింది గుర్తు పెట్టుకో గలిగే సామర్ధ్యం ఉంటుంది.
లారెన్స్ కిం పీక్ జీవితం ఆధారంగా 1988లో "Rainman" అనే సినిమాను కూడా తీశారు.


ఈ వ్యాధి బాగుంది కదా!!!

24, జులై 2014, గురువారం

ఇ-పుస్తకాలు

గురువారం, జులై 24, 2014 1 Comments

New books అనే ఫోల్డర్ లో నేను అక్కడక్కడా సేకరించిన e-పుస్తకాలు ఉంచుతున్నాను.ఆశక్తి గలవారు దిగుమతి చేసుకోండి.


ఇక్కడ క్లిక్ చెయ్యండి.New books 

23, జులై 2014, బుధవారం

వేమన పద్యాల్లో కొన్ని

బుధవారం, జులై 23, 2014 0 Comments

పాలకడలిపైన పవ్వళించినవాడు
గొల్ల ఇండ్ల పాలు కోరనేల?
ఎదుటివారి సొమ్ము ఎల్లవారికి తీపి
విశ్వధాభిరామ వినురవేమ!

కనక మృగము భువిని కద్దులేదనకుండ
తరుణి విడిచిపోయె దాశరథియు
తెలివిలేనివాడు దేవుడెట్లాయెరా?
విశ్వధాభిరామ వినురవేమ!

పలుగురాళ్ళుదెచ్చి పరగ గుడులు కట్టి
చెలగి శిలల సేవ జేయనేల?
శిలల సేవ జేయు ఫలమేమి కలుగురా?
విశ్వధాభిరామ వినురవేమ!

మాలవానినంటి మరినీట మునిగితే 
కాటికేగునపుడు కాల్చు మాల
అప్పుడంటినంటు ఇప్పుడెందేగెనో?
విశ్వధాభిరామ వినురవేమ!

పిండములనుజేసి,పితురులదలపోసి
కాకులకు పెట్టు గాడ్దెల్లారా
పెంట తినెడు కాకి పితురుడెట్లాయెరా?
విశ్వధాభిరామ వినురవేమ!

21, జులై 2014, సోమవారం

"దృశ్యం"-నా అభిప్రాయం

సోమవారం, జులై 21, 2014 2 Comments






నిన్న నేనూ,మా పెద్దమ్మ వాళ్ళమ్మాయి,తన స్నేహితురాలూ కలిసి "దృశ్యం" చిత్రానికి వెళ్ళాము.థియేటర్ లో జనం బాగానే ఉన్నారు.కొంచెం ముందు వెళ్ళడంవల్ల టికెట్ దొరికింది.


ఇక సినిమా విషయానికొస్తే,కుటుంబ సమేతంగా చూడగలిగే చిత్రం.ప్రేక్షకుడికి, ఏమవుతుందా? అనే ఉత్కంఠ కలిగిస్తుందనడంలో సందేహం లేదు.వికీపీడియా పేజీలో కథ మొత్తం ఉంది.కానీ కథ తెలుసుకోవడం కంటే సినిమా చూస్తేనే బాగుంటుంది.ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం చుట్టూనే కథ తిరుగుతుంది."ఆగష్టులో ఫలానా తారీఖుల్లో మా హోటల్లోనే ఉన్నారండీ","మా థియేటర్లోనే సినిమా చూశారు","అంత మంచి కస్టమర్లను ఎలా మర్చిపోగల్గుతాం"అని ప్రతీ ఒక్కరూ వెంకటేష్ కి అనుకూలంగా చెప్తూంటే థియేటర్లో ఒకటే కేకలు,చప్పట్లూనూ.


అందరి నటనా బాగుంది.వీరభద్రం మరియు అను(చిన్నపిల్ల) పాత్రలు చిత్రానికే హైలెట్.కానీ వీరభద్రం వెంకటేష్ కుటుంబాన్ని అలా చితక్కొట్టడం చాలా బాధ కలిగించింది.కుటుంబమంతా ఒకే మాట మీద ఉండడం బాగుంది.అంజు(పెద్దమ్మాయి)ని తన కాలేజీలో పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్నప్పటి సీన్ కూడా చాలా బాగుంది.ఇంకా పచ్చటి పొలాలు,ఆ ఇంటి చుట్టూ ఉండే దృశ్యాలు బావున్నాయి.పాటలు కూడా సినిమాకి తగ్గట్టే ఉన్నాయి.సినిమాలోని ప్రతీ సీన్ ని హీరో తనకు అనుకూలంగా మలచుకోవడం చాలా బాగుంది.సినిమాల వల్ల ఇంత తెలివితేటలు వస్తాయా అన్నది మాత్రం ప్రశ్నే!

నాకు నచ్చిన "దృశ్యం" చిత్ర సమీక్షలు

సమీక్ష-1

సమీక్ష-2

Kritika Jayakumar

Esther Anil

19, జులై 2014, శనివారం

క్విజ్ సంగతి

శనివారం, జులై 19, 2014 0 Comments

ఏప్రిల్ లో మా విశ్వవిద్యాలయంలో CYGNUS'14 పేరుతో యాన్యువల్ సంబరాలు నిర్వహించారు.అందులో భాగంగా Cogno quest పేరుతో క్విజ్ కార్యక్రమం నిర్వహించారు.పీయూసీ వారికీ,ఇంజనీరింగ్ వారికీ వేరేవేరేగా పెట్టారు.మా స్నేహితులందరూ ఆరుగురు ఒక టీముగా అందులో పాల్గొన్నాము.మొదటి రౌండులో ఒక ప్రశ్నాపత్రమిచ్చి జవాబులు వ్రాయమంటారు.అందులో ఎక్కువ మార్కులొచ్చిన టీముల్ని రెండవ రౌండుకి ఎంపిక చేస్తారు.పీయూసీ వారికి పూల్-ఏ,ఇంజనీరింగ్ వారికి పూల్-బి ప్రశ్నాపత్రాలిచ్చారు.మేము బాగానే వ్రాశాము.ఫలితాల కోసం ఎదురు చూశాం.మా తరగతిలో అమ్మాయిల్లో రెండు టీములు పాల్గొన్నాము.Cygnus'14 కి ప్రత్యేకంగా ఒక సైట్ ఉంది.అందులో అన్ని అప్ డేట్స్ ఉంటుంటాయి.అందులో రెండవ రౌండుకి ఎంపికయినవారిలో మా టీం కూడా ఉంది.నేనైతే చాలా సంతోషపడ్డాను.ఎందుకంటే చాలా సార్లు అక్కడ క్విజ్ లలో పాల్గొన్నా ఎప్పుడూ ముందుకు వెళ్ళలేదు.కానీ ఈసారి ఎలాగైనా ఒదటి మూడు స్థానాల్లో ఏదోఒకటి దక్కించుకోవాలని అనుకున్నాం.రెండవ రౌండులో మామూలు క్విజ్ లాగానే జరిగింది.చాలా ఆసక్తిగా జరిగింది.మాకొచ్చిన మార్కులు చూసుకుంటే 50-50 అవకాశాలు ఉన్నాయి.మా అదృష్టం కొద్దీ అందులో కూడా మేము సెలెక్టయ్యాము.విశేషం ఏంటంటే ఫైనల్స్ కి ఎంపికయ్యిన వారిలో మేమే పీయూసీ నుండి ఉన్నాము,అందరూ ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం వాళ్ళే.మేము షాకయ్యాము.ఇంక మాకేమి వస్తుంది అనుకున్నాము.అసలు ఇంజనీరింగ్ వాళ్ళతో మాకు పోటీ ఏంటి?కనీసం మాకు మూడవ స్థానం ఇవ్వొచ్చుకదా! అనిపించింది.ఏదో అక్కడున్నామన్న పేరుకి మూడు,నాలుగు ప్రశ్నలకు సమాధానాలు చెప్పి వచ్చేశాము.ఫైనల్ కి వెళ్లామన్న ఆనందం తప్ప మాకింకేం మిగల్లేదు.


పూల్-ఏ ప్రశ్నాపత్రం కోసం-ఇక్కడ క్లిక్ చెయ్యండి


పూల్-బి ప్రశ్నాపత్రం కోసం-ఇక్కడ క్లిక్ చెయ్యండి


అలాగే సినిమాలపై కూడా క్విజ్ నిర్వహించారు.అందులో కూడా మేము పాల్గొన్నాము కానీ మాకేము రాలేదులెండి.ఆ ప్రశ్నాపత్రం కోసం-ఇక్కడ క్లిక్ చెయ్యండి

అన్నట్టు నా బ్లాగ్ హెడర్ బాగుందా?నేనే తయారు చేశాను.

17, జులై 2014, గురువారం

పిల్లి-దాని పిల్లలు

గురువారం, జులై 17, 2014 0 Comments

మా ఇంటిముందు ఒక పోర్షన్ ఖాళీగా ఉంది.ఇంకా ఎవరూ అద్దెకి రాకపోవడంతో మేము అందులో కొన్ని సామాన్లూ అవీ, మా ఇంట్లో చెద పడుతున్నాయని ఆ ఇంట్లో పెట్టాము.ఈ రోజు ఆ ఇంట్లోకి అద్దెకి వచ్చేవాళ్ళు ఇల్లు దులుపుకుందామని వచ్చారు.మరి ఆ సామను అంతా తీసెయ్యాలి కదా!అందుకు డాడీ చూస్తుంటే ఒక అట్టపెట్టెలో పిల్లి దాని పిల్లలతో ఉంది.డాడీ రావడం చూసి పారిపోయింది.డాడీ ఆ పెట్టెను తీసుకొచ్చి బయట ఒక మూల పెట్టారు.అప్పుడు నేను ఇలా క్లిక్ మనిపించాను.


ఆ తల్లి పిల్లి మళ్ళీ వచ్చింది.పిల్లలని వెతుకుతుంది.చివరికి చూసింది.ఒక పిల్లని నోట్లో కరచుకుని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది.నేనిక వాటిని గమనించటం మానేశాను.ఇప్పుడు ఈ పిల్లి గురించి టపా వ్రాయడానికి లాప్ టాప్ ఆన్ చేస్తుంటే పిల్లి అరుపు చిన్నగా వినిపించింది.నేనంత పట్టించుకోలేదు.మళ్ళీ వినిపించింది.ఎక్కడా అని చూస్తే మాది డూప్లెక్స్ లాంటి ఇల్లు,ఇంటి గలవాళ్ళు ఇదివరకు పై వాటాలో ఉండేవారు.అందుకని మా వాటాలోంచి పై వాటాకి మెట్లు ఉన్నాయి.కాని వాటిని ఇప్పుడు మూసేసారులే.ఆ అరుపు ఆ మెట్ల కింద నుండి వస్తుంది.నేను లైట్ వేసి చూస్తే అక్కడ పిల్లి ఉంది.నేను చీపురు తీసుకొచ్చి కొంచెం అటూఇటూ కదిపాను.ఆ పిల్లని వదిలేసి తల్లి పారిపోయింది.అ పిల్లని తీయడం ఎలాగో ఏంటో?


ఇదివరకు ఒక సారి ఆ తల్లి పిల్లి నీళ్ళ ట్యాంకు కింద ఇలాగే పిల్లలను పెట్టింది.మా పరిసరాల్లో కోతుల బెడద ఎక్కువ.ఆ పిల్లలని కోతులు చంపేసాయట.ఈ సారి అలా జరక్కుండా జాగ్రత్త పడుతుంది కాబోలు!







14, జులై 2014, సోమవారం

ఈ చిత్రమేమిటో చెప్పండి?

సోమవారం, జులై 14, 2014 2 Comments

డీడీ సప్తగిరిలో ఆణిముత్యాలు కార్యక్రమం గూర్చి చెప్పను కదా.అదే కార్యక్రమంలో ఈ రోజు ఒక చలనచిత్రం ప్రారంభం అయింది.

నిర్మలకి ఇద్దరు కూతుర్లు,రాజసులోచన మరియు సావిత్రి.రాజ సులోచన డాక్టర్ కావలనుకుంటుంది.అలాగే పరీక్ష కూడా పాసవుతుంది.నిర్మల భర్త చనిపోతూ సూర్యకాంతం కొడుకు,జగ్గయ్య కి రాజసులోచన ని ఇచ్చి పెళ్ళి చెయ్యాలని ఆఖరి కోరిక కోరి చనిపోతాడు.కానీ రాజసులోచనకేమో ఇష్టం ఉండదు.ఓ పక్క నుండి తనకి బాలయ్య అనే డాక్టర్ పరిచయమవుతాడు.ఆమె అతణ్ని ప్రేమిస్తూ ఉంటుంది.రాజ సులోచన-జగ్గయ్య పెళ్ళికి ముహూర్తాలు కూడా ఖరారయ్యిపోతాయి.

ఇదీ ఈరోజు జరిగింది.మరి ఇది ఏ చిత్రమో చెప్తారా??